ఆనంద్ దేవరకొండ హీరోగా 'గం గం గణేశా' సినిమా రూపొందింది. వంశీకృష్ణ - కేదార్ నిర్మించిన ఈ సినిమాకి, ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించాడు. ప్రగతి శ్రీవాత్సవ కథానాయికగా నటించిన ఈ సినిమా, మే 31వ తేదీన థియేటర్లకు వచ్చింది. క్రైమ్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఈ రోజునే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ హైదరాబాద్ - నంద్యాల మధ్యలో జరుగుతుంది. గణేశ్ (ఆనంద్ దేవరకొండ) అతని స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయేల్) కలిసి హైదరాబాదులో చిల్లర దొంగతనాలు చేస్తూ రోజులు గడుపుతూ ఉంటారు. గణేష్ ఒక అమ్మాయితో లవ్ లో పడతాడు. ఆ అమ్మాయి తనకి దూరమైపోవడానికి కారణం, తన దగ్గర డబ్బులేకపోవడమేనని అతను భావిస్తాడు. బాగా సంపాదించాలనే ఒక పట్టుదల అతనిలో పెరుగుతుంది.
ఇక ఎన్నికలు దగ్గరికి వస్తుండటంతో 'నంద్యాల'లో రాజకీయ పరిణామాలు మారిపోతూ ఉంటాయి. ముఖ్యమంత్రి రాజేంద్రతో పడని కారణంగా కిషోర్ రెడ్డి ఇబ్బందిపడుతూ ఉంటాడు. ఎలాగైనా డబ్బు పంచి గెలవాలనే ఉద్దేశంతో, ముంబైలో తనకి తెలిసినవాళ్లను 100 కోట్లు సర్దుబాటు చేయమని చెబుతాడు. ఆ డబ్బును నంద్యాలకు తీసుకుని వెళ్లే బాధ్యత అతనిదేనని అవతలివారు చెబుతారు.
ముంబై నుంచి ఆ డబ్బును తీసుకురావడం కోసం, జైల్లో ఉన్న 'రుద్ర'ను బెయిల్ పై బయటికి తీసుకొస్తాడు కిషోర్ రెడ్డి. వినాయకచవితి పండుగ దగ్గరలోనే ఉండటం వలన, ముంబై నుంచి వినాయకుడి విగ్రహంలో ఆ డబ్బు పెట్టి తీసుకురావడానికి ప్లాన్ చేస్తారు. అనుకున్నట్టుగానే విగ్రహం లోపల డబ్బు పెట్టేసి, అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. ఈ లోగా ఒక పార్టీ నుంచి గణేశ్ 7 కోట్లు ఖరీదు చేసే డైమండ్ ను కొట్టేస్తాడు.
గణేశ్ వెంట పోలీసులు పడతారు. ఆ సమయంలో రుద్ర నడుపుతున్న వినాయకుడితో కూడిన లారీ అటుగా వస్తుంది. దాంతో గణేశ్ తన చేతిలో ఉన్న డైమండ్ ను ఆ వినాయకుడి తొండంలో వేస్తాడు. ఆ తరువాత ఆ లారీని ఫాలో కావడంలో విఫలమవుతాడు. కిశోర్ రెడ్డి డెన్ కి వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్లిన రుద్ర, అందులో డబ్బు లేకపోవడం చూసి షాక్ అవుతాడు. ఎక్కడ ఎలా 100 కోట్లు మిస్సయ్యాయనేది అతనికి అర్థం కాదు. అప్పుడు కిశోర్ రెడ్డి ఎలా స్పందిస్తాడు? ఆ డబ్బు ఎలా కనిపించకుండా పోతుంది? అందుకు కారకులు ఎవరు? అంత డబ్బును దక్కించుకోవడం కోసం ఎవరెవరు రంగంలోకి దిగుతారు? చివరికి ఎవరి పథకం ఫలిస్తుంది? అనేది కథ.
దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి రాసుకున్న కథనే ఇది. ఒకే వినాయకుడిలో తాను దాచిన డబ్బుకోసం విలన్ .. తాను దాచిన డైమండ్ కోసం హీరో చేసే ప్రయత్నమే ఈ సినిమా. నిజానికి ఇది చాలా సింపుల్ లైన్. అయినా కథ ముందుకు వెళుతున్న కొద్దీ కొత్తగా పాత్రలు దిగిపోతూ ఉంటాయి. అందువలన కొత్తగా కామెడీ ఏమైనా యాడ్ అయిందా అంటే లేదనే చెప్పాలి.
ఇంటర్వెల్ వరకూ ఫరవాలేదనిపించుకున్న ఈ కథ, సెకండాఫ్ నుంచి పుంజుకుంటుందని ఆడియన్స్ ఆశిస్తారు. కానీ అక్కడి నుంచే గ్రాఫ్ పడిపోవడం మొదలుపెడుతుంది. సిల్లీ కామెడీతో స్టేజ్ పై డ్రామాలా నడుస్తూ ఉంటుంది. సన్నివేశాలలో సహజత్వం లోపించడంతో, ఆడియన్స్ జారిపోతూ ఉంటారు. చివర్లో మరీ నాటకీయ పరిణామాలు ఎక్కువైపోయి ఇబ్బందిపెడతాయి.
ఆదిత్య జవ్వాది ఫొటోగ్రఫీ .. చైతన్ భరద్వాజ్ సంగీతం ఫరవాలేదు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ విషయానికి వస్తే, ట్రిమ్ చేయవలసిన సీన్స్ చాలానే కనిపిస్తాయి. లవ్ అనే అంశాన్ని టచ్ చేయడానికి చాలా మొహమాట పడిపోయినట్టుగా కనిపిస్తుంది. అందువలన పాటలు .. రొమాన్స్ కు అవకాశం లేకుండా పోయింది.
ఇక వెన్నెల కిశోర్ కూడా తన పాత్రను డిజైన్ చేసిన తీరువలన ఏమీ చేయలేకపోయాడు. ఆనంద్ దేవరకొండ ఈ పాత్రకి సెట్ కాలేదు. తనది కానీ బాడీ లాంగ్వేజ్ ను ఆయన ప్రదర్శించినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ దెబ్బకొట్టి ఉండకపోతే, కనీసం ఈ సినిమా యావరేజ్ అనిపించుకునేదేమో.
'గం గం గణేశా' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Gam Gam Ganesha Review
- క్రైమ్ కామెడీ జోనర్లో వచ్చిన 'గం గం గణేశా'
- ఫరవాలేదనిపించిన ఫస్టాఫ్
- అసహనాన్ని కలిగించే సెకండాఫ్
- ఎక్కువైపోయిన నాటకీయత
- పేలని కామెడీ .. కనిపించని రొమాన్స్
Movie Name: Gam Gam Ganesha
Release Date: 2024-06-20
Cast: Anand Devarakonda, pragathi Srivathsava, Nayan Sarika, Vennela Kishore, Sathyam Rajesh
Director:Uday Bommisetty
Producer: Vamsi Krishna - Kedar
Music: Chaithan Bharadwaj
Banner: Hylife Entertainment
Review By: Peddinti
Rating: 2.00 out of 5
Trailer