'36 డేస్' (సోనీ లివ్) మూవీ రివ్యూ!

36 Days

36 Days Review

  • నేహా శర్మ ప్రధాన పాత్రగా '36 డేస్'
  • 8 ఎపిసోడ్స్ గా నడిచే కథ 
  • నిదానంగా సాగే కథనం 
  • పెద్దగా కనిపించని ట్విస్టులు 
  • ఫ్యామిలీతో కలిసి చూడటం కష్టమే

'36 డేస్' .. అనగానే ఆ రోజుల్లో ఏం జరుగుతుంది? అనే ఒక ఆసక్తి పెరగడం ఖాయం. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సిరీస్ రూపొందింది. విశాల్ ఫురియా దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 8 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేహా శర్మ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్, 'సోనీ లివ్' లో నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

అది 'గోవా' సముద్ర తీరంలోని ఓ హోసింగ్ సొసైటీ. అది ధనవంతులు మాత్రమే ఉండే ప్రదేశం. ఇక తాము ధనవంతులమని చెప్పుకోవడానికి అక్కడ అద్దెకి ఉండేవారు మరికొంతమంది. ఆ కాలనీలో రిషి (పూరబ్ కోహ్లీ) రాధిక (శృతి సేథ్) నివాసం ఉంటూ ఉంటారు. ఆ పక్కనే టోని (చందన్ రాయ్) అతని భార్య సియా (చాహత్) కూడా నివసిస్తూ ఉంటారు. ఇక తాము కూడా ధనవంతులమని చెప్పుకోవడానికి తపించే లలిత (అమృత), ఆమె భర్త వినోద్ (షరీబ్ హష్మీ) ఉండేది కూడా అక్కడే. 

ఇక బెనీ (షెర్నాజ్) ఆమె భర్త డెన్జీ .. కొడుకు రియాద్ ఒక ఇంట్లో ఉంటూ ఉంటారు. ఆ పక్కనే ఉన్న మరో ఇంట్లోకి కొత్తగా అద్దెకి దిగుతుంది ఫరా (నేహా శర్మ). రిషి - రాధిక దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. గతంలో రిషికి ఒక యువతితో ఎఫైర్ ఉండటం .. రాధికకి ఇది రెండో పెళ్లి కావడం అందుకు కారణం. ఇక టోని విషయానికి వస్తే, అతను నోయల్ (శంకర్) అనే గ్యాంగ్ లీడర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఆ నోయల్ కి చెందిన 'క్యాసినో'లో మేనేజర్ గా వినోద్ పనిచేస్తూ ఉంటాడు. 

బెనీ ఫ్యామిలీ విషయానికి వస్తే, ఆమె కోడలు సోనాలి పుట్టింటికి వెళ్లిపోతుంది. దాంతో కొడుకు రియాద్ మానసికంగా దెబ్బతింటాడు. బెనీ ఎప్పుడూ ఆమె భర్త గురించి ఆలోచన చేస్తుంటే, అతను మాత్రం పరాయి స్త్రీలపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ పక్కనే ఉన్న మరో విల్లాలోకి ఫరా రావడంతో అసలు కథ మొదలవుతుంది. తాను ఎయిర్ హోస్టెస్ గా చేస్తున్నట్టు అక్కడి వారికి ఆమె చెబుతుంది. తన పేరెంట్స్ ముంబైలో ఉంటారని అంటుంది. 

ఫరా మంచి అందగత్తె .. పైగా పెళ్లి కాని యువతి. అందువలన రిషి .. టోని దృష్టి ఆమెపై పడుతుంది. ఇక ఆమెకి వాళ్లిద్దరూ ఎక్కడ దగ్గరైపోతారోనని వినోద్ ఉడుక్కుంటూ ఉంటాడు. ఆమె గ్లామర్ చూసి మిగతా లేడీస్ అసూయపడుతూ ఉంటారు. అదే సమయంలో సియా స్నేహితురాలినంటూ 'తార' అనే ట్రాన్స్ జెండర్ టోని ఇంటికి వస్తుంది. ఆమెను ఎలా సాగనంపాలా అనే విషయాన్ని గురించి అతను ఆలోచన చేస్తూనే, ఫరాను ముగ్గులోకి లాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

ఈ నేపథ్యంలోనే ఫరా తరచూ మోహిత్ అనే యువకుడిని రహస్యంగా కలుసుకుని, తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. ఆమె పట్ల రిషి ఆకర్షితుడు కావడాన్ని అతని భార్య రాధిక తట్టుకోలేకపోతుంది. అలాగే రిషితో ఫరా చనువుగా ఉండటం గమనించిన టోని ఈర్ష్య పడతాడు. లలిత .. బెనీ కూడా ఫరా అందానికి శత్రువులే. అలాంటి పరిస్థితుల్లోనే ఆమె దారుణంగా హత్య చేయబడుతుంది. ఆమెను ఎవరు హత్య చేస్తారు? అందుకు కారణం ఏమిటి? అసలు ఫరా అక్కడికి ఎందుకు వస్తుంది? అనేది కథ.

ఈ కథ ఫరా హత్యతో మొదలవుతుంది. హత్యకు 36 రోజుల ముందు నుంచి ఏం జరుగుతూ వచ్చిందనేది కౌంట్ డౌన్ గా చూపించడం మొదలవుతుంది. ఫరా హత్య జరిగిన రోజు దగ్గర పడుతున్నా కొద్దీ, ఒక్కొక్క పాత్ర వైపుకు మనం అనుమానంగా చూస్తూ ఉంటాము. అలాగే ఫరా నేపథ్యానికి సంబంధించిన కుతూహలం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలా అనేక కోణాలలో ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. 

దర్శకుడు ఎంచుకున్న కథ మరీ విభిన్నమైనదేం కాకపోయినా, స్క్రీన్ ప్లేతో నెట్టుకొచ్చాడు. నిజానికి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగనుంది? ఆమె ఆసక్తిని పెంచే లైనే ఇది. కానీ దర్శకుడు అలా ప్లాన్  చేసుకోకపోవడం కొంత నిరాశను కలిగిస్తుంది. ఇక అసలు విషయాన్ని కాస్త స్పీడ్ గా కూడా చెప్పొచ్చు. కానీ దర్శకుడు తాపీగా .. నిదానంగా ఈ కథను చెబుతూ వెళ్లాడు. అయితే ప్రతి పాత్రకు ఒక ఆరంభం .. ఒక ముగింపు ఉన్నాయి. ఆ పాత్రలను రిజిస్టర్ చేయడంలోను దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

సముద్రతీరం .. ఆ తీరంలోని గృహసముదాయంలోనే కథ అంతా కానిచ్చేసినప్పటికీ, పెద్దగా బోర్ కొట్టదు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఈ సిరీస్ కి హెల్ప్ అయ్యాయనే చెప్పాలి. అనవసరమైన సన్నివేశాలు లేవు. కథలో కలిసిపోయే సన్నివేశాలనే కాస్త లాగారు. 

ఒక హోసింగ్ సొసైటీలోని ఇళ్లన్నీ ఒకే నమూనాలో ఉండొచ్చు. కానీ అందులో నివసించే వారి స్వభావాలు విభిన్నంగా .. పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. ఆశ .. అసూయ .. కోరిక .. స్వార్థం .. ఆవేశం .. వ్యామోహం జీవితాలను ప్రభావితం చేస్తుంటాయి. బలహీనతలు మనిషిని ప్రమాదాల వైపు నడిపిస్తాయని చెప్పే కథ ఇది. అయితే అక్కడక్కడా బూతులు .. అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకపోలేదు. అందువలన ఫ్యామిలీతో కలిసి చూడటం కష్టమనిపించే కంటెంట్ ఇది. 

Movie Name: 36 Days

Release Date: 2024-07-12
Cast: Neha Sharma, Purab Kohli, Shruti Seth, Sharib Hashmi, Chandan Roy Sanyal, Shernaz Patel
Director:Vishal Furiya
Producer: Sameer Nair, - Deepak Segal
Music: -
Banner: Applauge Entertainments

Rating: 2.75 out of 5

Trailer

More Reviews