'ది నైట్ మేనేజర్ 2' (డిస్నీ ప్లస్ హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ

The Night Manager

The Night Manager Review

  • భారీ వెబ్ సిరీస్ గా 'ది నైట్ మేనేజర్'
  • ఈ నెల 30వ తేదీ నుంచి పార్టు 2 స్ట్రీమింగ్ 
  • ప్రధానమైన పాత్రల్లో అనిల్ కపూర్ - ఆదిత్య రాయ్ కపూర్ 
  • బలమైన కథాకథనాలు .. సన్నివేశాలకి తగిన లొకేషన్స్ 
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - ఫొటోగ్రఫీ హైలైట్ 
  • వాస్తవానికి కాస్త దూరంగా అనిపించే కొన్ని అంశాలు

'డిస్నీ హాట్ స్టార్' లో ఇంతవరకూ వచ్చిన భారీ వెబ్ సిరీస్ లలో ఒకటిగా 'ది నైట్ మేనేజర్' కనిపిస్తుంది. అనిల్ కపూర్ - ఆదిత్య రాయ్ కపూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్ లో .. సీజన్ 1లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన 4 ఎపిసోడ్స్ ను వదిలారు. పార్టు 2 అంటూ ఆ ఎపిసోడ్స్ కి కొనసాగింపుగా మరో 3 ఎపిసోడ్స్ ను జూన్ 30వ తేదీన స్ట్రీమింగ్ చేశారు. ముందుగా వదిలిన 4 ఎపిసోడ్స్ చూసినవారికే, కొత్తగా వదిలిన ఎపిసోడ్స్ అర్థమవుతాయి.

షాన్ సేన్ గుప్తా (ఆదిత్యరాయ్ కపూర్) బంగ్లాదేశ్ లోని ఒక స్టార్ హోటల్లో 'నైట్ మేనేజర్' గా పనిచేస్తూ ఉంటాడు. బంగ్లాదేశ్ లో ఎక్కడ చూసినా అల్లర్లు జరుగుతూ ఉంటాయి. ఇండియాకి చెందిన ఓ 14 ఏళ్ల అమ్మాయి 'సఫీనా' ( అరిస్టా మెహతా) రెహ్మాన్ తో కలిసి ఆ హోటల్లో ఉంటుంది. తనకి ఇండియాకి పారిపోవాలని ఉందనీ, అందుకు సాయం చేయమని షాన్ ను కోరుతుంది. అందుకు కారణం ఇదేనంటూ ఆమె ఒక వీడియోను అతనికి పంపిస్తుంది. 

  రెహ్మాన్ (రేష్ లంబా) అనే ఒక గ్యాంగ్ స్టార్ కి సఫీనా మూడో భార్య అనీ, ఆయుధాల అక్రమ రవాణా చేసే శైలేంద్ర (అనిల్ కపూర్)కి అతను ముఖ్య అనుచరుడని షాన్ తెలుసుకుంటాడు. గతంలో తాను 'నేవీ'లో పని చేసి ఉండటం వలన, అతను నేరుగా 'ఢాకా'లోని డిప్యూటీ హై కమిషనర్ విక్రమ్ భగవత్ ను కలిసి, శైలేంద్ర అక్రమ కార్యకలాపాలను నిరూపించే ఆ వీడియోను అందజేస్తాడు. వెంటనే అతను ఆ వీడియోను ఢిల్లీలోని 'రా' అధికారికి పంపిస్తాడు. ఆ అధికారికి శైలేంద్రతో సాన్నిహిత్యం ఉండటం వలన, ఆ వీడియో ఆయన చేతికి వెళ్లిపోతుంది.

 దాంతో తమ విషయాలను లీక్ చేసిన సఫీనాను శైలేంద్ర మనుషులు హత్య చేస్తారు. తన కారణంగా ఒక అమ్మాయి చనిపోవడం షాన్ ను బాధిస్తుంది. జరిగిన సంఘటనకు బాధ్యులను చేస్తూ, 'రా' అధికారులను ఆయన నిలదీస్తాడు. అయితే 'రా' ఏజెంటుగా ఎంతో నిజాయతీగా పనిచేసే లిపిక (తిలోత్తమ) శైలేంద్ర అరాచకాలను బయటపెట్టి, అతణ్ణి చట్టానికి అప్పగించాలని బలంగా నిర్ణయించుకుంటుంది. అందుకోసం తనకి సాయం చేయమని షాన్ ను కోరుతుంది. 

లిపిక సూచన మేరకు శ్రీలంకలో అడుగుపెట్టిన షాన్, ఒక పథకం ప్రకారం శైలేంద్ర ఫ్యామిలీకి దగ్గరవుతాడు. అయితే శైలేంద్ర మనుషులు తనపై ఎన్ని రకాలుగా నిఘా పెట్టినా తెలివిగా తప్పించుకుంటూ, అతని నమ్మకాన్ని సంపాదించుకుంటాడు. అతని ద్వారానే కంపెనీ లావాదేవీలు జరిగేలా శైలేంద్ర నిర్ణయం తీసుకునేంతగా నమ్మిస్తాడు. శైలేంద్రకి సంబంధించిన కదలికలను ఎప్పటికప్పుడు లిపికకు చేరవేస్తూనే ఉంటాడు.

 శైలేంద్ర గర్ల్ ఫ్రెండ్ కావేరి ( శోభిత ధూళిపాళ) ఆయనతో సంతోషంగా లేదనే విషయం షాన్  గ్రహిస్తాడు. శైలేంద్రకి నమ్మకంగా ఉంటూ వస్తున్న జీవీ .. జేయు .. బ్రీజ్ పాల్ ను తెలివిగా అడ్డుతప్పిస్తాడు. షాన్ పట్ల కావేరి ఆసక్తిని చూపిస్తుండటం కూడా శైలేంద్ర గమనిస్తాడు. నిదానంగా అతనికి షాన్ పై అనుమానం పెరుగుతూ పోతుంది. అప్పుడు శైలేంద్ర ఏం చేస్తాడు? ఆయనను పట్టుకోవడానికి 'రా' చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? సఫీనాకి ఆత్మశాంతి కలిగేలా షాన్ చేయగలుగుతాడా? అనేది మిగతా కథ.

ది ఇంక్ ఫ్యాక్టరీ - బనిజయ్ ఏసియా సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మించిన వెబ్ సిరీస్ ఇది. సందీప్ మోది - ప్రియంక ఘోష్ దర్శకత్వం వహించారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాద సంస్థలకు అక్రమంగా ఆయుధాలను రవాణా చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యన్ని సృష్టించుకున్న విలన్ ఒక వైపు .. ఒక నైట్ మేనేజర్ సాయంతో ఆ విలన్ ను పట్టుకోవడానికి 'రా' బృందం చేసే ప్రయత్నం మరో వైపు. ఆ విలన్ కీ .. ఈ నైట్ మేనేజర్ కి మధ్య జరిగే కథనే ఇది. 

టైటిల్ హీరో వైపు నుంచి ఉన్నప్పటికీ .. విలన్ వైపు నుంచి నడిచే కథ ఎక్కువ. తన అక్రమ వ్యాపారాల రహస్యాలను తెలుసుకోవడానికి వచ్చిన వ్యక్తిని తన పక్కనే పెట్టుకుని, అందుకు సంబంధించిన లావాదేవీలను అతని సమక్షంలోనే విలన్ నిర్వహించడం ఈ కథలో ఆసక్తిని రేకెత్తించే అంశం. ఇది బలమైన కథ .. పాత్రల సంఖ్య కూడా ఎక్కువే. అయినా వాటిని డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే కూడా పకడ్బందీగా ... నీట్ గా అనిపిస్తుంది. లొకేషన్స్ .. విలన్ డీల్ కుదుర్చుకునే ఎపిసోడ్స్ హైలైట్ గా నిలుస్తాయి.    

అక్కడక్కడా సన్నివేశాలను కాస్త పొడిగించినట్టు అనిపించినా, ఒక వ్యూహంలో భాగంగా నడుస్తూ ఉంటుంది గనుక బోర్ కొట్టదు. అనిల్ కపూర్ .. ఆదిత్యరాయ్ కపూర్ .. 'రా' ఏజెంటుగా తిలోత్తమ నటన ఈ వెబ్ సిరీస్ కి హైలెట్. అనిల్ కపూర్ విలన్ పాత్రలో కనిపించినా, ఆయన విలనిజంలోను హీరోయిజం కనిపిస్తూ ఉంటుంది. సంతోష్ నారాయణ్ - సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు బలంగా నిలిచిందని చెప్పాలి. బెంజిమన్ జాస్పర్ ఫొటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దుబాయ్ ఎపిసోడ్ ను ఆయన చిత్రీకరించిన విధానానికి ఎక్కువ మార్కులు పడిపోతాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. 

నేవీ నుంచి హీరో ఎందుకు బయటికి వచ్చాడు? నైట్ మేనేజర్ గా ఎందుకు పనిచేస్తున్నాడు? అనే విషయంలో స్పష్టత లేదు. అలాగే అక్రమ ఆయుధాల డీల్ ను విలన్  ఓ గ్యాంగ్ తో మాట్లాడుతూ ఉండగా, గతంలో తన బ్యాచ్ లో పనిచేసిన నేవీ ఆఫీసర్ ను షాన్ గుర్తుపట్టి హగ్ చేసుకోవడం ఒక పొరపాటుగానే భావించాలి. కొత్తగా వచ్చిన వ్యక్తితో విలన్ తన కొడుకును బయటికి పంపించడం .. వేల కోట్ల లావాదేవీలు ఆ వ్యక్తి ద్వారా జరిగేలా చూడటం సహజత్వానికి దూరంగా అనిపిస్తాయి. ఇలాంటి కొన్ని లాజిక్స్ ను పక్కన పెట్టేస్తే, ఒక భారీ వెబ్ సిరీస్ గా .. ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ గానే దీనిని గురించి చెప్పుకోవాలి. 

ప్లస్ పాయింట్స్: కథ .. స్క్రీన్ ప్లే .. డైలాగ్స్ .. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన తీరు .. లొకేషన్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ. 

మైనస్ పాయింట్స్: కొన్ని విషయాల్లో స్పష్టత లేకపోవడం .. మరికొన్ని అంశాలు సహజత్వానికి దూరంగా అనిపించడం. 

Movie Name: The Night Manager

Release Date: 2023-06-30
Cast: Anil Kapoor,Aditya Roy Kapur,Sobhita Dhulipala, Tillotama Shome, Saswata Chatterjee, Joy Sengupta
Director:Sandeep Modi- Priyanka Ghosh
Producer: Deepak Dhar- Rishi Negi
Music: Santosh Narayan -Sam CS
Banner: The Ink Factory- Banijay Asia

Rating: 3.50 out of 5

Trailer

More Reviews