'మనమే' - మూవీ రివ్యూ!

Manamey

Manamey Review

  • శర్వానంద్ హీరోగా రూపొందిన 'మనమే'
  • ఆసక్తికరంగా అనిపించని కథాకథనాలు 
  • ఎమోషన్స్ పై మాత్రమే దృష్టిపెట్టిన దర్శకుడు 
  • ప్రధానమైన బలంగా నిలిచిన నేపథ్య సంగీతం
  • కొన్ని పాత్రల కోసం కుదరని ఆర్టిస్టుల ఎంపిక   
              

ఈ మధ్య శర్వానంద్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్ తరువాత ఆయన చేసిన సినిమా 'మనమే'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కృతి శెట్టి .. రాహుల్ రవీంద్రన్ .. రాహుల్ రామకృష్ణ .. ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా నడిచే ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం. 

విక్రమ్ (శర్వానంద్) శ్రీమంతుల కుటుంబానికి చెందిన హైదరాబాద్ యువకుడు. అతను లండన్ లో లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. జీవితానికి కాస్త రొమాంటిక్ టచ్ ఉండాలనేది ఆయన ఆలోచన. బరువులు .. బాధ్యతలంటే అతనికి భయం.  అతని మిత్రుడు అనురాగ్ - శాంతి యూకేలో ఉంటారు. వాళ్ల ఒక్కగానొక్క సంతానమే ఖుషీ. ఇండియా వెళ్లిన ఆ ఫ్యామిలీ ఓ ప్రమాదం బారిన పడుతుంది. అనురాగ్ దంపతులు అక్కడే చనిపోతారు. 

విషయం తెలియగానే విక్రమ్ ఇండియా వెళతాడు. అదే సమయానికి సుభద్ర (కృతి శెట్టి) కూడా అక్కడికి చేరుకుంటుంది. ఆమె శాంతి స్నేహితురాలు. అక్కడే విక్రమ్ - సుభద్ర కలుసుకుంటారు. ఖుషి పరిస్థితి ఏమిటి? అనేది అందరి ముందు పెద్ద ప్రశ్నగా మారుతుంది. అనురాగ్ - శాంతి లవ్ మ్యారేజ్ చేసుకోవడం వలన, శాంతి పేరెంట్స్ ఖుషిని గురించి పట్టించుకోరు. తనకి కార్తీక్ (శివ కందుకూరి)తో ఎంగేజ్ మెంట్ జరిగిందనీ, ఖుషిని పెంచుకోవడానికి అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తానని సుభద్ర అంటుంది. 

 యూకేలో అనురాగ్ - శాంతి ఉన్న ఇంట్లో నాలుగు నెలల పాటు ఉండి ఖుషీ ఆలనా పాలనా చూసుకోమనీ, చైల్డ్ సర్వీస్ వారు పర్యవేక్షిస్తూ ఉంటారనీ .. ఖుషీ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాళ్లు ఆ బాబును తీసుకుని వెళ్లిపోతారని మహేంద్ర (తనికెళ్ల భరణి) సూచిస్తాడు. ఆ లోగా కార్తీక్ ను ఒప్పించడానికి సుభద్ర, ఖుషీ అమ్మమ్మ వాళ్లని ఒప్పించడానికి విక్రమ్ ప్రయత్నించాలని అంటాడు. దాంతో రెండేళ్ల బాబు ఖుషీని తీసుకుని విక్రమ్ - సుభద్ర యూకే వెళతారు. అనురాగ్ దంపతుల ఇంట్లో దిగుతారు.  

  మొదటి నుంచి సరదాగా తాగుతూ .. తిరుగుతూ .. లైఫ్ అంతా రొమాన్స్ ను నింపుకున్న విక్రమ్ , ఖుషీ కోసం సమయాన్ని కేటాయించవలసి రావడాన్ని ఒక శిక్షగా భావిస్తాడు. దాంతో సుభద్రనే సర్దుకుపోతూ ఉంటుంది. విక్రమ్ ఒక ప్లే బాయ్ అనే విషయాన్ని ఆమె చాలా తక్కువ రోజులలోనే గమనిస్తుంది. అతను కూడా ఆమె ముందు బుద్ధిమంతుడిలా నటించడానికి ప్రయత్నం చేయడు. 

అనురాగ్ చనిపోవడంతో అతని వ్యాపార భాగస్వామిగా ఉన్న జోసెఫ్ (రాహుల్ రవీంద్రన్), మోసం చేయాలనుకుంటాడు. ఆ విషయాన్ని విక్రమ్ గ్రహిస్తాడు. ఇక అనుకోకుండా జరిగిన ఒకటి రెండు సంఘటనల కారణంగా, అతనికి ఖుషీపై ప్రేమ కలుగుతుంది. అలాగే సుభద్రపై ప్రేమ పుడుతుంది. తనని అనురాగ్ ఎంతగా అభిమానించాడనే విషయం విక్రమ్ కి అర్థమవుతుంది. అలాగే తన విషయంలో సుభద్ర చూపుతున్న సహనాన్ని అతను ప్రేమగా తిరిగి ఇవ్వాలనుకుంటాడు. సుభద్రను పెళ్లి చేసుకుని, ఖుషీని చూసుకోవాలని నిర్ణయించుకుంటాడు. 

అదే సమయంలో అతను ఎంతమాత్రం ఊహించని సంఘటన జరుగుతుంది. సుభద్రతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న కార్తీక్ అక్కడికి వస్తాడు. అలాగే తమ మనవడిని తామే చూసుకుంటామని ఖుషీ అమ్మమ్మ - తాతయ్యలు వస్తారు. అప్పుడు విక్రమ్ ఏం చేస్తాడు? ఖుషీని అతని అమ్మమ్మ - తాతయ్య తీసుకుని వెళతారా? సుభద్ర వివాహం ఎవరితో జరుగుతుంది? అనేది మిగతా కథ.   

శ్రీరామ్ ఆదిత్య తయారు చేసుకున్న కథ ఇది. ఒక వైపున ప్రేమ .. మరో వైపున స్నేహం .. ఇంకో వైపున త్యాగం అనే కోణాలను ఆవిష్కరిస్తూ, అక్కడక్కడా కామెడీ టచ్ ఇస్తూ ఆయన ఈ కథను నడిపించాడు. ఇక హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ లేకపోయినా, చిన్న చిన్న ట్యూన్స్ తో ..  నేపథ్య సంగీతంతో మేజిక్ చేశారనే అనిపిస్తుంది. లేకపోతే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యేవారేమో.   

హీరోయిన్ ఇలా పరిచయమైందో లేదో .. ఆ వెంటనే తనకి ఎంగేజ్ మెంట్ జరిగిపోయిందని చెబుతుంది. అక్కడ ఆ ఇద్దరి మధ్య రొమాన్స్ ను దర్శకుడు లాక్ చేశాడు. ఫలితంగా ఆ తాలూకు పాటలకు కళ్లెం పడిపోయింది. ఇక రొమాంటిక్ హీరోగా శర్వానంద్ హడావిడి చేశాడుగానీ, అది ఆయనకి అతకలేదు. భార్యాభర్తలుగా ముఖేశ్ రుషి - సీత, తులసి - సచిన్ ఖేడేకర్ కాంబినేషన్ ఉహించుకోవడం కష్టమైన విషయం. ఈ ఎంపిక రాంగ్ ఛాయిస్ అనిపిస్తుంది.

ఇక నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రకి రాహుల్ రవీంద్రన్ సెట్ కాలేదు. ఆ పాత్రలో అంత వెయిట్ కూడా లేదు. ఆ ట్రాక్ అనవసరమని కూడా అనిపిస్తుంది. అలాగే కమెడియన్స్ ను పెట్టుకున్నారుగానీ, కామెడీని వర్కౌట్ చేయలేకపోయారు. నిర్మాణ విలువలకు వంకబెట్టవలసిన పనిలేదు. హేషమ్ అబ్దుల్ వాహెబ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ నీట్ గానే అనిపిస్తుంది. 

'మనమే' బలమైన కథాకథనాలు లేని సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ ను పట్టుకునే కొన్ని సీన్స్ ఉన్నప్పటికీ, అది సరిపోదు. కేవలం ఎమోషన్స్ పైనే దృష్టిపెట్టిన దర్శకుడు, లవ్ .. రొమాన్స్ ను ఎంతమాత్రం పట్టించుకోలేదు. కామెడీని సరిగ్గా రాసుకోలేదు. కృతి శెట్టికి డబ్బింగ్ వాయిస్ సెట్ కాలేదు. శర్వానంద్ చేసిన తన బాడీ లాంగ్వేజ్ కి సరిపడని పాత్రలలో ఒకటిగానే ఇది కనిపిస్తుంది.

Movie Name: Manamey

Release Date: 2024-06-07
Cast: Sharwanand, krithi Shetty, Vennela Kishore, Sitha, Tulasi
Director:Sriram Adithya
Producer: Viswa Prasad
Music: Hesham Abdul Wahab
Banner: People Media Factory

Rating: 2.50 out of 5

Trailer

More Reviews