ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లను ఒకేసారి వివిధ భాషలలో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని వెబ్ సిరీస్ లు మాత్రం కొంచెం ఆలస్యంగా ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాంటి సిరీస్ ల జాబితాలో 'ఆకాశ్ వాణి' ఒకటిగా కనిపిస్తుంది. తమిళంలో కొంతకాలం క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ను, 'ఆహా' వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. 7 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, ఈ నెల 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఆకాశ్ (కెవిన్) ఓ కాలేజ్ లో చదువుతూ ఉంటాడు. అదే ఊళ్లో తాతయ్య దగ్గర ఉంటూ అదే కాలేజ్ లో వాణి (రెబా మోనికా జాన్) చదువుతూ ఉంటుంది. ఆకాశ్ మిత్ర బృందానికి ఆకతాయిలుగా ఆ కాలేజ్ లో పేరు ఉంటుంది. ఆ బ్యాచ్ జోలికి వెళ్లొద్దని వాణికి ప్రిన్సిపల్ ముందుగానే చెబుతాడు. వాణిని చూడగానే తొలిచూపులోనే ఆకాశ్ మనసు పారేసుకుంటాడు. ఆమెను ముగ్గులోకి దింపడానికి నానారకాల ప్రయత్నాలు చేస్తాడు. మొత్తానికి వాణిని పడగొట్టడంలో సక్సెస్ అవుతాడు.
ఓ శుభ ముహూర్తాన ఆకాశ్ - వాణి పెళ్లి చేసుకుంటారు .. కాపురం పెడతారు. అయితే పెళ్లి తరువాత తనపై ప్రేమ తగ్గిందని వాణి భావిస్తుంది. తనని అతను పట్టించుకోకపోవడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. దాంతో అతనిపై కోపంతో ఆమె తాతయ్య ఇంటికి వెళ్లిపోతుంది. అంతేకాదు అతనికి విడాకుల నోటీస్ కూడా పంపిస్తుంది. ఈ విషయంలో ఆకాశ్ ఆమెను నిలదీసినా ప్రయోజనం లేకుండాపోతుంది. చట్టప్రకారం ఇద్దరికీ విడాకులు అవుతాయి.
ఇదిలా ఉండగా ఆకాశ్ ఫ్రెండ్స్ .. పూర్వ విద్యార్థులు సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తారు. ఆకాశ్ - వాణి ప్రేమ వ్యవహారం .. పెళ్లి గురించి వాళ్లకి తెలుసు. అందువలన ఇద్దరూ కలిసి వస్తారని వాళ్లంతా భావిస్తూ ఉంటారు. అయితే తాము విడిపోయిన విషయాన్ని ఆకాశ్ - వాణి ఇద్దరూ కూడా గోప్యంగానే ఉంచుతారు. పూర్వ విద్యార్థులు సమ్మేళనానికి ఆకాశ్ రాడని వాణి అనుకుంటుంది. ఆమె రాకపోవచ్చని ఆకాశ్ భావిస్తాడు. ఒకరికి తెలియకుండా ఒకరు .. రీ యూనియన్ ఫంక్షన్ కి హాజరవుతారు.
తన కంటే ముందుగానే అక్కడికి చేరుకున్న వాణిని చూసి ఆకాశ్ షాక్ అవుతాడు. అతను కూడా రావడంతో వాణి ఆశ్చర్యపోతుంది. ఆ తరువాత అక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి? వాటి పరిణామాలు ఎలా ఉంటాయి? ఆకాశ్ - వాణి విడిపోయిన విషయం ఫ్రెండ్స్ దగ్గర బయటపడుతుందా? మిగతా క్లాస్ మేట్స్ జీవితాలు ఎలా ఉంటాయి? అనే అంశాలను ఆవిష్కరిస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది.
కాలేజ్ రోజులు .. ప్రేమ .. పెళ్లి ... అలకలు ... విడిపోవడాలు వంటి అంశాలతో కూడిన కథలతో గతంలో చాలానే కథలు వచ్చాయి. బ్యానర్లు .. ఆర్టిస్టులు .. లొకేషన్స్ మారవచ్చునేమోగానీ, ఈ తరహా కంటెంట్ ప్రేక్షకులకు బాగా పరిచయమున్నదే. ట్రీట్మెంట్ పరంగా .. స్క్రీన్ ప్లే పరంగా మేజిక్ చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకున్న సిరీస్ లు ఈ జోనర్లో కనిపిస్తాయి. కానీ అలాంటి మేజిక్ ఏదీ ఈ సిరీస్ లో జరగలేదు. చాలా అంటే చాలా రొటీన్ గా నడుస్తూ ఉంటుంది.
దర్శకుడు ఎనాక్ చాలా సాదా సీదా సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లాడు. ప్రతి సన్నివేశం ఇంతకుముందు చూసినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి ట్విస్టులు ఎక్కడా కనిపించవు. హీరో - హీరోయిన్ విడిపోవడానికి గానీ, కలిసి ఉండటానికి గాని బలమైన కారణాలు కనిపించవు. ఎక్కడా కూడా ఎమోషన్స్ కనెక్ట్ కావు. ఆకాశ్ మిత్రబృందం చేసిన సందడి .. హడావిడి .. కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు.
దర్శకుడు ప్రస్తుత కథ చెబుతూనే మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ను బయటికి లాగుతూ వెళ్లాడు. సంవత్సరాలు .. డేట్లు స్క్రీన్ పై వేసినప్పటికీ, ఫ్లాష్ బ్యాక్ లో జరిగిందా? ఇప్పుడు జరుగుతుందా అనే ఒక అయోమయం ఆడియన్స్ ను వెంటాడుతూనే ఉంటుంది. ఎపిసోడ్స్ నిడివి మరీ ఎక్కువగా లేకపోయినప్పటికీ, ఉన్నంతలో సీన్స్ పట్టుగా .. పకడ్బందీగా అనిపించవు. గుణ బాలసుబ్రమణియన్ సంగీతం ... శాంతకుమార్ ఫొటోగ్రఫీ .. కలై వనన్ ఎడిటింగ్ ఫరవాలేదు. రెబా మోనికా జాన్ ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తుంది.
సాధారణంగా ఇటువంటి కంటెంట్ ఉన్న సిరీస్ లు యూత్ ను బాగా పట్టుకుంటాయి. వాళ్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కానీ అలా యూత్ వైపు నుంచి కనెక్ట్ చేసే హృద్యమైన సన్నివేశాలు కూడా ఎక్కడా కనిపించవు. టీనా అనే ఒక క్లాస్ మేట్ 'ఆకాశ్ వాణి' ప్రేమకథను పుస్తకంగా రాయాలనుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ పుస్తకం పూర్తి కావడంతో కథ ముగుస్తుంది. పుస్తకం రాసేంత గొప్పతనం ఈ కథలో ఏముందని ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతు అవుతుంది.
'ఆకాశ్ వాణి' (ఆహా) వెబ్ సిరీస్ రివ్యూ
Akash Vaani Review
- తెలుగు ఆడియన్స్ ముందుకు 'ఆకాశ్ వాణి'
- రొటీన్ గా సాగే ప్రేమకథ
- బలహీనమైన సన్నివేశాలు .. కనిపించని ట్విస్టులు
- యూత్ వైపు నుంచి పడే మార్కులు కూడా తక్కువే
Movie Name: Akash Vaani
Release Date: 2024-01-26
Cast: Reba Monica John, Kavin, Sharath Ravi, Deepak Paramesh, Vinsa Rachel, Livingston
Director:Enoc Able
Producer: Darshith Naik
Music: Guna Balasubramanian
Banner: Kaustubha Media Works
Review By: Peddinti
Rating: 2.00 out of 5
Trailer