'భజే వాయువేగం' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

Bhaje Vaayu Vegam

Bhaje Vaayu Vegam Review

  • కార్తికేయ నుంచి వచ్చిన 'భజే వాయువేగం' 
  • మే 31న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ రోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ 
  • ఆసక్తికరమైన కథాకథనాలు .. ట్విస్టులు 
  • ఫ్యామిలీతో కలిసి చూడవలసిన కంటెంట్  


కార్తికేయ కథానాయకుడిగా 'భజే వాయువేగం' సినిమా రూపొందింది. యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఈ సినిమాకి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. రధన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా ఐశ్వర్య మీనన్ నటించింది. థియేటర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ వరంగల్ - 'రాజన్నపేట'లో మొదలవుతుంది. అక్కడ అప్పుల బాధలు భరించలేక వెంకట్ ( కార్తికేయ) తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. దాంతో వెంకట్ అనాథ అవుతాడు. అదే గ్రామానికి చెందిన లక్ష్మయ్య (తనికెళ్ల భరణి) అతణ్ణి చేరదీస్తాడు. తన కొడుకు రాజు (రాహుల్)తో పాటు సమానంగా చూసుకుంటాడు. రాజును బాగా చదివించిన లక్ష్మయ్య, వెంకట్ కి క్రికెట్ అంటే ఇష్టమని చెప్పి ఆ దిశగా ప్రోత్సహిస్తాడు.

రాజు - వెంకట్ ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళతారు. ఇద్దరూ కలిసి ఒక పెంట్ హౌస్ అద్దెకి తీసుకుని అక్కడ ఉంటారు. అయితే రాజు ఉద్యోగం సంపాదించడానికైనా, వెంకట్ క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ కావాలన్నా పెద్ద మొత్తంలో డబ్బు కట్టవలసి వస్తుంది. దాంతో రాజు ఒక స్టార్ హోటల్లో డ్రైవర్ గా చేరతాడు. క్రికెట్ ఆడవలసిన వెంకట్, బెట్టింగులు ఆడుతూ ఉంటాడు. అయితే తమ తండ్రి బాధపడకూడదనే ఉద్దేశంతో, తాము చాలా గొప్ప పొజీషన్ లో ఉన్నట్టుగా అబద్ధం చెబుతూ ఉంటారు. 

ఈ నేపథ్యంలోనే లక్ష్మయ్యకి అసలు విషయం తెలిసి కుప్పకూలిపోతాడు. అప్పుడే ఆయన  అనారోగ్యం కూడా బయటపడుతుంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే బ్రతకడం కష్టమనీ, ఆపరేషన్ కి 20 లక్షలు అవసరమవుతాయని డాక్టర్లు చెబుతారు. ఆ డబ్బు కోసం వెంకట్ బెట్టింగ్ లో పాల్గొని 40 లక్షలు గెలుచుకుంటాడు. మరునాడు ఉదయానికి 40 లక్షలు అతనికి అందుతాయని వంశీ చెబుతాడు.  ఆ డబ్బుతో ఆపరేషన్ చేయించడం కోసం లక్ష్మయ్యను హైదరాబాద్ లోని హాస్పిటల్లో చేరుస్తారు.

కానీ బెట్టింగ్ వ్యవహారాలు చూసే వంశీ, చివరి నిమిషంలో మోసం చేస్తాడు. తనకి వెంకట్ 40 లక్షలు బాకీ పడినట్టుగా బెదిరిస్తాడు. అతని వెనుక డేవిడ్ (రవిశంకర్) ఉన్నాడనే విషయం అప్పుడు రాజు - వెంకట్ లకు తెలుస్తుంది. డేవిడ్ ఎవరంటే మేయర్ జార్జ్ (శరత్ లోహితస్య)కి స్వయాన తమ్ముడు. చాలాకాలం క్రితం కర్ణాకట నుంచి హైదరాబాదుకి జార్జ్  ..  అతని తమ్ముడు డేవిడ్ వస్తారు. ఆ తరువాత రాజకీయనాయకులను పట్టుకుని జార్జ్ మేయర్ గా ఎదుగుతాడు. ఇక రౌడీయిజానికి సంబంధించిన పోర్షన్ అంతా కూడా డేవిడ్ చూసుకుంటూ ఉంటాడు. 

అలా సిటీ అంతా కూడా ఈ అన్నదమ్ముల కనుసైగలలో నడుస్తూ ఉంటుంది. మేయర్ కొడుకుతో  ఒక విషయంగా వెంకట్ గొడవపడతాడు. అప్పటి నుంచి మేయర్ కొడుకు అదృశ్యమవుతాడు. డేవిడ్ ప్రతివారం మాదిరిగానే ఆ వారం కూడా రాజు పని చేస్తున్న స్టార్ హోటల్ కి వెళతాడు. ఆ కారును రాజు పార్క్ చేయవలసి ఉంటుంది. కానీ తమకి జరిగిన అన్యాయానికి కారణమైన డేవిడ్ కి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో, అతని కారును వెంకట్ కొట్టేస్తాడు. 

అన్నదమ్ములిద్దరూ ఆ కారును వేరే సిటీలో అమ్మేయడానికి వెళుతుంటారు. కారు డిక్కీలో మేయర్ కొడుకు డెడ్ బాడీ ఉండటం ఆ సమయంలోనే వాళ్లు చూస్తారు. ఒక వైపున మేయర్ మనుషులు . మరో వైఉన్న డేవిడ్ అనుచరులు .. ఇంకో వైపున పోలీసులు వెంకట్ కోసం వెతుకుతుంటారు.  అప్పుడు ఆ అన్నదమ్ములు ఏం చేస్తారు? మేయర్ కొడుకును ఎవరు చంపుతారు? హాస్పిటల్లో ఉన్న లక్ష్మయ్య పరిస్ధితి ఏమిటి? అనేవి కథలో కనిపించే ఆసక్తికరమైన మలుపులు.     

దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తయారు చేసుకున్న కథ ఇది. కథ అంతా కూడా హైదరాబాదులోనే జరుగుతుంది. కథ మొదలైన తీరు చూస్తే .. ఆల్రెడీ ఈ తరహా సినిమాలు ఇంతకుముందు వచ్చాయి గదా అనిపిస్తుంది. కానీ ఆ తరువాత కథ తీసుకునే మలుపులు .. చిక్కబడుతూ వెళ్లిన విధానం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కథ ఎక్కడా ఆడియన్స్ ను జారిపోనీయకుండా చూసుకుంటూ తనతో తీసుకుని వెళుతుంది. 

ఓ మాదిరి బడ్జెట్ తో చేసినప్పటికీ .. స్టార్స్ కనిపించకపోయినప్పటికీ, కంటెంట్ పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఎక్కడా అనవసరమైన సన్నివేశాలు .. సాగదీసే కార్యక్రమాలు కనిపించవు. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ కూడా ఆడియన్స్ ను కాసేపు టెన్షన్ పెట్టేసి, ఆ తరువాత తేలికగా ఊపిరి తీసుకునేలా చేస్తాయి. ఇక ఈ సినిమాకి ఆడియన్స్ వైపు నుంచి చూస్తే కనిపించే ఒకే ఒక మైనస్, లవ్ .. రొమాన్స్ లేకపోవడమే.   
     
రాజశేఖర్ ఫొటోగ్రఫీ బాగుంది. రధన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఎడిటింగ్ కూడా నీట్ గా  అనిపిస్తుంది. కథ .. స్క్రీన్ ప్లే .. ట్విస్టులు అన్నీ కూడా కరెక్టుగా కుదిరిన కంటెంట్ ఇది. నిజానికి థియేటర్స్ లో ఈ సినిమా ఇంకా బాగా ఆడవలసిందే. అయితే కార్తికేయ క్రికెట్ బ్యాట్ పట్టుకుని పోస్టర్స్ లో కనిపించడం .. వేగానికి సంబంధించిన టైటిల్ కావడంతో, ఇది క్రికెట్ కి సంబంధించిన కంటెంట్ అనుకుని ఉంటారు. కానీ మంచి ఇంట్రెస్టింగ్ డ్రామా ఉన్న కథ ఇది. ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 

Movie Name: Bhaje Vaayu Vegam

Release Date: 2024-06-28
Cast: Karthikeya, Ishwarya Menon, Sharath Lohitasya, Ravi Shankar, Rahul, Thanikella Bharani
Director:Prashanth Reddy
Producer: UV Concepts
Music: Radhan
Banner: UV Concepts

Rating: 3.00 out of 5

Trailer

More Reviews