'జల్లికట్టు' - ఓటీటీ రివ్యూ

Jallikattu

Jallikattu Review

  • 'ఆహా'లో అందుబాటులోకి వచ్చిన 'జల్లికట్టు '
  • బలమైన కథ .. బలహీనపడుతూ వెళ్లిన కథనం 
  • ప్రత్యేకమైన ఆకర్షణగా ఫొటోగ్రఫీ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • సహజత్వానికి దగ్గరగా కనిపించే పాత్రలు ... సన్నివేశాలు
  • పెర్ఫెక్ట్ గా చెబితే 6 ఎపిసోడ్స్ లో పూర్తయ్యే కథ ఇది 

తమిళనాడులో 'జల్లికట్టు' క్రీడ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. ధైర్యవంతులైన యువకులు ప్రాణాలకు తెగించి, మొనగాడు ఎద్దులకు ఎదురెళ్లి కొమ్ములు వంచే తీరు చూడటానికి లక్షల్లో ప్రజలు తరలి వస్తుంటారు. 'జల్లికట్టు' క్రీడలో విజయం సాధించినవారి వలన తమ గ్రామానికి పేరు వస్తుందని భావించేవారు అక్కడ ఎక్కువగా కనిపిస్తారు. అలాంటి 'జల్లికట్టు' క్రీడను ప్రధానమైన కథావస్తువుగా చేసుకుని రూపొందించిన సినిమానే ఇది. 

తమిళనాడు ప్రాంతంలో ఏడు గ్రామాలకి చెందినవారంతా అడవిని నమ్ముకుని జీవిస్తుంటారు. ఈ ఏడు గ్రామాల ప్రజలు 'ముల్లయ్యూర్' జమీందార్ చంద్రశేఖర్ చెప్పినమాట వినవలసిందే. ఎప్పుడు 'జల్లికట్టు' జరిగినా ముందుగా ఆయన ఎద్దు బరిలోకి దిగడం ఆనవాయితీ. ఆ ఎద్దును తన అధీనంలో  ఉన్న గ్రామాల ప్రజలెవరూ పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు అనేది ఆయన శాసనం. కానీ ఆ ఎద్దు కొమ్ములు వంచి చంద్రశేఖర్ జమీందారుకి బుద్ధి చెప్పాలనేది 'పాండి' ఆలోచన. 

అయితే మొదటి నుంచి జమీందారుల ఆగడాలను చూస్తూ వచ్చిన 'ముత్తయ్య' (కన్నడ కిశోర్) 'పాండి'ని వారిస్తాడు. అతనికి ముత్తయ్య స్వయానా మేనమామ. అతను చెప్పిన మాట వినకుండా బరిలో జమీందారు ఎద్దును పాండి పట్టుకుంటాడు. దాంతో ముత్తయ్య ఆందోళన చెందుతాడు. తన తండ్రి తనకి అధికారాలు అప్పగించకపోవడం .. తనకంటే వయసులో చాలా చిన్నదైన 'మీనాక్షి'ని బలవంతంగా పెళ్లి చేసుకోవడం చంద్రశేఖర్ కొడుకు వీరశేఖర్ కి నచ్చదు.

చంద్రశేఖర్ శేఖర్ వయసైపోయినవాడు కావడంతో ఆయన భార్య 'మీనాక్షి' అతని ప్రధాన అనుచరుడైన మాణిక్యంతో సంబంధం పెట్టుకుంటుంది. మాణిక్యం చెల్లెలు 'తేని' కాళీ అనే ఎద్దును ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. కదులుతున్న నల్ల కొండ లాంటి ఆ ఎద్దు అంటే ఆ చుట్టుపక్కల ప్రజలకు భయం. బరిలో ఆ ఎద్దును ఎదుర్కొన్నవాడే తన మెడలో తాళి కట్టాలనేది 'తేని' పెట్టుకున్న షరతు.

అయితే పార్తీబన్ అనే యువకుడు 'తేని'కి దగ్గరవుతాడు. 'కాళీ' ఎద్దును నిలువరించే విషయంలో ఆమెను మోసం చేస్తాడు. అతనితో పెళ్లికి సిద్ధపడుతున్న సమయంలో ఆమెకి ఈ విషయం తెలుస్తుంది. చంద్రశేఖర్ జమీందార్ ఎద్దును బరిలో లొంగదీసిన పాండికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? తన భార్య మీనాక్షి, మాణిక్యం వలన నెల తప్పిందనే విషయం తెలిసి చంద్రశేఖర్ శేఖర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? మాణిక్యం మరణానికి ముత్తయ్య ఎలా కారకుడవుతాడు? పార్తీబన్ చేసిన మోసం గురించి తెలిసి తేని ఎలా స్పందిస్తుంది? అనేవి కథలోని మలుపులు. 

ఇది తమిళ వెబ్ సిరీస్ కి అనువాదం. ఈ వెబ్ సిరీస్ కి రాజ్ కుమార్ దర్శకత్వం వహించాడు. అయితే వెట్రిమారన్ పర్యవేక్షణలో ఈ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంది గనుక, ఆయనకి గల పేరు వలన ఆడియన్స్ ఆసక్తిని చూపించడం సహజం. ఈ కథ ఈ కాలంలోనే నడుస్తుంది .. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ నుంచి మొదలవుతుంది. ఒక వైపున జమీందారు బృందం .. మరో వైపున ముత్తయ్య బృందం ... ఇంకో వైపున తేని ప్రేమకథ. ఈ మూడింటితో ముడిపడిన జల్లికట్టుతో ఈ సిరీస్ సాగుతుంది. 

ఈ కథలో చంద్రశేఖర్ జమీందార్ .. అతని భార్య మీనాక్షి .. కొడుకు వీరశేఖర్ .. ముత్తయ్య ..  తేని .. మాణిక్యం సోదరుడు జైవేల్ ..  పార్తీబన్ ప్రధానమైన పాత్రలుగా కనిపిస్తాయి. ఈ పాత్రలన్నీ కూడా చాలా సహజత్వంతో ప్రవర్తిస్తాయి. రియల్ లొకేషన్స్ లోనే చిత్రీకరణ జరిపారు. ఆర్టిస్టులు ఎవరూ మేకప్ తో కనిపించరు. అడవి .. దానికి చుట్టుపక్కల గల గ్రామాలు ... జల్లికట్టు జరిగే తీరును ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది.

చంద్రశేఖర్ జమీందార్ .. ముత్తయ్య వంటి బలమైన పాత్రలతో ఈ కథ మొదలవుతుంది. ధనిక - పేద అంతరాలతో పాటు వర్గాలకి సంబంధించిన ఘర్షణ కూడా బలంగానే కనిపిస్తుంది. అయితే సిరీస్ ముందుకు వెళుతున్నా కొద్దీ మిగతా ట్రాకులు బలహీనపడిపోయి, తేని ప్రేమకథ బలాన్ని పుంజుకుంటుంది. మిగతా రెండు ట్రాకులను కూడా అదే స్థాయిలో ముందుకు తీసుకుని వెళితే సిరీస్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేది. 

ప్రధానమైన పాత్రధారులంతా ఎవరి పాత్రలో వారు జీవించారు. అయితే కొన్ని చోట్ల సన్నివేశాల సాగతీత ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి సీన్స్ ను ట్రిమ్ చేస్తూ వెళితే, 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ కథను 6 ఎపిసోడ్స్ లోనే చెప్పేయవచ్చు. ఇక 'జల్లికట్టు' జరుగుతున్నప్పుడు చెప్పే కామెంట్రీ చాలా ఇబ్బంది పెడుతుంది. తెలుగులో మంచి వాక్యాలు రాసుకోవలసింది. సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. వేల్ రాజ్ కెమెరా పనితనం ఈ సిరీస్ కి ప్రత్యేకమైన ఆకర్షణ అనే చెప్పాలి 

'జల్లికట్టు' ఆటను ఆటలాగే చూడాలి. ఆ బరిలో నుంచి బయటికి వచ్చిన తరువాత పగలు - ప్రతీకారాలు చూపించకూడదు. 'జల్లికట్టు' కూడా ఒక యుద్ధంలాంటిదే. అందులో గెలిచినవారు  గొప్పవారే కావొచ్చు .. కానీ యుద్ధానికి అతీతంగా వ్యవహరించిన వారు  ఇంకా గొప్పవారు అనే ఒక సందేశాన్ని ఇచ్చిన తీరు బాగుంది. 

ప్లస్ పాయింట్స్: కథ .. పాత్రలను డిజైన్ చేసిన తీరు .. జల్లికట్టు సీన్స్ .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ... సహజత్వం .. చివర్లో ఇచ్చిన సందేశం 

మైనస్ పాయింట్స్: నిదానంగా సాగే స్క్రీన్ ప్లే .. కొన్ని అనవసరమైన సీన్స్ .. డబ్బింగ్ విషయంలో కనిపించని ప్రత్యేకమైన శ్రద్ధ .. ముందుగా ఎత్తుకున్న ట్రాకులు ఆ తరువాత బలహీనపడటం. 

Movie Name: Jallikattu

Release Date: 2023-04-26
Cast: Kishore, Antony, Shila Raj Kumar, Vela Ramamurthy, Balahasan,Sathish, Prabhu
Director:Raj Kumar
Producer: Vetri Maaran
Music: Santosh Narayan
Banner: Grassroot Film Company

Rating: 2.75 out of 5

Trailer

More Reviews