'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' - మూవీ రివ్యూ!

Gangs Of Godavari

Gangs Of Godavari Review

  • విష్వక్ హీరోగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'
  • ఆసక్తికరమైన కథాకథనాలు
  • యాక్షన్ .. ఎమోషన్ సమపాళ్లలో సాగే కంటెంట్   
  • మెప్పించే నేపథ్య సంగీతం
  • తన మార్క్ తో మెప్పించిన విష్వక్  

విష్వక్సేన్ హీరోగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా రూపొందింది. సూర్యదేవర నాగవంశీ - సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. విష్వక్ కి మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కి తగిన కథతో .. గోదావరి నేపథ్యంతో వచ్చిన సినిమానే ఇది. ఈ రోజునే విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందనేది చూద్దాం.

అది గోదావరి జిల్లాలోని 'కొవ్వూరు' అనే ఒక లంక గ్రామం. అక్కడ నానాజీ (నాజర్) దొరస్వామిరాజు (గోపరాజు రమణ) రెండు పార్టీలకు చెందిన నాయకులు. ఇద్దరూ కూడా పెత్తనం కోసం పోటీపడుతుంటారు. ఎమ్మెల్యేగా ఉన్న దొరస్వామిరాజు చక్రం తిప్పుతూ ఉంటాడు. ఆ విషయంలో అతనికి బావమరిది రాధ (ప్రవీణ్) సాయపడుతూ ఉంటాడు. ఇక నానాజీకి బుజ్జి (నేహా శెట్టి) అనే కూతురు ఉంటుంది. రత్నం (విష్వక్) కన్ను ఆ అమ్మాయి మీద పడుతుంది. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు. 

అయితే రత్నం ప్రధానమైన ఉద్దేశం ఆ అమ్మాయిని పొందడమే కాదు, అక్కడ రాజకీయ పరంగా ఎదగడం .. అందుకోసం దేనికైనా వెనుకాడకపోవడం. ఆ ఊళ్లో అతని కష్టం .. నష్టం వినే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది రత్నమాల ( అంజలి) మాత్రమే. ఆమెపై వేశ్య అనే ముద్ర ఉన్నప్పటికీ, ఆమె రత్నం మనిషిగానే చెలామణి అవుతూ ఉంటుంది. అయితే నానాజీ కూతురు దగ్గరికి వెళ్లొద్దని ఆమె రత్నాన్ని హెచ్చరిస్తుంది కూడా. 

తన గ్రామ సరిహద్దుల్లో తనకి తెలియకుండా భారిస్థాయిలో ఇసుక మాఫియా జరుగుతుందనే విషయం రత్నానికి అర్థమవుతుంది. ఆ ఇసుక మాఫియా వలన రాజకీయ నాయకులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని తెలుస్తుంది. ఇసుక మాఫియాపై పట్టు సాధించాలంటే రాజకీయనాయకుడి అవతారం ఎత్తాలనే విషయం అతనికి అర్థమైపోతుంది. దాంతో అతను ఆ క్షణం నుంచే అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలెట్టేస్తాడు.  

నానాజీకీ .. దొరసామికి పడకపోవడాన్ని రత్నం తెలివిగా తనకి అనుకూలంగా మార్చుకుంటాడు. ఆ ఇద్దరి మధ్య మరింత శత్రుత్వాన్ని సృష్టించి, ఒకరికి తెలియకుండా ఒకరికి దగ్గరవుతాడు. ముందుగా నానాజీ విశ్వాసాన్ని సంపాదించుకుని, దొరసామిని దెబ్బకొడతాడు. ఆ తరువాత ఎమ్మెల్య్యేగా బలం పుంజుకుని నానాజీకి ఎదురు తిరుగుతాడు. అదే సమయంలో బుజ్జిని తన వైపుకు తిప్పుకుని, తనతో పాటు ఇంటికి వచ్చేలా చేస్తాడు.

తనని నమ్మించి తన పదవిని లాగేసుకున్న రత్నంపై దొరసామి ఆగ్రహావేశాలతో రగిలిపోతూ ఉంటాడు. ఇక తనని నమ్మించి తన కూతురును తీసుకుని వెళ్లిపోయాడని కోపంతో నానాజీ ఉంటాడు. ఇద్దరూ కూడా ఎవరికి వారు రత్నంపై ప్రతీకారం తీర్చు కోవడానికి రంగంలోకి దిగుతారు. ఇక అప్పటివరకూ రత్నం వెంట నిలిచిన అతని అనుచరులు, అతనిపైనే కత్తిగడతారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది మిగతా కథ.        
  
ఈ సినిమాకి రచయిత .. దర్శకుడు కృష్ణచైతన్య. ముందుగా ఆయన విష్వక్ సేన్ కి ఉన్న ఇమేజ్ కి తగిన కథను .. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రను డిజైన్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఏ సినిమాలోనైనా ఇంటర్వెల్ బ్యాంగ్ .. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. ఈ సినిమాకి సంబంధించి ఈ మూడు అంశాలలో ప్రేక్షకులు అసంతృప్తి చెందరు. 

సాధారణంగా ఫ్యామిలీ అనేది లేనివాళ్లు రౌడీయిజం చెలాయించడానికి ఎంతమాత్రం వెనుకాడరు. అదే ఒక రౌడీకి ఫ్యామిలీ ఏర్పడిన తరువాత ఆ ఫ్యామిలీని డిస్టబ్ చేయడానికి ఎవరైనా ట్రై చేస్తే ఎంతలా తెగిస్తారనేదే ఈ సినిమా కథ. ఇంటర్వెల్ బాంగ్ తోనే క్లైమాక్స్ ను తలపించిన డైరెక్టర్, ఆ తరువాత కథను పట్టుగా నడిపించడంలోను మెప్పించాడు. 
 
యాక్షన్ ను .. ఎమోషన్ ను దర్శకుడు బ్యాలెన్స్ చేస్తూ వెళ్లాడు. వెంకట్ - పృథ్వీ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ లోని లారీ ఫైట్ సీన్ .. సెకండాఫ్ లో పడవపై రాజీ కోసం 'యదూ'ను కలిసే సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. రొమాన్స్ కి పెద్దగా టైమ్ ఇవ్వకుండా లైట్ గా టచ్ చేస్తూ వెళ్లారు. కామెడీ కోసం ప్రత్యేకంగా ప్రయత్నించకుండా, ఆది పంచ్ లతో సరిపెట్టారు.

విష్వక్ .. నేహా శెట్టి .. అంజలి .. నాజర్ .. గోపరాజు రమణ ఇలా ఎవరికి వారు తమ పాత్రలకి న్యాయం చేశారు. నిర్మాణ విలువల విషయానికి వస్తే, ఎక్కడా వంక బెట్టలేం. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచిందని చెప్పచ్చు.సెకండాఫ్ మొదలైన తరువాత వచ్చే ఒక సాంగ్ దగ్గర మాత్రం గ్రాఫ్ పడిపోయినట్టు అనిపిస్తుంది. అనిత్ మదాడి కెమెరా పనితనం .. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ బాగుంది.  


ప్లస్ పాయింట్స్: కథ .. కథనం .. ఫైట్స్ .. ఎమోషన్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ : రక్తపాతం 


Movie Name: Gangs Of Godavari

Release Date: 2024-05-31
Cast: Vishwak Sen, Anjali, Neha Shetty, Nassar, Sai Kumar, Goparaju Ramana
Director:Krishna Chaitanya
Producer: Nagavamsi - Sai Soujanya
Music: Yuvan Shankar Raja
Banner: Sithara Entertainments

Rating: 3.00 out of 5

Trailer

More Reviews