'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' - (ఆహా) వెబ్ సిరీస్ రివ్యూ!

Arthamayyinda Arunkumar

Arthamayyinda Arunkumar Review

  • 'ఆహా'లో 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్'
  • కామెడీ .. ఎమోషన్స్ కలుపుకుని సాగే కథ 
  • ప్రధానమైన ట్రాకులలో కనిపించని డెప్త్
  • టైటిల్ క్రియేట్ చేసిన ఆసక్తి నుంచి జారిపోయిన కంటెంట్ 
  • పైపైన .. పలచగా సాగిపోయే కథాకథనాలు  

'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి ఎప్పటికప్పుడు కొత్త వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. కొత్తదనంతో కూడిన కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నారు. తాజాగా ఈ రోజున 'ఆహా'వారు 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' వెబ్ సిరీస్ ను వదిలారు. సీజన్ 1లో భాగంగా 5 ఎపిసోడ్స్ ను స్ట్రీమింగ్ చేశారు. 'లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్' వారు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి, జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించాడు. యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ వెబ్ సిరీస్, ఏ స్థాయిలో ఎంటర్టయిన్మెంట్ పంచిందనేది చూద్దాం.

'అమలాపురం'లోని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు అరుణ్ కుమార్ (హర్షిత్ రెడ్డి). బీటెక్ పూర్తి చేసిన అరుణ్ కుమార్, తన కుటుంబం ఆర్ధికంగా మరింత సౌకర్యంగా బ్రతకాలంటే సిటీలో జాబ్ చేయాలని అనుకుంటాడు. ఉన్న ఊళ్లోనే ఏదైనా పని చేసుకోమని తండ్రి ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా, హైదరాబాద్ లోనే ఉద్యోగ ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఓ కంపెనీలో జాబ్ రావడంతో వచ్చి వాలతాడు.  

హైదరాబాదులో కొంతమంది బ్యాచ్ లర్స్ తో కలిసి రూమ్ షేర్ చేసుకుంటాడు. మొదటి రోజున చాలా టెన్షన్ తోనే ఆఫీసుకి వెళతాడు. ఇంటర్న్ గా ఆఫీసులో చేరతాడు. కార్పొరేట్ ఆఫీసులో తన టాలెంట్ ను చూపిస్తూ అంచలంచెలుగా ఎదిగిపోవాలనే ఉత్సాహంతో ఉంటాడు. కానీ మొదటి రోజే అందరికీ 'టి' పెట్టి సర్వ్ చేయవలసి వస్తుంది. ఇక అరుణ్ కుమార్ మంచితనం .. కొత్తదనంతో కూడిన బెరుకు వలన, టీమ్ లీడర్ గా ఉన్న జై (ప్రవీణ్) అతణ్ణి అందరి ముందు హేళన చేస్తూ ఉంటాడు. 

అదే సమయంలో షాలిని( తేజస్వి మదివాడ) మరో టీమ్ లీడర్ గా ఉంటుంది. ఆమెకి .. జై కి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందనే విషయం అరుణ్ కుమార్ కి అర్థమైపోతుంది. ఈ విషయంలో జై పై ఒక గేమ్ లో గెలిచిమరీ అతని టీమ్ లో నుంచి షాలినీ టీమ్ లోకి అరుణ్ కుమార్ వెళ్లిపోతాడు. అయితే తనని అవమానపరుస్తూ జై బాధపెడితే, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసిరావడానికి షాలిని సెలవు ఇవ్వలేదని అరుణ్ కుమార్ ఆవేదన చెందుతాడు. 

అరుణ్ కుమార్ ఆఫీసులో అడుగుపెట్టిన దగ్గర నుంచి పల్లవి (అనన్య) అతన్ని దగ్గరగా గమనిస్తూ ఉంటుంది. సిటీ లైఫ్ స్టైల్ .. కార్పొరేట్ జాబ్ టెన్షన్స్ తనకి నచ్చకపోవడంతో, తిరిగి ఊరు వెళ్లిపోవాలని అనుకున్న అరుణ్ కుమార్ కి పల్లవి అండగా నిలబడుతుంది. ఆమె పరిచయమే అతనికి కొంత ఓదార్పును .. ఊరటను ఇస్తాయి. అరుణ్ కుమార్ పట్ల ఆమెకి గల అభిమానం ప్రేమగా మారుతుంది. 

అలాంటి అరుణ్ కుమార్ .. షాలిని టీమ్ లో చేరిన దగ్గర నుంచి ఆమెతో సాన్నిహిత్యంతో మెలగడం మొదలుపెడతాడు. అది చూసిన పల్లవి మనసు కష్టపడుతుంది. అరుణ్ కుమార్ తో పల్లవి చనువుగా ఉండటం షాలినీకి కూడా అంతగా నచ్చదు. ఈ నేపథ్యంలోనే అరుణ్ కుమార్ ను పర్మినెంట్ చేస్తూ ఆర్డర్స్ వస్తాయి. ఆ శుభవార్తను అతను పల్లవితో చెప్పాలనుకుంటాడు. అయితే ఆమె జాబ్ మానేసిందని తెలుస్తుంది. అప్పుడు అతను ఏం  చేస్తాడు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది కథ. 

దర్శకుడు జోనాథన్ చాలా తక్కువ బడ్జెట్ లో ఈ కథను సెట్ చేసుకున్నాడు. అమలాపురంలో హీరో ఫ్యామిలీ .. హైదరాబాదులో బ్యాచిలర్స్ రూము .. ఆ తరువాత కార్పొరేట్ ఆఫీస్. ఇవి ఈ కథ నడిచే ముఖ్యమైన ప్రదేశాలు .. కేంద్రాలు. తక్కువ పాత్రలతో ఈ కథ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో పెరిగిన ఎవరైనా, సిటీలో .. అందునా కార్పొరేట్ ఆఫీసుల్లో ఇమడటం కొంచెం కష్టమైన పనే. ఇక ఎక్కడ ఉండవలసిన శాడిజాలు అక్కడ ఉంటూనే ఉంటాయి. 

అందువలన విలేజ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన యూత్ ఈ తరహా కంటెంట్ ను కొంతవరకూ ఓన్ చేసుకుంటారు. అరుణ్ కుమార్ పాత్రలో తమని తాము చూసుకుంటారు. అయితే అరుణ్ కుమార్ గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసిన సందర్భాలుగానీ, బ్యాచిలర్ రూమ్ లో పడే కష్టాలను గానీ .. అలవాటు లేని హైదరాబాదులో పడే ఇబ్బందులుగాని డైరెక్టర్ డీప్ గా చూపించలేకపోయాడు. 

ఇక హీరో తనని ఇష్టపడుతున్న పల్లవితో తన ఇష్టాన్ని పంచుకునే సన్నివేశాలుగానీ, ఆమెకి మరింత దగ్గరయ్యే సందర్భాలు గాని లేవు. ఇద్దరి మధ్య ఆశించిన స్థాయి బాండింగ్ లేనప్పుడు, ఒకరికి మరొకరు దూరమవుతున్నప్పుడు ఆడియన్స్ వైపు నుంచి ఎమోషన్స్ ను ఆశించలేం. హర్షిత్ రెడ్డి .. అనన్య .. తేజస్వీ మదివాడ తమ పాత్రలకు న్యాయం చేశారుగానీ, కంటెంట్ నుంచి ఆశించిన స్థాయి అవుట్ పుట్ లేకపోవడం వలన, ప్రతి ఎపిసోడ్ డ్రైగా అనిపిస్తూ ఉంటుంది. 

అలాగే హీరో క్యారెక్టరైజేషన్ దగ్గరికి వచ్చేసరికి, అతను ఆయా సందర్భాల్లో ప్రవర్తించే తీరు ఆడియన్స్ ను డౌట్ లో పడేస్తూ ఉంటుంది. అతని స్వభావం విషయంలో ఎటూ తేల్చుకోలేని స్థితికి వచ్చేస్తాం.  లవ్ .. కామెడీ .. ఎమోషన్స్ తో కూడిన ట్రాకులను బలంగా చెప్పకపోవడం ఈ కథలో ఒక లోపంగా అనిపిస్తుంది. టైటిల్ కి తగిన కంటెంట్ .. కంటెంట్ కి తగిన సీన్స్ .. సీన్స్ కి తగిన ఫీలింగ్స్ లేకపోవడమే మైనస్ గా అనిపిస్తుంది. సీజన్ 2లో ఇవన్నీ సెట్ అవుతాయేమో చూడాలి మరి.

Movie Name: Arthamayyinda Arunkumar

Release Date: 2023-06-30
Cast: Harshith Reddy, Ananya, Tejaswi Madiwada, Abhinav Goutham,Visu Inturi, Jai Praveeen
Director:Jonathan Edwards
Producer: Tanvi Desai
Music: Ajay Arasada
Banner: Laughing Cow productions

Rating: 2.50 out of 5

Trailer

More Reviews