'బర్త్ మార్క్' (ఆహా) మూవీ రివ్యూ!

Birthmark

Birthmark Review

  • షబ్బీర్ నుంచి 'బర్త్ మార్క్'
  • థ్రిల్లర్ డ్రామా జోనర్లో నడిచే కథ
  • ఫిబ్రవరిలో థియేటర్లకు వచ్చిన సినిమా  
  • బలహీనమైన కథాకథనాలు 
  • ఎక్కడా ఆడియన్స్ ను పట్టుకోని సన్నివేశాలు
 

ఓటీటీలో థిల్లర్ జోనర్ లోని సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అలాంటి జోనర్లో రూపొందిన సినిమానే 'బర్త్ మార్క్'. తమిళంలో శ్రీరామ్ శివరామన్ నిర్మించిన ఈ సినిమాకి, విక్రమ్ శ్రీధరన్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం. 

డేనియల్ (షబ్బీర్) ఆర్మీలో పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య జెన్నిఫర్ (మిర్నా మీనన్) గర్భవతి అవుతుంది. అప్పుడే అతను 'ధవంతరి' బర్తింగ్ విలేజ్' గురించి వింటాడు. ఫారెస్టుకి సమీపంలోని ప్రదేశం అది. అక్కడ ఆమెకి డెలివరీ చేయించాలనే ఉద్దేశంతో తీసుకుని వెళతాడు. ఆ ఆశ్రమం 'కుందవై' (పీఆర్ వరలక్ష్మి) అధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. ఆమె దగ్గర ఆశ .. అమ్ములు అసిస్టెంట్లుగా ఉంటారు. అక్కడ వాచ్ మెన్ గా సెబాస్టియన్ పనిచేస్తూ ఉంటాడు. 

ఆశ్రమంలో సిగరెట్లు .. మద్యం తాగకూడదని డేనియల్ తో సెబాస్టియన్ గట్టిగా చెబుతాడు. అవి లేకుండా ఉండలేని డేనియల్ అతనిపై కోపం పెంచుకుంటాడు. టౌన్ కి ఆ విలేజ్ చాలా దూరంగా .. అడవికి దగ్గరగా ఉండటం వలన జెన్నీ భయపడుతూ ఉంటుంది. ఆశ్రమంలోని వాళ్లందరి ప్రవర్తన కాస్త తేడాగా ఉందనీ, తనని టౌన్ కి తీసుకెళ్లమని పోరుతూ ఉంటుంది. అయినా డేనియల్ పెద్దగా పట్టించుకోడు.      

డేనియల్ అప్పుడప్పుడు చాలా చిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏదో ఆవహించినట్టుగా ఆవేశపడుతుంటాడు. అతని ధోరణి ఆశ - అమ్ములు - సెబాస్టియన్ కి కూడా అయోమయాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని గురించి జెన్నీ అడిగితే, అతను ఏదో ఒక కారణం చెబుతూ ఉంటాడు. ఆశ్రమంలోని వాళ్లు ఇచ్చిన మందులను డేనియల్ దగ్గరుండి జెన్నీకి ఇస్తూ ఉంటాడు. ఆ మందులను డేనియల్ తనకి కరెక్టుగా ఇస్తున్నాడా లేదా అనే ఒక డౌట్ ఒక రోజున జెన్నీకి వస్తుంది.

 ఒక రోజున అతని డైరీ ఆమె కంట పడుతుంది.  ఆ డైరీని ఆమె చదవడం మొదలుపెడుతుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ విషయంలో డేనియల్ కి అనుమానాలు ఉన్నాయనే విషయం  ఆమెకి అర్థమవుతుంది. తనను ఏదో దురుద్దేశంతోనే అక్కడికి తీసుకుని వచ్చాడని ఆమె భావిస్తుంది. అప్పుడు జెన్నీ ఏం చేస్తుంది? ఆమెపై డేనియల్ కి ఎందుకు అనుమానం కలుగుతుంది? అంతకుముందు ఏం జరుగుతుంది? సెబాస్టియన్ పై కోపంతో డేనియల్ ఏం చేస్తాడు? అనే ఆసక్తికరమైన అంశాలను కలుపుకుంటూ ఈ కథ నడుస్తుంది.

దర్శక నిర్మాతలు తయారు చేసుకున్న కథ ఇది. చాలా సింపుల్ లైన్ ను డెవలప్ చేస్తూ వెళ్లారు. సినిమా మొత్తం మీద అరడజను పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. అడవికి సమీపంలోని ఒక ఆశ్రమం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ప్రధానమైన పాత్రలుగా భార్యాభర్తలు కనిపిస్తారు. గర్భవతిగా ఉన్న భార్య తనకి పుట్టబోయే బిడ్డ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో భర్త తన దగ్గరే ఉండాలని ఆరాటపడుతూ ఉంటుంది. 

ఇక భర్త మాత్రం కాస్త తేడాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకు కారణం ఏమిటనేది ఆడియన్స్ కి అర్థం కాదు. బలమైన ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉండే ఉంటుంది .. అదేంటో చూడాల్సిందే అనుకుంటాడు. తీరా ఆ ఫ్లాష్ బ్యాక్ ఏమిటనేది రివీల్ చేశాక, ఉస్సూరుమనని ప్రేక్షకులు ఉండరు. ఏదో మతలబు ఉంది ..  ఏదో జరగబోతోంది అనే బిల్డప్ ఇచ్చి చివరికి తూచ్ అనిపించారు. ఆశ్రమంలో నానా గందరగోళం జరుగుతుంటే, ఎక్కడా ఎవరూ కనిపించరు .. వాళ్లంతా ఏమైపోయారనేది అర్థం కాదు.

ఒక తల్లి తన బిడ్డకు జన్మనివ్వడం కోసం ఎన్ని బాధలనైనా ఎలా ఓర్చుకుంటుంది అనే వరకూ ఓకే. కానీ ఇది మానసిక స్థితి సరిగ్గా లేని ఒక భర్త కథగా ..  ఒక అనుమానపు పక్షి కథగానే ఎక్కువగా గుర్తుంటుంది.  ఉదయ్ తంగవేల్ ఫొటోగ్రఫీ .. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం .. ఇనియావన్ పాండియన్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. అందరికీ తెలిసిన ఒక చిన్న పాయింటు పట్టుకుని .. దానిని రొటీన్ గా అల్లుకుని ..  అంతే రొటీన్ గా చూపించడం కాస్త ఇబ్బందిని కలిగించే విషయమే. 

Movie Name: Birthmark

Release Date: 2024-08-08
Cast: Shabeer Kallarakkal, Mirnaa Menon, Porkodi Senthil, Indirajith, Deepthie Orientelu, P R Varalakshmi
Director:Vikram Shreedhara
Producer: Sriram Sivaraman
Music: Vishal Chandrashekhar
Banner: Bhavani Productions

Rating: 2.00 out of 5

Trailer

More Reviews