కేరళలో కొంతకాలం క్రితం వేలమంది అమ్మాయిలు మిస్సయ్యారు. అయితే అధికారికంగా కొన్ని కేసులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. వాళ్లంతా కూడా మత సంబంధమైన ట్రాప్ లో చిక్కుకుని, ఆ తరువాత తీవ్రవాద సంస్థలకు తరలించబడుతున్నారనే ఒక టాక్, దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఆ సంఘటన ఆధారంగా రూపొందిన సినిమానే 'ది కేరళ స్టోరీ'. 2023 మే 5వ తేదీన విడుదలైన ఈ సినిమా అనేక విమర్శలను ఎదుర్కొంది. అలాంటి ఈ సినిమా జీ 5లో నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
'తిరువనంతపురం'లో పుట్టి పెరిగిన షాలినీ ఉన్నికృష్ణన్ (అదా శర్మ),పై చదువుల కోసం 'కాసర్ గడ్'లోని ఒక కాలేజ్ లో చేరుతుంది. ఆ ఊళ్లో బంధువులెవరూ లేకపోవడంతో, నర్సింగ్ హాస్టల్లోనే ఉంటూ ఉంటుంది. నీమా (యోగిత బిహాని) గీతాంజలి (సిద్ధి ఇద్నాని) ఆసిఫా (సోనియా బలాని) ఆమె రూమ్మేట్స్. అందరూ కూడా ఒకరిని ఒకరు పరిచయం చేసుకుని చాలా వేగంగా కలిసిపోతారు. ఒక వైపున చదువు ... మరో వైపున కబుర్లతో కాలం హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది.
ఆసిఫా అవకాశం దొరికినప్పుడల్లా తన మతాన్ని గురించి .. తమ దైవాన్ని గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది. అలాగే ఎదుటివారి మతంపై నమ్మకం తగ్గేలా మాట్లాడుతూ ఉంటుంది. తన మతం వైపు ఈ ముగ్గురినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే నీమా మాత్రం ఆమె మాటలను ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తూ ఉంటుంది. షాలినీ .. గీతాంజలిపై మాత్రం ఆసిఫా మాటలు కొంతవరకూ ప్రభావం చూపుతాయి.
ఆసిఫా సంకేతాలకు తగినట్టుగానే రమీజ్ (ప్రణయ్) అబ్దుల్ (ప్రణవ్)లు రంగంలోకి దిగుతారు. ఆసిఫా వాళ్లను షాలినీ - గీతాంజలికి పరిచయం చేస్తుంది. ఆ ఇద్దరూ పక్కా ప్లానింగ్ తో షాలినీని .. గీతాంజలిని వశపరచుకుంటారు. షాలిని గర్భవతి కాగానే రమీజ్ ముఖం చాటేస్తాడు. దాంతో ఆసిఫా ఒత్తిడితో మతం మార్చుకుని ఇసాక్ ను పెళ్లి చేసుకుంటుంది. మత పెద్దలు ఆ ఇద్దరినీ దేశం దాటిస్తారు. ఆఫ్గాన్ బోర్డర్ లోని షాబాద్ కి చేరుకున్న షాలినీ, అక్కడే ఒక బిడ్డకి జన్మనిస్తుంది.
ఇక అబ్దుల్ డ్రగ్స్ అలవాటు చేయడం వలన, ఆ మత్తులో గీతాంజలి తన న్యూడ్ ఫొటోలను అతనికి పంపిస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఆమెను గర్భవతిని చేయడానికి అబ్దుల్ తొందరపడుతూ ఉంటాడు. అక్కడే అతనిపై ఆమెకి డౌట్ వస్తుంది. సిరియా వెళ్లిపోదామని పదే పదే అంటూ ఉండటంతో ఆమె అనుమానం మరింత బలపడుతుంది. తనని అతను ట్రాప్ చేశాడనే విషయాన్ని అప్పుడు ఆమె గ్రహిస్తుంది. మరో వైపు నుంచి నీమాకి కూడా అలాంటి అనుభవమే ఎదురవుతుంది.
షాలినీకి తాను ఎక్కడ ఉన్నదీ ... ఎలాంటి పరిస్థితులలో ఉన్నది .. తన చుట్టూ ఏం జరుగుతుందనేది నిదానంగా అర్థమవుతూ వస్తుంది. భర్తలను పోగొట్టుకున్న అక్కడి స్త్రీలు లైంగిక అవసరాలు తీర్చే వస్తువులుగా మారడం .. లేదంటే మానవ బాంబులుగా మార్చబడుతూ ఉండటం .. ఎక్కడ పొరపాటు జరిగినా అత్యంత దారుణంగా హింసించబడటం చూసి షాలినీ భయపడిపోతుంది. అదే సమయంలో నీమా కాల్ చేసి, తామంతా ట్రాప్ లో చిక్కుకున్నామని చెబుతుంది.
అప్పుడు షాలినీ ఏం చేస్తుంది? అక్కడి నుంచి బయటపడటానికి ఆమె ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? ఫలితంగా అక్కడ ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? గీతాంజలికి అబ్దుల్ కారణంగా ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తన స్నేహితులకు జరిగిన అన్యాయాన్ని గురించి అర్థం చేసుకున్న నీమా జీవితానికి ముగింపు ఏమిటి? అనేదే కథ.
యథార్థ సంఘటన ఆధారంగా సూర్యపాల్ సింగ్ - దర్శకుడు సుదీప్తో సేన్ తయారు చేసుకున్న కథ ఇది. అలాంటి ఈ సినిమా విడుదల తరువాత వివాదాలను ఎదుర్కుంటూ .. విమర్శలను తట్టుకుంటూ ఆలస్యంగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా చూసిన తరువాత, ఈ సంఘటనపై దర్శకుడు పూర్తిస్థాయి పరిశీలన - పరిశోథన చేశాడనే విషయం అర్థమవుతుంది. పూర్తి అవగాహనతో కథను .. పాత్రలను మలిచాడనే విషయం స్పష్టమవుతుంది. ఆయన స్క్రీన్ ప్లే వేసుకున్న తీరు ఈ సినిమాకి హైలైట్.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కొత్తగా కాలేజ్ లో చేరే అమ్మాయిలను ఎలా ట్రాప్ చేస్తారు? ఎలా వాళ్లను బయటికి తీసుకొస్తారు? ఎలా వాళ్ల జీవితాల్లోకి తమ ముఠాకి చెందిన మనుషులను ప్రవేశపెడతారు? ఎలా వారిని కుటుంబ సభ్యుల నుంచి దూరం చేస్తారు? ఎలా తమ మతంపై గల నమ్మకాన్ని పోగొడతారు? ఇక్కడి నేరస్థులతో పెళ్లి జరిపించి .. ఉగ్రవాద కేంద్రాలకు ఎలా పంపిస్తారు? అనే అంశాలను దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా ఆవిష్కరించాడు.
సుదీప్తో సేన్ రూపొందించిన ఈ సినిమా చూస్తుంటే, అది సినిమాగా అనిపించదు. వాస్తవ సంఘటనలు మన కళ్లముందు జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ సంఘటన కేరళలో ఎక్కడో జరిగింది కదా అని ఎవరూ సరిపెట్టుకోలేరు. ఆ ఉచ్చు మన చుట్టూ కూడా ఉండే ఉంటుందనే ఆలోచన ఉలిక్కిపడేలా చేస్తుంది. పిల్లల విషయంలో పేరెంట్స్ మరింత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని గుర్తుచేస్తుంది.
ప్రధానమైన పాత్రలను పోషించిన అదా శర్మ - యోగిత బిహాని - సిద్ధి ఇద్నాని తమ పాత్రలకు న్యాయం చేశారు. తామంతా ఒక ట్రాప్ లో చిక్కుకుని మోసపోయామని తెలిసినప్పుడు ఎమోషన్స్ కి లోనయ్యే సన్నివేశాలలో గొప్పగా నటించారు. ఈ కథలోకి ఆడియన్స్ వేగంగా వెళ్లడానికి గల కారణాలలో లొకేషన్స్ ఒకటి. దర్శకుడు ఎంచుకున్న లొకేషన్స్ ఈ కథకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. ఆలోచింపజేసే కథా కథనాలు .. ఆసక్తిని రేకెత్తించే సన్నివేశాలు .. సహజమైన ఆవిష్కరణ ఈ సినిమాకి ప్రధానమైన బలం. విరేశ్ శ్రీవల్స - భిషక్ జ్యోతి సంగీతం, ప్రశాంతను ఫొటోగ్రఫీ .. సంజయ్ శర్మ ఎడిటింగ్ అదనపు బలం అని చెప్పచ్చు.
'ది కేరళ స్టోరీ' (జీ 5) మూవీ రివ్యూ!
The Kerala Story Review
- కేరళలో జరిగిన యథార్థ సంఘటనకు దృశ్య రూపం
- ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే కథాకథనాలు
- మనసును టచ్ చేసే ఎమోషనల్ కంటెంట్
- సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చిన డైరెక్టర్
Movie Name: The Kerala Story
Release Date: 2024-02-16
Cast: Adah Sharma, Yogita Bihani, Sonia Balani, Siddhi Idnani
Director:Sudipto Sen
Producer: Vipul Amrutlal Shah
Music: Viresh Sreevalsa Bishakh Jyoti
Banner: Sunshine Pictures
Review By: Peddinti
Rating: 3.50 out of 5
Trailer