'కాల్వన్ ' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!

Kalvan

Kalvan Review

  • జీవి ప్రకాశ్ కుమార్ హీరోగా రూపొందిన 'కాల్వన్'
  • ఆయన సరసన అలరించిన ఇవాన
  • సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • లవ్ .. రొమాన్స్ .. కామెడీలను పట్టించుకోని డైరెక్టర్ 
  • ఎమోషన్స్ తోనే సరిపెట్టిన వైనం

జీవీప్రకాశ్ కుమార్ - ఇవాన జంటగా నటించిన 'కాల్వన్' సినిమా, తమిళంలో ఏప్రిల్ 4వ తేదీన విడుదలైంది. సినిమాటోగ్రఫర్ గా మంచి పేరున్న పీవీ శంకర్, ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ రోజు నుంచే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

అది సత్యమంగళం ఫారెస్టును ఆనుకుని ఉన్న ఒక గ్రామం. ఆ అడవి ప్రాంతంలో ఏనుగుల సంఖ్య ఎక్కువ. ఏనుగుల గుంపులు గ్రామాలపై దాడిచేస్తూ ఉంటాయి. అలాగే అడవిలో ఒంటరిగా వెళ్లేవారు సైతం వాటి బారినపడి ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉంటారు. ఆ గ్రామంలోనే కెంపరాజ్ ( జీవీ ప్రకాశ్ కుమార్) అతని స్నేహితుడు సూరి (దీనా) ఉంటారు. ఆ ఊరికి చెందిన బాలమణి (ఇవాన) నర్సింగ్ చదువుతూ ఉంటుంది. 

కెంపరాజ్ - సూరి ఇద్దరూ కూడా అనాథలు. ఆ ఊళ్లో దొంగతనాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తమ ఊళ్లో ఏ దొంగతనం జరిగినా అది కెంపరాజ్ - సూరి పనే అయ్యుంటుందని అందరికీ తెలుసు. ఊళ్లోవారు ఫిర్యాదులు చేయడం .. వాళ్లిద్దరూ పెద్దమనుషుల పంచాయితీలో దోషుల్లా నిలబడటం తరచూ జరుగుతూనే ఉంటుంది. ఓ రోజున బాలామణి ఇంటికి దొంగతనానికి కెంపరాజ్ - సూరి వెళతారు. అప్పటి నుంచి కెంపరాజ్ ఆమె ప్రేమలో పడతాడు. 

బాలామణిని చూడకుండా కెంపరాజ్ ఉండలేకపోతూ ఉంటాడు. ఓ రోజున ఆమె వేరే ఊరిలో వృద్ధుల శరణాలయంలో ఏర్పాటు చేసిన క్యాంప్ కి వెళ్లిందని తెలుకుని అక్కడికి వెళతాడు. అక్కడ వారికి ఓ పెద్దాయన (భారతీరాజా) తారసపడతాడు. ఆయనకి వెనకా ముందూ ఎవరూ లేరని తెలుకుని జాలిపడతారు. కెంపరాజ్ ఆయనను తాతయ్యగా దత్తత చేసుకుని, తన ఇంటికి తీసుకుని వెళతాడు. అతని పూరి గుడిసెలో ఉండటానికి ఇబ్బంది అయినా ఆ తాత సర్దుకుంటాడు. 

కెంపరాజ్ ఒక వృద్ధుడిని దత్తత చేసుకున్నాడని తెలియగానే, ఒక దొంగగా అతని పట్ల బాలామణికి ఉన్న అభిప్రాయం మారిపోతుంది. అతని పట్ల ఆరాధనా భావం పెరుగుతూ ఉంటుంది. కెంపరాజ్ ఇంటికి బాలామణి వచ్చి వెళుతూ ఉంటుంది. ఆమె కెంపరాజ్ ను ప్రేమిస్తుందనే విషయం ఆ తాతకి అర్థమవుతుంది. తాతకి సేవలు చేయడానికి సూరి చిరాకుపడుతూ ఉంటాడు. అతనికి కెంపరాజ్ నచ్చజెబుతూ ఉంటాడు. 

ఏనుగు దాడిలో మరణించిన వారికి ప్రభుత్వం 4 లక్షల సాయాన్ని ప్రకటిస్తుంది. ఆ తాతను చంపేసి .. అతను ఏనుగు దాడిలో చనిపోయినట్టుగా చిత్రీకరించి ఆ డబ్బును పొందాలనే ప్లాన్ లో కెంపరాజ్ ఉంటాడు. అతనికి సహకరించడానికి సూరి ఒప్పుకుంటాడు. ఇదేమీ తెలియని ఆ తాత, కెంపరాజ్ కి ఫారెస్టు గార్డు ఉద్యోగాన్ని ఇప్పించడానికీ, బాలామణితో అతని వివాహం జరిపించడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

అడవిలో ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రదేశానికి తాతను తీసుకుని వెళితే, అక్కడ అతను చనిపోవడం ఖాయమని కెంపరాజ్ - సూరి భావిస్తారు. అక్కడ తమ కులదైవం ఉందనీ .. నమస్కరించుకుని రావాలని చెప్పి తాతను వెంటబెట్టుకుని వెళతారు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? మనవడి విషయంలో తాత ప్రయత్నాలు ఫలిస్తాయా? తాత విషయంలో మనవడి పథకం పారుతుందా? అనేది మిగతా కథనం.  
  
పీవీ శంకర్ తయారు చేసుకున్న కథ ఇది. ఓ అనాథ యువకుడు డబ్బు కోసం ఓ వృద్దుడిని చేరదీస్తాడు. తన మరణం కూడా మరోకరికి ఉపయోగపడితే చాలనుకుని ఆ వృద్ధుడు అతనిని అనుసరిస్తాడు. ఇష్టపడిన వ్యక్తిని ప్రేమించడానికి అతనికి ఉండవలసిన అర్హత మానవత్వానికి మించి మరేమీ లేదని భావించే ఒక యువతి. ఈ ముగ్గురు చుట్టూనే ఈ కథంతా తిరుగుతూ ఉంటుంది.

దర్శకుడు ఎంచుకున్న కథ బాగుంది. ఆ కథను చెప్పడానికి ఎంచుకున్న లొకేషన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ కథలో మంచి లవ్ స్టోరీని నడిపించవచ్చు .. రొమాంటింక్ సీన్స్ ను పండించవచ్చు .. కామెడీని పరిగెత్తించవచ్చు. అలాగే ఎమోషన్స్ ను కనెక్ట్ చేయవచ్చు. కానీ దర్శకుడు ఒక్క ఎమోషన్స్ పైనే దృష్టిపెట్టాడు. ఆ ఎమోషన్స్ కూడా ఆశించిన స్థాయిలో ఆవిష్కరించలేకపోయాడు. జీవీ ప్రకాశ్ కుమార్ - ఇవాన మధ్య ఒక్క రొమాంటిక్ సీన్ కూడా లేకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. 

ప్రధానమైన పాత్రధారులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. రేవా నేపథ్య సంగీతం ఫరవాలేదు. పీవీ శంకర్ కెమెరా పనితనం బాగుంది. ఫారెస్టు నేపథ్యంలో సన్నివేశాలను చిత్రీకరించిన తీరు బాగుంది. లోకేశ్ ఎడిటింగ్ ఓకే. ఈ సర్వైవల్ థ్రిల్లర్ కి, లవ్ .. రొమాన్స్ .. కామెడీలను యాడ్ చేసి ఉంటే, ఈ కంటెంట్ నెక్స్ట లెవెల్ కి వెళ్లి ఉండేదేమో. 


Movie Name: Kalvan

Release Date: 2024-05-14
Cast: G V Prakash Kumar, Bharathiraja, Ivana, Dheena, Gnanasambandam
Director:P V Shankar
Producer: P V Shankar
Music: Revaa
Banner: Axess Film Factory

Rating: 2.50 out of 5

Trailer

More Reviews