కొంతకాలంగా మాస్ సినిమాలు చేయడానికే రామ్ ఉత్సాహాన్ని చూపుతూ వస్తున్నాడు. ఆ తరహా సినిమాలు చేస్తున్నప్పటికీ, ఆయన ఆశించిన మాస్ ఇమేజ్ మాత్రం రావడం లేదు. దాంతో బోయపాటి సినిమాతోనే అది సాధ్యపడుతుందని భావించిన రామ్, ఆ దిశగానే ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. అలా వాళ్లిద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమానే 'స్కంద'. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా కథ ఏమిటో .. ఆ కథలోని విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం.
రామకృష్ణరాజు (శ్రీకాంత్) పెద్ద బిజినెస్ మెన్. ఆయన అరెస్టుతో ఈ కథ మొదలవుతుంది. ఆయనపై కొన్ని హత్యానేరాలు మోపబడతాయి .. ఆయన సంస్థలు - ఇళ్లు సీజ్ చేయబడతాయి. జరిగిన సంఘటనలపై చకచకా విచారణ పూర్తవుతుంది .. కోర్టు ఆయనకి 'ఉరిశిక్ష'ను విధిస్తుంది. ఆ సమయంలో ఆయన కూతురు ప్రణీత ( సైయీ మంజ్రేకర్) చావుబతుకులో హాస్పిటల్లో ఉంటుంది.
ఇక 'రుద్రరాజపురం' గ్రామంలో మణికంఠరాజు (దగ్గుబాటి రాజా) 'లక్ష్మి (గౌతమి) దంపతులు నివసిస్తూ ఉంటారు. వారి సంతానమే భాస్కర్ (రామ్). అతను ఒక కాలేజ్ లో చదువుతూ ఉంటాడు. అదే కాలేజ్ లో శ్రీలీల (శ్రీలీల) చదువుతూ ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి (శరత్ లోహితస్య) కూతురు ఆమె. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఆమె సీక్రెట్ గా ఉంచుతుంది. తాను ముఖ్యమంత్రికి కాబోయే అల్లుడినని కాలేజ్ లో భాస్కర్ కాలర్ ఎగరేస్తుంటాడు. అదే పని శ్రీలీల దగ్గర కూడా చేస్తుంటాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయుడు (అజయ్ పుర్కర్) తన కూతురు వివాహానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తాడు. వివాహానికి ముందు ఆయన కూతురు అదృశ్యమవుతుంది. తెలంగాణ సీఎమ్ కొడుకుతో ఆమె వెళ్లిపోయిందని తెలిసి షాక్ అవుతాడు. అతని కొడుకును చంపేసి, తన కూతురును తెచ్చుకుంటానని రంజిత్ రెడ్డి దగ్గర ప్రతిజ్ఞ చేస్తాడు. దాంతో రంజిత్ రెడ్డి తన జాగ్రత్తలో తాను ఉంటాడు. తన అనుచరులను అప్రమత్తంగా ఉంచుతాడు.
అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి .. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు కోపంతో రగిలిపోతూ ఉంటారు. తన కూతురును తనకి అప్పగించమని భాస్కర్ ను పోలిన యువకుడితో చెబుతాడు ఆంధ్ర సీఎమ్. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లిన ఆ యువకుడు, ఆయనకి కాబోయే కోడలినీ .. ఆయన కూతురు శ్రీలీలను తీసుకుని నేరుగా తన ఊరైన 'రుద్రరాజుపురం' చేరుకుంటాడు.
ఇద్దరు ముఖ్యమంత్రుల కూతుళ్లను అతను తీసుకుని వెళ్లిపోవడానికి కారణం ఏమిటి? అందుకోసం వచ్చిన యువకుడు భాస్కర్ పోలికలతో ఉండటం వెనుక కథేమిటి? తమ కూతుళ్లను కాపాడుకోవడం కోసం ముఖ్యమంత్రులు ఏం చేస్తారు? జైల్లో ఉన్న రామకృష్ణరాజు పరిస్థితి ఏమిటి? హాస్పిటల్లో ఉన్న ఆయన కూతురు ప్రాణాలతో బయటపడుతుందా? అనేవి కథలో కనిపించే ఆసక్తికరమైన అంశాలు.
దర్శకుడు బోయపాటి సినిమాల ప్రధానమైన లక్షణంగా భారీతనం కనిపిస్తుంది .. ప్రథమ లక్షణంగా భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఈ కథ కూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. అయితే ఈ సారి ఆయన స్నేహం వైపు నుంచి ఎమోషన్ డోస్ పెంచాడు. ఫస్టాఫ్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు .. రామ్ .. శ్రీలీల .. ఈ నాలుగు ప్రధానమైన పాత్రలతోనే కథను నడిపించాడు. ఫస్టాఫ్ అంతా కూడా భారీ యాక్షన్ సీన్స్ తో .. కలర్ ఫుల్ సాంగ్స్ తో కథ జోరుగా హుషారుగా ముందుకు వెళుతుంది.
ఫస్టాఫ్ లో ఒకరిపట్ల ఒకరు విలన్స్ గా వ్యవహరించిన ముఖ్య మంత్రులు,సెకండాఫ్ లో ఇద్దరూ కలిసిపోయి హీరోకి విలన్స్ గా మారతారు. శ్రీకాంత్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సెకండాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ గా కనిపిస్తుంది. ఫస్టాఫ్ లో పెద్దగా కనిపించని ఫ్యామిలీ ఎమోషన్స్ .. సెకండాఫ్ లో కనిపిస్తాయి. లవ్ .. ఫ్రెండ్షిప్ .. మాస్ యాక్షన్ .. ఎమోషన్స్ మధ్యలో, రామ్ ఫ్రెండ్ గా రచ్చరవితో కామెడీ టచ్ ఇప్పించే ప్రయత్నం చేశారు.
బోయపాటి తయారు చేసుకునే కథలు .. ఆయన హీరోల పాత్రలను డిజైన్ చేసే తీరు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. బాలకృష్ణకి గల మాస్ ఇమేజ్ కారణంగా వాళ్లది హిట్ కాంబినేషన్ గా నిలిచింది. అయితే రామ్ దగ్గరికి వచ్చేసరికి కూడా బాలకృష్ణ రేంజ్ లోనే బోయపాటి కథను ప్లాన్ చేసుకున్నాడు. దాంతో ఈ పాత్రలోని పవర్ .. రామ్ స్థాయిని దాటిపోయిందని అనిపిస్తుంది. రామ్ హీరోగా ఈ స్థాయి రక్తపాతాన్ని చూడటం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది.
ఇక ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడు. రెండూ యాక్షన్ కంటెంట్ ఉన్న పాత్రలే. రెండో పాత్ర కథకి ప్లస్ కాకపోగా మైనస్ అయిందనిపిస్తుంది. కేవలం సైయీ మంజ్రేకర్ కి కూడా ఒక తోడు చూపించడం కోసమే ఆ పాత్రను డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది .. అనవసరమైనదిగా కనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రుల ప్రైవేట్ ఫోర్స్ తో హీరో చేసే ఫైట్ .. క్లైమాక్స్ లో హీరో చేసే ఫైట్ .. 'సదర్' ఉత్సవం సాగదీసినట్టుగా అనిపిస్తాయి. ప్రిన్స్ కి ఇవ్వవలసిన పాత్రను కాలకేయకి .. అతనికి ఇవ్వాల్సిన పాత్రను ప్రిన్స్ కి ఇచ్చారేమో అనిపిస్తుంది.
రామ్ ఎనర్జీ లెవెల్స్ .. ఆయన యాక్టింగ్ ఆకట్టుకుంటాయి. అజయ్ పుర్కర్ విలనిజం కొత్తగా కనిపిస్తుంది. తెలుగు తెరకి మరో పవర్ఫుల్ విలన్ దొరికాడనే చెప్పుకోవాలి. డాన్సుల పరంగా .. గ్లామర్ పరంగా శ్రీలీల ఓకే. గౌతమీ ... ఇంద్రజ వంటి సీనియర్ ఆర్టిస్టులను పెట్టుకున్నారుగానీ, వాళ్ల పాత్రలు నామమాత్రం. చాలా గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి రాజా నటన ఆకట్టుకుంటుంది. తమన్ అందించిన ట్యూన్స్ ఫరవాలేదు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆడియన్స్ విని తట్టుకునే స్థాయిని దాటిపోయినట్టుగా అనిపిస్తుంది.
సంతోష్ కెమెరా పనితనం బాగుంది .. పాటలను .. ఫైట్ లను .. గ్రామీణ నేపథ్యంలోని లొకేషన్స్ ను బాగా కవర్ చేశాడు. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే యాక్షన్ సీన్స్ ను ఇంకా కాస్త ట్రిమ్ చేసుకోవచ్చు. 'నా ఇంటి గేటు కాదు గదా .. నా స్టేట్ టోల్ గేట్ కూడా దాటలేవు' .. 'మర్యాదిస్తే అరిటాకుల్లో అన్నం పెడతాం .. తేడా వస్తే తాటాకుల్లో తగలబెడతాం' .. 'కొడుకంటే కొరివి పెట్టేవాడు కాదు .. పరువు నిలబెట్టేవాడు' వంటి డైలాగ్స్ గుర్తుండిపోతాయి.
నిర్మాణ విలువల .. భారీ తారాగణం .. కలర్ ఫుల్ సెట్స్ .. విజువల్స్ పరంగా బోయపాటి ఈ సినిమాను తెరపై గ్రాండ్ గా ఆవిష్కరించాడు. అయితే కథాకథనాల పరంగా కొన్ని లోపాలు కనిపిస్తాయి .. కొన్ని సీన్స్ ను అవసరానికి మించి సాగదీసినట్టుగా అనిపిస్తుంది. తమన్ వాయిద్యాల హోరు కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇక ఈ సినిమాకి 'స్కంద' అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది మాత్రం అర్థం కాదు.
'స్కంద' - మూవీ రివ్యూ
Skanda Review
బోయపాటి నుంచి వచ్చిన 'స్కంద'
- స్నేహం .. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే కథ
- భారీ యాక్షన్ సీన్స్ కి పెద్దపీట వేసిన దర్శకుడు
- హద్దులు దాటిన యాక్షన్ సీన్స్ .. సాగతీత సన్నివేశాలు
- కలర్ఫుల్ సెట్స్ .. డాన్సులు .. విజువల్ బ్యూటీ ప్రత్యేక ఆకర్షణ
- బోయపాటి నుంచి వచ్చిన 'స్కంద'
- స్నేహం .. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే కథ
- భారీ యాక్షన్ సీన్స్ కి పెద్దపీట వేసిన దర్శకుడు
- హద్దులు దాటిన యాక్షన్ సీన్స్ .. సాగతీత సన్నివేశాలు
- కలర్ఫుల్ సెట్స్ .. డాన్సులు .. విజువల్ బ్యూటీ ప్రత్యేక ఆకర్షణ
Movie Name: Skanda
Release Date: 2023-09-28
Cast: Ram Pothineni, Sreeleela, Saiee Manjrekar, Sharath Lohithaswa, Ajay Purkar, Daggubati Raja
Director:Boyapati
Producer: Srinivasa Chitturi
Music: Thaman
Banner: Srinivasaa Silver Screen
Review By: Peddinti
Rating: 3.00 out of 5
Trailer