అక్బర్ చరిత్రకి సంబంధించిన కథాకథనాలతో జీ 5వారు 'తాజ్' అనే వెబ్ సిరీస్ ను రూపొందించారు. నసీరుద్దీన్ షా ప్రధానమైన పాత్రను పోషించిన ఈ వెబ్ సిరీస్, 10 ఎపిసోడ్లతో సీజన్ 1 గా అలరించింది. ఆ తరువాత సీజన్ 2గా మే 12వ తేదీన 4 ఎపిసోడ్లను వదిలారు. ఇక సీజన్ ఫినాలే క్రింద మరో 4 ఎపిసోడ్లను ఈ నెల 2వ తేదీన అందుబాటులోకి తెచ్చారు. ఈ ఎపిసోడ్స్ ఎంతవరకూ కనెక్ట్ అయ్యాయనేది ఇప్పుడు చూద్దాం.
అక్బర్ కాలంలో మొగల్ సామ్రాజ్యం మరింత విస్తరిస్తూ వెళుతుంది. ఒక వ్యూహం ప్రకారం అక్బర్ తన బలాన్ని .. బలగాన్ని పెంచుకుంటూ వెళుతుంటాడు. 'అనార్కలి' మరణానికి తన తండ్రి కారకుడయ్యాడనే కోపంతో అక్బర్ పై సలీమ్ కోపం పెంచుకుంటాడు. అనార్కలి శవాన్ని ఎక్కడ సమాధి చేశారో తెలుసుకుని, ఆమెకి స్మారక మందిరాన్ని నిర్మించాలనే ఆలోచనలో ఆయన ఉంటాడు. ఈ కారణంగానే ఆయన తన తండ్రికీ .. మొగల్ రాజమందిరానికి దూరమవుతాడు.
సింహాసనం కోసం వారసుల మధ్య జరుగుతున్న పోరాటాల విషయంలో అక్బర్ అసంతృప్తితో ఉంటాడు. తన తరువాత మొగల్ సామ్రాజ్యం ఎక్కువ కాలం నిలవదనే విషయాన్ని తన గురువు ద్వారా తెలుసుకుని ఆవేదన చెందుతాడు. అది మనసులో పెట్టుకునే ఆయన మరింత అనారోగ్యం పాలవుతాడు. ఈ సమయంలోనే అక్బర్ దగ్గర వజీర్ గా పనిచేసే రియాజ్ బేగ్ కూతురు మెహరున్నీసా, సలీమ్ కి చేరువవుతుంది. అందుకు అడ్డుపడటానికి అక్బర్ చేసిన ప్రయత్నం విఫలమవుతుంది.
అక్బర్ కి మరో వారసుడైన డానియల్ కి సింహాసనం దక్కాలని అబుల్ ఫజల్ - బదాయిని ప్రయత్నిస్తుంటారు. మరో వైపున సలీమ్ కుమారులలో ఒకరైన ఖుస్రుకు రాజ్యాధికారం దక్కాలని కొందరు .. ఖుర్రమ్ కి సింహాసనం దక్కాలని కొందరు రహస్య మంతనాలు చేస్తుంటారు. ఖుస్రు దృష్టి రాజకీయాలపై ఉంటే, ఖుర్రమ్ దృష్టి తన ప్రియురాలైన అర్జుమంద్ (ముంతాజ్) పై ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతీకార దాడులలో దానియల్ .. అబుల్ ఫజల్ .. బదాయిని చనిపోతారు. దాంతో సింహాసనం కోసం తన కుమారులతోనే పోటీపడే పరిస్థితి సలీమ్ కి వస్తుంది.
అప్పుడు సలీమ్ ఏం చేస్తాడు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు? అతని జీవితంలోకి అర్థాంగిగా అడుగుపెట్టిన మెహరున్నీసా, 'నూర్జహాన్' గా ఎలా మారుతుంది? సలీమ్ ద్వారా గర్భాన్ని ధరించిన ఆమె, తనకి పుట్టబోయే వాడే బాద్ షా కావాలనే స్వార్థంతో ఏం చేస్తుంది? ముంతాజ్ తో కలిసి ఖుర్రమ్ ఎలాంటి నిర్ణయానికి వస్తాడు? అనేది మిగతా కథ.
'తాజ్' వెబ్ సిరీస్ విషయంలో నిర్మాణ విలువలు .. దర్శకుడిగా విభూ పురి ప్రతిభ ప్రధానంగా కనిపిస్తాయి. మొగల్ సామ్రాజ్య చరిత్ర .. అక్బర్ కాలంలో దాని వైభవం .. అనార్కలి విషయంలో సలీమ్ తో ఆయనకి పెరిగిన దూరం .. అక్బర్ వారసుల మధ్య పోరు .. సింహాసనం కోసం తన కుమారులతోనే సలీమ్ పోరాటం చేయవలసి రావడం .. శత్రువుల వ్యూహాలు .. ప్రతి వ్యూహాలు .. అంతఃపుర రహస్యాలు ఇలా ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
భారీ సెట్స్ .. కాస్ట్యూమ్స్ .. యుద్ధం నేపథ్యంలోని ఎపిసోడ్స్ .. సైన్యం గుర్రాలపై తరలివెళ్లడం .. ఆయుధాల డిజైనింగ్ .. లొకేషన్స్ ను ఎంచుకున్న తీరు .. ఈ కథకి ప్రేక్షకులను మరింత కనెక్ట్ చేస్తాయి. నిజానికి ఇంతటి భారీ కథావస్తువుకు సులువుగా అర్థమయ్యేలా స్క్రీన్ ప్లే చేయడం చాలా కష్టమైన విషయం. కానీ ఎక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆయన ఈ కథను నడిపించిన తీరును అభినందించకుండా ఉండలేం. ఇక సవ్యక్ చక్రవర్తి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ వెబ్ సిరీస్ కి ప్రధానమైన బలంగా నిలిచిందని చెప్పచ్చు.
ఈ వెబ్ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది ఫొటోగ్రఫీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కోటలు .. అడవులు .. యుద్ధాలు .. గుడారాలు ఇలా ఎక్కడ చూసినా ఆయన చేసిన లైటింగ్ ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రివేళకి సంబంధించిన సన్నివేశాలను ఆయన గొప్పగా ఆవిష్కరించాడు. ఉమేశ్ గుప్తా ఎడిటింగ్ కి కూడా వంకబెట్టలేం. క్లిష్టమైన ఈ కథను అర్థవంతంగా అందించడంలో ఆయన పాత్ర కూడా ముఖ్యమైనదే.
వయసు పైబడిన అక్బర్ చక్రవర్తిగా నసీరుద్దీన్ షా నటన ఈ వెబ్ సిరీస్ హైలైట్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆ తరువాత మార్కులు మాత్రం 'మాన్ సింగ్' పాత్రను పోషించిన దిగంబర్ ప్రసాద్ కి దక్కుతాయి. తన చెల్లెలు .. మేనల్లుడు విషయంలో ఆయన పాత్ర వైపు నుంచి ఉన్న ఎమోషన్స్ మనసును కదిలిస్తాయి. సలీమ్ పాత్రధారి ధర్మేంద్ర నటన కూడా ఆకట్టుకుంటుంది. మిగతా ఆర్టిస్టులంతా తమ పాత్రలకి న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్: బలమైన కథ .. ఆసక్తికరమైన కథనం .. పాత్రలకి తగిన ఆర్టిస్టులు .. నసీరుద్దీన్ షా నటన .. కథకి కనెక్ట్ చేసే ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఆ కాలంలోకి తీసుకుని వెళ్లే సెట్స్ .. కాస్ట్యూమ్స్ .. లొకేషన్స్ .. ఎమోషన్స్.
* చారిత్రక నేపథ్యంతో ఇంతవరకూ వచ్చిన వెబ్ సిరీస్ లలో ఇది ముందు వరుసలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
'తాజ్' (జీ 5 -సీజన్ ఫినాలే) వెబ్ సిరీస్ రివ్యూ!
Taj Review
- జీ 5లో 'తాజ్' సీజన్ ఫినాలే
- ఈ నెల 2 నుంచి అందుబాటులోకి
- యాక్షన్ .. ఎమోషన్స్ తో నడిచిన కథాకథనాలు
- సెట్స్ .. కాస్ట్యూమ్స్ .. లొకేషన్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ... ఫొటోగ్రఫీ హైలైట్
- చారిత్రక నేపథ్యం కలిగిన వెబ్ సిరీస్ లో ప్రత్యేక స్థానం
Movie Name: Taj
Release Date: 2023-06-02
Cast: Naseeruddin Shah, Dharmendra, Aditi Rao Hydari, Digambar prasad, Sauraseni Maitra
Director:Vibhu Puri
Producer: Abhimanyu Singh - Roopali Singh
Music: Souvyk Chakraborty
Banner: Contiloe Pictures
Review By: Peddinti