'దూత' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ!

Dhootha

Dhootha Review

  • విక్రమ్ కుమార్ రూపొందించిన 'దూత'
  • బలమైన కథాకథనాలు 
  • ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలు 
  • ట్విస్టులతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిన సిరీస్ 
  • చైతూ కెరియర్ లోనే ఇది బెస్ట్ సిరీస్ 

ఈ మధ్య కాలంలో సౌత్ నుంచి .. నార్త్ నుంచి కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి చాలా క్రైమ్ థ్రిల్లర్లు వచ్చాయి. అయితే సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన సిరీస్ లు చాలా అరుదనే చెప్పాలి. అలాంటి జోనర్లో విక్రమ్ కుమార్ చేసిన ప్రయత్నంగా 'దూత' రూపొందింది. నాగచైతన్య ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్, నిన్నటి నుంచే 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్టు సీజన్ లో భాగంగా, 8 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ కథ 'వైజాగ్' నేపథ్యంలో మొదలవుతుంది .. అక్కడ సాగర్ (నాగచైతన్య) ఒక దినపత్రికకి చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తూ ఉంటాడు. భార్య ప్రియా (ప్రియా భవాని శంకర్) కూతురు అంజలి .. తల్లితండ్రులు (రోహిణి - అనిశ్ కురువిల్ల) ఇది అతని కుటుంబం. ఆయన జీవితం చాలా విలాసవంతంగా సాగిపోతూ ఉంటుంది. ఒక రాత్రి వేళ ఫ్యామిలీతో కలిసి ఆయన ప్రయాణం చేస్తుండగా కారు ట్రబుల్ ఇస్తుంది. 

అక్కడున్న ఒక 'ధాబా' లోకి వెళ్లిన ఆయనకి, ఒక డైలీ పేపర్ పిక్ కనిపిస్తుంది. అది పాతకాలం నాటి ముద్రణతో ఉంటుంది.  మరి కాసేపట్లో కారు ప్రమాదం కారణంగా తాను చనిపోనున్నట్టు అందులో వార్త ఉండటం చూసి షాక్ అవుతాడు. ధాబాలోనే ఉండిపోయి ఆయన చూస్తుండగానే,  ఆ వార్తలో రాసిన సమయానికి ఆయన కారును ఓ లారీ ఢీ కొంటుంది. తనకి వ్యతిరేకంగా వెళుతున్న జర్నలిస్ట్ 'ఛార్లెస్' ఇలా చేయించి ఉంటాడని సాగర్ భావిస్తాడు. అతనిని నిలదీయడానికి ఇంటికి వెళతాడు. అతని ఇల్లంతా న్యూస్ పేపర్ పిక్స్ తో నిండిపోయి ఉంటుంది. 

'ఇక నుంచి అది నిన్ను వెంటాడుతుంది .. నిన్ను .. నీ వాళ్లందరినీ చంపేస్తుంది' అంటూ చార్లెస్ షూట్ చేసుకుని చనిపోతాడు. అతని చేతిలో ఉన్న న్యూస్ పేపర్ పిక్ ను సాగర్ చూస్తాడు. మరి కాసేపట్లో చార్లెస్ చనిపోతాడనే వార్త ఆ పేపర్ పిక్ లో ఉంటుంది. 'అది అంటే ఎవరూ? .. తనని ఎందుకు చంపుతారు? అనే ఆలోచన చేస్తూనే సాగర్ ఇంటికి చేరుకుంటాడు. ఛార్లెస్ మర్డర్ ను ఛేదించే బాధ్యత డీసీపీ క్రాంతి (పార్వతి తిరువోతు)కి అప్పగించబడుతుంది. దాంతో ఆమె రంగంలోకి దిగుతుంది. 

తన కారును ఢీ కొట్టిన డ్రైవర్ 'కోటి'ని కాస్త గట్టిగా విచారణ చేయమని ఎస్.ఐ. అజయ్ ఘోష్ (రవీంద్ర విజయ్) తో సాగర్ చెబుతాడు. అయితే అజయ్ ఘోష్ ట్రీట్మెంట్ తట్టుకోలేక అతను చనిపోతాడు. రహస్యంగా ఆ శవాన్ని పూడ్చవలసిన పని కూడా సాగర్ పైనే పడుతుంది. ఛార్లెస్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ వచ్చిన క్రాంతికి, అతను చనిపోయిన సమయంలో సాగర్ స్పాట్ లోనే ఉన్నాడనే విషయం తెలుస్తుంది. ఛార్లెస్ సూసైడ్ చేసుకున్న తుపాకి లారీ డ్రైవర్ కోటి ద్వారా అతనికి చేరిందనీ, ఎస్.ఐ.అజయ్ ఘోష్ తీసుకెళ్లిన తరువాత కోటి కనిపించకుండా పోయాడనే విషయం ఆధారాలతో సహా కనిపెడుతుంది. 

ఈ నేపథ్యంలోనే కిరణ్ రెడ్డి అనే యూ ట్యూబర్ ను సాగర్ కలుసుకుంటాడు. ఆత్మలు .. దెయ్యాలు అనే విషయాలపై ఆమె పరిధోనచేస్తూ, వాటిపై వీడియోలు చేస్తూ ఉంటుంది. గతంలో రవి అనే ఒక జర్నలిస్ట్ తనని కలిశాడనీ, ఒక ఆత్మ కారణంగా అతని కుటుంబ సభ్యులందరూ చనిపోయారని చెప్పాడని అంటుంది. ఆ ఆత్మ కేవలం అవినీతి పరులైన జర్నలిస్టులనే టార్గెట్ చేస్తోందనే విషయం అతని పరిశోధనలో తేలిందని చెబుతుంది. అందుకు సంబంధించిన ఫైల్ ను తనకి ఇచ్చాడంటూ, దానిని సాగర్ కి అందజేస్తుంది. 

  ఆ ఫైల్ ను సాగర్ పరిశీలిస్తాడు .. 1963 నుంచి న్యూస్ పేపర్ పిక్స్ లో ఉన్న ప్రకారం జర్నలిస్టులు ఆత్మహత్యలు చేసుకుంటూ వస్తున్నారనే విషయం ఆయనకి అర్థమవుతుంది. అప్పట్లో ఆ న్యూస్ పేపర్ ఏ ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చిందనేది అతికష్టంపై తెలుసుకుని ఆ అడ్రెస్ కి వెళతాడు. అక్కడ అతనికి 'దూత పబ్లికేషన్స్' కనిపిస్తుంది. ఆ తరువాత సాగర్ కి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? అప్పుడు అతను ఏం చేస్తాడు? 1963కి ముందు ఏం జరుగుతుంది? స్వార్థపరులైన జర్నలిస్టులను వెంటాడుతున్న ఆ ఆత్మ ఎవరిది? అనేది మిగతా కథ.

విక్రమ్ కుమార్ టీమ్ తయారు చేసుకున్న కథ ఇది. మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకూ అనూహ్యమైన .. ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూ వెళుతుంది. ఎక్కడా కూడా క్లారిటీ మిస్సవ్వదు. ఎపిసోడ్ .. ఎపిసోడ్ కి కథ చిక్కబడుతూ ఉంటుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్నట్టుగా ఆడియన్స్ సైలెంట్ గా ఫాలో అవుతూ ఉంటారు. 1963కి ముందు వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఈ కథకి మరింత బలాన్ని ఇచ్చింది.

ఈ కథ మొత్తాన్ని వర్షంలో నడిపించడం వలన ఆడియన్స్ కి మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.  జర్నలిస్టుల ఆత్మహత్యలకు కారణం కనుక్కునే ప్రయత్నాల్లో సాగర్ ముందుకు వెళుతుంటే, అతనే కారణమని భావిస్తూ జరిగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అడుగడునా ఆసక్తికరంగా నడుస్తుంది. చివరి ఎపిసోడ్ లో రివీల్ చేస్తూ వెళ్లే ఒక్కో ట్విస్ట్ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంది. చాలా పాత్రలు ఉన్నప్పటికీ ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది .. ఎందుకంటే ప్రతి పాత్రకి ఓ ప్రయోజనం ఉంది.  
 
నటన పరంగా చూసుకుంటే చైతూ .. పశుపతి .. పార్వతి తిరువోతు ముందువరుసలో కనిపిస్తారు. అక్కడక్కడా తెరపై రక్తం ఎక్కువగా కనిపిస్తుంది. నెలలు నిండకముందే పుట్టిన మృత శిశువును క్లోజప్ షాట్ లో చూపించారు. అవి కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తాయి అంతే. కథా కథనాలు ఈ సిరీస్ కి ప్రధానమైన బలం అనే చెప్పాలి. ఇషాన్ చాబ్రా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. మికొలాజ్ ఫొటోగ్రఫీ .. నవీన్ నూలి ఎడిటింగ్ ఈ సిరీస్ కి మరింత పదును తీసుకొచ్చాయి. ఇటీవల కాలంలో పెర్ఫెక్ట్ కంటెంట్ తో మొదటి నుంచి చివరివరకూ ఉత్కంఠను రేకెత్తించిన చాలా తక్కువ సిరీస్ లలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. 


ప్లస్ పాయింట్స్ : కథ .. స్క్రీన్ ప్లే .. పాత్రలను డిజైన్ చేసిన తీరు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. కథ మొత్తం వర్షంలోనే నడవడం. 

మైనస్ పాయింట్స్: అక్కడక్కడా మోతాదు మించిన రక్తపాతం .. ఇబ్బంది కలిగించే క్లోజప్ షాట్స్. 

Movie Name: Dhootha

Release Date: 2023-12-01
Cast: Naga Chaitanya,Priya Bhavani Shankar, Parvathy Thiruvothu, Prachi Desai, Tanikella Bharani, Pasupathy
Director:Vikram Kumar
Producer: Sharrath Marar
Music: Ishaan Chhabra
Banner: Northstar Entertainment

Rating: 3.50 out of 5

Trailer

More Reviews