'హిడింబ' - మూవీ రివ్యూ

Hidimba

Hidimba Review

  • అశ్విన్ బాబు హీరోగా వచ్చిన 'హిడింబ'
  • యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
  • ఆకట్టుకునే హీరో .. హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ 
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీకి మంచి మార్కులు 
  • బలహీనపడిన కొన్ని పాత్రలు .. కొన్ని సన్నివేశాలు

అశ్విన్ బాబు హీరోగా 'హిడింబ' సినిమా రూపొందింది. టైటిల్ దగ్గర నుంచే ఈ సినిమా ఆడియన్స్ లో ఆసక్తిని పెంచింది. ఒక చిత్రమైన మాస్క్ తో కూడిన పోస్టర్స్ తో అందరిలో మరింత ఉత్కంఠ పెరిగింది. ఈ సినిమాకి సంబంధించిన సస్పెన్స్ ను ఎవరూ రివీల్ చేయవద్దని రిలీజ్ కి ముందు రోజున ఈ సినిమా టీమ్ ఒక రిక్వెస్ట్ చేసింది. దాంతో సస్పెన్స్ ఎవరూ ఊహించని విధంగా ఉండొచ్చనే ఒక కుతూహలం మరింత చోటుచేసుకుంది. అలా ఈ రోజున థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో ఆకట్టుకుందనేది చూద్దాం.

కథలోకి వెళితే .. హైదరాబాదులో వరుసగా జరుగుతున్న అమ్మాయిల కిడ్నాప్ లతో ఈ సినిమా మొదలవుతుంది. పాతికేళ్లలోపు అమ్మాయిలు కిడ్నాప్ కి గురవుతుంటారు. ఎవరు ఈ కిడ్నాప్ లకు పాల్పడుతున్నారు? వాళ్లు ఆ అమ్మాయిలను ఏం చేస్తున్నారు? అనేది అంతుబట్టదు. ఈ కేసును పోలీస్ డిపార్టుమెంటులో పనిచేస్తున్న అభయ్ (అశ్విన్ బాబు) .. ఆధ్య (నందిత శ్వేత)లకు అప్పగిస్తారు. ఆ రోజు నుంచే వాళ్లిద్దరూ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. 

ఒక వైపున వీళ్లు తమ ఇన్వెస్టిగేషన్ ను కొనసాగిస్తూ ఉండగానే, మరో వైపున కిడ్నాప్ లు జరుగుతూనే ఉంటాయి. 'కాలాబండ' ప్రాంతంలో ఉండే 'బోయ' గ్యాంగ్ పనే అయ్యుండొచ్చని భావించి, అతణ్ణి అరెస్టు చేస్తారు. అయితే అతణ్ణి పట్టుకున్నప్పటికీ ఈ దారుణాలకు తెరపడదు. 'రెడ్' కలర్ డ్రెస్ వేసుకున్న యువతులు మాత్రమే కిడ్నాప్ కి గురవుతూ ఉండటాన్ని ఆధ్య గమనిస్తుంది. కిడ్నాపర్ కి ఎరుపు రంగును మాత్రమే గుర్తించగలిగే ఒక రకమైన దృష్టి సంబంధమైన వ్యాధి ఉండొచ్చని తెలుసుకుంటుంది. 

అలాంటి పరిస్థితుల్లోనే, గొర్రె ముఖాన్ని పోలిన ఒక 'చెక్క మాస్క్' ఆధ్యకి దొరుకుతుంది. ఆ మాస్క్ ను చూడగానే ఆమె ఒక్కసారిగా భయపడిపోతుంది. అందుకు కారణం ఏమిటని అభయ్ అడుగుతాడు. అప్పుడు ఆమె 'హిడింబ' అనే పేరును ప్రస్తావిస్తుంది. ఆ మాస్క్ కారణంగానే తన తండ్రి చనిపోయాడంటూ, కేరళలో తన బాల్యానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది. 'హిడింబ' అనేది ఒక ప్రమాదకరమైన తెగ అనీ, వాళ్లు మనుషుల రక్తంతో ఆకలి తీర్చుకునే అలావాటున్న వాళ్లని అంటుంది. 

కొన్ని కారణాల వలన ఆ తెగకి చెందినవారు అంతా కూడా అంతమైపోయారనీ, ఆ తెగకి చెందిన ఒకే ఒక వ్యక్తి మాత్రం కేరళ నుంచి ఇక్కడికి వచ్చాడని అంటుంది. అతని దగ్గర మాత్రమే అలాంటి మాస్క్ ఉండే అవకాశం ఉందని చెబుతుంది. ఈ కేసును తాము కేరళ నుంచి మొదలు పెట్టవలసి ఉంటుందని అంటుంది. ఆధ్యకి సంబంధించిన కేరళ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? ఆ మాస్క్ కీ .. ఆమె తండ్రి మరణానికి గల సంబంధం ఎలాంటిది? ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? 'హిడింబ' జాతి నుంచి వచ్చిన చివరి వ్యక్తి ఎవరు? అనేది మిగతా కథ. 

దర్శకుడు అనిల్ కన్నెగంటి ఈ కథను రెడీ చేసుకుని, తనదైన స్టైల్లో తెరకెక్కించాడు. అతను ఏదైతే కంటెంట్ అనుకున్నాడో, దానికి సంబంధించిన అవుట్ పుట్ ను చాలా వరకూ తెరపైకి తీసుకుని రాగలిగాడు. పోలీస్ ఆఫీసర్స్ గా ఒకే ఆపరేషన్ లో హీరో .. హీరోయిన్ భాగం కావడం, ట్రైనింగ్ సమయంలోనే వాళ్ల మధ్య ప్రేమ వ్యవహారం నడవడం వంటి ఎపిసోడ్స్ ను, ప్రధానమైన ట్రాక్ తో సమానంగా నడిపిస్తూ వచ్చాడు. అలాగే యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా ఉండేలా చూసుకున్నాడు. 

అయితే ప్రేక్షకుడికి ఒక సీరియల్ కిల్లర్ కథను .. సైకో కిల్లర్ కథను .. కిడ్నాప్ స్టోరీలను .. మిస్టరీ థ్రిల్లర్ లను కలిపి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకప్పుడు అడవి ప్రాంతాల్లో జీవించే ఒక తెగ అంటూ దర్శకుడు ఈ కథను ఎత్తుకున్నప్పటికీ, కథ చిక్కబడుతున్నా కొద్దీ హింస పెరుగుతూ పోతుంటుంది. సాధారణంగా హాలీవుడ్ సైకో కిల్లర్ జోనర్లోని సినిమాల్లో ఈ తరహా సన్నివేశాలు ఉంటాయి. ఆ నెత్తుటి ధారలను చూసి తట్టుకోవాలంటే ప్రేక్షకులకు కాస్త గుండె నిబ్బరం ఉండాల్సిందే.

దర్శకుడు ప్రధానమైన కథకి జోడిస్తూ, తెరపైకి 'బోయ' .. 'ఫాహద్' అనే విలన్ షేడ్స్ కలిగిన పాత్రలను తీసుకొచ్చాడు. అక్రమ వ్యాపారంగా జరుగుతున్న అవయవాల అమ్మకం గురించిన పాయింటును కూడా టచ్ చేశాడు. కానీ ఈ రెండు వైపుల ఉన్న ట్రాకులను బలంగా రాసుకోలేకపోయాడు. చివరికి అవి మరింత బలహీనపడి సైడైపోతాయి. ఇటు హీరో ఫ్లాష్ బ్యాక్ .. అటు హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే కొనసాగుతాయి.

అభయ్ గా అశ్విన్ యాక్షన్ బాగుంది. మంచి ఫిట్ నెస్ తో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఫైట్స్ చాలా బాగా చేశాడు. ఆధ్య పాత్రకి నందిత శ్వేత న్యాయం చేసింది. మకరంద్ దేశ్ పాండే తన పాత్రలో జీవించాడనే చెప్పాలి. రాజీవ్ పిళ్లై .. రఘుకుంచె .. అజయ్ రత్నం పాత్రలను దర్శకుడు సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోయాడు. వికాస్ బాడిస అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. రాజశేఖర్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఫారెస్టు నేపథ్యంలో సీన్స్ ను గొప్పగా ఆవిష్కరించాడు. ఎడిటింగ్ కూడా ఓకే. కేరళలోని ఫైట్ .. 'కాలబండ' ఫైట్ హైలైట్ గా అనిపిస్తాయి. 

ప్లస్ పాయింట్స్: కథ .. స్క్రీన్ ప్లే .. టేకింగ్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కెమెరా పనితనం .. కేరళలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ .. ఫైట్స్. 

మైనస్ పాయింట్స్: హింస .. రక్తపాతం ..   సరిగ్గా డిజైన్ చేయని కొన్ని పాత్రలు .. జుగుప్స కలిగించే కొన్ని సన్నివేశాలు .. బలహీనపడిన కొన్ని ట్రాకులు.

Movie Name: Hidimba

Release Date: 2023-07-20
Cast: Ashwin Babu, Nanditha Swetha, Makarand Deshpande, Shiju Abdul, Rajeev Pillai, Raghu Kunche
Director:Anil Kanneganti
Producer: Gangapatnam Sridhar
Music: Vikas
Banner: AK Enetartainmets - OAK - SVKC

Rating: 2.75 out of 5

Trailer

More Reviews