'రెజీనా ( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Regina

Regina Review

  • సునైన ప్రధాన పాత్రగా రూపొందిన 'రెజీనా'
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • బలహీనమైన స్క్రీన్ ప్లే ప్రధానమైన లోపం
  • రొటీన్ కి భిన్నంగా ట్రై చేయలేకపోయిన డైరెక్టర్
  • ఇబ్బందిపెట్టే రక్తపాతం

తమిళంలో క్రితం ఏడాది విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో 'రెజీనా' ఒకటి. సునైన ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా,  క్రితం ఏడాది జూన్ 23వ తేదీన అక్కడి థియేటర్స్ లో విడుదలైంది. అదే సమయంలో ఈ సినిమాను ఇక్కడ కూడా రిలీజ్ చేయాలనుకున్నారు .. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం.

రెజీనా (సునైన) జో ( అనంత్ నాగ్) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. 'జో' ఒక బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటాడు. ఆనందంగా .. హాయిగా వాళ్ల జీవితం సాగిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున బ్యాంక్ లోకి ఓ నలుగురు దుండగులు ప్రవేశిస్తారు. ముఖానికి మాస్క్ ను ధరించిన ఆ దుండగులు, డబ్బు .. నగలు దోచుకెళుతూ, అందుకు అడ్డుపడిన 'జో'ను తీవ్రంగా గాయపరుస్తారు. దాంతో 'జో' అక్కడికక్కడే మరణిస్తాడు. ఈ విషయం తెలిసి రెజీనా కుప్పకూలిపోతుంది.

రెజీనా తన చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంటుంది. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గిరిజన గూడెంలోని ప్రజలకు ఆయన అండగా నిలిచేవాడు. ఈ విషయంలో ప్రభుత్వాన్నీ .. అధికారులను నిలదీయడానికి కూడా ఆయన వెనకాడేవాడు కాదు. అలాంటి ఆయనను కొంతమంది దుండగులు హత్య చేస్తారు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి రెజీనాకి చాలా కాలం పడుతుంది. తన జీవితంలోకి 'జో' అడుగుపెట్టిన తరువాతనే ఆమె హ్యాపీగా ఉంటూ ఉంటుంది. 

అలాంటి 'జో' చనిపోయాడనే నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. తన భర్త హత్యకి సంబంధించిన విచారణ ఎంతవరకూ వచ్చిందనేది తెలుసుకోవడానికి ఆమె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ఎవరూ కూడా ఆమెను పట్టించుకోరు. ఆమె ఆవేదనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. కొంతమంది అధికారుల తీరు ఆమెకి అనుమానాన్ని కలిగిస్తుంది. పోలీస్ వారి వలన ఆమెకి అవమానమే మిగులుతుంది.

తన భర్త మరణం చాలా పకడ్బందీగా జరిగిందనీ, అది బ్యాంకు దొంగతనంలో భాగంగా జరిగింది కాదనే విషయం రెజీనాకి అర్థమవుతుంది. దాంతో ఆమె ఆ ఊరును వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తరువాత రెజీనా ఏం చేస్తుంది? ఆమె భర్త మరణానికి కారకులు ఎవరు? ఆ విషయం తెలుసుకున్న రెజీనా తన జీవితంలో ఎలాంటి మలుపు తీసుకుంటుంది? తన భర్త మరణానికి కారకులైనవారిపై ఎలా పగ తీర్చుకుంటుంది? అనేదే మిగతా కథ. 

డోమిన్ డిసిల్వా  ఈ సినిమాకి దర్శకుడు .. తనే రాసుకున్న కథ ఇది. రెజీనా అనాథగా పెరిగిన అమ్మాయి. అందమైన వైవాహిక జీవితం .. ఆమె భర్త హత్యకి గురికావడం .. ఆ తరువాత ఆమెకి ఎదురైన అవమానాలు .. తన భర్తను హత్య చేసినవారిపై .. చేయించినవారిపై ఆమె పగ తీర్చుకోవడమనేది ప్రధానమైన కథాంశంగా కనిపిస్తుంది. దర్శకుడు తాను చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పాడు. అయితే ఆ విషయాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించలేకపోయాడు. 

తన భర్త హత్యకి కారకులైనవారిని రెజీనా అన్వేషించడం .. వాళ్లు ఎవరనేది తెలుసుకునే పద్ధతి .. వాళ్లకి చేరువ కావడానికి వేసే ప్రణాళికలు .. ఊహించని విధంగా దాడి చేయడానికి అవసరమైన వ్యూహాలు .. ఇలాంటివి ఈ కథపై మరింత ఉత్కంఠను రేకెత్తించే అంశాలు. కానీ ఆ విషయాలపై దృష్టిపెట్టకపోవడం కనిపిస్తుంది. రెజీనా ఏం చేయనుంది? ఎలా చేయబోతోంది? అనే విషయం ఆడియన్స్ అంచనాలకి తేలికగానే అందుతూ ఉంటుంది.

ఇక హత్యలకు సంబంధించిన ఏ సన్నివేశాన్ని కూడా దర్శకుడు మామూలుగా వదల్లేదు. ఒక రేంజ్ లో రక్తపాతం చూపించాడు. ఆ సన్నివేశాలను చూడటమే ఇబ్బందిని కలిగిస్తుంది.  స్క్రీన్ ప్లే కూడా పేలవంగానే అనిపిస్తుంది. అందువలన ఈ కథ సాదాసీదాగానే సాగుతూ ఉంటుంది. బలమైన విలనిజం రెజీనాకి తారసపడకపోవడం .. అతని నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురుకాకపోవడం మరో లోపంగా అనిపిస్తుంది. 


ప్రధానమైన పాత్రను పోషించిన సునైన తన పాత్రకి న్యాయం చేసింది. నివాస్ అదితన్ ... రీతూ మంత్ర పాత్ర పరిధిలో మెప్పించారు. మిగతా పాత్రధారుల నటన కూడా ఓకే. సతీశ్ నాయర్ నేపథ్య సంగీతం .. పవి కె పవన్ ఫొటోగ్రఫీ .. టోబీ జాన్ ఎడిటింగ్ ఫరవాలేదు. రెజీనా ఎక్కడైతే టర్న్ తీసుకుంటుందో, ఆ సంఘటననే దర్శకుడు స్కిప్ చేశాడు. ఎక్కడా కూడా కొత్తగా చెప్పడానికి ట్రై చేయలేదు. అందువలన ఇలాంటి సినిమాలు ఇంతకుముందు చాలానే వచ్చాయి కదా అని ప్రేక్షకులు అనుకునే అవకాశమే ఎక్కువ. 

Movie Name: Regina

Release Date: 2024-02-22
Cast: Sunaina,,Ananth Nag,Rithu Manthra, Nivas Adithan ,Vivek Prasanna
Director:Domin D. Silva
Producer: Sathish Nair
Music: Sathish Nair
Banner: Yellow Bear Production

Rating: 2.00 out of 5

Trailer

More Reviews