స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలోని కథలు అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తూనే ఉంటాయి. ఆ జోనర్ కి థ్రిల్లర్ ను యద చేస్తూ, ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాగా 'పీటీ సర్' సినిమా కనిపిస్తోంది. హిప్ హాప్ తమిళన్ .. కాశ్మీర పరదేశి జంటగా నటించిన ఈ సినిమాలో, అనిఖ సురేంద్రన్ కీలకమైన పాత్రను పోషించింది. మే 24వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెట్టింది. కార్తీక్ వేణుగోపాలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కనగవేల్ ( హిప్ హాఫ్ తమిళన్) ఒక కార్పొరేట్ స్కూల్లో పీటీ సర్ గా పనిచేస్తూ ఉంటాడు. అదే స్కూల్లో వానతి (కశ్మీర పరదేశి) టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య పరిచయం .. సాన్నిహిత్యం ప్రేమగా మారుతుంది. కనగవేల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన యువకుడు. తండ్రి రాజన్ - తల్లి మహేశ్వరి (దేవదర్శిని) ఓ చెల్లి ఇదీ అతని కుటుంబం. ఇక వానతి తండ్రి మాణిక వేల్ (ప్రభు) క్రిమినల్ లాయర్.
కనగవేల్ కి జాతక సంబంధమైన ఒక దోషం ఉంటుంది. అందువలన అతనితో ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దనీ .. అతను ఎటువంటి గొడవల్లో తలదూర్చకుండా చూసుకోమని ఒక సిద్ధుడు అతని పేరెంట్స్ కి చెబుతాడు. వివాహం అయ్యేవరకూ అతనికి ఆ గండం ఉంటుందని అంటాడు. అందువలన అతను ఎలాంటి ప్రమాదాల జోలికి వెళ్లకుండా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఓ ప్రమాదం అతణ్ణి వెదుక్కుంటూ రానే వస్తుంది.
కనగవేల్ ఇంటికి ఎదురుగానే రాజన్ (ఇళవరసు) ఇల్లు ఉంటుంది. ఆయనకి ఇద్దరు కూతుళ్లు. ఒక కూతురైన నందిని (అనిఖ సురేంద్రన్) ఇంజనీరింగ్ చదువుతూ ఉంటుంది. కనగవేల్ - వానతి కలిసి పనిచేస్తున్న స్కూల్ కీ, నందిని చదువుతున్న కాలేజ్ కి చైర్మన్ ఒక్కరే. అతనే పురుషోత్తం (త్యాగరాజన్). తన స్కూల్లో 'మేజిక్ వాల్'ను ఆలోచనను కనగవేల్ ఆచరణలో పెడతాడు.
స్టూడెంట్స్ తాము బయటికి చెప్పడానికి ఇబ్బంది పడే విషయాలను ఆ గోడపై రాయవచ్చు. అలా చేయడం వలన వాళ్లు ఒత్తిడి నుంచి బయటపడతారనేది అతని కాన్సెప్ట్. అతని ఆలోచనను చైర్మన్ పురుషోత్తం అభినందిస్తాడు. అతను పురుషోత్తంను చూడటం అదే ఫస్టు టైమ్. ఒక రోజున కొంతమంది ఆకతాయిలు నందినిని ఆటపట్టిస్తారు. ఆ మరునాడే ముఖాన్ని గుర్తించలేని స్థితిలో ఆమె డెడ్ బాడీ దొరుకుతుంది.
నందిని శవం దగ్గర క లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ చూసిన పోలీసులు తర్జన భర్జనలు పడటాన్ని కనగవేల్ గమనిస్తాడు. ఒక పోలీస్ హడావిడిగా ఆ లెటర్ తీసుకుని బయల్దేరతాడు. ఆ పోలీస్ ఆ లెటర్ ను నేరుగా తీసుకుని వెళ్లి, విద్యా సంస్థల చైర్మన్ పురుషుత్తానికి అందజేస్తాడు. అతను ఇచ్చిన డబ్బు తీసుకుని అక్కడి నుంచి ఆ పోలీస్ వెళ్లిపోతాడు. అపుడు కనగ వేల్ ఏం చేస్తాడు? నందిని మరణానికీ .. పురుషోత్తానికి ఉన్న సంబంధం ఏమిటి? ఆ సంఘటన కథను ఎలాంటి మలుపు తిప్పుతుంది? అనేది కథ.
ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. అందుకు ఒక విద్యాసంస్థల చైర్మన్ కారణమవుతాడు. అతణ్ణి దోషిగా నిరూపించడం కోసం ఒక సాధారణమైన పీటీ సర్ ఏం చేస్తాడు? ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు? అనేదే కథ. ఆరంభంలో కాస్త కామెడీ టచ్ .. లవ్ టచ్ కనిపించినప్పటికీ, ఆ తరువాత సీరియస్ డ్రామానే నడుస్తూ వెళుతుంది .. కోర్టు రూమ్ సీన్స్ సైతం ఎక్కడా బోర్ కొట్టకుండా సాగడం విశేషం.
మిడిల్ క్లాస్ వారు పరువు ప్రతిష్ఠలను కాపాడుకునే విషయంలో ఎంతగా ఇబ్బంది పడతారు? తమకి న్యాయం జరగడం కోసం వాళ్లు ఎంత మానసిక క్షోభను అనుభవిస్తారు? డబ్బు .. అధికారం .. అవినీతి అనేవి మిడిల్ క్లాస్ వారి జీవితాలతో ఎలా ఆడుకుంటాయి? అనేది ఈ సినిమాలో చాలా నీట్ గా చూపించారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా, సహజత్వానికి దగ్గరగా తమ పాత్రలను తీసుకుని వెళ్లారు.
మాదేష్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. హిప్ హాప్ నేపథ్య సంగీతం ఒకే. కానీ ఆయన బాణీలు ఎంతమాత్రం కనెక్ట్ కావు. ఇక తెలుగు అనువాదం విషయానికి వచ్చేసరికి పాటల విషయంలో ఎంతమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. అటు పాడటంలో కావొచ్చు .. ఇటు సాహిత్యం పరంగా కావొచ్చు. ఒక మంచి కథకు ఇవి మైనస్ మార్కులుగా అనిపిస్తాయి. ప్రసన్న ఎడిటింగ్ ఓకే. ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ లో వచ్చిన ఒక మంచి కంటెంట్ గా ఈ సినిమాను గురించి చెప్పుకోవచ్చు.
'పీటీ సర్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
PT Sir Review
- తమిళంలో రూపొందిన 'పీటీ సర్'
- అందుబాటులోకి వచ్చిన తెలుగు వెర్షన్
- ఆసక్తికరమైన కథాకథనాలు
- అనూహ్యమైన మలుపులు
- ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా
Movie Name: PT Sir
Release Date: 2024-06-21
Cast: Hiphop Tamizha, Kashmira Pardeshi ,Anikha Surendran, Prabhu, K Bhagyaraj
Director:Karthik Venugopalan
Producer: Ishari K Ganesh
Music: Hiphop Tamizha
Banner: Vels Films International
Review By: Peddinti
Rating: 3.25 out of 5
Trailer