'ప్రేమలు' (ఆహా) మూవీ రివ్యూ!

Premalu

Premalu Review

  • మలయాళంలో హిట్ కొట్టిన మూవీ
  • నాలుగు ప్రధాన పాత్రలచుట్టూ నడిచే కథ  
  • తెలుగులోనూ లాభాలను రాబట్టిన కంటెంట్ 
  • యూత్ పల్స్ పట్టేసిన డైరెక్టర్
  • ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్  

మలయాళంలో రూపొందిన 'ప్రేమలు' సినిమా, ఫిబ్రవరి 9వ తేదీన అక్కడ విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. నస్లెన్ - మమిత బైజు జంటగా నటించిన ఈ సినిమాకి, గిరీశ్ దర్శకత్వం వహించాడు. మార్చి 8వ తేదీన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక్కడ కూడా మంచి లాభాలను రాబట్టిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథలో ప్రేక్షకులకు ఏం నచ్చిందనేది ఇప్పుడు చూద్దాం. 

సచిన్ (నస్లెన్) తమిళనాడులో కాలేజ్ చదువు పూర్తిచేస్తాడు. పై చదువులకు యూకే వెళ్లాలనుకుంటాడు .. కానీ అందుకోసం చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. అంతేకాదు తాను మనసుపడిన అమ్మాయి 'నో' చెప్పడం అతనికి జీవితంపై నిరాశను కలిగిస్తుంది. దానికి తోడు ఎప్పుడు చూసినా పేరెంట్స్ మధ్య గొడవలు. అందువలన ఇంట్లో నుంచి బయటపడటం కోసం 'గేట్' కోచింగ్ పేరు చెప్పి అతను హైదరాబాద్ వెళతాడు. అక్కడ ఫ్రెండ్ రూమ్ లో దిగుతాడు. 

అదే సమయంలో ఆంధ్ర నుంచి రేణు (మమిత బైజు) సాఫ్ట్ వేర్ జాబ్ నిమిత్తం హైదరాబాద్ చేరుకుంటుంది. తన స్నేహితురాలు .. కొలీక్ అయిన కార్తీక రూమ్ లో దిగుతుంది. సాఫ్ట్ వేర్ జాబ్ .. అక్కడి వాతావరణం రేణుకి కొత్తగా అనిపిస్తుంది. టీమ్ లీడర్ గా ఉన్న ఆది (శ్యామ్ మోహన్) మొదటిసారిగా రేణును చూడగానే, మనసు పారేసుకుంటాడు. రెండు మూడు సందర్భాల్లో రేణు ప్రవర్తన కారణంగా, ఆమె కూడా తనని ఇష్టపడుతోందని భావిస్తాడు. 

 తమ ఆఫీసులో పనిచేసే శ్రావణి వివాహం కావడంతో, ఆది తన టీమ్ సభ్యులతో కలిసి ఆంధ్ర వెళతాడు. ఆ అమ్మాయికి కాబోయే భర్తతో సచిన్ అతని ఫ్రెండ్ అమల్ కి పరిచయం ఉంటుంది. అందువలన వాళ్లిద్దరూ కూడా తెలిసినవాళ్ల కారు తీసుకుని బయల్దేరతారు. తీరా పెళ్లి ఇంటి ప్రాంగణంలోకి ఎంటర్ కాగానే, సచిన్ నడుపుతున్న కారు కంట్రోల్ తప్పుతుంది. ఆ సంఘటన వలన ఆది గాయపడబోయి తప్పించుకుంటాడు. అతను సచిన్ - అమల్ కు క్లాస్ పీకుతూ ఉండగా రేణు వస్తుంది. ఆదికి నచ్చజెప్పి అక్కడి నుంచి తీసుకుని వెళుతుంది. 

రేణును చూసిన దగ్గర నుంచి సచిన్ మనసు అదుపు తప్పుడుతుంది. ఆ క్షణం నుంచే ఆమెను ఆరాధించడం మొదలుపెడతాడు. తిరుగు ప్రయాణంలో ఆది రాకపోవడంతో సచిన్ తోనే కలిసి రేణు ప్రయాణిస్తుంది. ఆ సమయంలో వారి మధ్య మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. కలిసి పార్టీలు చేసుకోవడం .. పబ్ లకు వెళ్లడం చేస్తుంటారు. సచిన్ కి రేణు దగ్గరవుతుందనే ఉద్దేశంతో ఆది అసహనానికి లోనవుతూ ఉంటాడు. ఇక ఆమె ఆదితో చనువుగా ఉంటుందనే అభిప్రాయంతో సచిన్ అసంతృప్తి చెందుతూ ఉంటాడు. 

చివరికి ఒక రోజున రేణుకు తన మనసులోని మాట చెప్పాలని సచిన్ నిర్ణయించుకుంటాడు. రేణు తనకంటే తెలివైనవాడిని .. లైఫ్ లో సెటిల్ అయినవాడిని .. సాఫ్ట్ వేర్ సైడ్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉందనీ, ఆమెకి ప్రపోజ్ చేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని సచిన్ తో రేణు ఫ్రెండ్ కార్తీక చెబుతుంది. ఆమె ఆదితో సహజీవనం చేసే అవకాశాలు ఉన్నాయని అంటుంది. అప్పుడు సచిన్ ఎలా స్పందిస్తాడు? ఆ తరువాత ఏం చేస్తాడు? పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేది మిగతా కథ.

 కిరణ్ జోసేతో కలిసి దర్శకుడు గిరీశ్ ఈ కథను రెడీ చేసుకున్నాడు. ఈ కథ కొన్ని పాత్రలను కలుపుకుంటూ వెళుతుంది. అయితే ప్రధానమైన పాత్రలు మాత్రం నాలుగే. హీరో .. హీరోయిన్ .. హీరో ప్రేమకు సపోర్టు చేసే ఫ్రెండ్ .. హీరోయిన్ ను లవ్ చేసే కొలీక్. ఫ్రెండ్లీగా ఉండటం హీరోయిన్ కి అలవాటు. ఆమె అలా ఉండటం వల్లనే ఒక వైపు నుంచి కొలీక్ .. మరో వైపు నుంచి హీరో ఆమెకి చేరువవుతారు. ఆ తరువాత ఆమె కోసం ఆ ఇద్దరి మధ్య పోటీ మొదలవుతుంది. ఈ ఇద్దరిలో ఆమె ఎవరికి దక్కుతుంది? అనేదే ప్రధానమైన కథాంశం.

ఏ ప్రేమకథలోనైనా అలకలు .. బుజ్జగింపులు సహజమే. కానీ ఈ సినిమాలోని పాత్రలను డిజైన్ చేసిన తీరు విభిన్నంగా అనిపిస్తుంది. హీరోయిన్ తన కెరియర్ గురించి .. ఆర్ధిక పరమైన భద్రత గురించి ఆలోచిస్తుంది. హీరోయిన్ ఆశిస్తున్నవి అందించడం కోసం హీరో సిద్ధపడటం ఈ కథలో కనిపిస్తుంది. లెక్కలు వేసుకుని ప్రేమించడం సాధ్యం కాదు .. నిజమైన ప్రేమ దొరికాక లెక్కలన్నీ తప్పిపోతాయి. ప్రేమించిన అమ్మాయి గురించి ఏదో ఊహించుకుని సైడైపోవడం కాదు, తన ప్రేమలోని నిజాయితీని ధైర్యంగా చెప్పగలిగినవాడే నిజమైన ప్రేమికుడు అనే సందేశాన్ని ఇచ్చే కథ ఇది. 

ఇక కథ .. కథనం .. సంగతి అలా ఉంచితే, ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించడానికి మరో కారణం ఉంది .. అదే ట్రెండ్. ప్రస్తుతం యూత్ ఆలోచనా విధానం ఎలా ఉంది? వాళ్ల మధ్య ప్రేమలు .. అందుకు సంబంధించిన అభిప్రాయాలు .. అభిరుచులు ఎలా ఉన్నాయనే పల్స్ పట్టుకుని అల్లుకున్న కథ ఇది. అందుకు దగ్గరగా పాత్రలను మలిచిన విధానమే ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించిందని చెప్పాలి. 

ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా తమ పాత్రలను సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్లారు. ఏ పాత్రలోను ఆర్టిస్టులు కనపడరు. అజ్మల్ సాంబు ఫొటోగ్రఫీ .. విష్ణు విజయ్ సంగీతం ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి. ఆకాశ్ జోసెఫ్ ఎడిటింగ్ చాలా నీట్ గా అనిపిస్తుంది. కేవలం 3 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 136 కోట్లను రాబట్టడానికి కారణం, కంటెంట్ పెర్ఫెక్ట్ గా ఉండటమే. యూత్ ఆశించే అంశాలన్నీ ఈ కథలో అందంగా ఒదిగిపోవడమే.

Movie Name: Premalu

Release Date: 2024-04-12
Cast: Naslen K Gafoor, Mamitha Baiju, Sangeeth Prathap, Shyam Mohan, Akhila Bhargavan, Mathew Thomas
Director:Girish A D
Producer: Fahadh Faasil - Dileesh Pothan
Music: Vishnu Vijay
Banner: Bhavana Studios

Rating: 3.50 out of 5

Trailer

More Reviews