భూమి పెడ్నేకర్ ప్రధానమైన పాత్రను పోషించిన 'భక్షక్' నిన్నటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. షారుక్ ఖాన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, పులకిత్ దర్శకత్వం వహించాడు. అనురాగ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, సంజయ్ మిశ్రా .. సాయి తమ్ హంకర్ .. ఆదిత్య శ్రీవాత్సవ ముఖ్యమైన పాత్రలను పోషించారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ కథ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ 'పాట్నా' నేపథ్యంలో మొదలవుతుంది. అక్కడ వైశాలి (భూమి పెడ్నేకర్) ఒక జర్నలిస్ట్. ఎవరి క్రింద పనిచేయడం ఆమెకి నచ్చదు. అందువల్లనే సొంతంగా ఒక లోకల్ ఛానల్ పెట్టుకుని నడుపుతూ ఉంటుంది. భాస్కర్ ( సంజయ్ మిశ్రా)ను కెమెరా మెన్ గా పెట్టుకుని .. తనే న్యూస్ యాంకర్ గా కూడా చేస్తూ ముందుకు వెళుతూ ఉంటుంది. ఆమె భర్త అరవింద్ (సూర్య శర్మ) పోస్టాఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడంతో, ఛానల్ ను రన్ చేయడం కూడా వైశాలీకి కష్టమవుతూ ఉంటుంది.
అరవింద్ కి అన్నావదినలు ఉంటారు. అతని అన్నయ్య అక్కడి కోర్టులోనే వకీల్ గా పనిచేస్తూ ఉంటాడు. వైశాలి - అరవింద్ లకు వివాహమై ఆరేళ్లు అవుతున్నా పిల్లలు లేకపోవడం పట్ల, అరవింద్ అన్నావదినలు అసంతృప్తితో ఉంటారు. ఈ విషయంలో వైశాలి ఆసక్తిని చూపించకపోవడం, జర్నలిజం అంటూ వేళాపాళా లేకుండా తిరుగుతుండటం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తారు. తన లక్ష్యాన్ని చేరుకునేవరకూ తన పద్ధతి మారదనేది వైశాలి సమాధానం.
ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి అనాథ బాలికల వసతి గృహంలోని పిల్లలపై లైంగిక దాడులు జరుగుతూన్నాయనే విషయం వైశాలికి తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనేది ఆమె దృష్టికి వస్తుంది. దాంతో ఆమె ఆ బాలికల వసతి గృహానికి వెళుతుంది. కానీ అక్కడి రౌడీలు ఆమెను అడ్డుకుంటారు. ఆ బాలికల వసతి గృహాన్ని బన్సీలాల్ (ఆదిత్య శ్రీవాత్సవ) నిర్వహిస్తున్నాడని ఆమెకి సమాచారం అందుతుంది.
అయితే 'బాలికల వసతి గృహం'లో అసలు ఏం జరుగుతుందనేది తెలుసుకునే ప్రయత్నాలు మొదలెడుతుంది. గతంలో ఆ వసతి గృహంలో వంట మనిషిగా చేసిన 'సుధ' అనే యువతిని కలుసుకుంటుంది. అక్కడ జరిగే అఘాయిత్యాలు .. హింస .. హత్యలను గురించి తెలుసుకుంటుంది. బన్సీలాల్ ధనవంతుడు .. అనేక మంది రాజకీయనాయకులు .. పోలీస్ అధికారులు అతని చేతిలో ఉంటారు. అందువలన అతని జోలికి వెళ్లొద్దని వైశాలితో భర్త చెబుతాడు. అయినా వినిపించుకోకుండా, ఆమె కోర్టులో 'పిల్' వేస్తుంది.
అప్పుడు బన్సీలాల్ ఏం చేస్తాడు? అతని వలన ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? బన్సీలాల్ నిజస్వరూపాన్ని బయటపెట్టడానికి ఆమె చేసిన ప్రయత్నం ఫలిస్తుందా? అనాథ బాలికల వసతి గృహం చాటున జరుగుతున్న వ్యాపారాన్ని ఆమె అడ్డుకోగలుగుతుందా? అనే అంశాలను టచ్ చేస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది.
దర్శకుడు పులకిత్ తయారు చేసుకున్న కథ ఇది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను ఆవిష్కరించడం జరిగింది. అనాథ బాలికలు .. వాళ్ల గురించి పట్టించుకునేవారు .. వెతికేవారు .. అడిగేవారు ఎవరూ ఉండరు. అలాంటి పిల్లలను టార్గెట్ చేసుకుని, సేవ ముసుగులో బన్సీలాల్ సెక్స్ రాకెట్ నడపడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. లోపల ఏం జరుగుతున్నది బయటికి తెలియనీయరు .. బయట ఏం జరుగుతుందనేది లోపల తెలిసే అవకాశం లేదు. ఇలా చీకట్లో మగ్గిపోతున్న జీవితాలకు వెలుగును ప్రసాదించడానికి ఒక లేడీ జర్నలిస్ట్ చేసే పోరాటమే ఈ సినిమా.
దర్శకుడు ఈ కథకు సహజత్వాన్ని జోడించడానికే చివరివరకూ ప్రయత్నించాడు. అందువలన ఎక్కడా కూడా సినిమాటిక్ గా అనిపించదు. మనం కెమెరా పట్టుకుని ప్రధానమైన పాత్రను ఫాలో అవుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. కథ మొదలైన దగ్గర నుంచి ఒక దశవరకూ చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. ఆ ప్రాంతానికి లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చేవరకూ కూడా కథ ఇలాగే వెళుతుంది. ఆ తరువాత ఇంకా స్పీడ్ అందుకుంటుందని ప్రేక్షకుడు అనుకుంటాడు. కానీ అక్కడి నుంచే స్లో అవుతుంది.
కథలోని సమస్య .. పరిష్కారం దిశగా వైశాలి పెట్టే పరుగులు అలాగే నడుస్తుంటాయి. కానీ లేడీ పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ .. వైశాలి పిల్ వేయడం .. ఆమె బావపై ఎటాక్ జరగడం తరువాత కథ ఇంకా ఊపందుకోవాలి. కానీ అలా జరగకపోగా బలహీనపడుతుంది. ఉన్న విషయాన్నే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేలా ప్లాన్ చేసుకుని ఉంటే, ఈ కంటెంట్ కి మరింత ఆదరణ లభించి ఉండేది.
అనాథ బాలికల వసతి గృహాలను లైంగిక కార్యకలాపాల అడ్డాగా మార్చేసేవారి ఆలోచన ఎలా ఉంటుంది? ఎలాంటివారి అండదండలు అలాంటివారికి ఉంటాయి? అలాంటి చోట ఎలాంటి వాతావరణం ఉంటుంది? అక్కడ పనిచేసేవారి స్వభావం ఎలా ఉంటుంది? అనేది దర్శకుడు చూపించినతీరు సహజత్వానికి దగ్గరగా అనిపిస్తుంది. భూమి పెడ్నేకర్ నటన ఈ సినిమాకి అదనపు బలంగా కనిపిస్తుంది. నేపథ్య సంగీతం .. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ సహజత్వాన్ని దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళతాయి.
ఎవరికో ఏదో సమస్య వచ్చింది .. మనకెందుకులే అని పట్టించుకోకుండా వెళ్లిపోతే, రేపటి రోజున ఆ సమస్య మన గుమ్మం ముందుకు వచ్చి నుంచుంటుంది. అందువల్లనే సమస్యకి ఎదురెళ్లాలి .. బలహీనులను రక్షించుకోవడం కోసం బలవంతులతోనే పోరాటం చేయవలసి ఉంటుంది. అందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. అనే సందేశాన్ని అంతర్లీనంగా అందించే సినిమా ఇది.
'భక్షక్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Bhakshak Review
- భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రగా 'భక్షక్'
- క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమా
- సహజత్వానికి దగ్గరగా అనిపించే సన్నివేశాలు
- సెకండాఫ్ లో నిదానించిన కథనం
- భూమి నటన ప్రధానమైన ఆకర్షణ
Movie Name: Bhakshak
Release Date: 2024-02-09
Cast: Bhumi Pednekar, Sanjay Mishra,Sai Tamhankar, Aditya Srivastava, Surya Sharma
Director:Pulkit
Producer: Gauri Khan
Music: Anurag Saikia
Banner: Red Chillies Entertainment
Review By: Peddinti
Rating: 3.00 out of 5
Trailer