'ఆంటోని' - (ఆహా ) మూవీ రివ్యూ!

Antony

Antony Review

  • జోజు జార్జ్ ప్రధానమైన పాత్రగా 'ఆంటోని'
  • క్రితం ఏడాది డిసెంబర్లో విడుదలైన సినిమా 
  • ఈ నెల 23 నుంచి 'ఆహా'లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ 
  • ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథాకథనాలు
  • ఎమోషన్స్ వైపు నుంచి కనెక్ట్ అయ్యే కంటెంట్ 

మలయాళంలో క్రితం ఏడాది ద్వితీయార్థంలో వచ్చిన సినిమాలలో 'ఆంటోని' ఒకటి. జోజు జార్జ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి, జోషి దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 1వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, అక్కడి ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా తెలుగు వెర్షన్, ఈ నెల 23వ తేదీన 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ కేరళ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఆంటోని (జోజు జార్జ్) 19 ఏళ్ల వయసులో అతను తన తల్లిదండ్రులను .. ఇద్దరు చెల్లెళ్లను కోల్పోతాడు. ఆంటోని తండ్రితో కలిసి బిజినెస్ చేసిన నారాయణ, అతనిని మోసం చేస్తాడు. అంతేకాకుండా ఓ పోలీస్ ఆఫీసర్ తో కలిసి పక్కాగా వేసిన ప్లాన్ ప్రకారం ఆ కుటుంబం పరువు తీస్తాడు. ఆంటోని ఇంట్లో లేని సమయంలో వాళ్లంతా కూడా ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ల సంవత్సరీకం రోజున, నారాయణనీ .. ఆ పోలీస్ ఆఫీసర్ ను ఆంటోని హత్య చేస్తాడు. 

ఆ రెండు హత్య కేసులలో ఎలాంటి సాక్ష్యం లేకపోవడంతో, ఆంటోని జైలు నుంచి బయటికి వస్తాడు. అప్పటి నుంచి అతను అక్కడ గ్యాంగ్ స్టర్ గా మారతాడు. ఐదుగురు స్నేహితులు అతనికి అత్యంత విశ్వాస పాత్రులుగా ఉంటారు. ఆంటోని చేసే ప్రతి పని వెనుక .. మంచి మనసు కనిపిస్తూ ఉంటుంది. తన స్నేహితుడైన మనోజ్ పై జేవియర్ (టినీ టామ్) ఎటాక్ చేసి, అతని కాలును నరికేస్తాడు. ఈ విషయం తెలియగానే జేవియర్ ను వేటాడి మరీ అతని కాలును ఆంటోని నరికేస్తాడు. దాంతో అతను అక్కడే చనిపోతాడు. ఈ కేసులో కూడా సాక్ష్యం లేకపోవడంతో ఆంటోని బయటపడతాడు.

జేవియర్ తమ్ముడు టార్సన్ ఒక హత్యా నేరంపై జైల్లో ఉన్న కారణంగా, అంత్యక్రియలకు రాలేకపోతాడు. జేవియర్ అతని భార్య జెస్సి (ఆశా శరత్) .. వాళ్ల కూతురు మరియా (కల్యాణి ప్రియదర్శన్) దిక్కులేనివారవుతారు.ఆ కుటుంబం గురించి ఫాదర్ ద్వారా తెలుసుకున్న ఆంటోని , వాళ్లకి కొంత భూమిని .. కొత్తగా కట్టించిన ఇంటిని సాయంగా అందజేస్తాడు. అయితే ఆ తరువాత జరిగిన ఒక సంఘటనలో మరిది కారణంగా 'జెస్సీ' చనిపోతుంది. అందరూ కూడా వర్షంలో కరెంట్ తీగలు తెగిపడటం వలన, ఆమె చనిపోయిందని అనుకుంటారు. ఒంటరిగా మిగిలిపోయిన మరియా సంరక్షణను, ఆంటోనికి అప్పగిస్తాడు ఫాదర్.  

ఈ నేపథ్యంలోనే సీఐ ప్రమోద్ కి సంబంధించిన ఓ రిసార్ట్ విషయంలో, లారెన్స్ (జినూ జోసెఫ్) అనే మరో గ్యాంగ్ స్టర్ తో ఆంటోని గొడవ పెట్టుకుంటాడు. అప్పటి నుంచి అతనిపై పగ తీర్చుకునే సమయం కోసం లారెన్స్ వెయిట్ చేస్తూ ఉంటాడు. తన తమ్ముడైన జేవియర్ ను హత్య చేసిన ఆంటోని పై ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో టార్సన్ (హరి ప్రశాంత్) ఉంటాడు. ఇక తన అన్న కూతురైన మరియా సంరక్షణ బాధ్యత తాను కాకుండా ఆంటోని స్వీకరించడంతో అతనిపై మరియా బాబాయ్ కూడా ద్వేషంతో రగిలిపోతూ ఉంటాడు. 

తన తండ్రిని చంపిన హంతకుడి సంరక్షణలో ఉండవలసి రావడం మరియా జీర్ణించుకోలేకపోతోంది. ఫాదర్ తీసుకున్న ఆ నిర్ణయం పట్ల ఆమె అసహనానికి లోనవుతుంది. చుట్టూ శత్రువులను పెట్టుకున్న ఆంటోని, మరియా భవిష్యత్తు కోసం ఎలాంటి గొడవలకు వెళ్లకూడదని నిర్ణయించుకుంటాడు. ఫలితంగా అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? ఎటువంటి అవరోధాలను అధిగమించవలసి వస్తుంది? తనకి ఫాదర్ అప్పగించిన బాధ్యతను ఆంటోని పూర్తి చేయగలిగాడా లేదా? అనేది మిగతా కథ.

 రాజేశ్ వర్మ కథను అందించిన ఈ సినిమాకి, జోషీ దర్శకత్వం వహించాడు. కథ విషయానికి వస్తే . ఇది కొత్త కథేం కాదు. ఇంతకుముందు ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. అయితే స్క్రీన్ ప్లే .. అన్ని వైపుల నుంచి కథను అల్లుకుంటూ వచ్చిన తీరు .. ప్రెజెంటేషన్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి, నేరమయ జీవితానికి అలవాటు పడిన ఒక వ్యక్తి, తన కూతురు స్థానంలోకి ఒక ఆడపిల్ల వచ్చిన తరువాత ఎలా మారిపోతాడు? అనేదే ఈ కథలోని సున్నితమైన అంశం. 

తన అండదండలు ఎంతమాత్రం ఇష్టంలేని మరియా .. అయినా ఆశ్రయం కల్పించడానికి ఆరాటపడే ఆంటోని. ఒక వైపున తన నేరమయ జీవితం .. ఒక వైపున శత్రువర్గం .. మరో వైపున వంకర బుద్ధితో చూసే సమాజం. వీటన్నిటినీ దాటుకుని ఒక ఆడపిల్లని ఆంటోని ఎలా రక్షించుకున్నాడనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు, ప్రేక్షకులకు ఎమోషన్స్ పరంగా కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ కూడా  సంతృప్తికరంగా అనిపిస్తుంది. తండ్రి స్థానంలో జోజు జార్జ్ .. కూతురు స్థానంలో కల్యాణి ప్రియా దర్శన్ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. 

ఈ కథ కోసం ఎంపిక చేసుకున్న లొకేషన్స్ ... కథా నేపథ్యానికి మరింత బలాన్ని ఇచ్చాయి. అందమైన ఆ లొకేషన్స్ ను రెనదివ్ గొప్పగా ఆవిష్కరించాడు. జేక్స్ బొజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ను కథలో లీనమయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా ఆంటోని పాత్రను మరోమెట్టుపైన నిలబెట్టింది. శ్యామ్ శశిధరన్ ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది. ఎక్కడా అనవసరమైన సన్నివేశాలుగానీ, సాగదీసే ప్రయత్నాలు గాని కనిపించవు. 

స్నేహం ... ప్రేమ .. త్యాగం అనే మూడు ప్రధానమైన అంశాల చుట్టూ తిరిగే ఈ కథ, ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఆంటోని పాత్ర కరకుగా కనిపించినా, ఆ పాత్ర మానవీయ కోణంలో ఆలోచన చేయడం ఆడియన్స్ కనెక్ట్ కావడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఒక ప్రాంతం పరిధిలో జరిగే ఈ కథను సహజత్వానికి సాధ్యమైనంత దగ్గరగా తీసుకుని వెళ్లడం వలన, అక్కడక్కడా కంటతడి పెట్టిస్తుంది. ఇది ఒక కథగా కాకుండా జీవితం అనిపించేలా చేస్తుంది. 

Movie Name: Antony

Release Date: 2024-02-23
Cast: Joju George, Kalyani Priyadarshan,Nyla Usha, Asha Sharath,Chemban Vinod Jose, Vijayaraghavan
Director:Joshiy
Producer: Einstin Zac Paul
Music: Jakes Bejoy
Banner: Einstin Media - Nextel Studios

Rating: 3.00 out of 5

Trailer

More Reviews