డబ్బు చుట్టూ తిరిగే కథతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కామెడీ టచ్ తో నడిచే ఈ తరహా కథలు కొన్ని మంచి విజయాలను అందుకున్నాయి. తక్కువ బడ్జెట్ తో మంచి కంటెంట్ ను ఇచ్చేందుకు అవకాశం ఉన్న జోనర్ ఇది. ఈ తరహా జోనర్లో రూపొందిన మరో సినిమానే 'కిస్మత్'. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 2వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కిరణ్ (నరేశ్ అగస్త్య) అభి (అభినవ్ గోమఠం) కార్తీక్ ( విశ్వదేవ్) మంచిర్యాలకి చెందిన కుర్రాళ్లు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చెందిన ఈ ముగ్గురు కుర్రాళ్లు ఇంజనీరింగ్ పూర్తిచేస్తారు. ముగ్గురూ కలిసి ఊళ్లో సరదాగా తాగుతూ .. తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ఉద్యోగం చూసుకోమని పేరెంట్స్ పోరుతుంటారు. దాంతో ఉద్యోగం కోసం ముగ్గురూ హైదరాబాద్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం తగిన ఏర్పాట్లను చేసుకోవడం మొదలెడతారు.
హైదరాబాద్ లో ఎలక్షన్స్ హడావిడి మొదలవుతుంది. ఈ సారి ఎన్నికలలో MLAగా గెలవాలని జనార్దన్ ( అజయ్ ఘోష్) ఆలోచన చేస్తూ ఉంటాడు. అతను ఎన్నో కాలేజ్ లను నిర్వహిస్తూ ఉంటాడు. ఇన్ కామ్ టాక్స్ అలోక్ నాథ్ (సమీర్) అతనిపై ఓ కన్నేసి ఉంచుతాడు. దాంతో తన దగ్గరున్న నగదును బ్యాగుల్లో సర్దేసి తన అనుచరులైన సూరి - రాజుకి ఇచ్చేసి ఎక్కడైనా దాచమని చెబుతాడు. రాజు తన బ్యాగులో ఉన్న 10 కోట్లను నొక్కేయాలని ప్లాన్ చేస్తాడు. తన రూమ్ లోని 'బీమ్ బ్యాగ్' లో దాచేస్తాడు.
10 కోట్ల గురించి సూరి నిలదీయడానికి చేసిన ప్రయత్నంలో రాజు చనిపోతాడు. అతను ఎక్కడ ఉంటున్నది కూడా సూరికి తెలియదు. దాంతో రాజు చనిపోయిన విషయం జనార్దన్ కి చెప్పకుండా సూరి గాలించడం మొదలుపెడతాడు. మంచిర్యాల నుంచి వచ్చిన ముగ్గురు స్నేహితులు, గతంలో రాజు అద్దెకి ఉన్న రూమ్ లోనే రెంటుకి దిగుతారు. తమకి ఉద్యోగాలు రావాలంటే 10 లక్షలు లంచంగా ఇవ్వాలని భావించి, జనార్దన్ మనుషుల నుంచి 10 లక్షలు కొట్టేస్తారు.
10 లక్షలను తీసుకుని రూమ్ కి వస్తూ ఒక కారు ఎక్కుతారు. ఆ కారులో జనార్దన్ మనుషులు డ్రైవర్ కి కూడా తెలియకుండా 10 కోట్లు ఉంచుతారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ తమ బ్యాగ్ తో పాటు ఆ బ్యాగ్ కూడా తీసుకుని రూమ్ కి చేరుకుంటారు. తమని వెతుక్కుంటూ 20 కోట్లు వచ్చాయనే విషయం ఒక రోజున వారికి తెలుస్తుంది. దాంతో తమ సమస్యలన్నీ తీరిపోయినట్టేనని వాళ్లంతా ఖుషీ అవుతారు. కొన్నాళ్ల వరకూ సైలెంట్ గా ఉండి ఆ తరువాత పంచుకోవాలని భావిస్తారు.
మూడో కంటికి తెలియకుండా తన డబ్బును రాబట్టుకోవాలని భావించిన జనార్దన్, ఒక వైపున రౌడీ సూరి గ్యాంగ్ ను .. మరో వైపున పోలీస్ ఆఫీసర్ వివేక్ ( అవసరాల శ్రీనివాస్)ను రంగంలోకి దింపుతాడు. వాళ్ల గాలింపులో, డబ్బు అంతా కూడా ఈ ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గర ఉందని తెలుస్తుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? ముగ్గురు స్నేహితులు ఎలాంటి పరిణామాలను ఫేస్ చేస్తారు? ఫలితంగా వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? అనేది మిగతా కథ.
దర్శకుడు శ్రీనాథ్ రాసుకున్న కథ ఇది. నిరుద్యోగులైన ముగ్గురు యువకులకు, వాళ్లున్న పరిస్థితుల్లో డబ్బు చాలా అవసరం. అలాంటి పరిస్థితుల్లో 20 కోట్లు వచ్చి పడితే, వాళ్ల జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అనే దిశగా దర్శకుడు ఈ కథను నడిపించిన తీరు బాగుంది. ఈ కథలో కనిపించే ప్రధానమైన పాత్రలు మూడు. ముఖ్యమైన పాత్రలను కలుపుకుని చెప్పాలంటే ఓ పదివరకూ ఉంటాయి. డబ్బుకోసం ప్రధాన పాత్రల మధ్య జరిగే దాగుడుమూతలాట ప్రేక్షకులను నవ్విస్తుంది.
చాలా తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో ఈ కథ నడుస్తుంది. కథలో అద్భుతాలు ఏమీ జరగపోయినా, మొదటి నుంచి చివరివరకూ బోర్ కొట్టకుండా నవ్విస్తుంది. సన్నివేశాలను ఎక్కడా సాగదీసినట్టుగా అనిపించదు. కామెడీ టచ్ తో వినోదభరితమైన డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ రెండూ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి.
ఆర్టిస్టులంతా ఎవరి పాత్రకు వారు జీవం పోశారు. శంకరన్ ఫొటోగ్రఫీ .. విప్లవ్ నైషధం ఎడిటింగ్ ఫరవాలేదు. మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచిందనే చెప్పాలి. సింపుల్ బడ్జెట్ లో తీసిన సింపుల్ కంటెంట్ లా అనిపించినప్పటికీ, దర్శకుడు ఇచ్చిన అవుట్ ఫుట్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది. డబ్బుతో పాటు సంతోషం మాత్రమే కాదు, సమస్యలు కూడా వస్తాయనే ఒక సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా, ఓటీటీ ఆడియన్స్ ఆశించే ఎంటర్టైన్ మెంటును అందిస్తుందనే చెప్పాలి.
'కిస్మత్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Kismath Review
- ఫిబ్రవరి 2న థియేటర్లకు వచ్చిన 'కిస్మత్'
- డబ్బు చుట్టూ తిరిగే కామెడీ డ్రామా
- ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
- చిన్న బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇచ్చిన దర్శకుడు
- మొదటి నుంచి చివరివరకూ సరదాగా సాగిపోయే కంటెంట్
Movie Name: Kismath
Release Date: 2024-04-02
Cast: Naresh Agasthya, Abhinav Gomatham, Vishwa Dev, Riya Suman, Ajay Ghosh,
Director:Srinath Badineni
Producer: Raju
Music: Mark. K. Robin
Banner: Comrade Film Factory
Review By: Peddinti
Rating: 3.00 out of 5
Trailer