అనుష్కకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన పనిలేదు. ఇంతవరకూ ఆమె ఒక వైపున స్టార్ హీరోల సరసన నటిస్తూనే, మరో వైపున నాయిక ప్రధానమైన కథలను చేస్తూ వచ్చింది. ఈ రెండు జోనర్లలో కాకుండా, నవీన్ పోలిశెట్టితో కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' కథను నడిపించే పాత్రను పోషించడం అనుష్క చేసిన మరో సాహసంగా చెప్పుకోవచ్చు. యూవీ బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.
కథ విషయానికొస్తే .. ఇది 'లండన్' లో మొదలవుతుంది. అక్కడి స్టార్ హోటల్లో అన్విత (అనుష్క) మాస్టర్ చెఫ్ గా పనిచేస్తూ ఉంటుంది. తల్లి సుధ (జయసుధ)నే ఆమెకి అన్నీ. లండన్ నుంచి ఇండియాకి తిరిగొచ్చిన సుధ, చనిపోతుంది. అందుకు సంబంధించిన పనులపై ఇండియాకి వచ్చిన అన్విత, తాను ఒక బిడ్డకి తల్లి కావాలనుకుంటుంది. వివాహం పట్ల అయిష్టత .. రిలేషన్ షిప్ పట్ల అసంతృప్తి కారణంగా, డోనర్ ద్వారా తాను తల్లిని కావాలని భావిస్తుంది. ఈ విషయంలో ఆమె తన స్నేహితురాలైన 'కావ్య' సాయం తీసుకుంటుంది.
అయితే స్పెర్మ్ డొనేట్ చేసే వ్యక్తి గుణగణాలు .. అతని ఫ్యామిలీ నేపథ్యం .. ఇవన్నీ చూసుకోవాలని అన్విత నిర్ణయించుకుంటుంది. ఈ విషయంలో ఆమెకి అనేక అనుభవాలు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో 'సిద్ధూ' (నవీన్ పోలిశెట్టి) ఆమెకి తారసపడతాడు. అతను మధ్య తరగతి ఫ్యామిలీకి చెందిన యువకుడు. తనకి ఎంతో ఇష్టమైన 'స్టాండప్ కామెడీ'లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. అతనిలోని సమయస్ఫూర్తి నచ్చడంతో, అతన్ని తన డోనర్ గా అన్విత ఎంచుకుంటుంది.
అయితే ఈ విషయం సిద్ధూకి చెప్పకుండానే, అతని విషయంలో అన్విత కేర్ తీసుకుంటూ ఉంటుంది. అలాగే వారసత్వంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ల ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నాయేమో తెలుసుకోవాలని, సిద్ధూ ఫ్యామిలీ నేపథ్యం గురించి తెలుసుకోవడం మొదలుపెడుతుంది. ఇందుకోసం తరచూ సిద్ధూ ఇంటికి వెళుతూ ఉంటుంది. తన పట్ల ఇష్టంతోనే అన్విత ఇలా చేస్తుందని భావించిన సిద్ధూ, ఆమెను మనస్పూర్తిగా ప్రేమించడం మొదలుపెడతాడు.
ఒక కీలకమైన సందర్భంలో అన్వితకి ప్రపోజ్ చేయడానికి సిద్ధూ రెడీ అవుతాడు. అప్పుడు అన్విత అతనితో తన మనసులోని మాట చెబుతుంది. తనకి ప్రేమ .. పెళ్లి పట్ల నమ్మకం లేదని అంటుంటుంది. అందువలన అతని ద్వారా బిడ్డను కనాలని అనుకుంటున్నట్టుగా చెబుతుంది. అప్పుడు సిద్ధూ ఎలా స్పందిస్తాడు? అన్వితకి పెళ్లి అంటే ఇష్టం లేకపోవడానికి కారణం ఏమిటి? అన్విత - సిద్దూ తీసుకున్న నిర్ణయాలలో చివరికి ఎవరి నిర్ణయం మారుతుంది? అనేదే మిగతా కథ.
దర్శకుడు మహేశ్ బాబు ఈ కథను రెడీ చేసుకుని రంగంలోకి దిగాడు. నిజానికి ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కి చెందిన సినిమా. ఇది రెగ్యులర్ ఫార్మేట్ లో సందడి చేసే సినిమా కాదనే విషయం, సగటు ప్రేక్షకుడికి ట్రైలర్ తోనే అర్థమైపోతుంది. అంతేకాదు .. ఇది హీరోహీరోయిన్ ల రొమాన్స్ తో ముడిపడిన కంటెంట్ కాదనే విషయం కూడా వాళ్లకి తెలిసిపోతుంది. అలాంటి ఒక సినిమాకి ఆడియన్స్ ను తీసుకురావడం .. వచ్చిన వాళ్లను కూర్చోబెట్టడం అంత తేలికైన విషయమేం కాదు.
ఇంతవరకూ అనుష్క చేస్తూ వచ్చిన సినిమాలు వేరు .. నవీన్ పోలిశెట్టికి బాగా పరిచయమైన కామెడీని ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తూ, ఆమె పాత్రను నడిపించాలి. అదే సమయంలో ఈ రెండు పాత్రలు హీరో - హీరోయిన్స్ లా అనిపించకుండా ఆవిష్కరించవలసి ఉంటుంది. అలా కామెడీని పరిగెత్తిస్తూ .. దానికి ఎమోషన్ ను యాడ్ చేస్తూ .. క్లైమాక్స్ దిశగా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. రెండు ప్రధానమైన పాత్రలను కలిసి నడిపిస్తూనే .. అవసరమైనంత దూరంలో ఉంచిన విధానమే ప్లస్ అయిందని చెప్పాలి.
అనుష్కను సన్నగా చూపించడానికి చాలానే కష్టపడినట్టుగా అనిపిస్తుంది. అయినా ముఖాన్ని క్లోజ్ అప్ లో చూపించినప్పుడు ఆమె లావు తెలిసిపోతూనే ఉంటుంది. నవీన్ పోలిశెట్టి తనకి అలవాటైన కామెడీని తనదైన స్టైల్లో పరిగెత్తించాడు. ఇక జయసుధను బాలయ్య బాబు వీరాభిమానిగా చూపించడం కథకి అవసరం లేని ప్రక్రియగా అనిపిస్తుంది. ఉన్నంతలో తులసి - మురళీశర్మ పాత్రలు కాస్త సందడి చేస్తాయి. ఇక నాజర్ పాత్ర విషయంలోనే సగటు ప్రేక్షకుడికి క్లారిటీ లేకుండా పోతుంది.
ఈ సినిమాను ఫస్టాఫ్ .. సెకండాఫ్ అంటూ విడదీసి మార్కులు ఇవ్వడం కష్టమే. ఎందుకంటే ఫస్టాఫ్ లో అనుష్క ద్వారా ఆడియన్స్ కి తెలిసిన విషయమే .. సెకండాఫ్ లో నవీన్ పోలిశెట్టికి తెలుస్తుంది. సాధ్యమైనంత వరకూ ఎంటర్టైన్ మెంట్ పాళ్లను కలపడానికే ట్రై చేస్తూ వెళ్లారు. "నువ్వు నచ్చకపోతే నీ ద్వారా బిడ్డను కనాలని ఎందుకు కోరుకుంటుంది? ఆమెకి ప్రేమ పట్ల నమ్మకం లేకపోతే అమ్మ కావాలని ఎందుకు ఆశపడుతుంది?" అనేది కాన్సెప్ట్ మొత్తానికి కలిపి పేలిన డైలాగ్.
ఈ సినిమాకి గోపీ సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. రధన్ అందించిన బాణీలు ఫరవాలేదు. నీరవ్ షా ఫోటోగ్రఫీకి వంకబెట్టవలసిన పనిలేదు. కానీ విదేశాల్లోని లొకేషన్స్ ను ఆశించిన స్థాయిలో చూపించలేదనే ఒక అసంతృప్తి మాత్రం కలుగుతుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ కూడా ఓకే. కథ తక్కువ పాత్రల మధ్య.. తక్కువ పరిధిలో తిరుగుతున్నా, బోర్ కొట్టకుండా చాలానే జాగ్రత్తలు తీసుకున్నారనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ఆమోదయోగ్యంగానే అనిపిస్తుంది.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' - మూవీ రివ్యూ
Miss Shetty Mr Polishetty Review
- విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా ఇది
- చాలా గ్యాప్ తరువాత ఆడియన్స్ ముందుకొచ్చిన అనుష్క
- తక్కువ పాత్రలతో .. తక్కువ పరిధిలో నడిచిన కథ
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకమైన ఆకర్షణ
- నవీన్ పోలిశెట్టి కామెడీనే ప్రధానమైన బలం
Movie Name: Miss Shetty Mr Polishetty
Release Date: 2023-09-07
Cast: Anushka, Naveen Polishetty, Jayasudha, Nassar, Murali Sharma, Tulasi, Abhinav Gomatham,
Director:Mahesh Babu. P
Producer: Vamsi Krishna- Pramod
Music: Gopi Sundar
Banner: UV Creatoins
Review By: Peddinti
Rating: 3.00 out of 5
Trailer