ఈ మధ్య కాలంలో ఓటీటీ సెంటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి చెందిన వెబ్ సిరీస్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బడా సంస్థలు నిర్మిస్తున్న ఈ సిరీస్ లు, నిర్మాణ విలువల పరంగా భారీ సినిమాలను తలపిస్తున్నాయి. అలాంటి భారీతనంతో 'హాట్ స్టార్' ఫ్లాట్ ఫామ్ ద్వారా పలకరించిన మరో వెబ్ సిరీస్ గా 'కాలా' కనిపిస్తుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. భారీ తారాగణంతో రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉందనేది చూద్దాం.
ఈ కథ కోల్ కతా .. డార్జిలింగ్ .. న్యూయార్క్ .. లండన్ నగరాలలో కొనసాగుతుంది. 1988 - 2018 మధ్య కాలంలో ఈ కథ నడుస్తుంది. ఇండో - బంగ్లాదేశ్ బోర్డర్ లో జరిగిన ఒక పోరాటంలో ఇండియాకి చెందిన 11మంది జవాన్లు చనిపోతారు. ఇండియన్ ఆర్మీకి చెందిన సుభేన్డు ముఖర్జీ (రోహన్ వినోద్ మెహ్రా) బంగ్లాదేశ్ రెబల్ ఫోర్స్ తో చేతులు కలపడమే అందుకు కారణమనే వార్త బయటికి వస్తుంది. బంగ్లాదేశ్ రెబల్ ఫోర్స్ తో చేతులు కలిపిన ఆయన, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడనే ప్రచారం ఊపందుకుంటుంది.
ఆ సంఘటనతో ముఖర్జీపై దేశద్రోహి అనే ముద్ర పడుతుంది. కావాలనే తనపై ప్రదీప్ శర్మ .. శాశ్వత్ రామ్ .. బల్వంత్ కుట్ర చేశారనే విషయం ముఖర్జీకి అర్థమవుతుంది. అయితే తన నిజాయితీని నిరూపించుకునే అవకాశం కోసం వెయిట్ చేస్తూ, ఆదినాథ్ బాబ్జి పేరుతో ఓ మారుమూల ప్రాంతంలో .. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తన తండ్రిపై దేశద్రోహి అనే ముద్రపడటం పట్ల ఆవేదన చెందుతూనే రిత్విక్ ముఖర్జీ (అవినాశ్ తివారి) ఎదుగుతాడు. పట్టుదలతో ఐబి ఆఫీసర్ అవుతాడు.
ఇదిలా ఉండగా నమన్ రాణా (తాహెర్ షబ్బీర్) తన అక్రమాలను .. అరాచకాలను ఒక రేంజ్ లో కొనసాగిస్తూ ఉంటాడు. ఆయనకి రాజకీయ నాయకుల అండదండలు .. కొంతమంది పోలీస్ అధికారుల సహకారం ఉండటం వలన ఎవరూ ఏమీ చేయలేకపోతుంటారు. అయితే రిత్విక్ ముఖర్జీ మాత్రం ఆయన ఆగడాలకు అడ్డుకట్టవేయాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగుతాడు. 15 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ లావాదేవీలను బయట పెట్టడమే కాకుండా, ఆ డబ్బును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ప్లాన్ చేస్తాడు.
అయితే కొంతమంది కీలకమైన వ్యక్తులు చక్రం తిప్పడంతో, రిత్విక్ కోసమే ఐబీ ఆఫీసర్స్ గాలించే పరిస్థితి వస్తుంది. తనకి మాదిరిగానే తన తండ్రిని కూడా కొంతమంది టార్గెట్ చేశారనీ, సమాజం దృష్టిలో దేశద్రోహిగా నిలబెట్టారనే నిజం రిత్విక్ కి అప్పుడు అర్థమవుతుంది. గతంలో తన తండ్రినీ .. ఇప్పుడు తనని టార్గెట్ చేసిన వారిని ఎలాంటి పరిస్థితుల్లోను వదలకూడదని నిర్ణయించుకుంటాడు. అందుకోసం రిత్విక్ ఏం చేస్తాడు? ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు? అనేవి కథలో ఆసక్తిని రేకెత్తించే అంశాలు.
బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహించిన సిరీస్ ఇది. సీజన్ 1లో భాగంగా మొత్తం 8 ఎపిసోడ్స్ ను అందించారు. 'కాలా' అనే పేరు చాలా పవర్ఫుల్. ఈ టైటిల్ కారణంగానే ఆడియన్స్ ఈ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్లో ఊహించుకుంటారు. నిర్మాణ విలువల పరంగా .. ఆర్టిస్టుల సంఖ్యా పరంగా చూసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే భావిస్తారు. నిజంగానే నిర్మాణ పరమైన విలువలకు ఢోకా లేదు. కానీ కథాకథనాల పరంగా చూసుకుంటే మాత్రం, అలాంటి ఆలోచనలకు .. అంచనాలకు దూరంగానే ఈ సిరీస్ కనిపిస్తుంది.
ఒక నిజాయతీ పరుడైన జవాన్ ను తోటి జవాన్లు ముగ్గురు టార్గెట్ చేస్తారు. అలాంటప్పుడు వారి పాత్రలను హైలైట్ చేయాలి. తనపై వేయబడిన నిందను తొలగించుకోవడానికి హీరో తండ్రి బలమైన ప్రయత్నాలు చేయాలి. ఇక తన అక్రమ వ్యాపారాలకు అడ్డుపడుతున్న హీరోకు, విలన్ తన పవరేంటనేది చూపించాలి. కథలో ఒకరిని మించిన ఎత్తుగడలు ఒకరు వేస్తూ వెళుతూ ఉండాలి. అప్పుడే కథ ఆడియన్స్ ను కూర్చోబెడుతుంది. కానీ ఇలాంటివేమీ దర్శకుడు వర్కౌట్ చేయలేకపోయాడు.
విలన్ చేసే బిజినెస్ లు ఏంటి? వాటి ద్వారా సమాజానికి కలిగే నష్టాలు ఏంటి? హీరో ఆయనను ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించనున్నాడు? వంటి అంశాలు సాధారణ ప్రేక్షకులకు అంత తొందరగా అర్థం కావు. స్క్రీన్ పై కథ పరిగెడుతూ ఉంటే, ఆడియన్స్ లో టెన్షన్ పుట్టాలి. ఈ కథలో మాత్రం పాత్రలు టెన్షన్ పడుతూ ఉంటాయిగానీ, ఆడియన్స్ కి ఏమీ అనిపించదు. ఎవరి ఉద్దేశం ఏమిటి? ఎవరు ఏం చేయబోతున్నారు? అనే విషయంలో ఆడియన్స్ కి క్లారిటీ రాకపోవడమే అందుకు కారణం.
ఈ వెబ్ సిరీస్ కోసం కాస్త గట్టిగానే ఖర్చు చేశారు. కథకి తగిన లొకేషన్స్ కోసం .. ఛేజింగుల కోసం చేసిన ఖర్చు భారీగానే కనిపిస్తుంది. తుపాకుల మోత హోరెత్తిస్తుంది. అయితే ఆ యాక్షన్ వెనకున్న ఎమోషన్ కి ఆడియన్స్ కి కనెక్ట్ చేయకపోవడం వలన ఏమీ అనిపించదు. హీరో వైపు నుంచి ఫాదర్ సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవడం .. హీరోకి సంబంధించిన లవ్ .. రొమాన్స్ ట్రాక్ లేకపోవడం ఒక వెలితిగా అనిపిస్తుంది. ఇక కొన్ని పాత్రలు ఆడియన్స్ కి రిజిస్టర్ కూడా కాలేదు. శక్తికపూర్ ... సౌరభ్ సచ్ దేవా వంటివారిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు.
ఇక బల్వంత్ పాత్రను హోమోగా చూపించడం .. హీరో స్టెప్ సిస్టర్ 'అలోక'ను లెస్బియన్ గా చూపించడం కథకి ఎంత మాత్రం అవసరం లేని విషయం. అనవసరమైన పాత్రలు .. సన్నివేశాలు అక్కడక్కడా తగులుతూనే ఉంటాయి. ఇక బల్వంత్ న్యూయార్క్ చేరుకున్న తరువాత 'హిజ్రా' లుక్ ను ఎందుకు సెట్ చేసుకోవలసి వచ్చిందనేది అర్థం కాదు.
గౌరవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సందర్భానికి తగినట్టుగా ఉంది. సిద్ధార్థ్ శ్రీనివాసన్ కెమెరా పనితనం మెప్పిస్తుంది .. లొకేషన్స్ ను బాగా కవర్ చేశాడు. ప్రియాంక్ ప్రేమ్ కుమార్ ఎడిటింగ్ విషయానికొస్తే, కొన్ని సీన్స్ ట్రిమ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కి భారీతనం పరంగా మంచి మార్కులు ఇవ్వొచ్చుగానీ, కథాకథనాల పరంగా గొప్పగా ఉందని మాత్రం చెప్పలేం.
'కాలా' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ
Kaala Review
- 'హాట్ స్టార్'లో అందుబాటులో ఉన్న 'కాలా'
- యాక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు
- ఎమోషన్ ను కనెక్ట్ చేయలేకపోయిన వైనం
- సామాన్య ప్రేక్షకులకు క్లారిటీ రాని కథ
- అయోమయానికి గురిచేసే రిజిస్టర్ కాని పాత్రలు
- నిర్మాణ విలువల పరంగా మంచి మార్కులు
Movie Name: Kaala
Release Date: 2023-09-15
Cast: Avinash Tiwary, Rohan Vinod Mehra, Nivetha Pethuraj, Taher Shabbir, Hiten Tejwani
Director:Bejoy Nambiar
Producer: Bhushan Kumar - Krishan Kumar
Music: Gaurav Godkhindi
Banner: T-Series Films
Review By: Peddinti
Rating: 2.75 out of 5
Trailer