'కురంగు పెడల్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Kurangu Pedal

Kurangu Pedal Review

  • తమిళంలో రూపొందిన 'కురంగు పెడల్'
  • బలమైన కథాకథనాలు 
  • ఆకట్టుకునే సన్నివేశాలు 
  • సహజత్వానికి పెద్దపీట 
  • ఫ్యామిలీతో కలిసి చూసే కంటెంట్ 

ఒకప్పుడు చిన్నపిల్లల కోసమే ప్రత్యేకించి కొన్ని సినిమాలు వచ్చేవి. అలాంటి సినిమాలకి స్కూల్ నుంచి పిల్లలందరినీ తీసుకుని వెళ్లి చూపించేవారు. కానీ ఇప్పుడు ఆ తరహా సినిమాల సంఖ్య దాదాపుగా తగ్గిపోయిందనే చెప్పాలి. చాలా కాలం తరువాత ఆ తరహా సినిమా ఒకటి అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది .. ఆ సినిమా పేరే 'కురంగు పెడల్'. రీసెంటుగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కమలా కన్నన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ 1980లలో నడుస్తూ ఉంటుంది. అది 'కతేరి' అనే ఒక చిన్న గ్రామం. అక్కడ కందస్వామి (కాళీ వెంకట్) కుటుంబం కూడా నివసిస్తూ ఉంటుంది. భార్య సావిత్రి .. కొడుకు మారియప్పన్ (సంతోష్) ఇదీ అతని కుటుంబం. కందసామికి సైకిల్ తొక్కడం కూడా రాదు. అందువలన ఎక్కడికి వెళ్లినా నడిచే వెళుతూ ఉంటాడు. చివరికి ఆ ఊళ్లో వాళ్లు 'నడిచివెళ్లే కందసామి' అంటూ పిలిచే పరిస్థితి వస్తుంది. 12 ఏళ్ల మారియప్పన్ కి అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. 

మారియప్పన్ .. అంగరసు .. సంగినరి .. నిధి వీళ్లంతా ఒక్కతోటి పిల్లలు. స్కూల్ నుంచి వచ్చింది మొదలు ఆటపాటలతో కాలం గడిపేస్తూ ఉంటారు. వాళ్లు ఇంట్లో ఉండే సమయమే చాలా తక్కువ. ఎక్కువగా తోటల్లో .. మోటబావుల్లో సరదాగా గడిపేస్తూ ఉంటారు. వేసవి సెలవుల్లో ఎవరూ చుట్టాలింటికి వెళ్లకుండా, తమ ఊళ్లోనే కర్రసాము నేర్చుకోవాలని వాళ్లు నిర్ణయించుకుంటారు. ఆ సమయంలోనే వారి దృష్టి సైకిల్ పైకి వెళుతుంది.

ఎలాగైనా సైకిల్ తొక్కాలి .. తామంతా కలిసి దూరంగా కనిపిస్తున్న పెద్దకొండపైకి సైకిల్ పై చేరుకోవాలి. సైకిల్ నేర్చుకోవాలంటే అద్దెకి తీసుకోవాలి .. అందుకు డబ్బులు కావాలి. అందరూ కలిసి తలా 10 పైసలు చొప్పున 50 పైసలు సంపాదించి ఒక గంటకు సైకిల్ అద్దెకి తీసుకుంటారు. సైకిళ్లను అద్దెకి ఇచ్చే వ్యక్తి గతంలో మిలటరీలో పనిచేసి ఉండటం వలన, పిల్లలకి అతనంటే చాలా భయం. అందువలన సమయం పూర్తయ్యేలోగా సైకిల్ తిరిగి ఇచ్చేయాలి. అది చాలా అసంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. 

సైకిల్ ను అద్దెకి తీసుకోవడానికి అవసరమైన డబ్బు కోసం మారియప్పన్ ఇంట్లో గురిగిలో డబ్బులు కాజేయడం .. కోడి గుడ్లు దొంగిలించడం మొదలుపెడతాడు. ఒకసారి అద్దె సైకిళ్లు లేకపోవడంతో ఆ షాపు అతను, ఓ తాగుబోతు తన షాపులో పెట్టిన సైకిల్ ను మారియప్పన్ కి ఇస్తాడు. ఆ తాగుబోతు వచ్చేలోగా ఆ సైకిల్ ఇచ్చేయమని చెబుతాడు. సైకిల్ అద్దె పెరిగిపోవడంతో మారియప్పన్  పక్క ఊళ్లోనే ఉంటున్న తన అక్కయ్య సెల్వి దగ్గరికి వెళతాడు. అయితే మరునాడు ఉదయాన్నే వెళ్లమంటూ అక్కయ్య ఆపేస్తుంది. ఇక్కడ సైకిల్ షాపుకి తాగుబోతు వచ్చి తన సైకిల్ తనకి కావాలంటూ గొడవ చేస్తూ ఉంటాడు. 

దాంతో అతణ్ణి వెంటబెట్టుకుని మారియప్పన్ ఇంటికి ఆ మిలట్రీ వ్యక్తి వస్తాడు. మారియప్పన్ కనిపించడం లేదనీ, అతని కోసమే వెతుకుతున్నామని కందసామి చెబుతాడు. తన కొడుకు రోజూ సైకిల్ అద్దెకి తీసుకుని తిరుగుతున్నాడనే ఒక విషయం అప్పుడే అతనికి తెలుస్తుంది. ఆ డబ్బు కోసమే అతను చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడని అర్థమవుతుంది. అప్పుడు కందసామి ఏం చేస్తాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేదే కథ. 

ఈ కథలో హీరో .. హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరు .. కథనే హీరో. గ్రామీణ నేపథ్యం .. ఓ నలుగురు కుర్రాళ్లు .. సైకిల్ తొక్కాలనే వారి కోరిక చుట్టూ ఈ కథ నడుస్తుంది. 1980లలో నడిచే ఈ కథ ఎక్కడా కూడా బోర్ కొట్టదు. 1980లలో 12 ఏళ్ల వయసులో ఉన్నవారంతా, ఈ సినిమా చూస్తూ ఆ రోజుల్లోకి వెళ్లిపోతారు. తమ బాల్యంలోకి వెళ్లిపోయి .. ఆనాటి అనుభూతులను మళ్లీ మళ్లీ ఆస్వాదిస్తారు. అంతటి సహజత్వంతో ఈ కథ పరిమళిస్తుంది.

ప్రధానమైన పాత్రలను పోషించిన పిల్లలంతా తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఎవరూ కూడా నటిస్తున్నట్టుగా అనిపించదు. ఇక ఈ సినిమాకి మరో ఆకర్షణ .. లొకేషన్స్. ఆ లొకేషన్స్ చూస్తుంటే మనకి కూడా అక్కడికి వెళ్లిపోవాలనిస్తుంది. ఈ విషయంలో సుమీ భాస్కరన్ కెమెరా పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. జిబ్రాన్ నేపథ్య సంగీతం కూడా కథతో పరుగులు తీయిస్తుంది. శివానందీశ్వరన్ ఎడిటింగ్ బాగుంది. 

ఇల్లంటే నాలుగు గోడలు .. ఒక పైకప్పు కాదు. అది బంధాలకు .. అనుబంధాలకు నెలవు. ఆ నాలుగు గోడల మధ్య ఎన్నో ఎమోషన్స్ దాగివుంటాయి. అలాంటి ఎమోషన్స్ ను ఆవిష్కరించే కథ ఇది. చివర్లో ప్రధానమైన రెండు పాత్రల వైపు నుంచి సందేశం ఉంటుంది. అందువలన పిల్లలతో కలిసి హాయిగా ఈ సినిమాను చూడొచ్చు. 50లలో పడినవారు ఆనాటి రోజులను గుర్తుచేసుకోవచ్చు. ఈ కాలం పిల్లలు ఆ రోజులలోని స్నేహాలు .. అప్పటి ఆటలు .. ఆ స్వచ్ఛతను ఆస్వాదించవచ్చు. 



Movie Name: Kurangu Pedal

Release Date: 2024-06-21
Cast: Santhosh Velmurugan, Ragavan, Gnanasekar, Rathish, Sai Ganesh, Kaali Venkat
Director:Kamala Kannan
Producer: Sivakarthikeyan
Music: Ghibran
Banner: Sivakarthikeyan Productions

Rating: 3.50 out of 5

Trailer

More Reviews