మలయాళంలో రూపొందిన 'పోచర్' వెబ్ సిరీస్, నిన్నటి నుంచే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నిమిషా సజయన్ .. రోషన్ మాథ్యూ .. దివ్యేంద్రు భట్టాచార్య .. ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కీ, రిచీ మెహతా దర్శకత్వం వహించారు. కేరళ అడవుల నేపథ్యంలో నడిచే ఈ కథను .. 8 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ చేశారు. ఈ సిరీస్ ప్రేక్షకులకి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ 2015 నేపథ్యంలో నడుస్తూ ఉంటుంది. కేరళ ఫారెస్టుకి సంబంధించిన రేంజ్ ఆఫీసర్ గా మాల (నిమిషా సజయన్) పనిచేస్తూ ఉంటుంది. గతంలో ఆమె తండ్రి అడవిలోని జంతువులను వేటాడేవాడు. అందువలన తండ్రి చనిపోయిన తరువాత కూడా అతని పట్ల మాల ప్రేమను చూపించలేకపోతుంది. తన తండ్రి చేసిన పాపానికి పరిహారంగా అడవిలోని వన్య మృగాలను రక్షించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఈ కారణంగానే ఆమె ఆ అడవిపై .. అక్కడి గిరిజన గూడాలపై పట్టు సాధిస్తుంది.
కేరళలో అడవిలో మళ్లీ వేటగాళ్ల కదలికలు మొదలయ్యాయనీ .. ఏనుగు దంతాల కోసం 18 ఏనుగులను చంపేశారనే వార్త బయటకి రావడంతో మాల నివ్వెరపోతుంది. వేటగాళ్లతో కలిసి పనిచేసిన 'అరుకు' అనే వ్యక్తి, చేసిన తప్పుకు బాధపడి .. జరిగిందంతా ఫారెస్ట్ ఆఫీసర్స్ కి చెప్పేస్తాడు. దాంతో నీల్ బెనర్జీ (దివ్యేంద్రు భట్టాచార్య) అధ్వర్యంలో ఒక టీమ్ రంగంలోకి దిగుతుంది. అలెన్ ( రోషన్ మాథ్యూ) తో పాటు, ఆ ఫారెస్టు పై పట్టున్న 'మాల'కు కూడా ఆ టీమ్ లో చోటు దక్కుతుంది.
ఏనుగులను ఎవరు చంపుతున్నారు? ఏనుగు దంతాల రవాణా ఎక్కడి నుంచి సాగుతోంది? అవి ఎక్కడికి చేరుకుంటున్నాయి? మొత్తం ఈ నెట్ వర్క్ ను నడిపిస్తున్నదెవరు? అనేది తెలుసుకోవడం కోసం ఈ టీమ్ బరిలోకి దిగుతుంది. అప్పుడే వారికి మోరిస్ - రాజ్ అనే పేర్లు వినిపిస్తాయి. అతికష్టంపై మోరిస్ ను వెతికి పట్టుకుంటారు. ఏనుగు దంతాలపై తాను బొమ్మలు మాత్రమే చెక్కుతాననీ, ఆ తరువాత వాటిని రాజ్ ఎక్కడికి తరలించేది తనకి తెలియదని మోరిస్ చెబుతాడు.
దాంతో రాజ్ ను పట్టుకోవడానికి మాల టీమ్ బయల్దేరుతుంది. రాజ్ రహస్యంగా తలదాచుకున్న ప్రదేశానికి వెళ్లేసరికి అతను చెట్టుకు 'ఉరి' వేసుకుని కనిపిస్తాడు. అతనిది ఆత్మ హత్య కాదనీ ... హత్య అనే అనుమానం ఉందని మాల ఎంతగా చెబుతున్నా, అక్కడి పోలీస్ లు ఎంతమాత్రం సహకరించరు. రాజ్ చనిపోయిన తరువాత, పొయ్యా .. ఇవాన్ దాస్ పేర్లు బయటికి వస్తాయి. అలాగే రాజకీయ నాయకుడైన ప్రభాస్ పేరడీ .. రవి డాన్ .. ఆర్ట్ గ్యాలరీ నిర్వహించే పూనమ్ పేర్లు తెరపైకి వస్తాయి.
అప్పుడు మాల టీమ్ ఏం చేస్తుంది? ఏనుగు దంతాల అక్రమ రవాణా వెనకున్నదెవరు? వాళ్లను పట్టుకునే ప్రయత్నంలో మాల టీమ్ కి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? ఈ కేసులో ముందుకు వెళుతున్నా కొద్దీ వాళ్లకి తెలిసే నిజాలు ఏమిటి? విధి నిర్వహణలో తమకి ఎదురయ్యే అవాంతరాలను వాళ్లు ఎలా అధిగమిస్తారు? అనేదే కథ.
అలియాభట్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ఈ కథను కొన్ని యథార్థ సంఘటనల నుంచి తీసుకున్నారు. ఈ కథ పరిధి చాలా విస్తృతంగా కనిపిస్తుంది. ఎందుకంటే అడవిలో ఏనుగు దంతాల కోసం వాటిని వేటాడేవారు లోకల్ గా ఉంటే, అంచలంచెలుగా ఈ నెట్ వర్క్ ను నడిపిస్తున్నవారు ఎక్కడో ఉంటారు. అందువలన ఈ చివరి నుంచి ఆ చివరి వరకూ పోలీస్ టీమ్ అన్వేషించవలసి ఉంటుంది. అలాంటి ఒక అన్వేషణతోనే ఈ కథంతా నడుస్తుంది.
వేటగాళ్ల చేతిలో 18 ఏనుగులు చనిపోవడంతో ఉలిక్కిపడిన ఫారెస్టు డిపార్టుమెంటు రంగంలోకి దిగడంతో ఈ కథ మొదలవుతుంది. స్థానికంగా ఉండే వేటగాళ్ల మొదలు .. రాష్ట్రాల అవతల ఉన్న అక్రమార్కులను బయటికిలాగే దిశగా ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ నిదానంగా నడవడమే ఈ సిరీస్ లోని లోపంగా అనిపిస్తుంది. తెరపై నుంచి ఆడియన్స్ ఆశించే పోలీస్ హడావిడి ఎంతమాత్రం కనిపించదు.
ఇక ఒక్కో నేరస్థుడి కోసం గాలించడం .. ఆ నేరస్థుడు దొరగ్గానే ఆ విషయాన్ని లైట్ గా తేల్చిపారేసి, అక్కడి నుంచి మరో నేరస్థుడి కోసం గాలించడం .. ఇలాగే ఈ కథ అంతా కొనసాగుతూ ఉంటుంది. 'అన్నిటికీ మించిన పెద్ద తలకాయ ఏదో ఉంటుంది .. ఆ తలకాయను పట్టుకోండి చూద్దాం ..' అని ఆడియన్స్ కూడా అనుకుంటారు. కానీ అక్కడ కూడా తేల్చిపారేశారు. వందల కేజీల ఏనుగు దంతాల అక్రమ రవాణా చేసే ప్రతినాయకుడు .. ఒక్క డైలాగ్ లేకుండా ఉంటాడు.
ప్రతినాయకుడు బలమైనవాడైనప్పుడే అతనిని ఎదుర్కోవడంలో కిక్ ఉంటుంది. ఆడియన్స్ ఆ కిక్ ను ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ అలాంటి విలనిజం కనిపించకపోవడం ఒక వెలితిగా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో కూడా బయట విపరీతమైన తొక్కిసలాట జరుగుతూ ఉంటుంది. లోపల మాత్రం అధికారులు తాపీగా తమ పని చేసుకుంటూ ఉంటారు. పైగా ఎలాంటి టెన్షన్ లేకుండా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈ సిరీస్ మొత్తానికి నిమిషా సజయన్ నటన ఆకట్టుకుంటుంది. మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. నిర్మాణ విలువలకు వంకబెట్టనవసరం లేదు. అలాగే ఫారెస్టు నేపథ్యంలోని అద్భుతమైన లొకేషన్స్ 'ఆహా' అనిపిస్తాయి. జాన్ ఫొటోగ్రఫీ ఈ సిరీస్ కి హైలైట్ గా నిలుస్తుందనే చెప్పాలి. నేపథ్య సంగీతం కూడా కథకి తగినట్టుగానే సాగుతూ వచ్చింది. ఎడిటింగ్ ఫరవాలేదు.
కథను నిదానంగా చెప్పడం వలన ఒక్కో ఎపిసోడ్ నిడివి పెరిగిపోయింది. స్క్రీన్ ప్లేలో మేజిక్ .. ఇన్వెస్టిగేషన్ లో స్పీడ్ .. కథలో ట్విస్టులు .. బలమైన విలనిజం గనుక ఉండి ఉంటే, ఈ సిరీస్ తప్పకుండా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదేమోనని అనిపిస్తుంది.
'పోచర్' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ!
Poacher Review
- మలయాళం నుంచి వచ్చిన 'పోచర్'
- 8 ఎపిసోడ్స్ గా వచ్చిన సీజన్ 1
- క్రైమ్ డ్రామా జోనర్లో నడిచే కథ
- మంచి మార్కులు కొట్టేసే నిర్మాణ విలువలు
- లొకేషన్స్ .. ఫొటోగ్రఫీ హైలైట్
- నిదానంగా సాగే స్క్రీన్ ప్లే
- సాదాసీదాగా సాగే సన్నివేశాలు
Movie Name: Poacher
Release Date: 2024-02-23
Cast: Nimisha Sajayan, Roshan Mathew, Dibyendu Bhattacharya, Kani Kusruti
Director:Richie Mehta
Producer: Edward H. Hamm Jr- Alia Bhatt
Music: -
Banner: QC Entertainment
Review By: Peddinti
Rating: 3.00 out of 5
Trailer