'సామజవరగమన' - మూవీ రివ్యూ

Samajavaragamana

Samajavaragamana Review

  • శ్రీవిష్ణు నుంచి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టయినర్ 
  • ఆకట్టుకునే కథాకథనాలు 
  • హాయిగా నవ్వించే సన్నివేశాలు 
  • వెన్నెల కిశోర్ పాత్ర హైలైట్ 
  • శ్రీవిష్ణుకి మరో హిట్ పడినట్టే

శ్రీవిష్ణు కామెడీ బాగా చేస్తాడనే విషయం తెలిసిందే. తన సినిమాల్లో కామెడీ పాళ్లు తప్పకుండా ఉండేలా ఆయన చూసుకుంటాడు. అయితే అలా ఆయన కామెడీ కంటెంట్ పై దృష్టి పెడుతూ వచ్చినా, కొన్నాళ్లుగా ఆయన ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో కామెడీకి ప్రాధాన్యతనిస్తూ ఆయన చేసిన మరో సినిమానే 'సామజవరగమన' ఈ రోజున థియేటర్లకు వచ్చిన ఈ సినిమాతో, శ్రీవిష్ణు వెయిట్ చేస్తూ వస్తున్న హిట్ పడిందా లేదా అనేది చూద్దాం.

హైదరాబాదులోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో ఉమామహేశ్వరరావు (నరేశ్) ఫ్యామిలీ ఒకటి. ఆయన కొడుకు బాలు (శ్రీవిష్ణు) ఒక మల్టీ ప్లెక్స్ థియేటర్ లోని 'బాక్సాఫీస్'లో పనిచేస్తూ ఉంటాడు. కూతురు వైష్ణవి చదువుకుంటూ ఉంటుంది. ఉమా మహేశ్వరరావు డిగ్రీ చదువుతో ముడిపెడుతూ ఆయన తాత ఒక వీలునామా రాస్తాడు. ఆ ఆస్తి కోసం కాకపోయినా, మేనత్త ముందు తన తండ్రి చులకన కాకూడదని అతనితో బాలు డిగ్రీ పరీక్షలు రాయిస్తూ ఉంటాడు. 

అలా తండ్రితో పరీక్షలు రాయించడానికి బాలు వెళ్లిన సమయంలో అక్కడ సరయు (రెబా మోనికా జాన్) పరిచయమవుతుంది. రాజమండ్రి నుంచి వచ్చిన ఆమె, కొంతకాలం పాటు 'పీజీ'లో ఉండాలనుకుని, రూమ్స్ చూసుకుంటూ ఉంటుంది. తన ఇంట్లో ఆమె పేయింగ్ గెస్టుగా ఉండటం వలన, నెలకి ఓ 15 వేలు వస్తాయి కదా అని, తన ఇంట్లో ఆమె ఉండటానికి బాలు అంగీకరిస్తాడు. అలా బాలూను సరయు  దగ్గరగా చూస్తుంది. అతని పొదుపు .. కుటుంబం పట్ల బాధ్యత .. పెద్దల పట్ల ప్రేమ ఆమెకి నచ్చుతుంది. 

అయితే గతంలో లవ్ మేటర్ లో దెబ్బతిన్న బాలు, తనని ఎవరైనా ప్రేమిస్తున్నారని తెలిస్తే చాలు, వాళ్లతో రాఖీ కట్టించుకోవడం అలవాటుగా పెట్టుకుంటాడు. అలాంటి బాలు .. సరయు లవ్ లో పడిపోతాడు. అదే సమయంలో సరయు రాజమండ్రి వెళ్లిపోతుంది. తన మేనత్త కొడుకు పెళ్లి కోసం తన వాళ్లతో రాజమండ్రికి వెళ్లిన బాలూకి, ఆ పెళ్లిలో సరయు కనిపిస్తుంది. పెళ్లికూతురు తన బాబాయ్ కూతురేనని బాలూతో ఆమె చెబుతుంది. ఆ పెళ్లి జరిగితే తాము వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతామని తెలిసి బాలు - సరయు ఉలిక్కిపడతారు.

ఎలాగైనా ఆ పెళ్లి జరగకుండా ఆపాలని బాలు నిర్ణయించుకుంటాడు. ఇక సరయు తండ్రికి ప్రేమ పెళ్లిళ్లు ఇష్టం ఉండదనీ, అందుకు ఒక బలమైన కారణం కూడా ఉందనే విషయం బాలూకు తెలుస్తుంది. దాంతో ఇప్పుడు జరగబోయే మేనత్తకొడుకు పెళ్లిని ఆపవలసిన పని .. సరయు విషయంలో ఆమె తండ్రిని ఒప్పించవలసిన బాధ్యత బాలూపై పడతాయి. అప్పుడు అతను ఏం చేస్తాడు? అతను వేసిన పథకాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? అనేది మిగతా కథ. 

 గతంలో సత్య ప్రధానమైన పాత్రను పోషించిన 'వివాహభోజనంబు' సినిమాను తెరకెక్కించిన రామ్ అబ్బరాజు, ఈ సినిమాకి దర్శకుడు. ఆ సినిమా చూస్తేనే ఆయనకి కామెడీపై ఎంత పట్టు ఉందనే విషయం అర్థమవుతుంది. అదే కామెడీని నమ్ముకుని ఈ సినిమాను రూపొందించిన రామ్ అబ్బరాజు, ప్రేక్షకులను హాయిగా నవ్వించాడు. కథపై పూర్తి క్లారిటీతో ఆయన రంగంలోకి దిగాడనే విషయం మనకి అర్థమవుతుంది. 

ఈ సినిమాలో చాలానే పాత్రలు తగులుతాయి .. ప్రతి పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఎక్కడ ఎలాంటి లాజిక్ మిస్సవ్వదు. ప్రతి విషయంలో ఆడియన్స్ ను కన్విన్స్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఒక సాధారణమైన కాలనీలో .. ఒక మధ్యతరగతి ఇంటి చుట్టూ కథను తిప్పుతూ, ముగింపు దిశగా దర్శకుడు నడిపించిన తీరు గొప్పగా అనిపిస్తుంది. ఆ పరిధిలోనే లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని కలిపి అందించిన విధానం ఆకట్టుకుంటుంది. 

డైరెక్టర్ .. హీరోయిన్ పాత్రను హీరో లైఫ్ లోకి ఎంటర్ చేసిన పద్ధతి రొటీన్ కి భిన్నంగా అనిపిస్తుంది. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా నవ్విస్తూనే .. సెకండ్ పార్టుపై ఆసక్తిని పెంచుతుంది. చివర్లో కాస్త టెన్షన్ పెట్టేసి, అందరికీ సంతృప్తికరమైన క్లైమాక్స్ నే అందించాడు. ఇక నటీనటుల విషయానికొస్తే, నరేశ్ .. శ్రీవిష్ణు .. వెన్నెల కిశోర్ పాత్రలను దర్శకుడు మలచిన పద్ధతి ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి. 

ముఖ్యంగా వెన్నెల కిశోర్ పాత్రను మలచిన తీరు చూస్తే, 'గీత గోవిందం' సినిమా గుర్తుకు వస్తుంది. కులపిచ్చి ఉన్న 'కులశేఖర్' పాత్రలో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక కొత్తమ్మాయి రెబా మోనికా జాన్ కి ఇది తొలి సినిమానే అయినా బాగా చేసింది. 'నందు' అందించిన డైలాగ్స్ థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. "మిడిల్ క్లాస్ వాళ్లు మల్టీ ప్లెక్స్ లకు రాకూడదు ... వచ్చినా ఇంటర్వెల్ లో బయటికి వెళ్లకూడదు' .. 'ఏందిరా వీళ్లు రాఖీలను పెండింగ్ చలాన్ల మాదిరిగా కడుతున్నారు' .. 'బరిసెలతో చంపేవాళ్లను చూశాం గానీ .. ఇలా వరసలతో చంపే వాళ్లను చూడలేదు' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.  

గోపీసుందర్ సమకూర్చిన బాణీలు సందర్భానికి తగినట్టుగా అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మాత్రం ఎక్కువ మార్కులనే వసూలు చేస్తాడు. ఇక రామ్ రెడ్డి  ఫొటోగ్రఫీ .. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నాయి. భారీ తారాగణం ... హెవీ ఎమోషన్స్ .. అనవసరమైన హడావిడి లేని సినిమా ఇది. సహజత్వానికి దగ్గరగా నడుస్తూ, హాయిగా నవ్వించే సినిమా ఇది. ఈ మధ్య కాలంలో పెర్ఫెక్ట్ కంటెంట్ తో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను గురించి చెప్పుకోవచ్చు. 

కథ .. కథనం .. ప్రధానమైన పాత్రలను మలిచిన తీరు .. సహజత్వంతో కూడిన సన్నివేశాలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. సంభాషణలు ప్లస్ పాయింట్స్ గా కనిపిస్తాయి.  

Movie Name: Samajavaragamana

Release Date: 2023-06-29
Cast: Sri Vishnu, Reba Monika John, Naresh, Vennela Kishore, Sudarshan, Pramodini, Srikanth Ayyangar
Director:Ram Abbaraju
Producer: Rajesh Danda
Music: Gopi Sundar
Banner: Hasya Movies

Rating: 3.00 out of 5

Trailer

More Reviews