'లక్కీమేన్' - (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ

Lucky Man

Lucky Man Review

  • 'లక్కీమేన్'గా నటించిన యోగిబాబు 
  • సెప్టెంబర్ 1న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • సెప్టెంబర్ 29 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ 
  • కామెడీనీ .. ఎమోషన్స్ ను బ్యాలెన్చ్ చేస్తూ నడిచే కథ 

కోలీవుడ్ లో యోగిబాబుకి ఉన్న క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయనను ప్రధాన పాత్రగా చేసుకుని అనేక కథలను తెరకెక్కిస్తున్నారు. అలా ఇటీవల కాలంలో వచ్చిన సినిమాగా 'లక్కీమేన్' కనిపిస్తుంది. బాలాజీ వేణుగోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 1వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. 'అమెజాన్ ప్రైమ్' లో సెప్టెంబర్ 29వ తేదీ నుంచి తెలుగు వెర్షన్ లోను ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం.

మురుగన్ (యోగిబాబు)పై చిన్నప్పటి నుంచి కూడా నష్ట జాతకుడు అనే ఒక ముద్ర పడిపోతుంది. దాంతో తాను దురదృష్టవంతుడిని అనే ఒక బలమైన అభిప్రాయానికి అతను వచ్చేస్తాడు. చాలీ చాలని జీతంతో చిన్నపాటి ఉద్యోగం చేస్తూ, భార్యను .. కొడుకును పోషించుకుంటూ ఉంటాడు. అద్దె కట్టలేక .. కొడుకు స్కూల్ ఫీజు కట్టలేక .. ఇంటి అవసరాలను తీర్చలేక నానా అవస్థలు పడుతుంటాడు. దాంతో భార్య దేవయాని (రేచల్ రెబెక్కా) తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది.

అలాంటి పరిస్థితుల్లో తాను అప్పు తీసుకున్న ఒక చిట్ ఫండ్ కంపెనీ తీసిన లాటరీలో మురుగన్ కి కారు గిఫ్ట్ గా వస్తుంది. తనకి ఇంతటి అదృష్టం కలిసి రావడమేంటనే ఆనందాశ్చర్యాలు అతణ్ణి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆ కారును అమ్మేసి అవసరాలు తీర్చుకుందామని భార్య అంటుంది. జీవితంలో తాను కూడా అదృష్టవంతుడినేనని నిరూపించిన ఆ కారును అమ్మడం కుదరదని మురుగన్ తేల్చి చెబుతాడు. ఆ కారును ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. 

ఒకసారి ఆ కారు పార్కింగ్ విషయంలో పోలీస్ ఆఫీసర్ శివకుమార్ (వీరబాహు)తో మురుగన్ గొడవపడతాడు. ఆ సమయంలో తన పైఅధికారి ఎదురుగా అతను మురుగన్ కి సారీ చెప్పవలసి వస్తుంది. దానిని శివకుమార్ చాలా అవమానంగా భావిస్తాడు. గతంలో జరిగిన ఒక సంఘటన కారణంగా చాలా అసహనంతో ఉంటూ వస్తున్న శివకుమార్ కి, మురుగన్ విషయం మరింత చిరాకు తెప్పిస్తుంది. అందువలన అతను తనని ప్రేమిస్తున్న అమ్మాయితోను మనసు విప్పి మాట్లాడలేకపోతుంటాడు.

 ఎప్పటిలానే ఆ రోజు కూడా తెల్లవారుతుంది. తాను పార్క్ చేసిన చోట కారు లేకపోవడంతో మురుగన్ కంగారుపడిపోతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో శివకుమార్ కి ఫిర్యాదు చేస్తాడు. తన కారు కోసం అతని చుట్టూ తిరుగుతూ ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. కారు అమ్మేద్దామని చెబితే వినిపించుకోలేదని చిటపడటలాడుతూ, భార్య పుట్టింటికి వెళ్లిపోతుంది. ఆ కారును తామే దొంగిలించామని అబద్ధం చెప్పి, అతని దగ్గర నుంచి రెండు లక్షలు రాబడుతుంది మరో ముఠా. 


దాంతో మురుగన్ పూర్తిగా డీలాపడిపోతాడు.  అతనిపై గల కోపంతో పోలీస్ ఆఫీసర్ శివకుమార్ ఇదంతా చేయించి ఉంటాడని స్నేహితుడు వెంకట్ చెప్పిన మాటలను మురుగన్ నమ్మేస్తాడు. శివకుమార్ పై అతని పై అధికారులకు ఫిర్యాదు చేస్తాడు. అసలే షార్టు టెంపర్ ఆఫీసర్ గా పేరున్న శివకుమార్ అప్పుడు ఏం చేస్తాడు? పర్యవసానంగా మురుగన్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానంగా మిగతా కథ నడుస్తుంది.

నిజానికి ఇది చాలా సింపుల్ లైన్ .. తక్కువ బడ్జెట్ లో .. కేవలం అరడజను ముఖ్యమైన పాత్రలతో నడిచే కథ ఇది. దర్శకుడు బాలాజీ వేణుగోపాల్ ఈ కథను ఆసక్తికరంగా మలచుకున్నాడు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ .. తన కారు కనిపించడకుండా పోవడంలో అతని ప్రమేయం ఉందని భావించిన ఒక సాధారణ వ్యక్తి. అతని వైపు నుంచి చూస్తే ఆ పోలీస్ ఆఫీసర్ విలన్. ఈ ఇద్దరి మధ్య ప్రధానమైన కథ నడుస్తూ ఉంటుంది.

 చెప్పుకోవడానికి పెద్ద కథగా .. గొప్ప కథగా అనిపించకపోయినా, చూస్తుంటే బోర్ కొట్టకుండా ఉంటుంది. భారీ సస్పెన్స్ .. ట్విస్టులు ... యాక్షన్ సీన్స్ ఇలాంటివేమీ లేకపోయినా, వాటిని గురించిన ఆలోచన చేయకుండా కథ ఆసక్తికరంగా ముందుకు వెళుతుంటుంది. యోగిబాబు అంటేనే కామెడీ కనుక, ఆ వైపు నుంచి డైరెక్టర్ వర్కౌట్ చేయగలిగాడు. కారుతో పాటు యోగిబాబు స్టైల్లో వచ్చిన మార్పును చూపిస్తూ నవ్వించాడు. 

ప్రధానమైన పాత్రలను పోషించిన వారంతా బాగా చేశారు. సందీప్ ఫొటోగ్రఫీ .. సీన్ రోల్డన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. మదన్ ఎడిటింగ్ కంటెంట్ ను కరెక్టుగా ప్రేక్షకుల ముందుంచాయి. కామెడీ కంటెంట్ కి .. ఎమోషనల్ టచ్ ఇస్తూ నడిచే కథ ఇది. రియల్ లొకేషన్స్ .. వాస్తవానికి దగ్గరగా ఉండే జీవితాలు .. పరిస్థితులకు తగినట్టుగా మారిపోయే స్వభావాలను సహజంగా ఆవిష్కరించడం వల్లనే ఈ కంటెంట్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని చెప్పచ్చు. చిన్నప్పటి యోగిబాబు క్రికెట్ గేమ్ తో మొదలై, చివర్లో ఆయన సిక్సర్ కొట్టడం ఆ పాత్ర వైపు నుంచి దర్శకుడు ఇచ్చిన క్లారిటీ బాగుంది. 

Movie Name: Lucky Man

Release Date: 2023-09-29
Cast: Yogi Babu, Veera Bahu, Raichal Rabecca
Director:Balaji Venugopal
Producer: Think Studios
Music: Sean Roldan
Banner: Think Studios

Rating: 2.75 out of 5

Trailer

More Reviews