మొదటి నుంచి కూడా సుహాస్ తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన మరో వైవిధ్యభరితమైన సినిమానే 'ప్రసన్నవదనం'. మణికంఠ - ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, అర్జున్ వై.కె. దర్శకత్వం వహించాడు. ఈ నెల 3వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, నెల తిరక్కుండానే 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. ఈ రోజు నుంచే 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
సూర్య (సుహాస్) రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటాడు. ఒకసారి అతను తన తల్లిదండ్రులతో కలిసి కారులో వెళుతుండగా ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో అతని తల్లిదండ్రులు చనిపోతారు. తీవ్రమైన గాయాలైన సూర్య, కొన్ని రోజుల తరువాత కోలుకుంటాడు. అతను తన స్నేహితుడినిగానీ .. తల్లిదండ్రుల ఫొటోలను గని గుర్తుపట్టలేకపోతాడు. ప్రమాదం కారణంగా అతనికి 'ఫేస్ బ్లైండ్ నెస్' వచ్చిందని డాక్టర్ చెబుతాడు.
ఒకసారి చూసిన వ్యక్తి మరోసారి ఎదురుపడినా తాను గుర్తుపట్టలేననే విషయం సూర్యకి అర్థమవుతుంది. అవతల వ్యక్తికి సంబంధించిన ప్రత్యేకమైన గుర్తులు .. అలంకారాలు మాత్రమే అతనికి గుర్తుంటాయి. అతని సమస్య అర్థం కావడంతో స్నేహితుడు దగ్గరే ఉంటూ అన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఈ విషయం బయటికి తెలియకుండా సూర్య మేనేజ్ చేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే అతనికి ఆద్య (పాయల్ రాధాకృష్ణన్) తారసపడుతుంది.
ఒకటి రెండు సార్లు కలిసిన తరువాత సూర్యపై ఆమెకి ఒక రకమైన అభిమానం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారడానికి ఎక్కువ రోజులు పట్టదు. అతనితో తన జీవితాన్ని పంచుకోవాలనే ఆలోచనలో ఆమె ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే. ఒకరోజు రాత్రి ఒక యువతిని ఒక వ్యక్తి లారీ క్రిందికి తోసేయడం సూర్య చూస్తాడు. ఆ యువతిని లారీ క్రిందికి తోసేసింది పోలీస్ ఆఫీసర్ రామచంద్ర. తన సమస్య కారణంగా అతణ్ణి గుర్తించలేని సూర్య, అదే పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి, 'జరిగింది ప్రమాదం కాదు .. హత్య' అని కానిస్టేబుల్ కి చెప్పేసి ఫోన్ పెటేస్తాడు.
ఆ సమయంలో స్టేషన్ లోనే ఉన్న రామచంద్ర, సూర్యను వెతికి పట్టుకునే పనిలో పడతాడు. నేరుగా రామచంద్రను కలిసి తాను చూసినది చెప్పాలనే ఆలోచనలో సూర్య ఉంటాడు. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని సూర్యకి అతని స్నేహితుడు చెబుతూనే ఉంటాడు. సూర్య ఎక్కడ ఉంటున్నాడనేది తెలుసుకుని అతనిపై రామచంద్ర దాడిచేస్తాడు. ఆ సమయంలో అతని ఒంటిపై 'పాదం' గుర్తు ఉండటం సూర్య చూస్తాడు.
పోలీస్ స్టేషన్ కి వెళ్లిన సూర్య, ఆ సమయంలో అక్కడ కనిపించిన ఏసీపీ వైదేహి (రాశి సింగ్)కి విషయం చెబుతాడు. ఆమెతో చెప్పిన దగ్గర నుంచి సూర్యపై దాడులు పెరుగుతాయి. దాంతో సూర్య .. అతని స్నేహితుడు .. ఆద్య కలిసి ఆలోచన చేస్తారు. రామచంద్రను రహస్యంగా ఫాలో చేయాలి .. చనిపోయిన యువతి ఎవరనేది తెలుసుకోవాలి. అలా చేయడం వలన తన చుట్టూ ఏం జరుగుతుందనే విషయంలో తనకి ఒక క్లారిటీ వస్తుందని సూర్య అంటాడు.
రామచంద్ర ఆ యువతిని ఎందుకు హత్య చేస్తాడు? అతని వెనక ఉన్నది ఎవరు? చనిపోయిన యువతి ఎవరు? ఆమె కుటుంబ నేపథ్యం ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించిన సూర్యకి ఎలాంటి చేదు నిజాలు తెలుస్తాయి? అప్పుడు తనని తాను కాపాడుకోవడం కోసం అతను ఏం చేస్తాడు అనేది కథ.
దర్శకుడు అర్జున్ వై.కె.తయారు చేసుకున్న కథ ఇది. ప్రమాదవశాత్తు 'ఫేస్ బ్లైండ్ నెస్' తో ఇబ్బంది పడుతున్న హీరో, తన కళ్లముందు జరిగిన హత్యను గురించి నిజాయితీగా పోలీస్ స్టేషన్లో చెబుతాడు. ఫలితంగా అతను మూడు హత్య కేసుల్లో చిక్కుకుంటాడు. ఆ కేసుల బారి నుంచి బయటపడటానికి హీరో ఏం చేస్తాడు? ఆ ప్రయత్నాల్లో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయనేదే ఈ సినిమా.
6 పాత్రల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఒక హత్యతో మొదలయ్యే ఈ కథ అనేక మలుపులు తీసుకుంటూ ముందుకు వెళుతుంది. సాదాసీదాగా అనిపిస్తూ మొదలయ్యే ఈ కథ .. నిదానంగా చిక్కబడుతూ వెళుతుంది. అక్కడక్కడా పలకరించే ట్విస్టులు చివరివరకూ అలా కూర్చోబెట్టేస్తాయి. స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి. అరే .. ఇంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను థియేటర్ లో మిస్సయ్యామే అనే ఒక ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది.
ఇంటర్వెల్ బ్యాంగ్ .. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రధానమైన బలమని చెప్పాలి. టాయిలెట్ లో ఫైట్ సీన్ .. ఎస్సై ఇంట్లోకి హీరో రహస్యంగా ప్రవేశించే సీన్ .. గోవింద్ అనే అబద్ధపు సాక్ష్యాన్ని హీరో వెతుక్కుంటూ వెళ్లే సీన్ .. ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. ఎక్కడ అనవసరమైన సీన్ అనేది లేకుండా కంటెంట్ చాలా పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ప్రధానమైన పాత్రధారులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
చంద్రశేఖరన్ కెమెరా పనితనం బాగుంది. విజయ్ బుల్గానిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆడియన్స్ మూడ్ లో నుంచి బయటికి రాకుండా చేస్తుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. 'ప్రసన్న వదనం' అనే టైటిల్ జనాలకు అంతగా ఎక్కకపోయి ఉండొచ్చు. అందువలన థియేటర్స్ దగ్గర సందడి తగ్గి ఉండొచ్చు. అలాగే ఫేస్ బ్లైండ్ నెస్ అనే ఒక సమస్య, సాధారణమైన ప్రేక్షకులకు పూర్తిగా అర్థంకాకపోయి ఉండొచ్చు. కానీ నిజానికి ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉన్న సినిమానే. విభిన్నమైన కథ .. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే .. ఆడియన్స్ ఊహకు అందని ట్విస్టులు .. క్లైమాక్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయి. ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమానే ఇది.
'ప్రసన్నవదనం' (ఆహా) మూవీ రివ్యూ!
Prasanna Vadanam Review
- సుహాస్ హీరోగా రూపొందిన 'ప్రసన్నవదనం'
- ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉన్న కాన్సెప్ట్
- ఉత్కంఠను పెంచుతూ వెళ్లే ట్విస్టులు
- కదలకుండా కూర్చోబెట్టే స్క్రీన్ ప్లే
- ఫ్యామిలీతో చూసే కంటెంట్
Movie Name: Prasanna Vadanam
Release Date: 2024-05-24
Cast: Suhas, Payal Radhakrishna, Rashi Singh Nandu, Viva Harsha, Nitin Prasanna, Sai Swetha
Director:Arjun Y K
Producer: Manikanta - Prasad Reddy
Music: Vijay Bulganin
Banner: Little Thoughts Cinemas
Review By: Peddinti
Rating: 3.00 out of 5
Trailer