'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' (ఆహా) మూవీ రివ్యూ

The Great Indian Suicide

The Great Indian Suicide Review

  • అందుబాటులోకి వచ్చిన 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్'  
  • ప్రధాన పాత్రధారిగా మెప్పించిన హెబ్బా పటేల్
  • మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే కంటెంట్ 
  • ప్రధానమైన బలంగా నిలిచిన స్క్రీన్ ప్లే .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • హైలైట్ గా అనిపించే  ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ ట్విస్టులు   

యథార్థ సంఘటనల ఆధారంగా ఇంతవరకూ చాలా సినిమాలు తెరకెక్కాయి. ఆత్మహత్య చేసుకుని చనిపోతే మళ్లీ బ్రతకొచ్చు .. పరలోకంలో ఉన్న తమ వాళ్లను తీసుకుని రావొచ్చు .. కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు అనే ఒక మూఢనమ్మకంతో కొంతమంది సామూహికంగా ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన సినిమాగా 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' కనిపిస్తుంది. 'ఆహా'లో నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

హేమంత్ (కార్తీక్ రామ్) ఓ అనాథ. అతను ఓ కాఫీ షాప్ నిర్వహిస్తూ ఉంటాడు. తరచూ తన కాఫీ షాప్ కి వచ్చే చైత్ర (హెబ్బా పటేల్) తో అతనికి పరిచయమవుతుంది. దాంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని అతను నిర్ణయించుకుంటాడు. అయితే తనపై ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దనీ, తన ఫ్యామిలీ అంతా కూడా త్వరలో ఆత్మహత్య చేసుకోనుందని చైత్ర చెబుతుంది. ఆ మాటకి హేమంత్ ఉలిక్కిపడతాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి కారణం ఏమిటని అడుగుతాడు. 

తండ్రిలేని తన కుటుంబాన్ని పెదనాన్న నీలకంఠయ్య (నరేశ్) చూస్తూ వచ్చాడనీ, పెద్దమ్మ పద్మ (పవిత్ర లోకేశ్)కూడా సొంత తల్లి మాదిరిగా తనని చూసుకుందని అంటుంది. అయితే కారు ప్రమాదంలో నీలకంఠయ్య చనిపోయాడనీ, అతను తిరిగి రావాలంటే తామంతా తమ ప్రాణాలను త్యాగం చేయాలని చైత్ర చెబుతుంది. తాము సూసైడ్ చేసుకున్న తరువాత మృత్యుదేవత తమ సంకల్పానికి మెచ్చి తమని బ్రతికించడమే కాకుండా, తమతో నీలకంఠయ్యను కూడా పంపిస్తుందని అంటుంది. 

ఆ మాటలకు హేమంత్ బిత్తరపోతాడు. చనిపోయినవారెవరూ తిరిగి రారనీ, అలాంటి మూఢనమ్మకాలను నమ్మొద్దని హేమంత్ ఎంతగా చెప్పినా ఆమె వినిపించుకోదు. తాను బ్రతికి వచ్చిన తరువాత తాము పెళ్లి చేసుకుందామని నమ్మకంతో చెబుతుంది. బాగా పేరున్న ఒక మానసిక వైద్యుడిని కలిసిన హేమంత్, తనకి తెలిసిన విషయమంతా చెబుతాడు. సామూహిక ఆత్మహత్యలను ఎలా ఆపాలో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తాడు.  

సామూహిక ఆత్మ హత్యలకు ఆ కుటుంబ సభ్యులను ప్రేరేపించింది ఎవరు? వాళ్లు చనిపోవడం వలన ఎవరికి లాభం ఉంది? అనే విషయాలను పరిశీలిస్తూ వెళితే ఉపయోగం ఉండొచ్చని ఆ డాక్టర్ చెబుతాడు. అయితే ఇవన్నీ తెలుసుకోవాలంటే, ముందుగా అతను ఆ కుటుంబ సభ్యుడు కావాలని అంటాడు. ఈ తరహా మానసిక స్థితి ఉన్నవారు బయట వ్యక్తుల మాటలను వినిపించుకోరని బలంగా చెబుతాడు. దాంతో నాటకీయ పరిణామాల మధ్య చైత్ర మెడలో హేమంత్ తాళి కడతాడు.  

తమతో పాటు హేమంత్ కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఒక షరతు మీద, అతణ్ణి చైత్ర కుటుంబ సభ్యులు ఆ ఇంట్లోకి  అనుమతిస్తారు. ఏ రోజున ఆత్మహత్య చేసుకోవాలనేది ముందుగానే అతనికి చెబుతారు. ఈ లోగా వారిని ఆత్యహత్యకి ఉసిగొల్పినది .. ఈ విషయంలో వాళ్లను నమ్మించింది ఎవరనే విషయం తెలుసుకోవాలని హేమంత్ భావిస్తాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? ఆ ప్రయత్నంలో అతనికి తెలిసే రహస్యాలేమిటి? అనేవి ఆసక్తికరమైన అంశాలు. 

 దర్శకుడు విప్లవ్ కోనేటి తయారు చేసుకున్న కథ ఇది. ఈ కథను ఆయన చాలా నిదానంగా ఎత్తుకున్నాడు. కథను తాపీగా నడిపిస్తూ .. ప్రేక్షకుడిని కథలోకి లాగి .. ఉత్కంఠను పెంచడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఈ కథ మొదలైనప్పుడు ఈ స్థాయి సస్పెన్స్ ను .. హారర్ ఎఫెక్ట్ ను .. సైకో థ్రిల్లర్ ను తలపించే కంటెంట్ మన ముందుకు వస్తుందని ఎంతమాత్రం ఊహించము. అంత పట్టుగా ఆయన స్క్రీన్ ప్లే చేసిన తీరు ఆకట్టుకుంటుంది.

దాదాపు ఒక ఎనిమిది కుటుంబ సభ్యుల మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు, వాళ్లంతా ఆత్మహత్యకి ముహూర్తం పెట్టుకుని అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు ఒక సాధారణ మానసిక స్థితి కలిగిన వ్యక్తి వాళ్ల మధ్యకి వెళితే ఎలా ఉంటుంది? అనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. పాత్రల మధ్య షేడ్స్ .. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ .. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి. ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ ను చూసిన భావన కలుగుతుంది. ఎక్కడా అనవసరమైన సీన్స్ లేకపోవడం ఈ సినిమా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 

సాధారణంగా హారర్ థ్రిల్లర్ .. హారర్ కామెడీ సినిమాలు ఒక ఇంటికి పరిమితమై నడుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని పాత్రలు అలా బయటికి వెళ్లి వచ్చినా, ఈ కథ కూడా దాదాపు ఒక బంగ్లాలోనే నడుస్తుంది. ప్రతి పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరు .. రిజిస్టర్ చేసిన తీరు బాగుంది. హీరో ఒక్కో సీక్రెట్ ను కనుక్కుంటూ ముందుకు వెళుతుంటే, ఆడియన్స్ తప్పకుండా అతనిని ఫాలో అవుతుంటారు. కథాకథనాలకి సంబంధించిన గ్రాఫ్ ఎక్కడా పడిపోదు. ఎవరి ఫ్లాష్ బ్యాక్ కూడా లాజిక్ కి దూరంగా వెళ్లదు. 

శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూడ్ లోకి తీసుకుని వెళుతుంది. అనంత్ నాగ్ - అజయ్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ కూడా ఓకే. నటీనటులంతా ఎవరి పాత్ర పరిధిలో వాళ్లు మెప్పించారు. అక్కడక్కడా ఒకటి రెండు అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపిస్తాయి .. డైలాగ్స్ వినిపిస్తాయి. ఆ సమయంలో ఫార్వర్డ్ ఆప్షన్ ఎంచుకుంటే, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది నచ్చుతుందని చెప్పచ్చు.

ప్లస్ పాయింట్స్: కథ .. స్క్రీన్ ప్లే .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. హింస - రక్తపాతం లేకపోవడం.  

మైనస్ పాయింట్స్: ఒకటి రెండు అభ్యంతరకరమైన సన్నివేశాలు.

Movie Name: The Great Indian Suicide

Release Date: 2023-10-06
Cast: Hebah Patel, Ram Karthik, Nares, Pavitra Lokesh, jayaprakash, Rathna Shekhar Reddy,
Director:Viplove Koneti
Producer: Viplove Koneti
Music: Sricharan Pakala
Banner: Syringe Cinem

Rating: 3.00 out of 5

Trailer

More Reviews