'చార్లీ చోప్రా - ది మిస్టరీ ఆఫ్ సలాంగ్ వ్యాలీ' (సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ

Charlie Chopra

Charlie Chopra Review

  • వామికా గబ్బి ప్రధానమైన పాత్రగా 'చార్లీ చోప్రా'
  • కీలకమైన పాత్రలలో సీనియర్ ఆర్టిస్టులు 
  • కథలో కొత్త పాయింటును టచ్ చేసిన దర్శకుడు 
  • కథ జరిగే నేపథ్యంలోను కనిపించిన కొత్తదనం 
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - ఫొటోగ్రఫీ హైలైట్ 

మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో సాగే వెబ్ సిరీస్ లకు ఇప్పుడు విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అనే ముడులను విప్పుకుంటూ వెళ్లే ఈ తరహా కథలను ఇష్టపడే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువ. అందువలన ఈ జోనర్లో ఎక్కువ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ఓటీటీ సంస్థలు ఉత్సాహాన్ని చూపుతున్నాయి. అలాంటి కాన్సెప్టుతో ఈ రోజు నుంచే 'సోనీ లివ్' లో 'చార్లీ చోప్రా' స్ట్రీమింగ్ అవుతోంది. 


ఈ కథ సలాంగ్ - మనాలి ప్రాంతాల్లో జరుగుతుంది. మెహర్బాన్ సింగ్ (గుల్షన్ గ్రోవర్) గతంలో బ్రిగేడియర్ గా పనిచేసి ఉంటాడు. తనతో పాటు కలిసి పని చేసిన 'కల్నల్ బరువా'తో ఆయన స్నేహం ఇప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. పదవీ విరమణ తరువాత చేసిన వ్యాపారాలు కలిసి రావడంతో, మెహర్బాన్ శ్రీమంతుడు అవుతాడు. ఆయనకి సంబంధించిన వ్యవహారాలను చూస్తూ 'బరువా' ఉంటాడు. 

మెహర్బాన్ తమ్ముడు మోహన్ సింగ్ రావత్ తో జానకి (నీనా గుప్తా) వివాహం జరుగుతుంది. వారి కుమారుడే వరుణ్. ఇక మెహర్భాన్ కి సలోని అనే మేనకోడలు .. దిలీప్ - బల్జిత్ అనే మేనల్లుళ్లు ఉంటారు. ఆ ఫ్యామిలీకి చెందినవాడే జిమ్మీ (వివాన్ షా). అతను .. చారులత చోప్రా (వామికా గబ్బి) ప్రేమించుకుంటారు. వాళ్ల ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోతుంది. చారులత తల్లి డిటెక్టివ్ గా పనిచేసి ఉంటుంది. అందువలన ఆ లక్షణాలు కొన్ని చారులతకి వస్తాయి. 

మెహర్బాన్ వివాహం చేసుకోకపోవడం వలన, ఆయన ఆస్తిపాస్తుల కోసం ఆయన కుటుంబ సభ్యులంతా ఆశపడుతూ ఉంటారు. అయితే ఆయన 'నికోల్' అనే విదేశీ అమ్మాయి వ్యామోహంలో పడతాడు. తన ఆస్తిపాస్తులపై అన్ని అధికారాలు ఆమెకి అప్పగించడానికి ఆయన రెడీ అవుతుంటాడు. ఈ విషయం తెలిసి అంతా అయోమయానికి లోనవుతారు. అలాంటి పరిస్థితుల్లోనే మంచు తుపాను కురుస్తున్న ఒక రాత్రివేళ మెహర్బాన్ హత్య జరుగుతుంది.

ఈ హత్య కేసులో జిమ్మీ చిక్కుకున్నాడనే విషయం తెలిసి, చారులత చోప్రా ఆశ్చర్యపోతుంది. తనకి  ఏ పాపమూ తెలియదని జిమ్మీ ఆమెతో చెబుతాడు. జిమ్మీనే హంతకుడు అనే విషయాన్ని నమ్మిన పోలీసులు .. జర్నలిస్టులు ఆ దిశగానే ముందుకు వెళుతుంటారు. దాంతో సత్యాలు .. సాక్ష్యాలు మరుగున పడుతున్నాయని భావించిన చారులత చోప్రా, డిటెక్టివ్ 'చార్లీ చోప్రా'గా మారుతుంది. ఈ మర్డర్ మిస్టరీని ఆమె ఎలా ఛేదిస్తుంది? ఆ ప్రయత్నంలో ఎలాంటి పరిణామాలను ఎదుర్కుంటుంది? అనేది మిగతా కథ. 

మిస్టరీ థ్రిల్లర్ కథలలో ఒక మర్డర్ జరగడం ... ఆ మర్డర్ చుట్టూ అనేక అనుమానాలు .. సందేహాలను అల్లుతూ కథను ముందుకు తీసుకుని వెళ్లడం సహజంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మిగతా మర్డర్ కేసుల విషయంలో పోలీస్ డిపార్టుమెంటుకి సంబంధించిన ఆఫీసర్లు విచారణ జరపడాన్ని ఆసక్తికరంగా చూపిస్తూ ఉంటారు. కానీ తన కాబోయే భర్తను కాపాడుకోవడం కోసం .. ఒక యువతి డిటెక్టివ్ గా మారిపోయి, నిజమైన నేరస్థులెవరో నిరూపించడమనేది ఈ సిరీస్ లోని కొత్త పాయింట్. 

సంగీత దర్శకుడిగా పేరున్న విశాల్ భరద్వాజ్ ఈ సిరీస్ కి దర్శక నిర్మాతగా వ్యవహరించాడు. జ్యోత్స్న హరిహరన్ తో కలిసి ఆయన ఈ కథను తయారు చేసుకున్నారు. కథ అంతా కూడా ఒక ఫ్రేమ్ లో పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. కథ ఎక్కడా సడలినట్టుగా అనిపించదు. లూజ్ సీన్స్ అనేవి దాదాపుగా కనిపించవు. కథ మొదలైన కొద్ది సేపటిలో ఏ పాత్రలైతే గడప లోపలికి వస్తాయో, ఆ పాత్రలతోనే కథ అంతా నడుస్తుంది. మధ్యలో కొత్త పాత్రలు రావడమనేది జరగదు. 

అందరూ మెహర్భాన్ కుటుంబ సభ్యులే .. కాకపోతే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వాళ్లలో ఎవరి ఆయనను హత్య చేశారనే అంశం చుట్టూనే ఈ కథ నడుస్తుంది. ఈ నిజాన్ని బయటపెట్టడానికి చార్లీ చోప్రా ప్రయత్నాలు చేస్తుండగా, మనం ఆమెను ఫాలో అవుతూ ఉంటాము. ఆమె పాత్ర .. ఆ ట్రాక్ ను డిజైన్ చేసిన తీరు వలన ఎక్కడా కూడా బోర్ కొట్టదు. కథ అనేక మలుపులు తీసుకుంటూ ఉండటం వలన ప్రేక్షకుడు ఆసక్తికరంగానే ఉంటాడు. 

ప్రధానమైన పాత్రలో వామికా గబ్బి తన మార్క్ చూపించింది. ఇక నసీరుద్దీన్ షా .. నీనా గుప్తా ... గ్గుల్షన్ గ్రోవర్ .. రత్నా పాఠక్ .. వంటి సీనియర్ ఆర్టిస్టుల నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఈ సిరీస్ కి కథాకథనాలు ప్రధానమైన బలం. ఆ తరువాత స్థానంలో ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కనిపిస్తాయి. 'మనాలి'లోని మంచుకొండలు .. పచ్చని ప్రదేశాలను అందంగా ఆవిష్కరించిన తీరు నచ్చుతుంది. అలాగే విశాల్ భరద్వాజ్ అందించిన సందర్భానికి తగిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూడ్ లోకి తీసుకుని వెళుతుంది.

ఒక మర్డర్ మిస్టరీ ... కొంతమందిపై అనుమానాన్ని రేకెత్తిస్తూ వెళ్లి, ఎలాంటి అంచనాలు లేని వ్యక్తిని దోషిగా తేల్చడమనే పద్ధతి చాలాకాలం నుంచి వస్తున్నదే. అయితే ఈ కథలో ఒక కొత్త పాయింట్ ఉంది .. ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రాంతం పరంగా కథ నడిచే నేపథ్యం కూడా విభిన్నంగానే అనిపిస్తుంది. ఇక ఫ్లాష్ బ్యాకులు ఉన్నప్పటికీ, అవి కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ సిరీస్ ల జాబితాలో 'చార్లీ చోప్రా'ను కూడా వేసేయవచ్చు.

Movie Name: Charlie Chopra

Release Date: 2023-09-27
Cast: Wamiqa Gabbi, Priyanshu Painyuli, Naseeruddin Shah, Lara Dutta, Neena Gupta, Ratna Pathak Shah, Gulshan Grover
Director:Vishal Bhardwaj
Producer: Vishal Bhardwaj
Music: Vishal Bhardwaj
Banner: Vishal Bhardwaj Pictures

Rating: 3.00 out of 5

Trailer

More Reviews