'శాకాహారి' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Shakhahaari

Shakhahaari Review

  • కన్నడలో హిట్ కొట్టిన ''శాకాహారి'
  • తక్కువ బడ్జెట్ - భారీవసూళ్లు  
  • నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చిన తెలుగు వెర్షన్
  • బలమైన కథాకథనాలు 
  • ఆకట్టుకునే ట్విస్టులు  

కన్నడలో ఈ ఏడాది ఇంతవరకూ విజయవంతమైన చిత్రాల జాబితాలో 'శాకాహారి' ఒకటిగా కనిపిస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమై, ఎక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాల జాబితాలోను ఈ సినిమా ముందువరుసలో కనిపిస్తుంది. ఫిబ్రవరి 16వ తేదీన విడుదలైన ఈ సినిమా, మే 22 నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాంటి ఈ సినిమా తెలుగు వెర్షన్ నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. 

అది 'తీర్థ హళ్లి' అనే కొండ ప్రాంతం. అక్కడ సుబ్బన్న (రంగాయన రఘు) చిన్న పాక వేసుకుని    హోటల్ నడుపుతూ ఉంటాడు. పెద్దగా చదువు .. సంపాదన లేని కారణంగా అతను పెళ్లి చేసుకోడు. అతనికి ఒక తమ్ముడు ఉంటాడు గానీ, అతను అప్పుడప్పుడు మాత్రమే వచ్చి వెళుతూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్లందరికీ సుబ్బన్న హోటల్ మాత్రమే దిక్కు. ఓ రాత్రివేళ కాలికి బుల్లెట్ తగిలిన ఒక యువకుడు సుబ్బన్న హోటల్ కి వచ్చి ఆశ్రయం పొందుతాడు. 

మరుసటి రోజు ఉదయం పోలీస్ ఆఫీసర్ మల్లికార్జున్ (గోపాల్ కృష్ణ దేశ్ పాండే) తన టీమ్ తో కలిసి సుబ్బన్న దగ్గరికి వస్తాడు. విజయ్ అనే ఒక హంతకుడు జైలు నుంచి పారిపోయాడనీ, అతను కనిపిస్తే చెప్పమని మల్లికార్జున్ చెబుతాడు .. అతని ఫొటో చూపిస్తాడు. విజయ్ హంతకుడని తెలిసి, సుబ్బన్న కంగారు పడతాడు. ఎవరిని హత్య చేశావని విజయ్ ను అడుగుతాడు. తన తప్పేమీ లేదంటూ విజయ్ జరిగింది చెబుతాడు. 

విజయ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ అంతా సుబ్బన్న వింటాడు. తన కారణంగా సుబ్బన్న ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉదయాన్నే వెళ్లిపోతానని విజయ్ చెబుతాడు. విజయ్ కి హర్ష అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. గతంలో అతనే దగ్గరుండి విజయ్ కి పెళ్లి జరిపిస్తాడు. తన ఫ్రెండ్ జైలు నుంచి తప్పించుకున్నాడని తెలిసి, అతను కూడా వెదకడం మొదలుపెడతాడు. అలా అతను కూడా 'తీర్థహళ్లి' ప్రాంతానికి చేరుకుంటాడు.

పోలీస్ ఆఫీసర్ మల్లికార్జున్ వేరే ఊరికి ట్రాన్స్ ఫర్ పెట్టుకుంటాడు. విజయ్ ను అప్పగించి, ఆ ఊరు నుంచి బయటపడాలనే కంగారులో అతను ఉంటాడు. ఇక స్థానిక ఎన్నికల హడావిడి జోరందుకోవడంతో, తమ్ముడు మదన్ ను పిలిపించమని అక్కడివాళ్లు సుబ్బన్నను కంగారు పెడుతుంటారు. గతంలో సుబ్బన్నను ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయిన సుభద్ర, ఆ తరువాత భర్తను కోల్పోతుంది. ఇప్పుడు ఆమె సుబ్బన్న జీవితంలోకి అడుగుపెట్టాలనే ఆసక్తితో ఉంటుంది. 

 అలాంటి పరిస్థితుల్లోనే సుబ్బన్న ఆశ్రయాన్ని పొందిన విజయ్ చనిపోతాడు. కోలుకుని వెళ్లిపోతాడనుకున్న విజయ్ చనిపోవడంతో సుబ్బన్న కంగుతింటాడు.  విజయ్ కి ఆశ్రయమివ్వడమే ఒక నేరం .. అలాంటిది అతను తన హోటల్లో చనిపోయాడు. అందుకు తాను కారణం కాదని చెప్పినా ఎవరూ నమ్మరు. అలాంటి పరిస్థితుల్లో సుబ్బన్న ఏం చేస్తాడు? అతను తీసుకున్న ఆ నిర్ణయం వలన, ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అనేది కథ. 

 రచయిత గిరీశ్ తో కలిసిదర్శకుడు సందీప్ సుంకద్ తయారు చేసుకున్నకథ ఇది. కొత్తగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించిన యువకుడు .. భార్య అనారోగ్య కారణాల వలన ట్రాన్స్ ఫర్ పెట్టుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ .. మధ్య వయసులో హోటల్ పెట్టుకుని జీవిస్తూ, తన జీవితంలోకి మాజీ ప్రియురాలిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్న కథానాయకుడు .. అక్రమ సంబంధాల్లో ఆనందాన్ని వెతుక్కునే అతని తమ్ముడు. ఈ నాలుగు పాత్రలే ప్రధానంగా నడిచే కథ ఇది.

ఒక చిన్న విలేజ్ లో .. పూరిపాక హోటల్ చుట్టూ తిరిగే కథ ఇది. ప్రధానమైన పాత్రలన్నీ ఈ హోటల్ కి వచ్చి వెళుతూ ఉంటాయి. ఇలా చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా, బలమైన కథాకథనాల వలన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథనం నిదానంగానే ఉంటుంది. అయితే ఏం జరుగుతుందా అనే ఒక కుతూహలం పెరుగుతూనే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. 

రంగాయన రఘు నటన ఈ సినిమాకి హైలైట్. విశ్వజిత్ రావు ఫొటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్ ను చాలా అందంగా చూపించాడు. మయూర్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది. శశాంక్ నారాయణ ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది. కేవలం కోటి రూపాయలతో నిర్మించిన ఈ సినిమా, అనేక రెట్ల లాభాన్ని తీసుకుని వచ్చింది. అందుకు కారణం ఏమిటనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. 

తక్కువ బడ్జెట్ లో ఎంతటి బలమైన కంటెంట్ చెప్పొచ్చనేది నిరూపించిన సినిమా ఇది. తెలుగు ఆడియన్స్ కి కథనం కాస్త స్లోగా అనిపించవచ్చు. ఇక రక్తపాతం ఎక్కువగానే చూపించారు. సస్పెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

Movie Name: Shakhahaari

Release Date: 2024-07-24
Cast: Rangayana Raghu, Gopalkrishna Deshpande, Vinay, Nidhi Hegde, Harini Srikanth
Director:Sandeep Sunkad
Producer: Rajesh Keelambi - Ranjini Prasanna
Music: Mayur Ambekallu
Banner: Keelambi Media Lab

Rating: 3.25 out of 5

Trailer

More Reviews