'పరువు' అనే టైటిల్ చూడగానే, ఇది 'పరువు' హత్యల నేపథ్యంలో నడిచే కథ అనే విషయం చాలామందికి అర్థమైపోతుంది. అలాంటి ఈ కథను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుస్మిత కొణిదెల - విష్ణు ప్రసాద్ నిర్మించారు. సిద్ధార్థ్ నాయుడు - రాజశేఖర్ వడ్లపాటి దర్శకత్వం వహించారు. నాగబాబు .. నివేదా పేతురాజ్ .. నరేశ్ అగస్త్య ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, 8 ఎపిసోడ్స్ గా ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ అంతా కూడా 'గుంటూరు' నేపథ్యంలో నడుస్తుంది. గుంటూరు సమీపంలోని ఒక గ్రామంలో పరువే ప్రాణంగా భావించే ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన యువతి పల్లవి (నివేదా పేతురాజ్). తల్లిదండ్రులు ఉన్నప్పటికీ ఆమెకి పెదనాన్న దగ్గర గారం ఎక్కువ. ఆమెకి వరసైన చందూ (సునీల్ కొమిశెట్టి)తో పెళ్లి జరిపించాలని అనుకుంటారు. అది ఎంతమాత్రం నచ్చని పల్లవి, తాను ప్రేమిస్తున్న సుధీర్ (నరేష్ అగస్త్య) కోసం ఊరొదిలి వెళ్లిపోతుంది. దాంతో ఆమె కుటుంబ సభ్యులంతా ఆమెపై కోపంతో ఉంటారు.
ఇక ఎన్నిమార్లు ఎన్నికలు జరిగినా ఆ ఊరికి ఎమ్మెల్యేగా రామయ్య (నాగబాబు) గెలుస్తూ ఉంటాడు. ఆయనను ఎలాగైనా ఓడించి, అధికారాన్ని అందుకోవాలనే ఆలోచనలో శుభాష్ ఉంటాడు. ఆయన అన్నయ్య బోస్ ఆలోచన కూడా అదే అయినా, ఆయనలో నీతి నిజాయితీ ఉంటాయి. ఇక ఆ ప్రాంతానికి పోలీస్ ఆఫీసర్స్ గా చక్రవర్తి (రాజ్ కుమార్ కసిరెడ్డి) .. బాబ్జీ ఉంటారు. రామయ్యకి అనుకూలంగా చక్రవర్తి ఉంటే, శుభాష్ వర్గానికి బాబ్జి అండగా ఉంటాడు.
ఈ నేపథ్యంలోనే రామయ్య వర్గానికి చెందిన అమ్మాయిని, సుభాష్ వర్గానికి చెందిన అబ్బాయి ప్రేమిస్తాడు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించడం జరిగేపనికాదని భావించి, ఆ ఊరు నుంచి పారిపోతారు. దాంతో రెండు సామాజిక వర్గాల మధ్య ఒక యుద్ధవాతావరణం కనిపిస్తూ ఉంటుంది. గతంలో అలాగే ఊరు నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్న జంట పల్లవి .. సుధీర్, రెండేళ్ల తరువాత ఆ ఊరికి బయల్దేరతారు. అందుకు కారణం ఆమెను చిన్నప్పటి నుంచి పెంచిన పెదనాన్న చనిపోవడమే.
అతణ్ణి చూడటం కోసం ఆమె సుధీర్ తో కలిసి బయల్దేరుతుంది. వాళ్లను తీసుకుని వెళ్లడానికి చందూ వస్తాడు. ప్రస్తుతం తను స్వాతి (ప్రణీత పట్నాయక్)తో ప్రేమలో ఉంటాడు. త్వరలో ఆమెతో అతని పెళ్లి జరగనుంది. స్వాతి విషయానికి వస్తే ఆమె చాలా ధైర్యవంతురాలు. తాను ప్రేమిస్తున్న చందూ కోసం ఎంతకైనా తెగించగలదు. అనుక్షణం ఆమెతో చందూ టచ్ లోనే ఉంటాడు. అయినా గతంలో తనని కాదని వెళ్లిపోయిన పల్లవిపై అతను కోపంగానే ఉంటాడు. గర్భవతిగా ఉన్న పల్లవి, సుధీర్ తో కలిసి అయిష్టంగానే చందూ కారులో ఆ రాత్రివేళలో బయల్దేరుతుంది. దారిపొడవునా గతాన్ని గురించి చందూ ప్రస్తావించడం .. తాగుతూ ఉండటం పల్లవికి అసహనాన్ని కలిగిస్తుంది.
మార్గ మధ్యంలో చందూ ఒక వ్యక్తి నుంచి 'గన్' తీసుకోవడం పల్లవి - సుధీర్ గమనిస్తారు. తమని చంపడం కోసమే అతను 'గన్' తీసుకున్నాడని వాళ్లు భావిస్తారు. పారిపోవడానికి అవకాశం లేకపోవడంతో, అందుకు తగిన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అదను చూసుకుని, చందూపై సుధీర్ దాడి చేస్తాడు. అయితే ఊహించని విధంగా చందూ చనిపోతాడు. దాంతో పల్లవి - సుధీర్ నివ్వెరపోతారు. చందూ ఫ్యామిలీలో దొరబాబు చాలా ప్రమాదకరమని అప్పుడే సుధీర్ తో పల్లవి చెబుతుంది.
ఊళ్లో వాళ్లంతా చందూ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అతని ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో, స్వాతి పోలీసులకు కాల్ చేస్తూనే ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ చక్రవర్తి వెంటనే రంగంలోకి దిగిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో చందూ డెడ్ బాడీని కారు డిక్కీలో పెట్టేసి, పల్లవి - సుధీర్ ఆ ఊళ్లోకి వెళతారు. అక్కడ ఏం జరుగుతుంది? చందూ కోసం ఎదురుచూస్తున్నవారికి వాళ్లు ఏం చెబుతారు? ఆ ఊరు నుంచి పారిపోయిన విక్రమ్ పరిస్థితి ఏమిటి? రామయ్య రాజకీయం జీవితం ఏమౌతుంది? అనేది మిగతా కథ.
ఈ కథను దర్శకులు నాలుగువైపుల నుంచి రాసుకున్నారు. హీరో - హీరోయిన్ వైపు నుంచి .. విక్రమ్ - జాహ్నవి వైపు నుంచి .. చందూ - స్వాతి వైపు నుంచి .. ఎమ్మెల్యేగా రామయ్య వైపు నుంచి నడుస్తుంది. కులమతాల ఆలోచన లేకుండా ప్రేమించుకున్న జంట, తమ ప్రేమను నిజం చేసుకోవడానికి పారిపోతారు. అలా గతంలో పారిపోయిన జంట, ఒక ముఖ్యమైన పనిపై ఆ ఊరు వస్తుంది. ఈ రెండు జంటలు అటు కుటుంబం పరంగా .. ఇటు సమాజం పరంగా ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేశాయనేదే ఈ కథ.
'పరువు' అనే టైటిల్ ను బట్టి చూసుకుంటే, ఈ కథ అంతా కూడా, 'పరువు' హత్యల చుట్టూనే తిరుగుతుందని అనుకోవడం సహజం. కానీ అనుకోకుండా ఒక హత్య చేసిన జంట, ఆ శవాన్ని మాయం చేయడానికి పడిన అవస్థలను ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుంది. ప్రేమ - సమాజం .. రాజకీయం .. రౌడీయిజం .. ఇలా అన్ని అంశాలను టచ్ చేస్తూనే ఈ కథ నడుస్తుంది. కొన్ని సీన్స్ కాస్త బాగుంటే .. మరి కొన్ని సీన్స్ జారిపోతూ ఉంటాయి.
ఈ మొత్తం కథకి సంబంధించి మొదటి రెండు ఎపిసోడ్స్ .. చివరి ఎపిసోడ్ మాత్రమే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. మిగతా ఎపిసోడ్స్ లో కథ ఉంటుంది .. కానీ నత్తనడక నడుస్తూ ఉంటుంది. సన్నివేశాలు బలహీనపడటం .. సాగదీసినట్టుగా ఉండటం కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ఆర్డర్ బాగున్నప్పటికీ, అందులో వేగం కనిపించదు. అంతా తాపీగా .. నిదానంగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరగనుంది? అనే ఒక ఆసక్తి తలెత్తదు.
ఇక పాత్రల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ, వాటిలో ఉన్న పవర్ తక్కువ. ప్రధానమైన నాగబాబు పాత్రను ఇంకాస్త పవర్ఫుల్ గా డిజైన్ చేయవచ్చు. ఇక ఆయనను ఢీ కొట్టే పాత్రలకు కూడా ఆ స్థాయి ఆర్టిస్టులు అవసరం. అసలైన విలన్ వేరే ఉన్నాడంటూ దొరబాబు పేరును హింట్ ఇచ్చారు. ఆ పాత్ర వలన ఈ సిరీస్ కి ఒరిగేదైతే ఏమీ లేదు. నిర్మాణ విలువలతో పాటు, శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం .. విద్యాసాగర్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. విప్లవ్ ఎడిటింగ్ ఫరవాలేదు. కథపై .. పాత్రలను డిజైన్ చేసే తీరుపై .. స్క్రీన్ ప్లేపై ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే, ఈ సిరీస్ మరింత బెటర్ గా అనిపించేదేమో.
'పరువు' (జీ 5) వెబ్ సిరీస్ రివ్యూ!
Paruvu Review
- 8 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతున్న 'పరువు'
- ఇంట్రెస్టింగ్ గా అనిపించే 1.. 2 .. 8 ఎపిసోడ్స్
- వేగం లోపించిన కథనం
- కొన్ని పాత్రలకు సెట్ కానీ ఆర్టిస్టులు
- అక్కడక్కడా బలహీనపడిన సీన్స్
- ప్రధానమైన బలంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - ఫొటోగ్రఫీ
Movie Name: Paruvu
Release Date: 2024-06-14
Cast: Nagababu, Niveditha Pethuraj, Naresh Agasthya, Raj Kumar, Bindu Madhavi
Director:Siddharth Nayudu - Rajasekhar
Producer: Susmitha Konidela- Vishnu Prasad
Music: Shravan Bharadwaj
Banner: Gold Box Entertainments
Review By: Peddinti
Rating: 2.75 out of 5
Trailer