ఈ మధ్య కాలంలో కంటెంట్ ఉండాలేగానీ, అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే విషయాన్ని ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. తమకి నచ్చిందంటే హిట్ పట్టుకొచ్చి దోసిట్లో పెట్టడానికి ఎంతమాత్రం వెనకాడటం లేదు. అందువలన చిన్న సినిమాల తాకిడి తెలుగు తెరపై ఎక్కువగా కనిపిస్తోంది. అలాంటి సినిమాలలో ఒకటిగా వచ్చిందే 'మార్కెట్ మహాలక్ష్మి'. ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు 'ఆహా'లో అందుబాటులో ఉంది.
పార్వతీశం ( పార్వతీశం) ఓ మధ్యతరగతి యువకుడు. తండ్రీ .. తల్లి .. ఓ చెల్లెలు .. ఇదీ తన కుటుంబం. హైదరాబాదులోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో జాబ్ చేస్తూ ఉంటాడు. అతని తండ్రి (కేదార్ శంకర్) కొడుక్కి వచ్చే భారీ కట్నంపై భారీ ఆశలు పెట్టుకుంటాడు. తక్కువలో తక్కువగా కోటి రూపాయలైనా కట్నం తీసుకోవాలనేది అతని ఆలోచన. అందువలన ఆ స్థాయి సంబంధాలు చూడటం మొదలు పెడతాడు. అయితే ఏ అమ్మాయిని చూసినా పార్వతీశం నచ్చలేదని చెబుతుంటాడు.
తన కొడుకు చదువుకోసం పెట్టిన పెట్టుబడిని వడ్డీతో సహా వసూలు చేయాలనే తన ఆశకి కొడుకు ఎక్కడ గండి కొడతాడోనని అతను చాలా టెన్షన్ పడిపోతుంటాడు. ఒక రోజున తల్లితో కలిసి కూరగాయల మార్కెట్ కి వెళ్లిన పార్వతీశం, అక్కడ మహాలక్ష్మి అనే యువతిని చూసి మనసు పారేసుకుంటాడు. మహాలక్ష్మి ఆ మార్కెట్ లో కూరగాయలు అమ్ముతూ ఉంటుంది. ఆ మార్కెట్ లో చాలామంది వ్యాపారులకు ఆమె అంటే భయం.
అందుకు కారణం మహాలక్ష్మి ఎవరినీ లెక్క చేయకపోవడం మాత్రమే కాదు. ఆమె చిట్టీలు నడుపుతూ ఉండటం వలన ఆమె మాటకి ఎవరూ ఎదురుచెప్పే ధైర్యం చేయరు. ఆమె తండ్రి పక్షవాతం కారణంగా మంచాన పడతాడు. అన్నయ క్వార్టర్ కృష్ణ (బాషా) మద్యానికి బానిస. అందువలన కుటుంబ భారమంతా ఆమెపైనే ఉంటుంది. ఈ కారణంగా ఆమె తనకి సంబంధించిన పనులను తప్ప, మరేదీ పట్టించుకోదు.
మహాలక్ష్మిని చూడగానే పార్వతీశం ఆమెకి ఐ లవ్ యూ చెప్పేసి చెంపదెబ్బతింటాడు. అయినా పట్టించుకోకుండా ప్రతిరోజూ మార్కెట్ చుట్టూ తిరగడం మొదలుపెడతాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో, మార్కెట్లో మహాలక్ష్మి షాపు పక్కనే తాను ఒక షాపు తెరుస్తాడు. అక్కడే కూర్చుని ఆమెను చూస్తూ తన పని చేసుకుంటూ ఉంటాడు. అలా ప్రేమకి దూరంగా ఉన్న మహాలక్ష్మి మనసును కరిగిస్తాడు. ఆమెను నేరుగా తీసుకుని వెళ్లి తనవాళ్లకి పరిచయం చేయాలనుకుంటాడు.
అయితే అతణ్ణి పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగానే ఉన్నాననీ, పెళ్లి అయిన తర్వాత తాను అత్తవారింటికి మాత్రం రానని మహాలక్ష్మి షరతు పెడుతుంది. తన పేరెంట్స్ ను చూసుకుంటూ తన ఇంట్లోనే ఉంటానని చెబుతుంది. కోటి రూపాయల కట్నం కోసం ఎదురుచూస్తున్న తండ్రికి ఆ విషయంపై నచ్చజెప్పాలా? కోడలు అత్తగారింటికి రానందని తల్లికి చెప్పాలా? లేదంటే తాను ఇల్లరికం వెళ్లాలా? అనే ఆలోచన పార్వతీశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అప్పుడు పార్వతీశం ఏం చేస్తాడు? అతను తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఇంతకీ మహాలక్ష్మి అత్తగారింట్లో అడుగుపెడుతుందా? లేదంటే పార్వతీశమే ఆమె ఇంటికి వెళ్లడానికి సిద్ధపడతాడా? అనేది మిగిలిన కథ.
నిజానికి ఇది చాలా సింపుల్ లైన్ తో కూడిన కథ. కోటి రూపాయల కట్నం కోసం ఎదురుచూసే తండ్రికీ .. కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని కోడలిగా తీసుకుని వెళ్లాలనే కొడుక్కి మధ్య జరిగే పోరాటమే ఈ కథ. రెండు కుటుంబాలకీ .. ఒక కూరగాయల మార్కెట్ కి మధ్య ఈ కథ నడుస్తుంది. తాము థియేటర్లో కాకుండా కూరగాయల మార్కెట్లో ఉన్నావేమో అనే భావన ఆడియన్స్ కి కలిగించే కంటెంట్ ఇది. అక్కడక్కడా వినోదంతో పాటు, చివర్లో చిన్నపాటి సందేశం కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు.
పార్వతీశానికి సాఫ్ట్ వేర్ సైడ్ జాబ్ చేసే అమ్మాయిలతో .. శ్రీమంతుల కుటుంబాలకి చెందిన అమ్మాయిలతో పెళ్లి చూపులు జరుగుతాయి. కానీ అతను కూరగాయలు అమ్మే మహాలక్ష్మి మాత్రమే కావాలని పట్టుపడతాడు. తన కుటుంబం కోసం కష్టపడే అమ్మాయి .. ధైర్యం ఉన్న అమ్మాయి. ఆమెను ఎంచుకోవడానికి అతను చెప్పే లక్షణాలు. నిజానికి కష్టంలో పెరిగిన పిల్లలకు .. జనంలో తిరిగే పిల్లలకు, నాలుగు గోడల మధ్య పెరిగిన పిల్లలకు తేడా ఉంటుంది. అదే తేడా ఇక్కడా కనిపిస్తుంది.
ఇక ఈ రోజుల్లో కూరగాయలు అమ్మేవాళ్లు ఇలాగే ఉండాలనేం లేదు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ తో పొట్టి లంగా జాకెట్ ఎందుకు సెట్ చేశారనేది అర్థం కాదు. అసలే ఆమె హైటు తక్కువ .. అందునా పొట్టి డ్రెస్. అందువలన ఏ కోణంలో నుంచి చూసినా ఆమె హీరోయిన్ ప్లేస్ లో కనిపించదు. పైగా కూరగాయలు అమ్మేవారిలో సహజంగా కనిపించే మాస్ బాడీ లాంగ్వేజ్ కూడా ఆమెలో లేదు. ఆమెను తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోనని చెప్పి హీరో పట్టుబట్టేంత సీన్స్ కూడా అక్కడ ఏమీ లేవు.
ఇక హీరోను చూస్తే హీరోయిన్ చిటపటలాడుతూ ఉంటుంది గనుక, చివరివరకూ వీరి మధ్యలో పాటలు ఉండవు. అక్కడక్కడా ఒకటి రెండు కామెడీ సీన్స్ ఫరవాలేదనిపిస్తాయంతే. సురేంద్ర ఫొటోగ్రఫీ .. సృజన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. విశ్వనాథ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. బలమైన లాజిక్ లేకుండా బలహీనమైన కథాకథనాలతో నడిచే కంటెంట్ ఇది.
'మార్కెట్ మహాలక్ష్మి'(ఆహా) మూవీ రివ్యూ!
Market Mahalakshmi Review
- ఏప్రిల్లో థియేటర్లకు వచ్చిన 'మార్కెట్ మహాలక్ష్మి'
- పార్వతీశం జోడీగా పరిచయమైన ప్రణికాన్విక
- మాస్ రోల్ కి సెట్ కాని హీరోయిన్
- బలహీనమైన కథాకథనాలు
- అంతగా పేలని కామెడీ
Movie Name: Market Mahalakshmi
Release Date: 2024-07-04
Cast: Parvateesam, Praneekanvika, Harshavardhan, Kedar Shankar, Mukku Avinash, Basha
Director:Mukkhesh
Producer: Akhilesh Kalaru
Music: Joe Enmav
Banner: B2P Studios
Review By: Peddinti