'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీ రివ్యూ!

Geethanjali Malli Vachindi

Geethanjali Malli Vachindi Review

  • అంజలి 50వ సినిమాగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది'
  • బలహీనమైన కథాకథనాలు 
  • నవ్వించలేకపోయిన .. భయపెట్టలేకపోయిన సన్నివేశాలు 
  • 'గీతాంజలి'కి దూరంగా ఉండిపోయిన సీక్వెల్ 
  • కనిపించని కోన వెంకట్ మేజిక్  

అంజలి ప్రధానమైన పాత్రను పోషించిన 'గీతాంజలి' 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ కామెడీ జోనర్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంజలి కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలవడమే కాకుండా, నిర్మాతకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అలాంటి ఆ సినిమాకు సీక్వెల్ గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' రూపొందింది. ఈ రోజునే ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. గతంలో వచ్చిన 'గీతాంజలి'ని మించి ఈ సీక్వెల్ ఉందా? లేదంటే ఆ సినిమా స్థాయిలోనే ఆడియన్స్ ను అలరించిందా? అనేది ఇప్పుడు చూద్దాం.

శ్రీమంతుడైన రమేశ్ .. గీతాంజలిపై మనసు పారేసుకుంటాడు. ఆమెను వశపరచుకోవడమే కాకుండా, ఆమె మరణానికి కారకుడవుతాడు. చెల్లెలు అంజలిని ఆవహించిన గీతాంజలి ప్రేతాత్మ రమేశ్ ను అంతం చేస్తుంది. గీతాంజలి ప్రేతాత్మ ప్రతీకారం తీర్చుకునే విషయంలో, సినిమాల్లో అవకాశాల కోసం ఇండస్ట్రీకి వచ్చిన శ్రీనివాస్ టీమ్ ఆమెకి సహాయ పడుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది? అనే విషయంతో 'గీతాంజలి మళ్లీ వచ్చింది' కథ మొదలవుతుంది. 

హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో ఒక యువతిని లోబరచుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి, అతీంద్రియ శక్తి కారణంగా ప్రాణాలు కోల్పోతాడు. అతని మరణానికి కారణమైన 'గీతాంజలి' ప్రేతాత్మను ఓ మాంత్రికుడు బంధిస్తాడు. ఒక బొమ్మలో ఆమె ప్రేతాత్మను బంధించి, సిటీకి దూరంగా ఉన్న ఒక ప్రదేశంలో పాతిపెడతాడు. ఆ ప్రదేశంలో తవ్వకాలు జరుపుతుండగా ఆ బొమ్మ బయటపడుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బొమ్మలు అమ్మే ఓ అమ్మాయి ఆ బొమ్మను శుభ్రం చేసి, వెంట్రిలాక్విజం చేసే వెంకట్రావు (అలీ)కి అమ్ముతుంది.       

ఊటీలో ఒక ప్రదర్శన ఉండటంతో వెంకట్రావు అక్కడికి బయల్దేరతాడు. ఆ బొమ్మలో ప్రేతాత్మ ఉందని తెలుసుకున్న అతను, అది తన చెల్లెలైన అంజలిని కలుసుకోవాలనుకుంటోందని తెలుసుకుంటాడు. అప్పటి నుంచి అతను అంజలి కోసం వెదకడం మొదలుపెడతాడు. ఇదిలా ఉండగా, శ్రీను (శ్రీనివాస రెడ్డి) దర్శకుడిగా కొత్త ప్రాజెక్టు కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అతనికి 'ఊటీ' నుంచి కాల్ వస్తుంది. 

బిజినెస్ మెన్ అయిన విష్ణు (రాహుల్ మాధవ్) తన దర్శకత్వంలో ఒక సినిమా తీయాలనుకుంటున్నాడని తెలిసి శ్రీను ఎగిరిగంతేస్తాడు. తన స్నేహితులైన ఆత్రేయ (సత్యం రాజేశ్) ఆరుద్ర (షకలక శంకర్)తో పాటు, హీరో కావాలనే బలమైన కోరికతో తన దగ్గరికి వచ్చిన అయాన్ (సత్య)ను వెంటబెట్టుకుని ఊటీ వెళతాడు. అక్కడ కాఫీ షాప్ నడుపుతున్న అంజలి వారికి తారసపడుతుంది.

శ్రీను టీమ్ ను విష్ణు సమావేశపరుస్తాడు. తన దగ్గర 'సంగీత్ మహల్' అనే కథ ఉందని చెప్పి వినిపిస్తాడు. దెయ్యాల నేపథ్యంలో సాగే ఆ సినిమాను, తాను కొత్తగా కొన్న పాడుబడిన బంగ్లాలో తీయాలని విష్ణు చెబుతాడు. కాఫీ షాప్ దగ్గర తాను అంజలి అనే అమ్మాయిని చూశాననీ, ఆమెను మెయిన్ రోల్ కి ఒప్పించమని అంటాడు. ఈ విషయంలో శ్రీను టీమ్ అంజలిని ఒప్పిస్తుంది. 'సంగీత్ మహల్'లో నిజంగానే దెయ్యాలున్నాయనే విషయం తెలియని శ్రీను టీమ్, అందులోకి అడుగుపెడుతుంది. 

ఆ బంగ్లాలో దెయ్యాలుగా ఉన్నదెవరు? ఎందుకు దెయ్యాలుగా మారారు? అందులో శ్రీను టీమ్ కి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? విష్ణు ఎవరు? ఎందుకు అతను శ్రీను - అంజలితోనే సినిమా తీయాలనుకుంటాడు? బొమ్మలోని గీతాంజలి ప్రేతాత్మ అంజలిని చేరుకుంటుందా? అనేది మిగతా కథ. 

 ఈ సినిమాపై ఆడియన్స్ కి ఆసక్తి కలగడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు వచ్చిన 'గీతాంజలి' సినిమా హిట్ కావడం ఒక కారణంగా కనిపిస్తుంది. కథాకథనాలపై కోన వెంకట్ కి మంచి పట్టు ఉంది. ఆషా మాషీగా ఉంటే ఆయన ఒప్పుకోడు అనేది రెండో కారణం. ఇక ఈ సినిమా కెరియర్ పరంగా అంజలికి 50 సినిమా. అందువలన విషయం ఉన్న కంటెంట్ ను మాత్రమే ఆమె ఒప్పుకునే ఛాన్స్ ఉంది. విషయం ఉండటం వల్లనే ఆమె ఈ సినిమాకి ఓకే చెప్పి ఉంటుందనే నమ్మకం మూడో కారణంగా కనిపిస్తుంది. 

ఈ సినిమాకి వెళ్లిన తరువాత .. పై మూడు విషయాల్లో ప్రేక్షకుడు పెట్టుకున్న నమ్మకం దశలవారీగా ఆవిరైపోతుంది. గతంలో వచ్చిన 'గీతాంజలి'లో ఒక వైపున కామెడీ .. ఒక వైపున హారర్ .. మరో వైపున ఎమోషన్ ప్రేక్షకుడిని కదలనీయకుండా చేశాయి. చిన్న బడ్జెట్ లోనే చేసినా కంటెంట్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది. సీక్వెల్ అంతకు మించి లేకపోయినా, ఆ మాత్రం ఉంటే చాలని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ అందుకు చాలా దూరంలోనే ఈ సినిమా ఉండిపోయింది.

ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్ పై ఆసక్తిని పెంచేదిగానే ఉంటుంది. కానీ అంతవరకూ నడిచిన కథ .. ఆ తరువాత నడిచే కథ ప్రేక్షకులను సన్నివేశాల్లో భాగం చేయలేకపోతాయి. కమెడియన్ సత్య పాత్ర కాస్త అతిగా అనిపిస్తే, అలీ ట్రాక్ చాలా కృతకంగా కనిపిస్తుంది. శ్రీనివాస రెడ్డి - సత్యం రాజేశ్ - షకలక శంకర్ పాత్రల నుంచి ఒక బొట్టు కామెడీ కూడా రాలలేదు. ఇక దెయ్యాల ట్రాక్ విషయానికి వస్తే భయపడేలా? నవ్వుకోవాలా? అనేది అర్థం కాని పరిస్థితి. క్లైమాక్స్ చూస్తున్నప్పుడు కూడా ఇంతకంటే భిన్నమైన అభిప్రాయమేం కలగదు. 

 గతంలో వచ్చిన 'గీతాంజలి'లో అంజలి తరువాత ప్రాధాన్యత కలిగిన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి కనిపించాడు. కానీ సీక్వెల్ దగ్గరికి వచ్చేసరికి ఆయన పాత్రకి అసలు ప్రాధాన్యతనే లేకుండా పోయింది. కథలో బలం లేదు .. కథనంలో పట్టులేదు. పాత్రలను .. సన్నివేశాలను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయలేదు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం ఫరవాలేదు. సుజాత సిద్ధార్థ కెమెరా పనితనం ఓ మాదిరిగా అనిపిస్తుంది. దెయ్యాల క్లోజప్ షాట్స్ ఇబ్బంది పెడతాయి. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఓకే. ఎంటర్టైన్ మెంట్ విషయంలో 'గీతాంజలి'కి చాలా దూరంలోనే ఈ సీక్వెల్ ఉండిపోయిందని చెప్పచ్చు.   

Movie Name: Geethanjali Malli Vachindi

Release Date: 2024-04-11
Cast: Anjali, Srinivasa Reddy, Rahul Madhav, Ali, Sunil, Sathyam Rajesh, Shakalaka Shankar, Sathya, Ravishankar
Director:Shiva Thurlapati
Producer: MVV Sathyanarayana
Music: Praveen Lakkaraju
Banner: MVV Cinema - KFC

Rating: 2.25 out of 5

Trailer

More Reviews