'అనీతి' - (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ

Aneethi

Aneethi Review

  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన 'అనీతి'
  • శ్రీమంతుల ఇంటి పనిమనిషికీ, ఫుడ్ డెలివరీ బాయ్ కి మధ్య జరిగే లవ్
  •  ఒక వైపున సస్పెన్స్ ను .. మరో వైపున ఎమోషన్స్ టచ్ చేసిన డైరెక్టర్ 
  • హైలైట్ గా నిలిచిన అర్జున్ దాస్ యాక్షన్ 
  • మెప్పించిన స్క్రీన్ ప్లే ..  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ

అర్జున్ దాస్ .. తమిళ, తెలుగు భాషల్లో ఇప్పుడు ఈ పేరుకి ఎంతో క్రేజ్ ఉంది. తనదైన విలనిజంతో ఆయన దూసుకుపోతున్నాడు. కార్తి 'ఖైదీ' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ దాస్, ఆ తరువాత విలనిజంలో తన మార్కు చూపిస్తూ వెళుతున్నాడు. ఆయన వాయిస్ కి చాలామంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఆయన ప్రధానమైన పాత్రను పోషించిన తమిళ సినిమానే 'అనీతి'. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. 
 
ఈ కథ చెన్నై లో మొదలవుతుంది ... తిరు (అర్జున్ దాస్) ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఉంటాడు. తన స్నేహితుడు పోతురాజుతో కలిసి ఒక రూమ్ లో ఉంటూ ఉంటాడు. అయితే అదే రూమ్ లో అంతకు ముందు నుంచి ఉంటున్న భాస్కర్ ( షా రా)కి మాత్రం ఇది నచ్చదు. చాక్ లెట్ చూసినా .. చివరికి చాక్ లెట్ యాడ్ చూసినా 'తిరు'కి విపరీతమైన కోపం వస్తుంటుంది. అలాగే ఎవరినైనా చూస్తే చంపాలనిపిస్తూ ఉంటుంది. మానసిక పరమైన ఆ సమస్యకిగాను అతను మందులు వాడుతూ ఉంటాడు. 

ఓ రోజున తిరు ఓ శ్రీమంతుల ఫ్యామిలీకి ఫుడ్ డెలివరీ చేయవలసి వస్తుంది. ఆ బంగాళాలో పనిమనిషిగా చేసే 'సుబ్బూ'తో ఆయనకి అలా పరిచయం ఏర్పడుతుంది. ఫుడ్ డెలివరీ కోసం తరచూ ఆ ఇంటికి వెళ్లవలసి రావడంతో, అతను సుబ్బూతో ప్రేమలో పడతాడు. సుబ్బూతో లవ్ లో పడిన దగ్గర నుంచి తన మానసిక స్థితిలో మంచి మార్పు రావడాన్ని అతను గమనిస్తాడు. దాంతో ఆమెకి మరింత చేరువవుతాడు. 

సుబ్బూ తండ్రి ఒక తాగుబోతు .. ఆమె తమ్ముడు ఆకతాయిగా తిరుగుతూ ఉంటాడు. ఇక ఆమె  తోడబుట్టిన 'ఉష' పదో తరగతి మధ్యలో ఆపేసి, ఇంట్లో కూర్చుంటుంది. సుబ్బూ జీతమే ఆ ఇంటికి ఆధారం. సుబ్బూ యజమాని మాలతి (శాంత ధనుంజయన్). ఆమె కొడుకు - కోడలు, కూతురు - అల్లుడు అంతా కూడా అమెరికాలోనే ఉంటారు. ఒంటరిగా ఉంటున్న మాలతికి సుబ్బూనే దిక్కు.  ఆమె ద్వారానే ఫారిన్ లోని వాళ్లంతా ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. 

ఒక రోజు ఉదయాన్నే మాలతి తన బెడ్ రూమ్ లో పడిపోయి ఉండటం సుబ్బూ చూసి, తిరు సాయంతో హాస్పిటల్లో చేరుస్తుంది. అప్పటికే ఆమె చనిపోయిందని వాళ్లు చెప్పడంతో తిరు - సుబ్బూ షాక్ అవుతారు. మాలతి హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఆమె డెబిట్ కార్డుతో కొంత డబ్బు తీసి, శవాన్ని మార్చ్యురీలో ఉంచుతారు. అయితే సుబ్బూ బ్యాగ్ లో నుంచి ఆమె తమ్ముడు మాలతి డెబిట్ కార్డును కాజేసి 2 లక్షలు డ్రా చేస్తాడు .. ఆ డబ్బుతో పారిపోతాడు.

ఆ డబ్బును ఎలాగో సర్దుబాటు చేసి .. మాలతి ఎకౌంటులో వేసిన తరువాతనే, ఆమె చనిపోయిందనే విషయాన్ని ఫారిన్ లోని కుటుంబ సభ్యులకి చెప్పాలని సుబ్బూ నిర్ణయించుకుంటుంది. మాలతి కుటుంబ సభ్యులంతా చాలా తేడా మనుషులనీ, వాళ్లలో మానవత్వం మచ్చుకి కూడా కనిపించదని 'తిరు'తో చెబుతుంది. డబ్బు స్వార్థుబాటు చేసి .. మాలతి ఎకౌంటులో వేసే ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే, అమెరికా నుంచి వాళ్లంతా హఠాత్తుగా దిగిపోతారు. అప్పుడు ఏం జరుగుతుంది? తిరు ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? మాలతి మరణానికి కారకులు ఎవరు? అనేది మిగతా కథ. 

బడ్జెట్ పరంగా చూసినా .. తారాగణం పరంగా చూసినా ఇది చిన్న సినిమానే. అయితే కంటెంట్ విషయంలో మాత్రం ఆడియన్స్ ను కూర్చోబెట్టేస్తుంది. మొదటి నుంచి చివరివరకూ కూడా ఈ సినిమాలో ఎక్కడా లూజ్ సీన్స్ కనిపించవు. ప్రతి పాత్ర విషయంలో డైరెక్టర్ కి పూర్తి అవగాహన ఉందనే విషయం మనకి అర్థమైపోతుంది. పరిమితమైన పాత్రలతో ఆయన ఈ కథను పట్టుగా నడిపించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. 

ఈ కథలో ముందుగా హీరో - హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ తో నడుస్తుంది. ఆ తరువాత శ్రీమంతురాలి మరణం వెనుక పరిగెడుతుంది. ఆ తరువాత ఆమె ఆస్తిపాస్తుల చుట్టూ తిరుగుతుంది. ఈ మధ్యలోనే తిరు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది. తిరు .. అతని తండ్రికి మధ్య గల అనుబంధానికి అద్దం పట్టే ఈ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. చాక్ లెట్ ను చూస్తే, తిరు ప్రవర్తనలో ఎందుకు మార్పు వస్తుందనేది ఇక్కడే రివీల్ అవుతుంది. అది కూడా చాలా నేచురల్ గానే అనిపిస్తుంది. 

మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వలన ఆ శ్రీమంతురాలిని తిరు చంపేశాడా? ఆర్ధిక పరమైన ఇబ్బందులను తట్టుకోలేక ఆమెను సుబ్బూ హత్య చేసిందా? లేదంటే ఇద్దరూ కలిసే హత్య చేసి, నాటకమాడుతున్నారా? అనే విషయంలో ఎలాంటి క్లూ దొరక్క ప్రేక్షకులు సైతం సతమతమైపోతారు. నెక్స్ట్ ఏం జరుగుతుందా? అనే ఒక ఉత్కంఠను దర్శకుడు రేకెత్తించగలిగాడు. అందువల్లనే ప్రేక్షకుడు ఏ పాత్రను వదలకుండా ఫాలో అవుతూనే ఉంటాడు. 

 కథ నేపథ్యానికి తగిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను జీవీ ప్రకాశ్ కుమార్ అందించాడు. ముఖ్యంగా పాటలు కూడా మంచి ఫీల్ తో సాగుతాయి. అలాగే ఎడ్విన్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విలేజ్ నేపథ్యంలోని షాట్స్ చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. రవికుమార్ ఎడిటింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. ఆర్టిస్టులంతా తమ పాత్రలకు జీవం పోశారు. అర్జున్ దాస్ నటన హైలైట్ గా నిలుస్తుంది. హింస ... రక్తపాతం డోస్ కాస్త ఎక్కువగా ఉంది. ఆ విషయాన్ని పక్కన పెట్టి చూస్తే, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో పెర్ఫెక్ట్ కంటెంట్ తో వచ్చిన సినిమాగానే ఇది కనిపిస్తుంది.

Movie Name: Aneethi

Release Date: 2023-10-15
Cast: Arjun Das, Dushara Vijayan, Vanitha Vijayakumar, Kaali Venkat,Arjun Chidambaram
Director:Vasanthabalan
Producer: Krishna Kumar See
Music: G. V. Prakash Kumar
Banner: Urban Boyz Studios

Rating: 3.00 out of 5

Trailer

More Reviews