క్రితం ఏడాది తమిళంలో విడుదలై విజయాన్ని అందుకున్న సినిమాల జాబితాలో 'పరంపోరుల్' ఒకటిగా కనిపిస్తుంది. 2023 సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. శరత్ కుమార్ - అమితాష్ ప్రధాన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 1వ తేదీ నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళనాట అంతగా ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ కంటెంట్ లో ఏముందనేది ఇప్పుడు చూద్దాం.
సర్గుణన్ చెన్నైలో పేరుకు ఒక ఆర్టు గ్యాలరీని నిర్వహిస్తూ, తెరవెనుక పురాతనమైన పంచలోహ విగ్రహాలను విదేశాలకు విక్రయిస్తూ ఉంటాడు. ఒక గ్రామంలోని పొలంలో బయటపడిన పురాతనమైన ఒక పంచలోహ విగ్రహాన్ని రహస్యంగా తక్కువ రేటుకు కొనేసి చెన్నై కి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అటూ ఇటూ తిరిగి ఆ విగ్రహం పోలీస్ ఆఫీసర్ మైత్రేయన్ (శరత్ కుమార్) దగ్గరికి చేరుతుంది. అతను అవినీతిపరుడు .. అది ఇష్టంలేని భార్యాపిల్లలు అతనికి దూరంగా ఉంటూ ఉంటారు.
ఆ విగ్రహం ఖరీదు 50 - 60 కోట్ల మధ్యలో ఉంటుందని తెలుసుకున్న మైత్రేయన్, దానిని ఎలా అమ్మాలి? ... ఎక్కడ అమ్మాలి? అనేది తెలియక అయోమయంలో పడతాడు. అదే సమయంలో అతనికి గౌరీ (అమితాష్ ప్రధాన్) తారసపడతాడు. గతంలో అతను సర్గుణన్ దగ్గర పని చేసి ఉండటం వలన, అతనికి డీలర్స్ తో పరిచయం ఉంటుంది. అందువలన అతణ్ణి అడ్డం పెట్టుకుని ఆ విగ్రహాన్ని అమ్మేయాలని మైత్రేయన్ నిర్ణయించుకుంటాడు. ఒకవేళ ఎక్కడ తేడా కొట్టినా, ఆ కేసులో గౌరీని ఇరికించవచ్చని భావిస్తాడు.
గౌరి మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. అతని అక్క శక్తి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఆమె కోలుకోవాలంటే అందుకు అవసరమైన చికిత్స కోసం 40 లక్షల వరకూ ఖర్చుపెట్టవలసి ఉంటుంది. ఆ డబ్బు కోసం గౌరి నానా తంటాలు పడుతూ ఉంటాడు. ఆ డబ్బుకోసమే అతను మైత్రేయన్ తో కలిసి ఆ విగ్రహానికి సంబంధించిన డీల్ సెట్ చేయడానికి అంగీకరిస్తాడు. విగ్రహాన్ని అమ్మేయగా వచ్చిన మొత్తంలో తనకి సగం ఇచ్చేలా మైత్రేయన్ తో మాట్లాడుకుంటాడు.
వరుణ్ రావ్ అనే ఒక డీలర్ ను పట్టుకుని, అతనికి 15 కోట్లకి ఆ విగ్రహాన్ని ఇచ్చేలా గౌరి డీల్ సెట్ చేస్తాడు. అదే సమయంలో ఊహించని ఒక సంఘటన కారణంగా ఆ విగ్రహం విరిగిపోతుంది. దాంతో అచ్చు అలాంటి ఒక విగ్రహాన్ని తయారు చేయించి, అది చాలా పురాతనమైనదనే లుక్ తీసుకొస్తారు. విగ్రహాన్ని అమ్మేసిన తరువాత గౌరీ సంగతి చూడొచ్చనే ఆలోచనలో మైత్రేయన్ ఉంటాడు. డీల్ పూర్తయిన తరువాత అతను మాటపై నిలబడకపోవచ్చనే అనుమానం గౌరీకి వస్తుంది.
మైత్రేయన్ - గౌరీ ఆ విగ్రహాన్ని తమకి అమ్మేయకుండా వేరే ఆలోచన చేస్తే, వాళ్ల అంతు చూడాలనే ఉద్దేశంతోనే మాఫియా గ్యాంగ్ సిద్ధంగా ఉంటుంది. ఇలా ఎవరి ఆలోచనలు .. అనుమానాలు వారికి ఉంటాయి. అలాంటి పరిస్థితులలో
మైత్రేయన్ - గౌరీ ఆ విగ్రహాన్ని తీసుకుని వరుణ్ రావ్ దగ్గరికి వెళతారు. అక్కడ ఏం జరుగుతుంది? అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.
దర్శకుడు అరవింద్ రాజ్ ఈ కథను తయారు చేసుకున్నాడు. మైత్రేయన్ .. అతని ఫ్యామిలీ, గౌరీ ఫ్యామిలీ .. మాఫియా .. ఈ మూడు వైపులా నుంచి ఈ కథ నడుస్తుంది. యాక్షన్ - ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఈ కథ పరిగెడుతూ ఉంటుంది. లవ్ .. రొమాన్స్ .. కామెడీ అనేవాటికి అసలు చోటే లేని కాన్సెప్ట్ ఇది. కథ మొదలైన దగ్గర నుంచి చివరి వరకూ ఎక్కడా పట్టుసడలకుండా .. ప్రేక్షకులు జారిపోకుండా కొనసాగుతూ ఉంటుంది.
ఈ సినిమాలో .. పురాతన విగ్రహాలకు సంబంధించిన డీల్స్ ఎలా జరుగుతాయనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. రెస్టారెంట్ లో జరిగే డీల్ సీన్ అందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. ఇలాంటి ఒక సీన్ ను డిజైన్ చేయడం ఇంతకుముందు ఆడియన్స్ చూసి ఉండకపోవచ్చు. కథ నిదానంగా చిక్కబడుతూ .. ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతూ వెళుతూ ఉంటుంది. తెరపై ఎక్కడా ఎలాంటి హడావిడి కనిపించదు. కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఒక టెన్షన్ ఆడియన్స్ లో ఉంటుంది.
ఈ సినిమాకి ప్రీ క్లైమాక్స్ - క్లైమాక్స్ ప్రాణమనే చెప్పాలి. క్లైమాక్స్ లోని ట్విస్టు ఆడియన్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఆ క్లైమాక్స్ చూసిన తరువాత వాళ్ల వైపు నుంచి కథ వెయిట్ మరింత పెరిగిపోతుంది. శరత్ కుమార్ .. అమితాష్ .. బాలాజీ శక్తివేల్ పాత్రలను మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. కథ .. కథనం .. ప్రేక్షకులను అలా కూర్చోబెట్టేస్తాయి.
పాండి కుమార్ ఫొటోగ్రఫీ .. యువన్ శంకర్ రాజా కెమెరా పనితనం కథకు మరింత సపోర్టుగా నిలిచాయి. నగూరన్ రామచంద్రన్ ఎడిటింగ్ కూడా నీట్ గా అనిపిస్తుంది. ఎక్కడా అనవసరసమైన సీన్స్ కనిపించవు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామాలలో ఈ సినిమా తప్పకుండా నిలిచిపోతుందని చెప్పచ్చు.
'పరంపోరుల్' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
Paramporul Review
- తమిళంలో రూపొందిన 'పరంపోరుల్'
- క్రితం ఏడాది సెప్టెంబర్ 1న విడుదలైన సినిమా
- యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
- ఆసక్తిని రేకెత్తించే కథనం
- క్లైమాక్స్ ట్విస్ట్ హైలైట్
Movie Name: Paramporul
Release Date: 2024-02-01
Cast: Sarathkumar, Amitash Pradhan, Kashmira Pardeshi, Balaji Sakthivel,
Director:Aravind Raj
Producer: Manoj - Girish
Music: Yuvan Shankar Raja
Banner: Kavi Creations
Review By: Peddinti
Rating: 3.25 out of 5
Trailer