ఈ మధ్య కాలంలో తెలుగులోకి మలయాళ సినిమాలు ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. అలాగే అనువాదాలుగా వస్తున్న మలయాళ సినిమాలకి లభించే ఆదరణ కూడా ఎక్కువగా ఉంది. మలయాళ కథల్లోని సహజత్వానికి తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. అలా మలయాళం నుంచి ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన సినిమానే 'కరోనా పేపర్స్'. ఏప్రిల్ 6వ తేదీన అక్కడ థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 5వ తేదీ నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లోను 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో అందుబాటులోకి వచ్చింది.
ఈ కథ కరోనా సమయంలో మొదలవుతుంది. రాహుల్ (షేన్ నిగమ్) పోలీస్ ఆఫీసర్ గా కొత్తగా డ్యూటీలో జాయిన్ అవుతాడు. పై అధికారుల అవినీతిని అంతగా గమనించని అతను, నిజాయతీగా డ్యూటీ చేయాలనుకుంటాడు. అయితే అతని దృష్టిని మరో వైపు మళ్లించడం కోసం ఒక క్లిష్టమైన కేసును అతనికి అప్పగిస్తారు. అతను ఆ పనిలో ఉండగా, ఒక చిల్లర దొంగ ఆతని సర్వీస్ రివాల్వర్ ను కొట్టేస్తాడు. దాంతో డిపార్టు మెంట్ అతణ్ణి సస్పెండ్ చేస్తుంది.
ఇదిలా ఉండగా .. కారులో వచ్చిన ఇద్దరు దుండగులు జస్టీస్ జాకబ్ ను షూట్ చేసి పారిపోతారు. దాంతో తన మామగారైన జాకబ్ మర్డర్ కేసును ఛేదించడానికి ఏసీపీ గ్రేసీ (సంధ్య శెట్టి) రంగంలోకి దిగుతుంది. హంతకులు వచ్చిన కారు ఎవరిదో తెలుసుకుని, ఆ కారు ఓనర్ ముస్తఫాను .. అతని తండ్రి హమీద్ ను ఎన్ కౌంటర్ చేస్తుంది. అయితే ఆమె ఎలాంటి విచారణ జరపకుండా ఆ ఇద్దరినీ ఎన్ కౌంటర్ చేయడం పట్ల పోలీస్ ఆఫీసర్ లలో ఒకరైన సజీవ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తాడు. దాంతో ఆమె ఆ ఎన్ కౌంటర్ కేసులో అతణ్ణి ఇరికిస్తుంది.
కొంత కాలం పాటు జైలు జీవితాన్ని అనుభవించి వచ్చిన సజీవ్, బయటికి వస్తాడు. అనారోగ్యంతో భార్య బాధపడుతుండటం చూసి తట్టుకోలేకపోతాడు. ఆమె ఆపరేషన్ కి అయ్యే ఖర్చుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. దాంతో గ్యాంగ్ లీడర్ అయిన కాకా పాపన్ (షైన్ టామ్ చాకో) ప్రధాన అనుచరుడైన టోనీతో కలిసి బ్యాంక్ దొంగతనం చేస్తాడు. ఆ సమయంలో అతను రాహుల్ పోగొట్టుకున్న గన్ ను ఉపయోగిస్తాడు. కాకా పాపన్ అధీనంలో ఉన్న తన ప్రియురాలు రాణిని తీసుకుని పారిపోవడం కోసం, అతనికి తెలియకుండా టోనీ ఆ పని చేస్తాడు.
ఎన్ కౌంటర్ తాను చేయలేదని నిరూపించుకోవడానికి తగిన ఆధారాలను సంపాదించే పనిలో సజీవ్ ఉంటాడు. తాను చేసిన ఎన్ కౌంటర్ కి సంబంధించిన విషయం వెలుగులోకి రాకుండా చూసే పనిలో గ్రేసీ ఉంటుంది. తన నుంచి దొంగిలించబడిన గన్ ను తిరిగి సంపాదించడానికి తగిన ప్రయాత్నాలు చేయడంలో రాహుల్ నిమగ్నమై ఉంటాడు. కాకా పాపన్ బారి నుంచి బయటపడటానికి సరైన సమయం కోసం టోనీ - రాణి ఎదురుచూస్తుంటారు. ఇలా ఈ నాలుగు ట్రాకులు ఎక్కడ కలుసుకుంటాయి? ఏ ట్రాక్ ముగింపు ఎలా ఉంటుందనేది కథ.
ఎన్ కౌంటర్ .. బ్యాంకు దొంగతనం .. పోలీస్ ఆఫీసర్ రివాల్వర్ మిస్సవ్వడం అనే మూడు ముఖ్యమైన అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. అలాంటి ఈ సినిమాకి దర్శక నిర్మాత ప్రియదర్శన్. దర్శకుడిగా ఆయన ఎన్నో గొప్ప చిత్రాలను ఆవిష్కరించాడు. అలా ఆయన నుంచి వచ్చిన సినిమానే ఇది. 'స్ట్రే డాగ్' అనే జపనీస్ మూవీని స్ఫూర్తిగా తీసుకుని తమిళంలో '8 తోట్టకల్ (ఎనిమిది బుల్లెట్లు) అనే సినిమాను రూపొందించారు. తెలుగులో కూడా ఈ సినిమాను 'సేతుపతి' టైటిల్ తో తీశారు. అదే కథ స్ఫూర్తితోనే ప్రియదర్శన్ తనదైన స్టైల్లో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాలో ఎవరు హీరో అనడానికి లేదు .. కథనే హీరో. ప్రధానమైన నాలుగు ట్రాకులు కూడా వైవిధ్యభరితమైనవే. ఒకదానితో ఒకటి లింకై నడిచేవే. ఈ నాలుగు ట్రాకులకు సజీవ్ .. రాహుల్ .. కాకా పాపన్ .. ఏసీపీ గ్రేసీలను ప్రధానమైన పాత్రలుగా పెట్టి, ప్రియదర్శన్ నడిపించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది .. ఆకట్టుకుంటుంది. ఎక్కడా కూడా అసాధారణం .. అసహజం అనిపించకుండా పరిస్థితులను బట్టే పాత్రలు నడుచుకుంటున్నట్టుగా ఉంటుంది. ప్రతి పాత్రకి ఇచ్చిన ఫినిషింగ్ ఈ సినిమాకి హైలైట్.
నటీనటులెవరూ నటిస్తున్నట్టుగా ఉండదు .. అసలు వాళ్లు కెమెరా ముందు ఉన్నట్టుగా అనిపించదు. ఎవరి పాత్రలో వారు మెప్పించారు. సంధ్య శెట్టి చేసిన ఏసీపీ గ్రేసీ పాత్ర ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ. ఆ తరువాత మార్కులు సజీవ్ పాత్రను చేసిన సిద్ధిక్ కి .. కాకా పాపన్ పాత్రను పోషించిన షైన్ టామ్ చాకోకి పడతాయి. కేపీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్. దివాకర్ మణి ఫొటోగ్రఫీ కూడా బాగుంది.
ప్రియదర్శన్ కథను ఎంతవరకూ చెప్పాలో .. ఏ పాత్రకు ఎక్కడ ఎలా ముగింపు పలకాలో గొప్పగా డిజైన్ చేశాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లవలసిన సందర్భాల్లో, ఒకటి రెండు డైలాగ్స్ తోనే ఆ ఫ్లాష్ బ్యాక్ సారాంశాన్ని చెప్పించాడు. కథ ఎక్కడా పరిమితమైన ఖర్చును దాటదు .. ఆ కథ సహజత్వాన్ని ఆయన కాపాడుతూ వచ్చాడు. అందువలన మనకళ్లముందే అంతా జరుగుతున్నట్టుగా ఉంటుంది. నాలుగు ప్రధానమైన పాత్రలు ఫేస్ చేసే సమస్యలతో ఈ కథ నడుస్తుంది. అయినా ఎక్కడా బోర్ కొట్టదు. కామెడీ ... రొమాన్స్ .. పాటల ప్రమేయం లేకపోయినా, ఈ కథ కదలనీయదు.
ప్లస్ పాయింట్స్: కథ .. కథనం ... పాత్రలను మలచిన విధానం .. నటీనటుల నటన .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ.
తెలుగు వెర్షన్ వరకూ చూసుకుంటే, ఒకరిద్దరు ఆర్టిస్టులు మినహా ఇక్కడివారికి పరిచయమైన ఫేస్ లు లేకపోవడం కాస్తంత అసంతృప్తిగా అనిపిస్తుందంతే.
'కరోనా పేపర్స్' - ఓటీటీ రివ్యూ
Corona Papers Review
- ప్రియదర్శన్ నుంచి వచ్చిన 'కరోనా పేపర్స్'
- కరోనా కాలంలో నడిచే కథ
- ఆసక్తిని రేకెత్తించే కథనం
- సహజత్వానికి దగ్గరగా కనిపించే పాత్రలు
- ఏసీపీ గ్రేసీ పాత్ర ఈ సినిమాకి హైలైట్
Movie Name: Corona Papers
Release Date: 2023-05-05
Cast: Shane Nigam, Shine Tom, Siddhique, Sandhya Shetty, Gayathrie
Director:Priyadarshan
Producer: Priyadarshan
Music: KP
Banner: Four Frames Sound Company
Review By: Peddinti