'బ్లాకౌట్' (జియో సినిమా) రివ్యూ!

Blackout

Blackout Review

  • విక్రాంత్ హీరోగా రూపొందిన 'బ్లాకౌట్'
  • బ్లాక్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో నడిచే కంటెంట్ 
  • ఒకరాత్రిలో జరిగే సంఘటనల సమాహారమే కథ 
  • వినోదం .. సందేశం కలగలిసిన కథ ఇది  

బాలీవుడ్ లో నాన్ స్టాప్ కామెడీతో నవ్వించే కంటెంట్ కి మంచి గిరాకీ ఉంటుంది. ఇక ఈ తరహా కంటెంట్ కి ఓటీటీ వైపు నుంచి మంచి సపోర్ట్ లభిస్తూ ఉంటుంది. అలాంటి ఒక కాన్సెప్ట్ తో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో 'బ్లాకౌట్' ఒకటిగా చెప్పుకోవచ్చు. '12th ఫెయిల్' సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న విక్రాంత్ మెస్సె , ఈ సినిమాలో కథానాయకుడు. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. బ్లాక్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

 ఈ కథ 'పూణె'లో జరుగుతుంది. నగరంలో లెనీ డిసౌజా ( విక్రాంత్ మెస్సె) క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు స్టింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటాడు. కొంతమంది కీలకమైన వ్యక్తుల ఆధారాలు ఆయన దగ్గర ఉండటం వలన, ఆయన విషయంలో వాళ్లు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. లెనీ డిసౌజా భార్య రోహిణి ( రుహాని శర్మ). ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉంటారు. 

ఒక రోజు రాత్రి ఆయన ఓ ఫుడ్ ఐటమ్ కోసం కార్లో బయటికి వెళతాడు. అదే సమయంలో సిటీలో పవర్ తీసేసిన ఒక దొంగల గుంపు, బ్యాంకులను కొల్లగొడుతూ వెళుతుంది. ఆ కంగారులో ఆ దొంగల వ్యాన్ పడిపోతుంది. అందులోని వాళ్లంతా తీవ్రమైన గాయలతో పడిపోతారు. అదే సమయంలో లెనీ డిసౌజా తన కారులో అటుగా వస్తాడు. ఆ వ్యానులో డబ్బు ..బంగారం విపరీతంగా ఉండటం చూస్తాడు. ఆ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో, పెద్ద బాక్స్ ఒకటి తీసుకుని అక్కడి నుంచి బయల్దేరతాడు. 

డబ్బు పెట్టె కారులో ఉండటంతో, భవిష్యత్తును గురించి రకరకాల కలలు కంటూ డ్రైవ్ చేస్తూ, ఒక వ్యక్తికి డ్యాష్ ఇస్తాడు. ఆ వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాలని చెప్పి, అక్కడే ఉన్న ఓ తాగుబోతు ఆ కారులో ఎక్కుతాడు. తాను డ్యాష్ ఇచ్చిన వ్యక్తి చనిపోయాడని తెలుసుకున్న లెనీ డిసౌజా షాక్ అవుతాడు. ఆ కారులో ఉన్న డబ్బులో తనకి కొంత ఇస్తే, ఆ వ్యక్తిని పూడ్చేద్దామని ఆ తాగుబోతు అంటాడు. ఇద్దరూ కలిసి ఆ శవాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 

అదే సమయంలో ఇద్దరు టిక్ టాకర్స్ అటుగా వస్తారు. వాళ్లను చూడగానే లెనీ డిసౌజా కంగారు పడిపోతాడు. శవాన్ని పూడ్చడంలో సాయం చేస్తే కొంత డబ్బు ఇస్తానని అంటాడు. అదే సమయంలో అలికిడి కావడంతో, అందరూ కూడా అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు అక్కడున్న పొదల్లో నుంచి డిటెక్టివ్ అరవింద్ (జిషూ సేన్ గుప్తా) బయటికి వస్తాడు. లెనీ డిసౌజా కారును ఫాలో చేయడం మొదలుపెడతాడు. 

లెనీ డిసౌజా చాలా టెన్షన్ తో కారు నడువుతూ ఉండగా, శృతి మెహ్రా ( మౌనీ రాయ్) లిఫ్ట్ అడుగుతుంది. లెనీ డిసౌజా కారు నడిపే తీరుపై అనుమానం రావడంతో పోలీసులు ఫాలో చేయడం మొదలుపెడతారు. అతని కారులోని తాగుబోతును చూసిన శృతి షాక్ అవుతుంది. అతను పెద్ద డాన్ అనీ, 14 ఏళ్లుగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారని చెబుతుంది. అప్పుడు లెనీ డిసౌజా ఏం చేస్తాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ. 
     
ఎంతోమంది అవినీతి పరులను స్టింగ్ ఆపరేషన్ ద్వారా పట్టించిన ఒక జర్నలిస్ట్, తన దగ్గరికి వచ్చేసరికి దొంగల వ్యానులో నుంచి పెద్ద బాక్స్ కొట్టేస్తాడు. అప్పటి వరకు హాయిగా సాగిపోయిన అతని జీవితం టెన్షన్ లో పడుతుంది. ఆ డబ్బును కాపాడుకోవడం కోసం ఆయన ఒకదాని తరువాత ఒకటిగా తప్పులు చేస్తూ వెళ్లడం .. ఇరకాటంలో పడటమే కథ. ఆ డబ్బుతో తన భార్యను సుఖ పెట్టాలనుకున్న ఆయనకి చివరికి మిగిలినదేమిటి? అనేది సందేశం. 

ఇది కామెడీ థ్రిల్లర్ .. ఒక జర్నలిస్టు జీవితంలో ఒకరాత్రి ఏం జరిగిందనేదే కథ. ఈ కథ మొదలైన దగ్గర నుంచి చకచకా పరుగులు పెడుతూనే ఉంటుంది. కథ ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి మారిపోతూనే ఉంటుంది. కథ ముందుకు వెళుతున్నా కొద్దీ ఒక్కో పాత్ర యాడ్ అవుతూ ఉంటుంది. ప్రతి పాత్రకి ఒక ప్రయోజనం ఉండటం వలన, సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. 

కథలో ఎక్కువ భాగం కారులోనే హీరో ఉంటాడు. ఒక వైపు నుంచి పోలీసులు .. మరో వైపు నుంచి డిటెక్టివ్ .. ఇంకో వైపు నుంచి ఒక క్రిమినల్ హీరోను వెంటాడుతూ ఉంటారు. ఈ తతంగమంతా చాలా గమ్మత్తుగా జరుగుతూ వెళ్లి, చివరికి హీరోను మాఫియా ముఠాల మధ్య నిలబెట్టిన తీరు వినోదభరితంగా సాగుతుంది. నాన్ స్టాప్ కామెడీ సినిమాలోని డైలాగ్స్ ను .. అదే పంచ్ లో అనువాదంలో వేయడం కష్టం. అందువలన ఒరిజినల్ డైలాగ్స్ మరింత నవ్వు తెప్పించే ఛాన్స్ ఉంటుంది. 

ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా చాలా నేచురల్ గా చేశారు. దేవాంగ్ టేకింగ్ .. అనుభవ భన్సాల్ ఫొటోగ్రఫీ .. విశాల్ మిశ్రా సంగీతం .. ఉన్నికృష్ణన్ ఎడిటింగ్ కి మంచి మార్కులు పడతాయి. తెలుగు అనువాదంలో కొన్ని డైలాగ్స్ కూర్చోకపోయినా .. అక్కడక్కడా సన్నివేశాలను కాస్త  సాగదీసినట్టుగా అనిపించినా, ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసే సినిమానే ఇది. 

Movie Name: Blackout

Release Date: 2024-06-07
Cast: Vikrant Massey, Ruhani Sharma, Mouni Roy, Sunil Grover, Jisshu Sengupta,
Director:Devang Shashin Bhavsar
Producer: Jyoti Deshpande
Music: Vishal Mishra
Banner: 11:11 Productions -Jio Studios

Rating: 2.75 out of 5

Trailer

More Reviews