సాధారణంగా చిన్న సినిమాలు ప్రయోగాల జోలికి వెళ్లవు. సాధ్యమైనంతవరకూ కమర్షియల్ అంశాలు ఉండేలా చూసుకోవడంలోనే మేకర్స్ దృష్టిపెడుతూ ఉంటారు. అలా కాకుండా ప్రయోగం నేపథ్యంలో సాహసం చేసిన సినిమాగా 'ఆరంభం' కనిపిస్తుంది. మే 10వ తేదీన థియేటర్లకి వచ్చిన ఈ సినిమా, ఈటీవీ విన్ లో అందుబాటులో ఉంది. నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ లోను స్ట్రీమింగ్ అవుతోంది.
అది 'మదికొండ' అనే ఓ మారుమూల గ్రామం. అడవిని ఆనుకుని ఉన్న ఆ గ్రామంలో 'మిగెల్' (మోహన్ భగత్) అనే కుర్రాడు ఉంటాడు. ఆ ఊరు .. తల్లి లీలావతి అతని ప్రపంచం. చిన్నప్పటి నుంచి ప్రయోగాల పట్ల ఆసక్తిని కనబరిచే మిగెల్ కీ, సుబ్రమణ్యం ( భూషణ్)తో పరిచయం అవుతుంది. ఒక ప్రయోగానికి సంబంధించి కొన్నేళ్లుగా అతను కృషి చేస్తూ ఉంటాడు. ఆ ప్రయోగం వలన అతను తన కొడుకును కోల్పోతాడు. ఆ కోపంతో కూతురును తీసుకుని అతని భార్య పుట్టింటికి వెళ్లిపోతుంది.
20 ఏళ్ల తరువాత ఇప్పుడు తండ్రిని వెతుక్కుంటూ కూతురు శారద (సుప్రీత) వస్తుంది. తండ్రికి ప్రయోగంలో సహకరిస్తూ ఉంటుంది. ఆమెతో మిగెల్ కి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఇక ఆ ఊళ్లో 'పొన్నన' రహస్యంగా గంజాయి పండిస్తూ ఉంటాడు. వడ్డీకి డబ్బులు ఇచ్చి ఆ తరువాత వేధిస్తూ ఉంటాడు. అప్పు విషయంలో అతనితో సుబ్రమణ్యానికి .. మిగెల్ కి కూడా గొడవలు ఉంటాయి. ఎక్కువగా సుబ్రమణ్యం ఇంట్లోనే ఉండే మిగెల్, ఆయన ప్రయోగాలకు సహకరిస్తూ ఉంటాడు.
అలాంటి మిగెల్ .. సుబ్రమణ్యం హత్య కేసులో జైలుకు వెళతాడు. అతను 'కాలఘాటి' జైల్లో శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి అతను జైలు నుంచి తప్పించుకుంటాడు. వేసిన తాళం వేసినట్టుగానే ఉంటుంది. జైలు చుట్టూ 20 అడుగుల గోడ .. ఆపై కరెంటు కంచె ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అతను ఎలా తప్పించుకున్నాడనేది పోలీసులకు అర్థం కాదు. విషయం బయటికిపోతే తమ ఉద్యోగాలు ఊడతాయని భావించిన జైలర్, డిటెక్టివ్ చైతన్యకు కబురు చేస్తాడు.
డిటెక్టివ్ చైతన్య (రవీంద్ర విజయ్) రంగంలోకి దిగుతాడు. మిగెల్ తన సెల్లో నుంచి బయటికి వచ్చిన దాఖలాలు కనిపించవు. మిగెల్ ఆ జైల్లో గణేశ్ (మీసాల లక్ష్మణ్)తో మాత్రమే స్నేహంగా ఉంటాడని తెలిసి, అతణ్ణి పిలుస్తాడు. మిగెల్ గురించిన విషయాలు చెప్పమని అడుగుతాడు. అప్పుడు గణేశ్ ఏం చెబుతాడు? మిగెల్ ఎలా తప్పించుకుంటాడు? నిజంగానే అతను సుబ్రమణ్యాన్ని చంపాడా? అనేది మిగతా కథ.
నిజానికి ఇది చాలా తక్కువ బడ్జెట్ లో చేసిన చిన్న సినిమా. కానీ కథ ఒక ఫ్రేమ్ లో కరెక్టుగానే కూర్చుంటుంది. దర్శకుడు తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఎలాంటి అయోమయం లేకుండా నీట్ గా చెప్పాడు. ఎంచుకున్న ఈ కంటెంట్ కి గ్రాఫిక్స్ ఎక్కువగా అవసరమవుతుంది. అయినా తమ బడ్జెట్ కి అందుబాటులో ఉన్న వనరులతోనే సరిపెట్టారు. కథలో కొత్తదనం ఉండటం వలన, గ్రాఫిక్స్ వైపు నుంచి కూడా ఆడియన్స్ పెద్దగా ఆలోచన చేయరు.
ఓ అరడజను పాత్రలు ఈ కథలో ప్రధానంగా కనిపిస్తాయి. విలేజ్ వాతావరణంలో ఈ కథను ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే కూడా ప్లస్ అయింది. మదర్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. లొకేషన్స్ ఈ చిన్న కథకు పెద్ద హెల్ప్ చేశాయి. దేవ దీప్ గాంధీ ఫొటోగ్రఫీ గొప్పగా అనిపిస్తుంది. సింజిత్ యర్రమిల్లి నేపథ్య సంగీతం కథకి తగినట్టుగా సాగుతుంది. ప్రీతమ్ గాయత్రి - ఆదిత్య తివారి ఎడిటింగ్ బాగుంది.
ఈ కథ అంతా కూడా సుబ్రహ్మణ్యం అనే పాత్ర చేసే ప్రయోగంపై ఆధారపడి నడుస్తుంది. అదేమైనా నాలుగు గోడల మధ్య .. పల్లెటూళ్లో గుట్టుగా కానిచ్చేసే ప్రయోగమా అంటే కాదు. ఆ ప్రయోగం ఆడియన్స్ కు అర్థం కావాలి .. అది ఎలా పనిచేస్తుందనేది అర్థమయ్యేలా చెప్పాలి. ఇక ముఖ్యంగా ఈ తరహా కంటెంట్ ఉన్న కథలను గ్రాఫిక్స్ లేకుండా టచ్ చేయకూడదు. ఎందుకంటే గ్రాఫిక్స్ తో హడావిడి చేస్తేనే గానీ వాళ్లు ఆ దృశ్యంలోకి వెళ్లరు.
అలా కాకుండా సింపుల్ గా తేల్చేస్తే ఆడియన్స్ కనెక్ట్ కారు. 'ఈ ప్రయోగం ఫలించింది' అంటూ హీరో ఎగిరి గంతులేస్తుంటేగానీ అప్పుడు ఆ విషయం ఆడియన్స్ కి అర్థం కాదు. సెకండాఫ్ లో కంటెంట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది గానీ, ఎక్కడా లాజిక్ కి అందదు. ఇది పెద్ద బడ్జెట్ సినిమాకాదు . ఇక్కడ వనరులు పరిమితం అనుకుని సర్దుకుంటే, అందుకు తగిన కంటెంట్ ను అందించడంలో దర్శకుడు కొంతవరకూ సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.
'ఆరంభం' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Arambham Review
- విలేజ్ నేపథ్యంలో నడిచే కథ
- ఇంట్రెస్టింగ్ గా అనిపించే కంటెంట్
- మెప్పించే ఫొటోగ్రఫీ .. లొకేషన్స్
- గ్రాఫిక్స్ అవసరమైన పాయింట్
- ఆ విషయంలో సర్దుకోవలసిన ఆడియన్స్
Movie Name: Arambham
Release Date: 2024-07-06
Cast: Mohan Bhagath, Supritha, Bhushan, Ravindra Vijay, Surabhi Prabhavathi
Director:Ajay Nag
Producer: Abhishek Thirumalesh
Music: Sinjith Yarramilli
Banner: AVT Entertainments
Review By: Peddinti
Rating: 2.50 out of 5
Trailer