ప్రభాస్ కథానాయకుడిగా ' కల్కి 2898 AD' సినిమా రూపొందింది. వైజయంతీ మూవీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అమితాబ్ .. కమల్ .. దీపికా పదుపూణె .. దిశా పటాని ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ రోజున పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ మహాభారత యుద్ధంతో మొదలవుతుంది .. అశ్వద్ధామ తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి కారకులైన పాండవులపై పగతో రగిలిపోతూ ఉంటాడు. ఆ కోపంతో ఉత్తర గర్భంలో ఉన్న శిశువుపైకి బ్రహ్మాస్త్రాన్ని మళ్లిస్తాడు. దాంతో ఆగ్రహించిన కృష్ణుడు, కాలక్రమంలో జరుగుతున్న అనేక సంఘటనలను చూస్తూ, ఒంటరిగా వేల ఏళ్ల పాటు జీవించమని శపిస్తాడు. కలియుగంలో అతని సాయం తనకి అవసరమవుతుందనీ, అప్పటివరకూ ఎదురుచూస్తుండమని చెబుతాడు.
కురుక్షేత్ర యుద్ధం జరిగిన కొన్ని వేల ఏళ్ల తరువాత, ఈ భూమి మీద మానవజాతి నివసించడం కష్టమవుతుంది. గత వైభవాన్ని కోల్పోయిన కాశీ నగరంలోని ప్రజలు అనేక ఇబ్బందులను పడుతూ ఉంటారు. ఆ ప్రాంతమంతా సుప్రీమ్ (కమలహాసన్) అధీనంలో ఉంటుంది.భగవంతుడు 'కల్కి' అవతారం ధరించే సమయం ఆసన్నమైనదని గ్రహించిన ఆయన, దానిని అడ్డుకునేందుకు గర్భవతులపై ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఫలితంగా ఆయన బందీలుగా యువతులంతా నానా ఇబ్బందులు పడుతుంటారు.
ఇక మరో వైపున ఏ యువతి గర్భాన శ్రీమన్నారాయణుడు 'కల్కి'గా అవతరించనున్నాడో తెలుసుకుని, ఆ యువతిని సుప్రీమ్ కంటపడకుండా 'శంబాల' గ్రామంలో దాచిపెట్టడానికి అక్కడివారు ప్రయత్నిస్తూ ఉంటారు. శంబాల ప్రాంతంలో నివసించే వాళ్లంతా మరియా (శోభన) మాటకి కట్టుబడి ఉంటారు. కల్కి అవతరించే సమయం దగ్గరికి వచ్చేసిందనే సంకేతాలు అందడంతో, ఆమె తన మనుషులకు తగిన సూచనలు చేస్తూ ఉంటుంది.
ఇక కాశీ నగరానికి చెందిన యువకుడే 'భైరవ' (ప్రభాస్). ఆయన తాను తయారు చేసుకున్న చిత్రమైన కారులో తిరుగుతూ, జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తూ ఉంటాడు. సుప్రీమ్ కాంప్లెక్స్ లోకి అడుగుపెట్టాలనేది ఆయన కోరిక. అందుకు తగిన ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే సుప్రీమ్ కి సంబంధించిన కాంప్లెక్స్ లోని ల్యాబ్ లో, వారి ప్రయోగాల ఫలితంగా సుమతి (దీపికా పదుకొణె) గర్భవతి అవుతుంది.
సుమతి గర్భవతి అయిందని తెలుసుకున్న సుప్రీమ్, ఆ పిండం భూమి మీద పడకుండా ఆ శక్తిని తాను పొందాలనుకుంటాడు. అయితే అది పసిగట్టిన 'శంబాల' వాసులు రహస్యంగా ఆమెను తీసుకుని వెళ్లిపోతారు. ఆమెను తీసుకొచ్చి తమకి అప్పగిస్తే, కాంప్లెక్స్ ప్రవేశానికి అనుమతిస్తామని భైరవతో సుప్రీమ్ ప్రధాన అనుచరుడైన కమాండర్ మానస్ చెబుతాడు. అప్పటివరకూ ఒక గుహలో రహస్యంగా కాలం గడుపుతూ వచ్చిన అశ్వద్ధామకి, కృష్ణుడు తనకి చెప్పిన సమయం వచ్చిందని గ్రహించి రంగంలోకి దిగుతాడు. ఆ తరువాత జరిగేదేమిటి? అనేది మిగతా కథ.
ఇది మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ జోనర్ కు లింక్ చేస్తూ నాగ్ అశ్విన్ రాసుకున్న కథ. భైరవ .. సుమతి .. అశ్వద్ధామ .. సుప్రీమ్ .. శంబాల ప్రజల చుట్టూ ఈ కథ నడుస్తుంది. 'కల్కి' అవతరించడానికి ముందు జరిగే కథగా ఇది తెరపైకి వస్తుంది. 'కల్కి' పుట్టకుండా ఆపాలని విలన్ .. అతని ప్రయత్నాలకు అడ్డుపడుతూ 'శంబాల' వాసులు కనిపిస్తారు. విలన్ కి సాయపడే వాడిగా భైరవ .. శంబాల ప్రజలకు అండగా నిలిచే పాత్రగా అశ్వద్ధామ కనిపిస్తారు.
ఈ కథ అటు పురాణ కాలంలోను .. కలియుగం మొదలై 6 వేల ఏళ్లకి చేరువవుతూ ఉండగాను జరుగుతుంది. ఈ కథ కోసం ఇటు సాధారణ ప్రజలు .. అటు శంబాలవాసులు .. ప్రభాస్ నివాసం .. విలన్ కాంప్లెక్స్ .. మరో వైపున అశ్వద్ధామ తలదాచుకున్న సెట్ .. చూపించవలసి ఉంటుంది. అయితే సుప్రీమ్ కి సంబంధించిన కాంప్లెక్స్ ను బాగానే చూపించారు. మిగతా సెటప్ లన్నీ గందరగోళంగా కనిపిస్తాయి. ప్రభాస్ ధరించినవాటితో సహా, కాస్ట్యూమ్స్ అంత పెర్ఫెక్ట్ గా అనిపించవు.
ఇక భవిష్యత్తు కాలంలో అంటూ చూపించిన ఆ కాలంలో వాహనాలన్నీ ఒక తీరూ తెన్నూ లేకుండా కనిపిస్తాయి. ఎవరు ఉపయోగించినప్పటికీ వాహనాలు కూడా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవలేదు. అలాగే ఆయుధాల డిజైన్ కూడా. చాలావరకూ వీఎఫ్ ఎక్స్ పైనే ఆధారపడుతూ వెళ్లారు. అందువలన కథలో ప్రజలను భాగస్వాములను చేయలేకపోవడం ఒక లోపంగా కనిపిస్తుంది.
ఒకానొక సమయంలో ప్రభాస్ లోను విలన్ షేడ్ ఉందేమో అనిపించేవరకూ తీసుకుని వెళ్లి, ఆ వెంటనే అతని పాత్రను కూడా పురాణాలతో ముడిపెట్టి, ఆ ఆలోచనలో నుంచి బయటికి తీసుకుని వచ్చారు. ఇక దిశాపటాని .. బ్రహ్మానందం .. విజయ్ దేవరకొండ .. దుల్కర్ సల్మాన్ .. మృణాల్ ఠాకూర్ .. ఫరియా అబ్దుల్లా .. ఇలా తెరపైకి చాలామంది వచ్చి వెళతారు. కానీ ఎవరి పాత్రలోను విషయం కనిపించదు.
ఎలాగో అలా సాగతీత సన్నివేశాలతో కథ నడుస్తుందిలే అనుకుంటూ ఉండగా, ప్రభాస్ తో సమానంగా డ్రైవ్ చేస్తూ దర్శకుడు రాజమౌళి కనిపిస్తాడు. అలాగే ఒక షాట్ లో దర్శకుడు అనుదీప్ కనిపిస్తాడు. ఈ విధంగా చేయడం వలన కథలో నుంచి బయటికి వచ్చిన ఆడియన్స్, తిరిగి కథలోకి వెళ్లడానికి కొంత సమయం పడుతుంది. ఇక హీరో వైపు నుంచి లవ్వు .. రొమాన్స్ .. వాటి తాలూకు పాటలు లేకపోవడం ఆడియన్స్ కి అసంతృప్తిని కలిగించే విషయమేనని చెప్పక తప్పదు.
నిర్మాణ పరమైన విషయంలో వంకబెట్టడానికి లేదు. తెరపై భారీతనం ఎంతమాత్రం తగ్గలేదు. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది. ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే ట్రిమ్ చేయవలసిన సీన్స్ కొన్ని కనిపిస్తాయి. ప్రభాస్ - అమితాబ్ మధ్య ఫైట్స్ సీన్స్ ను డిజైన్ చేసిన తీరు బాగున్నప్పటికీ, అవసరమైన నిడివిని దాటిపోయినట్టుగా అనిపిస్తాయి. ఈ కథలో ప్రభాస్ హీరో అయినప్పటికీ, ఆ పాత్రకంటే అశ్వద్ధామ పాత్రను పెర్ఫెక్ట్ గా డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. గుర్తుపట్టలేనంతగా కమల్ లుక్ ఆశ్చర్యపరుస్తుంది.
ఇక 'కల్కి' భగవానుడు అవతరించే ప్రదేశానికి సంబంధించిన ప్రజలు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆయుధాలను ఉపయోగించడం ఇబ్బందిగా అనిపిస్తుంది. కథ మొదలైన చాలాసేపటివరకూ ఎవరు దేని గురించి వెతుకుతున్నారు? ఎందుకోసం వెదుకుతున్నారు? అసలు ఏం జరుగుతోంది? అనేది సామాన్య ప్రేక్షకుడికి అర్థం కావడానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చేసి ఉంటే, ఎలాంటి అయోమయం లేకుండా ప్రేక్షకులు ఇంకాస్త హాయిగా చూసేవారేమో.
'కల్కి 2898 AD' - మూవీ రివ్యూ!
Kalki 2898AD Review
- మరో పాన్ ఇండియా సినిమాగా వచ్చిన 'కల్కి'
- ప్రభాస్ మార్క్ యాక్షన్ సీన్స్ హైలైట్
- నిర్మాణ పరంగా తగ్గని భారీతనం
- కథను మించిపోయిన వీఎఫ్ ఎక్స్
- పెర్ఫెక్ట్ గా కనిపించే అశ్వద్ధామ పాత్ర
- అంతగా సెట్ కాని కాస్ట్యూమ్స్
Movie Name: Kalki 2898AD
Release Date: 2024-06-27
Cast: Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani, Rajendra Prasad , Shobhana
Director:Nag Ashwin
Producer: Aswani Dutt
Music: Santhosh Narayanan
Banner: Vyjayanthi Movies
Review By: Peddinti
Rating: 3.00 out of 5
Trailer