తమిళంలో ఇంతకుముందు హారర్ కామెడీ జోనర్లో చాలానే సినిమాలు వచ్చాయి. అలాగే సంతానం హీరోగా ఒక హారర్ కామెడీ సినిమా రూపొందింది. 'డీడీ రిటర్న్స్' పేరుతో నిర్మితమైన ఈ సినిమా ఈ ఏడాది జులై 28వ తేదీన విడుదలైంది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా, 40 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ సినిమా తమిళ వెర్షన్ 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రీసెంటుగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది.
ఈ కథ 'పాండిచ్చేరి'లో 1965లో మొదలవుతుంది .. ఫెర్నాండెజ్ (ప్రదీప్ రావత్) జమీందారీ కుటుంబానికి చెందినవాడు. ఒక అందమైన ప్యాలెస్ లో తన తల్లి .. భార్య .. పిల్లలతో కలిసి నివసిస్తూ ఉంటాడు. అక్కడి ప్రభుత్వం జూదాన్ని నిషేధిస్తుంది. దాంతో జూదం ఒక వ్యసనంగా ఉన్నవారు, రహస్యంగా ప్యాలెస్ లో నిర్వహించే జూదానికి వెళుతుంటారు. టాస్క్ రూపంలో అక్కడ జరిగే జూదంలో, ఫెర్నాండేజ్ కుటుంబ సభ్యుల శాడిజానికి వాళ్లంతా బలైపోతూ ఉంటారు.
ఆ బంగ్లాలోకి వెళ్లినవారు వెళ్లినట్టుగానే మాయమవుతూ ఉండటంతో, గ్రామస్తులకు అనుమానం వస్తుంది. వాళ్లంతా కూడా మూకుమ్మడిగా ఆ బంగ్లాపై దాడి చేస్తారు. ఆ దాడిలో ఆ ప్యాలెస్ తగలబడిపోతుంది. ఆ బంగళాలోనే ఫెర్నాండేజ్ కుటుంబ సభ్యులంతా దహనమైపోతారు. అప్పటి నుంచి వాళ్లంతా దెయ్యాలుగా మారిపోయి ఆ బంగళాలో ప్రేతాత్మలుగా తిరుగుతూ ఉంటారు.
ఇక 2023లో ప్రస్తుత కథ మొదలవుతుంది. సతీశ్ (సంతానం) సోఫియా (సురభి) ప్రేమించుకుంటూ ఉంటారు. ఆమె ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండటంతో, ఆమెకి సాయపడే మార్గాన్ని గురించి సతీశ్ ఆలోచన చేస్తూ ఉంటాడు. అన్బూ (విజయన్) అనే శ్రీమంతుడికి సోఫియా 25 లక్షలు చెల్లించవలసి వస్తుంది. లేదంటే అతని కొడుకు బెన్నీని పెళ్లి చేసుకోవాలనేది షరతు. ఈ విషయం తెలుసుకున్న సతీశ్ డబ్బు కోసం ట్రై చేయడం మొదలుపెడతాడు.
అదే సమయంలో అన్బూ తన ఇంట్లో దాచిన 50 లక్షలను భీవి (మునీశ్ కాంత్) టీమ్ కాజేస్తుంది. ఆ టీమ్ దగ్గర నుంచి ప్రొఫెసర్ (రాజేంద్రన్) టీమ్ కాజేస్తుంది. వాళ్ల దగ్గర నుంచి ఆ డబ్బును కొట్టేసిన సతీశ్ .. అతని స్నేహితులు సమానంగా పంచుకుంటారు. సతీశ్ తన వాటాను సోఫియాకి అందజేస్తాడు. అయితే ఈ తతంగమంతా అన్బూకి తెలిసిపోతుంది. ఆయన సోఫియాను బంధించి, మొత్తం డబ్బు ఇచ్చేసి ఆమెను తీసుకుని వెళ్లమని సతీశ్ ను బెదిరిస్తాడు.
సతీశ్ స్నేహితులు తమ వాటాను ఒక పాడుబడిన బంగ్లాలో దాచినట్టుగా చెబుతారు. వాళ్లను వెంటబెట్టుకుని సతీశ్ ఆ బంగ్లాకు వెళతాడు. అది గతంలో తగలబడిపోయి .. ఇప్పుడు దెయ్యాలకు నివాసంగా మారిన ఫెర్నాండేజ్ బంగ్లా. తాము అక్కడ దాచిన డబ్బుకోసం సతీశ్ టీమ్ .. వాళ్లను రహస్యంగా అనుసరిస్తూ భీవీ టీమ్ ... వాళ్లను ఫాలో అవుతూ ప్రొఫెసర్ టీమ్ .. అసలు డబ్బులు పోగొట్టుకున్న అన్బూ టీమ్ ఆ బంగళాకి చేరుకుంటారు. అక్కడ ఏం జరుగుతుందనేదే మిగతా కథ.
సాధారణంగా హారర్ తో ముడిపడిన కథలన్నీ కూడా ఒక బంగ్లాకి పరిమితం కావడం ఎక్కువగా కనిపిస్తుంది. పాత్రలన్నింటినీ ఆ బంగ్లాలో ప్రవేశపెట్టిన తరువాత కథ మరింత రసవత్తరంగా మారుతుంది. అదే పద్ధతిలో దర్శకుడు ఈ కథను నడిపించాడు. ఈ కథ కోసం దర్శకుడు కొన్ని ముఖ్యమైన పాత్రలను డిజైన్ చేసుకున్నాడు. మొదటి నుంచి చివరివరకూ ఆ పాత్రల మధ్యనే కథ నడుస్తుంది. మధ్యలో మరో పాత్ర ఎంటర్ కావడమంటూ జరగదు.
కానీ ఇంట్రడక్షన్ ఇప్పించిన తరువాత ప్రతి పాత్రను చివరివరకూ ఉపయోగించుకుంటూ వెళ్లాడు. దెయ్యాల బంగ్లాలో నుంచి బయటపడటం కోసం .. ముఖ్యంగా డబ్బుతో పాటు బయటపడటం కోసం పాత్రలు పడే అవస్థల మధ్య కామెడీని రాబట్టాడు. అక్కడక్కడా భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయితే భయపెట్టడంపై పెద్దగా ఫోకస్ చేయలేదని తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రాక్ కి సంబంధించిన గ్రాఫిక్స్ అంత క్వాలిటీగా అనిపించవు.
నటీనటులందరూ ఎవరి పాత్రలకి వారు న్యాయం చేశారు. దీపక్ కుమార్ ఫొటోగ్రఫీ .. అఫ్రో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. శ్రీకాంత్ ఎడిటింగ్ కూడా ఓకే. హారర్ కామెడీ జోనర్లో వచ్చిన 'కాంచన' ..'గీతాంజలి' వంటి సినిమాల స్థాయి వేరు. అదే జోనర్ అయినప్పటికీ ఈ సినిమా స్థాయి వేరు. ఈ సినిమాను పిల్లలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారేమో అనేట్టుగా సాగుతుంది. తమిళ సినిమా అనువాదానికి పెట్టిన ఈ తెలుగు టైటిల్ చందమామ కథలోని టైటిల్ మాదిరిగా అనిపించినా, తెలుగు వెర్షన్ కి తెలుగు టైటిల్ పెట్టారు .. అదే సంతోషం అనుకోవాలంతే.
'భూతాల బంగ్లా' (జీ 5) మూవీ రివ్యూ
Bhoothala bangla Review
- సంతానం హీరోగా రూపొందిన 'భూతాల బంగ్లా'
- హారర్ కామెడీ జోనర్లో సాగే కథ
- కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు
- పాత పద్ధతిలో ఒక బంగ్లాలో జరిగే కథ ఇది
- చిన్నపిల్లలను ఆకట్టుకునే అంశాలు ఎక్కువ
Movie Name: Bhoothala bangla
Release Date: 2023-09-01
Cast: Santhanam, Surabhi, Pradeep Rawat, Rajendran, Redin Kingsley, Munishkanth
Director:S.Prem Anand
Producer: Ramesh Kumar
Music: Afro
Banner: R.K. Entertainment
Review By: Peddinti
Rating: 2.50 out of 5
Trailer