నిత్యామీనన్ ఇప్పుడు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. ఇటీవలే తెలుగులో ఆమె చేసిన సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె నుంచి వచ్చిన మలయాళ సిరీస్ పేరే 'మాస్టర్ పీస్'. హాట్ స్టార్ లో తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది. సీజన్ 1లో భాగంగా 5 ఎపిసోడ్స్ నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. కామెడీ టచ్ తో సాగే ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతవరకూ కనెక్టు అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.
బినయ్ (షర్ఫుద్దీన్) రియా (నిత్యామీనన్) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వాళ్లది కులాంతర వివాహం. బినయ్ తల్లిదండ్రులు చాండిచాన్ ( రేంజి పణికెర్) ఆణియమ్మ (మాలా పార్వతి)కి గానీ, రియా పేరెంట్స్ అయిన కురియాచన్ (అశోకన్) లిస్సమ్మ ( శాంతికృష్ణ)కి గాని ఈ పెళ్లి ఇష్టం ఉండదు. అందుకు కారణం తమ కులం గొప్పదనే ఒక బలమైన భావన వాళ్లలో ఉండటమే. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లు ఈ పెళ్లిని అంగీకరించవలసి వస్తుంది.
లిస్సమ్మకి తన పెళ్లికి ముందు పెద్ద గాయకురాలు కావాలనే ఆశ ఉండేది. పెళ్లి కారణంగా తన కల నెరవేరలేదనే ఒక అసంతృప్తి ఆమెలో ఉంటుంది. అలాగే ఆణియమ్మ తన పెళ్లి కారణంగా తాను గవర్నమెంట్ జాబ్ ను వదులుకోవలసి రావడం గురించి తరచూ ఆవేదన చెందుతూ ఉంటుంది. ఈ విషయంలో ఇద్దరూ కూడా తమ భర్తలను సాధిస్తూ ఉంటారు. లిస్సమ్మ భర్తకి తన కమ్యూనిటీ పిచ్చి ఎక్కువ. ఇక గతంలో ఆర్మీలో పని చేసినప్పటికీ, భార్యముందు నోరెత్తలేని పరిస్థితిలో చాండిచాన్ ఉంటాడు.
తన కొడుకు బినయ్ అమాయకుడనీ .. పెత్తనమంతా కోడలు రియాదే అనే ఒక ఆలోచన ఆణియమ్మకు అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే తన కోడలు కత్తి పట్టుకుని తన కొడుకును బెదిరించిందనే విషయం ఆమెకి తెలుస్తుంది. దాంతో ఇలా చేయడం కరెక్టు కాదు అంటూ, రియా తల్లిదండ్రులకు కాల్ చేసి చెబుతుంది. ఇరుకుటుంబాలవారు తాము వెళ్లి రియా - బినోద్ కాపురాన్ని చక్కదిద్దాలనే నిర్ణయానికి వస్తారు. ముందుగా చెప్పకుండా రియా ఇంటికి వెళతారు.
రియా ఎందుకు కత్తితో బినోద్ పైకి వెళ్లవలసి వచ్చిందో .. రియా గర్భవతి కాకపోవడానికి కారణమేమిటో అనే ప్రశ్నలు మాత్రం అడగకుండా, సున్నితంగా ఈ సమస్యను పరిష్కరించాలని పేరెంట్స్ భావిస్తారు. అయితే అక్కడికి వెళ్లి రంగంపై కూర్చున్న తరువాత పరిస్థితి తారుమారు అవుతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? రియా - బినోద్ మధ్య గొడవలకి కారణం ఏమిటి? చివరిగా ఆ ఇంట్లో చోటుచేసుకునే సన్నివేశాలు ఎలాంటివి? అనేవి ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తాయి.
ప్రవీణ్ తయారు చేసిన ఈ కథకి దర్శకుడు శ్రీజిత్ దృశ్యరూపాన్ని ఇచ్చాడు. రెండు వేరు వేరు కులాలకు సంబంధించిన కుటుంబాలను తీసుకుని, ఆ రెండు కుటుంబాలలోని యువతీ యువకులు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? అనే ఒక కాన్సెప్ట్ తో దర్శకుడు ఈ కథను నడిపించాడు. ప్రధానమైన పాత్రలు పరిమితంగానే ఉంటాయి. అయితే ప్రతి పాత్రకి ఒక బలహీనత కనిపిస్తుంది. ఆ బలహీనతతో నుంచే కామెడీ పుట్టుకొస్తుంది.
తన భార్య రియా ... రాజేశ్ తో చనువుగా ఉండటం సహించలేని బినోద్. ఆయన అపర్ణ అనే యువతితో చనువుగా ఉండటం పట్ల రియా చిటపటలు .. తన కమ్యూనిటీ గొప్పదని వాదించే కురియాచన్ .. కోడలిని ఆడిపోసుకోవడానికి ట్రై చేసే ఆణియమ్మ ... ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించే చర్చి ఫాదర్ .. ఆ ఫ్లాట్ లో ఏం జరుగుతుందో చూడటానికి ఆసక్తిని కనబరిచే 'విజ్జీ' .. రియా అత్తగారి కోపానికి సగం కారణమైన ఆమె పెంపుడు కుక్క 'కో కో'.
ఇలా దర్శకుడు ప్రతి పాత్ర పట్ల పూర్తి అవగాహనతో డిజైన్ చేసుకుని, మొదటి నుంచి చివరివరకూ బోర్ కొట్టకుండా కథను నడిపించాడు. ఫ్లాట్ లో నుంచి బయటికి వెళ్లకుండా ఇంత కామెడీ కంటెంట్ ను వర్కౌట్ చేయడం సామాన్యమైన విషయమేం కాదు. ఇలాంటి సన్నివేశాలను .. ఈ తరహా వ్యక్తులను చాలా ఇళ్లలో మనం చూస్తూనే ఉంటాము. అందువలన ఆడియన్స్ వెంటనే కనెక్టు అవుతారు. ఈ కథ స్క్రీన్ పై కాకుండా మన పక్క ఫ్లాట్ లో జరుగుతున్నట్టుగానే ఉంటుంది.
కథ ... కథనాలు ... వాటిని దర్శకుడు సహజత్వంతో ఆవిష్కరించిన తీరు ఈ సిరీస్ కి హైలైట్ గా నిలిచాయి. ప్రధానమైన పాత్రలతో పాటు కుక్కను కూడా ఒక పాత్రగా చేసి .. దాని ఎక్స్ ప్రెషన్స్ ను ఆయన క్యాచ్ చేసిన తీరు కూడా నవ్వు తెప్పిస్తుంది. బిజిబల్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. కెమెరా పనితనం బాగుంది ... అలాగే ఎడిటింగ్ వర్క్ కూడా. అన్నీ కుదరడం వల్లనే ఈ మధ్య కాలంలో వచ్చిన పెర్ఫెక్ట్ కామెడీ సిరీస్ గా 'మాస్టర్ పీస్' నిలుస్తుంది. టైటిల్ ను జస్టిఫై చేసిన తీరు కూడా కనెక్టు అవుతుంది.
సాధారణంగా కామెడీ కంటెంట్ ను తెలుగులోకి అనువదించడం కష్టం. కానీ ఈ సిరీస్ చూస్తుంటే తెలుగు సిరీస్ మాదిరిగానే అనిపిస్తుంది. జంధ్యాల మార్కు సిరీస్ ను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. గతంలో ఈ తరహా సినిమాను జంధ్యాల తీశారు కూడా. ఎలాంటి లూజ్ సీన్స్ మనకి కనిపించవు .. చివర్లో ఇచ్చిన సందేశం కూడా ఆలోచింపజేస్తుంది. అసభ్యకరమైన మాటలుగానీ .. సన్నివేశాలుగాని లేవు. మొదటి నుంచి చివరివరకూ సరదాగా నవ్వుకుంటూ ఫ్యామిలీతో కలిసి ఈ సిరీస్ ను చూడొచ్చు.
'మాస్టర్ పీస్' - (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ
Master Peace Review
- నిత్యామీనన్ నుంచి వచ్చిన 'మాస్టర్ పీస్'
- కామెడీ టచ్ తో సాగే ఫ్యామిలీ డ్రామా
- జంధ్యాల మార్కును గుర్తుచేసే సిరీస్
- పాత్రలను డిజైన్ చేసిన తీరు హైలైట్
- ఫ్యామిలీతో కలిసి చూడదగిన కామెడీ ఎంటర్టైనర్
Movie Name: Master Peace
Release Date: 2023-10-25
Cast: Nithya Menen, Sharafudheen, Maala Parvathi, Renji Panicker, Shantikrishna, Ashokan
Director:Sreejith
Producer: Maythew George
Music: Bijibul
Banner: A Central Advertising Production
Review By: Peddinti
Rating: 3.50 out of 5
Trailer