తాప్సీ .. విక్రాంత్ మాస్సే .. సన్నీ కౌశల్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'హసీన్ దిల్ రూబా' 2021లో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. బోల్డ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థిల్లర్ ఇది. కంటెంట్ పరంగా ఈ సినిమా ఆకట్టుకుంది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రూబా' రూపొందింది. నిన్నటి నుంచే ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
రాణి (తాప్సీ) రిషు సక్సేనా ( విక్రాంత్ మాస్సే) ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. భర్తకి సంబంధించిన ఒక కోణంలో రాణి అసంతృప్తికి లోనవుతుంది. అదే సమయంలో వాళ్ల జీవితంలోకి 'నీల్' ( హర్షవర్ధన్ రాణే) ప్రవేశిస్తాడు. అతని పట్ల రాణి ఆకర్షితురాలవుతుంది. ఓ బలహీనమైన క్షణంలో అతనికి లొంగిపోతుంది.ఒకానొక సందర్భంలో ఆ విషయం రిషుకి తెలుస్తుంది. దాంతో ఆ ముగ్గురి మధ్య గొడవ జరుగుతుంది.
ఆ గొడవలో 'నీల్' చనిపోతాడు. దాంతో ఇద్దరూ కలిసి అతని శవాన్ని మాయం చేస్తారు. ఆ ప్రమాదంలో తాను చనిపోయినట్టుగా పోలీసులను నమ్మించడం కోసం రిషు తన చేయి నరుక్కుని, ఆ చేయి ఒక ఆధారంగా పోలీసులకు దొరికేలా చేస్తాడు. ఆ చేయిపై పచ్చబొట్టు కారణంగా, అతనే ఆ ప్రమాదంలో చనిపోయాడని పోలీసులు భావిస్తారు. రిషుని రాణి చంపేసి ఉంటుందనే అనుమానం కూడా వారికి ఉంటుంది. అలా పోలీసులను పక్కదారి పట్టించడంలో వారు సక్సెస్ కాడంతో, ఫస్టు పార్టు పూర్తవుతుంది.
రెండవభాగం కథ 'ఆగ్రా'లో మొదలవుతుంది. రాణి - రిషు ఇద్దరూ కూడా ఎవరికి వారుగా జీవిస్తూ, రహస్యంగా కలుసుకుంటూ ఉంటారు. రిషి చనిపోయాడని అంతా అనుకుంటున్న కారణంగా అతను ఎవరికీ కనిపించకుండా తిరుగుతూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ అయిన రిషు మేనమామకు రాణిపై అనుమానం ఉంటుంది. అతని ఆదేశం మేరకు పోలీస్ ఆఫీసర్ కిశోర్ రావత్ ఆమెపై ఓ కన్నేసి ఉంచుతాడు.
అదే సమయంలో రాణి ఒంటరిగా ఉంటుందని భావించిన కంపౌండర్ అభిమన్యు (సన్నీ కౌశల్) ఆమెపై మనసు పారేసుకుంటాడు. తనని రహస్యంగా గమనిస్తున్నవారిని నమ్మించడం కోసం రాణి అతన్ని వివాహం చేసుకుంటుంది. అయితే ఆ తరువాతనే అతనికి అసలు విషయం అర్థమవుతుంది. రాణి - రిషు ఇద్దరూ కూడా విదేశాలకి పారిపోయే ఆలోచనలో ఉన్నారనే విషయం స్పష్టమవుతుంది. వాళ్ల విదేశీ ప్రయాణానికి తగిన ఏర్పాట్లు తాను చేస్తానని అభిమన్యు మాట ఇస్తాడు.
రాణి పట్ల అభిమన్యుకి విపరీతమైన ప్రేమ ఉందనీ, తనని అడ్డు తప్పించి ఆమెను సొంతం చేసుకునే ఆలోచనలో అతను ఉన్నాడనే విషయం రిషుకి అర్థమవుతుంది. అభిమన్యు కనిపించేంత అమాయకుడు కాదనీ, అతని దగ్గర బంధువుల మరణానికి అతనే కారకుడనే విషయం రాణికి తెలుస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమెను దక్కించుకోవడం కోసం అభిమన్యు ఎలాంటి ప్లాన్ వేస్తాడు? అతని బారి నుంచి రిషు తప్పించుకోగలుగుతాడా? ఇద్దరిలో రాణి ఎవరికి దక్కుతుంది? అనేది మిగతా కథ.
ఫస్టు పార్టులో ప్రధానమైన కథ మూడు పాత్రల మధ్య జరుగుతుంది. ఆ పార్టులో 'నీల్' పాత్ర చనిపోతుంది. ఇక సెకండు పార్టులో 'అభిమన్యు' పాత్ర వచ్చి చేరుతుంది. అప్పటి నుంచి కథ మళ్లీ మూడు పాత్రల మధ్యనే కొనసాగుతూ ఉంటుంది. ఇక రాణి పాత్రను కనిపెడుతూ వెళ్లే పాత్రలో పోలీస్ టీమ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్లను నమ్మిస్తూ రాణి పావులు కదిపే విధానం ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది.
పోలీసుల బారి నుంచి తప్పించుకోవడం కోసం రాణి - రిషు నానా తంటాలుపడుతూ ఉంటే, రాణిని సొంతం చేసుకోవడానికి అభిమాన్యు ఆరాటపడుతూ ఉంటాడు. ఇలా నాలుగు వైపుల నుంచి కథ ఆసక్తికరంగా వెళుతూ ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఒక ఉత్కంఠ ప్రేక్షకులలో తొంగిచూస్తూ ఉంటుంది. అదే సస్పెన్స్ చివరివరకూ నడుస్తుంది. ప్రీ క్లైమాక్స్ లోని ట్విస్టులు .. క్లైమాక్స్ ప్రేక్షకులకు సంతృప్తికరంగా అనిపిస్తాయి.
ప్రధానమైన పాత్రలను పోషించిన వారంతా తమ పాత్రలను గొప్పగా ఆవిష్కరించారు. స్క్రీన్ ప్లే అలా కూర్చోబెట్టేస్తుంది. విశాల్ సిన్హా ఫొటోగ్రఫీ .. సాచేత్ పరంపర - అనురాగ్ సైకియా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. హేమల్ కొఠారి ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది. ఎక్కడా అనవసరమైన సన్నివేశాలు కనిపించవు. ఫస్టు పార్టు స్థాయిలోనే సెకండు పార్టు ఆకట్టుకుంటుంది. ఫస్టు పార్టు చూడకుండా నేరుగా సెకండు పార్టు చూస్తే మాత్రం ఏమీ అర్థం కాదు.
'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రూబా' ( నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Phir Aayi Hasseen Dillruba Review
- గతంలో ఆకట్టుకున్న 'హసీన్ దిల్ రూబా'
- సీక్వెల్ గా వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రూబా'
- రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్లో ఆకట్టుకునే కథ
- ఫస్టు పార్టు స్థాయిలోనే ఆసక్తిని రేపే సీక్వెల్
Movie Name: Phir Aayi Hasseen Dillruba
Release Date: 2024-08-10
Cast: Taapsee Pannu, Vikrant Massey, Sunny Kausha, Jimmy Sheirgill, Aditya Srivastava
Director:Jayprad Desai
Producer: Aanand L Rai - Himanshu Sharma
Music: Sachet–Parampara Anurag Saikia
Banner: Colour Yellow Productions
Review By: Peddinti
Rating: 3.00 out of 5
Trailer