'రఫూ చక్కర్' (జియో వెబ్ సిరీస్) రివ్యూ

Rafuchakkar

Rafuchakkar Review

  • యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన 'రఫూ చక్కర్'
  • హీరో పాత్ర చుట్టూ అల్లుకున్న నేరాలు 
  • మూడు ఎపిసోడ్స్ ను వదిలిన జియో సినిమా 
  • కీలకంగా కనిపిస్తున్న అక్ష - ప్రియా బపత్ పాత్రలు
  • మరో 6 ఎపిసోడ్స్ తో పూర్తి కానున్న సీజన్ 1

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై సస్పెన్స్ థ్రిల్లర్లు .. క్రైమ్ థ్రిల్లర్లు .. యాక్షన్ థ్రిల్లర్లు ఎక్కువగా ఆదరణ పొందుతూ ఉంటాయి. అందువలన అలాంటి జోనర్లలో వెబ్ సిరీస్ లను అందించడానికి ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి. అలా ఆ జోనర్లో వచ్చిన మరో వెబ్ సిరీస్ గా 'రఫూ చక్కర్' ఒకటిగా కనిపిస్తుంది. రితం శ్రీవాత్సవ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ నిన్నటి నుంచి 'జియో సినిమా'లో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 1లో భాగంగా ఒక్కో రోజున ఒక్కో ఎపిసోడ్ చొప్పున 3 ఎపిసోడ్స్ ను వదిలారు. 

ఈ మూడు ఎపిసోడ్స్ విషయానికి వస్తే .. 'నైనిటాల్' లో పవన్ కుమార్ (మనీశ్ పాల్) ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటాడు. తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ, జీవితంలో న్యాయంగా ఎదగడానికి అతను ప్రయత్నిస్తుంటాడు. పవన్ కష్టపడే తత్వం నచ్చిన కారణంగా అతణ్ణి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో అగర్వాల్ కూతురు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే అతణ్ణి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేస్తారు. కోర్టులో హాజరుపరుస్తారు.

ఢిల్లీ లోని ప్రముఖ బిజినెస్ మేన్ సర్వేశ్ పఠానియా (సుశాంత్ కుమార్ సింగ్) కూతురు వినీత, అజయ్ అనే ఒక బిజినెస్ మేన్ ను ఇష్టపడుతుంది. అజయ్ బిజినెస్ లో భాగస్వామిగా ఉండటానికి అంగీకరించడమే కాకుండా, అతణ్ణి తన అల్లుడిగా చేసుకోవడానికి సర్వేశ్ అంగీకరిస్తాడు. అయితే అటు వినీతను ... అటు సర్వేశ్ ను మోసం చేసి, పాతిక కోట్ల రూపాయలతో .. విలువైన డాక్యుమెంట్లతో అజయ్ పారిపోతాడు. ఆ కేసు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ శౌర్య (అక్ష పార్దసాని)కి అప్పగించబడుతుంది. 


ఇక మరో చోట కీర్తన్ పేరుతో పవన్ కుమార్ ఫిట్ నెస్ సెంటర్ ను ఏర్పాటు చేసి, సన్నబడాలనుకున్న స్త్రీలను టార్గెట్ చేసి వాళ్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బుకాజేశాడనే అభియోగం కూడా మోపబడుతుంది. కీర్తన్ చేతిలో మోసపోయిన స్త్రీలంతా కూడా కోర్టుకు వచ్చి, తమని మోసం చేసింది పవన్ కుమార్ అనే చెబుతారు. అయితే తనకి ఏ పాపమూ తెలియదని పవన్ కుమార్ చెబుతాడు. తన చుట్టూ ఏం జరుగుతుందనేది తనకి తెలియదని అంటాడు. 

పవన్ కుమార్ అమాయకుడనీ .. ఆ నేరాలు జరిగిన సమయంలో అతను ఆ ప్రాంతంలోనే లేడని అతని తరఫు న్యాయవాది జయదేవ్ (ఆకాశ్ దహియా) కోర్టుకు తెలియజేస్తాడు. మోసపోయిన వ్యక్తులు చెబుతున్న వ్యక్తి లైఫ్ స్టైల్ కీ .. పవన్ కుమార్ లైఫ్ స్టైల్ కి అసలు ఎంతమాత్రం సంబంధం లేదనే విషయాన్ని కోర్టువారు గ్రహించాలని కోరతాడు. చిన్నపాటి షాప్ ను రన్ చేయలేకపోతున్న పవన్, ఇంతపెద్ద స్థాయిలో అక్రమాలు చేయడం ఎలా సాధ్యమనే విషయాన్ని లేవనెత్తుతాడు. 

 అయితే ఈ నేరాలు మాత్రమే కాదనీ, మారు పేర్లతో పవన్ కుమార్ మరిన్ని అక్రమాలకూ పాల్పడ్డాడని లాయర్ రీతూ ( ప్రియా బపత్) వ్యాఖ్యానిస్తుంది. అందుకు సంబంధించిన నేరాలను గురించి కోర్టుకు తెలియజేస్తూ ఉంటుంది. అమాయకుడైన పవన్ ఇన్ని నేరాలను చేశాడంటే ఎవరూ నమ్మలేకపోతుంటారు. ఇంతకీ అసలు నేరస్థుడు ఎవరు? అతను చేసిన మిగతా నేరాలు ఏమిటి? అనేది కథ. 

'జియో స్టూడియోస్' వారు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి, రితం శ్రీవాత్సవ్ దర్శకత్వం వహించాడు.  ఈ మూడు ఎపిసోడ్స్ లోను హీరో .. పోలీస్ ఆఫీసర్ .. లాయర్ పాత్రలను హైలైట్ చేస్తూ నడిపించాడు. ఒక వైపున హీరోను మంచివాడిగా .. కాస్త అమాయకుడిగా చూపిస్తూ, డిఫరెంట్ లుక్స్ తో .. డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ తో ఆయన నేర జీవితాన్ని చూపించాడు. దాంతో అసలు నేరస్థుడు హీరోయేనా? అనే ఒక సందేహాన్ని కూడా రేకెత్తిస్తూ వెళ్లాడు.

ఇక అతన్ని ఎలాంటి పరిస్థితుల్లోను వదలకూడదని నిర్ణయించుకున్న లాయర్ ఒక వైపు .. పోలీస్ ఆఫీసర్ ఒక వైపు. ఈ మూడు పాత్రల మధ్య కథను ఆసక్తికరంగానే అల్లుకున్నాడు. మరో 6 ఎపిసోడ్స్ వరకూ ఈ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ ఎపిసోడ్స్ లో మరిన్ని కొత్త పాత్రలు పరిచయం కానున్నాయి. కథలో అనూహ్యమైన మలుపులు ఉంటాయనే విషయం అర్థమవుతోంది.   

మొదటి రెండు ఎపిసోడ్స్ తో పోల్చి చూస్తే, మూడో ఎపిపోడ్ కాస్త బోర్ కొడుతుంది. ఫిట్ నెస్ కి సంబంధించిన కంటెంట్ ను సాగదీసినట్టుగా అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ గా అక్ష .. లాయర్ గా ప్రియా బపత్ .. బిజినెస్ మేన్ గా సుశాంత్ కుమార్ సింగ్ బాగా చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫైజల్ `ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఈ మూడు ఎపిసోడ్స్ లో హీరోను రెండు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ లో చూపించారుగానీ, అవి ఆయనకి సరిగ్గా సెట్ కాలేదని అనిపిస్తుంది. మిగతా ఎపిసోడ్స్ లో టైట్ కంటెంట్ ఉంటే మాత్రం, ఈ వెబ్ సిరీస్ కొంతవరకూ కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

Movie Name: Rafuchakkar

Release Date: 2023-06-15
Cast: Manish Paul, Aksha Pardasani, Priya Bapath, Sushanth Kumar Singh, Akash Dahiya
Director:Ritam Srivasthsav
Producer: Jyothi Deshpandy
Music: -
Banner: Jio Studio

Rating: 2.50 out of 5

Trailer

More Reviews