'షరతులు వర్తిస్తాయి' (ఆహా) మూవీ రివ్యూ!

Sharathulu Varthisthayi

Sharathulu Varthisthayi Review

  • చైతన్యరావు హీరోగా వచ్చిన సినిమా 
  • ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో సాగే కథ 
  • ఆకట్టుకోని సన్నివేశాలు 
  • వినోదపరమైన అంశాలకు దూరంగా వెళ్లిన కంటెంట్

 ఒకప్పటి హీరో ప్రదీప్ ను గుర్తుచేస్తూ, ఫ్యామిలీ ఆడియన్స్ దిశగా చైతన్యరావు వెళుతున్నాడు. జనంలో నుంచి వచ్చే కథలను ఎక్కువగా ఎంచుకుంటూ, తెరపై సహజత్వానికి దగ్గరగా అనిపించే పాత్రలను చేస్తున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'షరతులు వర్తిస్తాయి'. మార్చి 15వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఇక రీసెంటుగా 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

ఈ కథ కరీంనగర్ లో జరుగుతుంది. చిరంజీవి (చైతన్యరావు) ఓ మధ్యతరగతి యువకుడు. తల్లి .. చెల్లి .. తమ్ముడు .. ఇది అతను కుటుంబం. ఒక చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, ఇంటి అవసరాలు తీరుస్తూ ఉంటాడు. డబ్బు విలువ తెలిసినవాడు కావడం వలన, దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాడు. ప్రతి విషయంలోను చాలా పొదుపుగా వ్యవహరిస్తూ ఉంటాడు. కొంతకాలంగా అతను విజయశాంతి ( భూమి శెట్టి)తో ప్రేమలో ఉంటాడు. 

విజయశాంతి అదే ఊరుకు చెందిన అమ్మాయి. ఆమెది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. తండ్రి తాగుబోతు .. బాధ్యత లేని మనిషి. దాంతో తల్లి .. తమ్ముడికి కావలసిన అవసరాలు తీరుస్తూ ఆమె ఓ చిన్నపాటి జాబ్ చేస్తూ ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా చిరంజీవిని పెళ్లి చేసుకుని, ఆ ఇంట్లో నుంచి బయటపడాలని విజయశాంతి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే తనకి ప్రమోషన్ వచ్చి .. జీతం పెరిగిన తరువాతనే పెళ్లి చేసుకుంటానని చిరంజీవి వాయిదా వేస్తూ ఉంటాడు. 

ఇక ఆ ఊళ్లో శంకరన్న అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. కార్పోరేటర్ సీట్ కోసం అతను ఎదురుచూస్తూ ఉంటాడు. అందుకు అవసరమైన డబ్బుకోసం అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే చైన్ బిజినెస్ చేసే ఒక సంస్థవారు ఆ ఊరుకి వస్తారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే పదింతలు ఇస్తామని చెప్పి ఆశపెడతారు. ప్రతి ఒక్కరూ ఆ సంస్థలో ఓ నలుగురిని చేర్పించాలనే షరతు పెడతారు. దాంతో ఊళ్లో సగం మంది జనం అదే పనిలో ఉంటారు. 

ఆ సంస్థలో చేరమని చిరంజీవిని స్నేహితులు చాలా ఒత్తిడి చేస్తారు. కష్టపడి సంపాదించుకోవాలే తప్ప, ఈజీ మని గురించిన ఆలోచన చేయవద్దని అతను వాళ్లకి చెబుతాడు. ఆ తరువాత ఒక అవసరం నిమిత్తం అతను పెద్ద ఎమౌంట్ తెచ్చి ఇంట్లో పెడతాడు. ఆ తరువాత హఠాత్తుగా అతను కొన్ని రోజుల పాటు ఫీల్డ్ వర్క్ పై వెళతాడు. ఒక రోజున తల్లికి సీరియస్ గా ఉందని కాల్ రావడంతో వెంటనే అతను తిరిగొస్తాడు.

అతని తల్లికి వెంటనే సర్జరీ చేయాలనీ, రెండు లక్షలు కౌంటర్లో కట్టాలని డాక్టర్ చెబుతాడు. దాంతో తాను ఇచ్చిన డబ్బు తెచ్చి కౌంటర్లో కట్టేయమని చిరంజీవి తన భార్యతో చెబుతాడు. భర్తకి తెలియకుండా చైన్ బిజినెస్ లో పెట్టుబడి పెట్టిన విజయశాంతి, వాళ్లను అడిగి ఆ డబ్బు తీసుకుని రావడానికి వెళుతుంది. అయితే ఆ బిజినెస్ చేసే టీమ్ అప్పటికే ఆ ఊరు నుంచి ఉడాయిస్తుంది. అప్పుడు విజయశాంతి ఏం చేస్తుంది? చిరంజీవి పరిస్థితి ఏమిటి? అనేది మిగతా కథ. 

మధ్యతరగతి వారిలో 80 శాతం మంది ఫేస్ చేసే సమస్యను చెబుతున్నట్టుగా దర్శకుడు ముందుగానే ఓ మాట ఇచ్చేశాడు. మధ్యతరగతి జీవితాలు .. చాలీచాలని జీతాలు .. ఆశలు .. ఊహలు .. పరువు ప్రతిష్ఠలు .. వీటినన్నిటిని టచ్ చేస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది. మరింత మంచిగా బ్రతకాలనే ఒక ఆశ .. ఆరాటంగా మారితే, ఆ బలహీనతను క్యాష్ చేసుకోవడానికి మరికొందరు సిద్ధంగా ఉంటారని చెప్పే కథ ఇది. 

చైతన్యరావు కథానాయకుడు కావడం వలన, ఈ కథ ఆసక్తికరంగా ఉంటుందని అంతా అనుకుంటారు. ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు నుంచి నడిచే కథ కావడం వలన, సహజత్వానికి దగ్గరగా వెళుతుందని భావిస్తారు. ఇక పల్లెటూరి ప్రేమకథలో స్వచ్ఛత ఉంటుంది గనుక, హృదయానికి హత్తుకునేలా తీసిఉంటారని అనుకుంటారు. కానీ అలాంటివాటికి దూరంగా ఈ కథ నడుస్తుంది. 

గ్రామీణ వాతావరణంలోని కథ .. స్నేహం .. ప్రేమలు .. అనుబంధాలు .. కుటుంబ సంబంధాలు .. వంటి వాటిని చక్కగా ఆవిష్కరించడానికి అవకాశం ఉన్న కంటెంట్ ఇది. ఎమోషన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కి కావలసినంత చోటు ఇవ్వగలిగిన కథ ఇది. కానీ దర్శకుడు ఇవేమీ పట్టించుకోలేదు. కేవలం ఎమోషన్స్ పైనే పూర్తి దృష్టిపెట్టాడు. మధ్యతరగతి వాళ్ల జీవితాల్లో కష్టాలు ఉన్నప్పటికీ, ఆ కథను చూసే ప్రేక్షకుడికి వినోదం కావలనే విషయాన్ని వదిలేశారు. 

ఇక చైన్ బిజినెస్ లు .. వాటి తాలూకు మోసాలు ఒకప్పుడు జోరుగా జరిగాయి. చాలాకాలం క్రితంనాటి సమస్యను తిరిగి తెరపైకి తీసుకుని రావడం .. దానిపైనే ఫోకస్ చేయడం ఆడియన్స్ ను ఇబ్బంది పెడుతుంది. ఇక కొంతమంది ఆర్టిస్టుల నుంచి సరైన రియాక్షన్ ను తీసుకోకపోవడం సహజత్వాన్ని దెబ్బ తీస్తుంది. మాటలు .. పాటలు కూడా అంతంత మాత్రంగానే అనిపిస్తాయి. సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ కూడా ఓ మాదిరి మార్కులనే తెచ్చుకుంటాయి. సందేశం ఇవ్వాలనే ఉద్దేశం మంచిదే అయినా, దాని చుట్టూ వినోదాన్ని అల్లుకోవడంలోనే ఈ కంటెంట్ విఫలమైందని చెప్పొచ్చు. 

Movie Name: Sharathulu Varthisthayi

Release Date: 2024-05-18
Cast: Chaitanya Rao Madadi, Bhoomi Shetty, Nanda Kishore, Santosh Yadav
Director:Kumaraswami
Producer: Srilatha - Nagarjuna Samala
Music: Arun Chiluveru
Banner: Starlight Studios Pvt Ltd

Rating: 2.00 out of 5

Trailer

More Reviews