వెబ్ సిరీస్ లకు అంతకంతకూ ఆదరణ పెరిగిపోతూ ఉండటంతో, అవి మరింత భారీతనాన్ని సంతరించుకుంటున్నాయి. అందుకు ఉదాహరణగా 'హీరామండి: ది డైమండ్ బజార్' అనే వెబ్ సిరీస్ ను చెప్పుకోవచ్చు. 200 కోట్ల రూపాయలతో నిర్మితమైన సిరీస్ ఇది. సంజయ్ లీలా బన్సాలి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సిరీస్, నిన్నటి నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ అవుతోంది. భారీతారాగణంతో .. 8 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ 1920 ప్రాంతంలో ఇప్పటి పాకిస్థాన్ లోని 'లాహోర్'లో మొదలవుతుంది. 'హీరామండి' అనేది వేశ్యలు నివసించే ప్రాంతం. అక్కడి 'షాహి మహల్' అందమైన వేశ్యలకు పెట్టింది పేరు. ఆ మహల్ నిర్వహణ మొత్తం మల్లికా జాన్ (మనీషా కోయిరాలా) చేతుల మీదుగా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతంలోని నవాబులంతా ఆమె కనుసన్నలలో మసలుతూ ఉంటారు. తన మాటకి తిరుగులేదు అనే స్థాయిలో మల్లికా జాన్ రాజ్యమేలుతూ ఉంటుంది. వేశ్యలు ప్రేమలో పడితే ప్రమాదంలో పడినట్టే అనే మాటను ఆమె అందరితో చెబుతూ ఉంటుంది.
మల్లిక దత్తత చేసుకున్న లజ్జో (రిచా చద్దా) మల్లిక సోదరి వహిదా (సంజీదా షేక్) మల్లిక పెద్ద కూతురు బిబో జాన్ (అదితి రావు) ముగ్గురూ వేశ్యలుగా తమ వృత్తిని కొనసాగిస్తూ ఉంటారు. మల్లిక మాట వినిపించుకోకుండా 'జొరావర్' అనే వ్యక్తితో లజ్జో, ఫిరోజ్ అనే వ్యక్తితో వహీదా, వలీ ఖాన్ అనే వ్యక్తితో బిబో ప్రేమలో పడతారు. వీరి ప్రేమాయణం అలా కొనసాగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మల్లికా తన చిన్న కూతురు ఆలమ్ (షర్మిన్ సెగల్)కి కన్నెరికం చేయాలనుకుంటుంది.
ఆలమ్ కి కవితలు రాయడం అలవాటు .. కవయిత్రి కావాలనేది ఆమె కోరిక. కన్నెరికం చేయించుకోవడానికి ఆమె అయిష్టతను వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే నవాబ్ అష్పాక్ తనయుడైన తాజ్ దార్ (తహ్ షహ్) ఆమెకు పరిచయమవుతాడు. ఆ నవాబు ఆంగ్లేయులకు బానిసగా ఉండగా, వారి నుంచి విముక్తి కోసం తాజ్ దార్ పోరాడుతూ ఉంటాడు. ఆలమ్ ను పెళ్లి చేసుకోవాలనే తాజ్ దార్ నిర్ణయాన్ని అతని తండ్రి వ్యతిరేకిస్తాడు. వేశ్య తమ ఇంటికి కోడలిగా రాలేదని తేల్చి చెబుతాడు.
ఇక ఆంగ్లేయుల ఆగడాలను దుయ్యబడుతూ .. వాళ్ల కబంధ హస్తాల నుంచి దేశానికి విముక్తిని ప్రసాదించాలనే ఉద్దేశంతో అమీర్ నాయకత్వంలో రహస్య సమాలోచనలు జరుగుతూ ఉంటాయి. ఒక వైపు నుంచి బిబో .. మరో వైపు నుంచి తాజ్ దార్ అతనికి తమవంతు సహకారాన్ని అందిస్తూ ఉంటారు. ఈ తిరుగుబాటు దారులను కట్టడి చేయడానికి ఆంగ్లేయ పోలీస్ అధికారిగా కార్ట్ రైట్ రంగంలోకి దిగుతాడు.
ఆంగ్లేయ పోలీస్ అధికారి అయిన కార్ట్ రైట్ (జాసన్ షా) మల్లికా జాన్ అహంభావాన్ని అణచాలనే ఉద్దేశంతో ఉంటాడు. అందుకు తగిన సమయం కోసం అతను ఎదురుచూస్తుంటాడు. ఇక మొదటి నుంచి తనకి ఆస్తిని .. స్వేచ్ఛను ఇవ్వకుండా ఉన్న మల్లికపై, ఆమె చెల్లెలు వహిదా (సంజీదా షేక్) గుర్రుగా ఉంటుంది. అదను చూసి మల్లికను దెబ్బకొట్టి తాను అనుకున్నది సాధించాలనే ఉద్దేశంతో ఉంటుంది. ఇక వీరిద్దరూ చాలరన్నట్టుగా, మల్లికపై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఫరీదా (సోనాక్షి సిన్హా) ఆ ఊరికి చేరుకుంటుంది.
ఫరీదా ఎవరు? మల్లికా జాన్ పై ఆమెకి ఎందుకు అంతటి పగ? ప్రేమలో పడిన లజ్జో .. వహిదా .. బిబోలకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? తాజ్ దార్ తో ఆలమ్ ప్రేమ వ్యవహారం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? మల్లికా జాన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఫరీదా ఏం చేస్తుంది? ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయా? అనేది మిగతా కథ.
మొయిన్ బేగ్ తయారు చేసిన కథ ఇది. వేశ్య కుటుంబానికి చెందిన ఆరుగురు స్త్రీల కథ ఇది. ప్రధానమైన ఈ ఆరు పాత్రల చుట్టూనే ఈ కథ అంతా తిరుగుతూ ఉంటుంది. ప్రతి పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రతి పాత్రను రిజిస్టర్ చేసిన తీరు .. ప్రతి పాత్రకు ఒక ప్రయోజనాన్ని కల్పించిన తీరు మెప్పిస్తుంది. అన్ని పాత్రలను .. వాటికి సంబంధించిన సన్నివేశాలను అన్ని వైపుల నుంచి ఆసక్తికరంగా నడిపిస్తూ వెళ్లిన స్క్రీన్ ప్లే ఈ సిరీస్ కి హైలైట్ అనే చెప్పాలి.
వేశ్యలు .. నవాబులు .. ఆంగ్లేయ పోలీస్ అధికారులు .. తిరుగుబాటుదారులు అనే ఈ నాలుగు వైపుల నుంచి కథ పరచుకుంటూ వెళుతుంది. ఈ నాలుగు అంశాలలో ప్రేమ .. ద్వేషం .. స్వార్థం .. దేశభక్తి అనేవి అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ కాలంనాటి డిజైన్లను దృష్టిలో పెట్టుకుని అందంగా తీర్చిదిద్దిన భారీ సెట్లు .. అద్భుతమైన లైటింగ్ .. ఫొటోగ్రఫీ .. బాణీలు .. నేపథ్య సంగీతం .. కాస్ట్యూమ్స్ ఈ సిరీస్ కి ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పచ్చు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ మరిన్ని మార్కులు కొట్టేస్తుంది.
ఒకప్పటి లాహోర్ ప్రాంతంలోని వేశ్యల విలాసవంతమైన జీవితం. అందంగా .. ఆనందంగా కనిపించేవారి జీవితంలోని విషాదం. తమ జీవితాలు కర్పూరం మాదిరిగా ఆవిరైపోతున్నా, త్యాగం చేయడానికి వెనుకాడని స్వభావం. దేశం కోసం ఆంగ్లేయులపై జరిపిన పోరాటంలో వారి పాత్ర. ఇలా అనేక అంశాలను వారు ఎలా ప్రభావితం చేశారనే విషయాన్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇది వేశ్యల జీవితాల చుట్టూ తిరిగే కథనే అయినప్పటికీ, ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు. కుటుంబ సభ్యులతో కలిసి చూడొచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ వెబ్ సిరీస్ లలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు.
'హీరామండి .. ది డైమండ్ బజార్' (నెట్ ఫ్లిక్స్) వెబ్ సిరీస్ రివ్యూ!
Heeramandi Review
- వేశ్యల జీవితాల చుట్టూ తిరిగే కథగా 'హీరామండి'
- దేశభక్తిని టచ్ చేస్తూ సాగిన కథనం
- అందమైన సెట్లు .. ఆకర్షణీయమైన కాస్ట్యూమ్స్
- ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. బాణీలు హైలైట్
- భారీ వెబ్ సిరీస్ ల జాబితాలో ప్రత్యేకమైన స్థానం
Movie Name: Heeramandi
Release Date: 2024-05-01
Cast: Manisha Koirala, Sonakshi Sinha, Aditi Rao Hydari ,Sanjeeda Sheikh, Sharmin Segal, Richa Chadha
Director:Sanjay Leela Bhansali
Producer: Sanjay Leela Bhansali
Music: Benedict Taylor - Naren Chandavarkar
Banner: Bhansali Productions
Review By: Peddinti
Rating: 3.00 out of 5
Trailer