ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథలను ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందువలన క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ ను వదలడానికి ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి. అలా 'జియో సినిమా'కి వచ్చిన వెబ్ సిరీస్ గా 'గాంత్' కనిపిస్తుంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉందనేది చూద్దాం.
అది ఢిల్లీ సమీపంలోని 'హకీకత్ నగర్' .. అక్కడ జతిన్ ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. తన తండ్రి దశరథ్ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన జతిన్, తండ్రి మరణంతో మానసికంగా దెబ్బతింటాడు. ఆ షాక్ వలన అతనికి మాట పోతుంది. చాలా కాలం తరువాత మాట వస్తుంది. ఆరుగురు సభ్యులతో ఆ కుటుంబం జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అలాంటి ఆ కుటుంబ సభ్యులంతా తెల్లవారేసరికి ఇంట్లోనే ఉరికి వ్రేలాడుతూ కనిపిస్తారు. దాంతో ఆ కాలనీ వాసులంతా భయపడిపోతారు.
ఈ కేసును గదర్ సింగ్ (మనవ్ విజ్)కి అప్పగిస్తారు. పోలీస్ ఆఫీసర్ గా ఉన్న అతణ్ణి ఫ్యామిలీ వైపు నుంచి కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అతను తన కూతురు 'మినీ'తో కలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఆ సమస్యల కారణంగా అతను మద్యానికి మరింత బానిస అవుతాడు. ఆ కారణంగానే సస్పెండ్ అవుతాడు. అలాంటి గదర్ .. ఈ కేసును ఛేదించగలడని భావించి, డిపార్టుమెంటువారు అతణ్ణి వెనక్కి పిలుస్తారు.
గదర్ ఉన్నపళంగా సంఘటన స్థలానికి చేరుకుంటాడు. అతని టీమ్ గా ఆఫీసర్ సత్యవతి (సలోని బత్రా) గొస్సేయిని (శ్రవణ్) అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఉరికి వ్రేలాడుతున్న ఆరుగురిలో .. పదేళ్ల కుర్రాడు 'కుశాగ్ర' బ్రతికే ఉండటం గమనించి వెంటనే అతణ్ణి హాస్పిటల్ కి తరలిస్తారు. ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న సాక్షి (మౌనిక) ఆ కుర్రాడి బాధ్యతను తీసుకుంటుంది. జతిన్ ఫ్యామిలీ గురించి గదర్ ఆ చుట్టు పక్కలవారిని ఆరాతీయడం మొదలుపెడతాడు.
జతిన్ ఫ్యామిలీ ఎవరితోనూ కలిసేవారు కాదనీ, ఆ ఇంట్లో ఆడవారిని ఎవరూ చూడలేదని .. ఆ కుటుంబ సభ్యుల ప్రవర్తన చిత్రంగా ఉండేదని అందరూ చెబుతారు. వారికి మూఢ నమ్మకాలు ఎక్కువనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. చనిపోవడానికి ముందుగా కూడా వారు అక్కడ ఏదో పూజ చేశారనడానికి ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే గదర్ మినహా మిగతా వాళ్లంతా అవి ఆత్మహత్యలుగానే భావిస్తారు.
జతిన్ కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకుంటే, వాళ్ల కాళ్లు - చేతులు ఎలా కట్టేసి ఉంటాయి? వారు చనిపోవడానికి ముందే ఆ ఇంటి కుక్క ఎందుకు చనిపోతుంది? కొత్తగా ఆ ఇంటికి పైపులు .. సొరంగ మార్గాలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి? చనిపోవడానికి ముందురోజున జతిన్ పెద్దమొత్తంలో డబ్బు ఎందుకు డ్రా చేశాడు? ఆ డబ్బును అతను ఎవరికి ఇచ్చాడు? అనే అనుమానాలతో తన విచారణ మొదలుపెడతాడు. అప్పుడు ఆయనకి తెలిసే నిజాలేమిటి? అనేదే కథ.
సోహం భట్టాచార్య - షాహిమ్ ఈ కథను అందించారు. అంజిత్ అంధారే నిర్మించిన ఈ సిరీస్ కి కనిష్క్ వర్మ దర్శకత్వం వహించాడు. ఒక కుటుంబంలోని సభ్యులంతా అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఈ కథ మొదలవుతుంది. వాళ్లు ఎందుకు చనిపోయారు? అవి హత్యలా .. ఆత్మహత్యలా? కారణాలు ఏమిటి? అనే విచారణ మొదటి ఎపిసోడ్ నుంచే మొదలవుతుంది. ఈ విచారణ అనేక మలుపులు తిరుగుతూ ముందుకు సాగుతుంది.
కథ ఆరంభం .. అక్కడక్కడా ఎదురయ్యే ట్విస్టులు .. క్లైమాక్స్ ట్విస్ట్ ఈ సిరీస్ ను నిలబెట్టేస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియన్స్ వైపు నుంచి ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ కథల్లో పోలీసుల హడావిడి ఒక రేంజ్ లో చూపిస్తూ ఉంటారు. కానీ ఈ కథ సహజత్వానికి చాలా దగ్గరగా వెళుతుంది. అందువలన సన్నివేశాలు నిదానంగా కదులుతూ, కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తాయి.
అయితే ప్రతి ఎపిసోడ్ బ్యాంగ్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. తరువాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అనే ఒక కుతూహలాన్ని పెంచుతూనే ఉంటాయి. ప్రధానమైనవిగా ఒక అరడజను పాత్రలు కనిపించినా, మిగతా పాత్రలు చాలానే వచ్చి వెళుతూ ఉంటాయి. అయినా ప్రతి పాత్ర రిజిస్టర్ అవుతూనే ఉంటుంది. సన్నివేశాలకి తగిన లొకేషన్స్ ఈ కథకి మరింత బలంగా మారాయని అనిపిస్తుంది.
రాఘవ్ - అర్జున్ అందించిన నేపథ్య సంగీతం ఈ సిరీస్ కి ప్రధానమైన బలంగా నిలిచింది. ప్రతీక్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఇక సంజయ్ శర్మ ఎడిటింగ్ వర్క్ కూడా నీట్ గా అనిపిస్తుంది. సాధారణంగా పోలీస్ కథలకి సంబంధించిన సిరీస్ లలో ఒక రకమైన డైలాగ్స్ వినిపిస్తూ ఇబ్బందిపెడుతూ ఉంటాయి. కానీ ఈ సిరీస్ లో అలాంటివేమీ కనిపించవు .. వినిపించవు. కాస్త నిదానంగా సాగినా .. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సిరీస్ గానే చెప్పుకోవచ్చు.
'గాంత్' (జియో సినిమా) వెబ్ సిరీస్ రివ్యూ!
Gaanth Review
- క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే 'గాంత్'
- 8 ఎపిసోడ్స్ గా సాగే సిరీస్
- బలమైన కథ - నిదానంగా సాగే కథనం
- ఆకట్టుకునే ట్విస్టులు
- మొత్తంగా మెప్పించే సిరీస్ ఇది
Movie Name: Gaanth
Release Date: 2024-06-11
Cast: Manav Vij, Saloni Batra, Monika Panwar, Gaurav Mishra, Pramod Chaturvedi, Sourabh Patel
Director:Kanishk Varma
Producer: Ajith Andhare
Music: Raghav- Arjun
Banner: Tipping Point
Review By: Peddinti
Rating: 3.00 out of 5
Trailer