పెళ్లి నేపథ్యంతో ముడిపడిన కథలు గతంలో చాలానే వచ్చాయి. అలాంటి ఒక కంటెంట్ కి కాస్త కామెడీ టచ్ ఇస్తూ రూపొందిన సినిమానే 'గురువాయూర్ అంబలనాడాయిల్'. విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది మే 16వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. నిన్నటి నుంచి హాట్ స్టార్ లో తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. పృథ్వీ రాజ్ సుకుమారన్ .. విమలా రామన్ .. బాసిల్ జోసెఫ్ .. అనశ్వరరాజన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం.
ఆనంద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) వైవాహిక జీవితం ఇబ్బందుల్లో ఉంటుంది. ఒక ఆకాశరామన్న ఉత్తరం వాళ్ల కాపురంలో చిచ్చుపెడుతుంది. దాంతో అతని భార్య పార్వతి (విమలా రామన్) బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళుతుంది. తల్లి - తండ్రి ఎంతగా చెప్పినా ఆనంద్ తన పద్ధతిని మార్చుకోడు. తన చెల్లెలు అమృత (అనశ్వర రాజన్)కి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే అతనికి వినూ (బాసిల్ జోసెఫ్) పరిచయమవుతాడు. అతనితో తన చెల్లెలి పెళ్లి జరిపించాలని ఆనంద్ భావిస్తాడు.
వినూ గతంలో ఓ యువతిని ప్రేమించాడనీ .. ఆ అమ్మాయి అతణ్ణి మోసం చేసి వేరే అతణ్ణి పెళ్లిచేసుకుని వెళ్లిపోయిందని ఆనంద్ తెలుసుకుంటాడు. ఆ యువతిని మరిచిపోయి, తన చెల్లెలితో హ్యాపీగా ఉండమని ఆనంద్ చెబుతాడు. ఇక పార్వతి పుట్టింటికి వెళ్లి ఆమెను తీసుకురమ్మని ఆనంద్ తో వినూ చెబుతాడు .. ఆనంద్ అలాగే చేస్తాడు. ఆ తరువాత అతని ఇంటికి వచ్చిన వినూ, ఆనంద్ భార్య స్థానంలో గతంలో తాను ప్రేమించిన పార్వతి ఉండటం చూసి షాక్ అవుతాడు.
ఆనంద్ కి ఎలాంటి పరిస్థితుల్లోను ఈ విషయం తెలియకూడదని భావించిన వినూ, అతని చెల్లెలితో పెళ్లిని కేన్సిల్ చేసుకోవాలని భావిస్తాడు. తాను మంచివాడిని కాననే విషయం అమృత ఫ్యామిలీకి తెలియడం కోసం, వినూ అనేక పథకాలు వేస్తాడు .. కానీ అవేవీ సక్సెస్ కావు. గురువాయూర్ లో వారి పెళ్లికి ఆనంద్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు. జరిగినదంతా తనకి పార్వతీ చెప్పిందనీ, తమ పెళ్లికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని వినూతో అమృత అంటుంది.
అమృత తనని ఎంతగా నమ్ముతున్నదీ అర్థమయ్యాక, ఇక ఆమెను పెళ్లి చేసుకోవలసిందే అని వినూ భావిస్తాడు. అయితే తన పెళ్లి ఆగడం కోసం గతంలో అతను వేసిన ప్లాన్స్ ఇప్పుడు వర్కౌట్ కావడం మొదలుపెడతాయి. అంతేకాదు ఆకాశ రామన్న ఉత్తరం కూడా వినూనె రాసి ఉంటాడని ఆనంద్ భావిస్తాడు. దాంతో తన చెల్లెలిని ఎలాంటి పరిస్థితుల్లోను వినూకి ఇవ్వడం కుదరదని తేల్చి చెబుతాడు. గురువాయూర్ లో ముందుగా అనుకున్న ముహుర్తానికే అమృతను పెళ్లి చేసుకుంటానని వినూ సవాల్ చేస్తాడు.
వినూతో అమృత పెళ్లి జరిపించడానికి ఇరు కుటుంబాలవారు గురువాయూర్ చేరుకుంటారు. ఇక ఆ పెళ్లిని ఆపాలని ఆలోచనతో ఆనంద్ వెళతాడు. గతంలో వినూకి శత్రువులుగా ఉన్న కొంతమంది కూడా ఆ పెళ్లిని ఆపాలనే ఉద్దేశంతో అక్కడికి చేరుకుంటారు. అంతా కూడా పెళ్లి మంటపానికి చేరుకుంటారు. అక్కడ చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అమృతతో వినూ పెళ్లి జరుగుతుందా? గతంలో ఆనంద్ ఇంటికి ఆకాశరామన్న ఉత్తరం రాసింది ఎవరు? అనేది మిగతా కథ.
దీపు ప్రదీప్ రాసిన కథ ఇది. మొదటి నుంచి చివరివరకూ కామెడీ టచ్ తోనే కథ నడుస్తూ ఉంటుంది. సాధారణంగా పెళ్లి సంబంధాలు చెడగొట్టడానికి ఒక్క మాట సరిపోతుంది. కానీ తనకి వచ్చిన సంబంధం తప్పిపోవడానికి, పెళ్లి కొడుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడం నవ్వు తెప్పిస్తుంది. తాను తప్పకుండా పెళ్లి చేసుకోవలసిందే అనుకున్నప్పుడు, అతని ప్లాన్స్ రివర్స్ కావడం పూర్తిస్థాయి వినోదాన్ని పంచుతుంది.
దర్శకుడు విపిన్ దాస్ పాత్రలను డిజైన్ చేసిన తీరు .. ఆ పాత్రలతో పట్టుగా కథను నడిపించిన విధానం కావలసినంత ఎంటర్టైన్ మెంట్ ను అందిస్తుంది. అయితే పాత్రలన్నీ పెళ్లి మంటపానికి చేరుకున్న తరువాత కథ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలి. కానీ సరిగ్గా అక్కడే కాస్త డల్ అవుతుంది. ఆ తరువాత నిదానంగా పుంజుకుని క్లైమాక్స్ కి వెళుతుంది.
కథ .. స్క్రీన్ ప్లే .. నీరజ్ రవి ఫొటోగ్రఫీ .. అంకిత్ మీనన్ నేపథ్య సంగీతం .. జాన్ కుట్టి ఎడిటింగ్ ఆకట్టుకుంటాయి. ఆర్టిస్టులంతా చాలా సహజంగా తమ పాత్రలను ఆవిష్కరించారు. తెలుగు టైటిల్ ను సెట్ చేయకపోవడమనేది కాస్త ఇబ్బందిని కలిగించినా, కథాకథనాల పరంగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసే సినిమాల జాబితాలో ఈ మూవీ కూడా చేరిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
'గురువాయూర్ అంబలనాదయిల్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Guruvayoorambala Nadayil Review
- మలయాళం నుంచి మరో కామెడీ డ్రామా
- వినోదమే ప్రధానంగా సాగే కథాకథనాలు
- ప్రధానమైన బలంగా కనిపించే స్క్రీన్ ప్లే
- ఫ్యామిలీతో కలిసి చూసే కంటెంట్
Movie Name: Guruvayoorambala Nadayil
Release Date: 2024-06-28
Cast: Prithviraj Sukumaran, Basil Joseph, Nikhila Vimal, Anaswara Rajan
Director:Vipin Das
Producer: Supriya Menon
Music: Ankit Menon
Banner: E4 Entertainment
Review By: Peddinti
Rating: 2.75 out of 5
Trailer