'పేకమేడలు' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!

Pekamedalu

Pekamedalu Review

  • వినోద్ కిషన్ హీరోగా 'పేకమేడలు'
  • కథానాయికగా మెప్పించిన అనూష కృష్ణ 
  • సహజత్వంతో కూడిన కథాకథనాలు 
  • ఆకట్టుకునే ఎమోషన్స్ 
  • అంతర్లీనంగా కనిపించే సందేశం 

ఈ మధ్య కాలంలో ఓటీటీ సెంటర్స్ లో చిన్న సినిమాలు ఎక్కువ సందడి చేస్తున్నాయి. కంటెంట్ ఉంటే చాలు అనూహ్యమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంటున్నాయి. అలా ఈటీవీ విన్ ఫ్లాట్ ఫామ్ పైకి 'పేకమేడలు' సినిమా వచ్చింది. జులై 19వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీ నుంచి ఈటీవీ విన్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

హైదరాబాద్ లో ఓ బస్తీలో లక్ష్మణ్ (వినోద్ కిషన్) ఫ్యామిలీ అద్దెకి ఉంటుంది. అతని భార్య వరలక్ష్మి (అనూష కృష్ణ) .. వాళ్లకి ఓ పదేళ్ల కొడుకు. లక్ష్మణ్ బీటెక్ చదువుతాడు. కానీ అతను జాబ్ చేయకుండా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ పనిపై కూడా అతను పెద్దగా ధ్యాస పెట్టకపోవడం వలన, తన ఖర్చులకు కూడా భార్యపై ఆధారపడుతూ ఉంటాడు. ఆమె 'మురుకులు' చేసి షాపులకు వేస్తూ ఉంటుంది. 

లక్ష్మణ్ ఓ తాగుబోతు. భార్య డబ్బులను కాజేసి తాగేస్తూ ఉంటాడు. బాధ్యత లేకుండా స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ వీలైతే అక్కడ అప్పులు చేస్తూ ఉంటాడు. దాంతో ఆతనితో వరలక్ష్మి విసిగిపోతుంది. తండ్రి దారి తప్పడం వలన కొడుకు కూడా దారితప్పుతాడేమోననే భయం ఆమెను వెంటాడుతూ ఉంటుంది. అందువలన పిల్లాడిని మంచి స్కూల్లో చదివించడానికి ఆరాటపడిపోతూ ఉంటుంది. 

ఇలాంటి పరిస్థితుల్లోనే విదేశాల్లో ఉన్న తన భర్తపై కోపంతో పిల్లలను కూడా వదిలేసి శ్వేత ఇండియాకి వస్తుంది. ఆమె ఒక డూప్లెక్స్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటుంది. ఆమె నేపథ్యం గురించి తెలిసిన లక్ష్మణ్, ఆమెకి దగ్గర కావడానికి ట్రై చేస్తాడు. అందుకోసం అప్పులు చేసి మరీ  డబ్బున్నవాడిలా నటిస్తాడు. ఆ ప్రయత్నంలో అతను సక్సెస్ అవుతాడు. ఆమెతో కలిసి తిరుగుతూ .. తాగుతూ అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ ఉంటాడు.  

బస్తీకి రావాలన్నా .. భార్యతో మాట్లాడాలన్నా అతనికి చిరాకు పుడుతుంది. తన కుటుంబాన్ని మరింత బెటర్ పొజీషన్ కి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో, తెలిసిన వాళ్ల దగ్గర అప్పు తీసుకుని మరీ వరలక్ష్మి 'కర్రీ పాయింట్' పెడుతుంది. అదే సమయంలో శ్వేత తన భర్తకు విడాకులు ఇవ్వాలనుకుంటుంది. దాంతో తాను కూడా వరలక్ష్మిని వదిలించుకుని హాయిగా శ్వేతతో ఎంజాయ్ చేయవచ్చని లక్ష్మణ్ భావిస్తాడు. 

 కొంతకాలంగా లక్ష్మణ్ ప్రవర్తనలో వచ్చిన మార్పును వరలక్ష్మి గమనిస్తుంది. తనని వదిలిచుకోవాలనే ఆలోచనలో భర్త ఉన్నాడనే విషయం ఆమెకి తెలుస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె తీసుకున్న నిర్ణయం ఎలాంటిది? లక్ష్మణ్ కోరుకున్న జీవితం అతనికి దొరుకుతుందా? అనేది మిగతా కథ. 

'పేకమేడలు' .. ఇది ఒక బస్తీలోని భార్యాభర్తల కథ. ఉన్నదాంట్లోనే సంతృప్తి పడుతూ ..  కొడుకు భవిష్యత్తు కోసం ఆ తల్లి ఆరాటపడుతూ ఉంటుంది. ఇక తన వ్యసనాల కోసం భార్యను వేధిస్తూ, సుఖాల వెంట పరిగెత్తే భర్తను నియంత్రించడానికి ఆమె నానా తంటాలు పడుతూ ఉంటుంది.  'పేకమేడలు' ఎంత జాగ్రత్తగా పేర్చినా గాలివాటుకే కుప్పకూలిపోతాయనే నిజాన్ని భర్త పాత్ర వైపు నుంచి, ఒక్కో ఇటుక పేర్చుతూ వెళ్లినప్పుడే ఆ ఇల్లు నిలబడుతుందనే వాస్తవాన్ని భార్య పాత్ర వైపు నుంచి ఆవిష్కరించిన కథ ఇది.

దర్శకుడికి గ్రామీణ నేపథ్యంపై మంచి అవగాహన ఉన్నట్టుగా తోస్తుంది. అక్కడి మనుషులు .. వాళ్ల స్వభావాలు .. మాటతీరు విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ అందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. హీరో - హీరోయిన్ ఇంట్లో పడే గొడవ, హీరోయిన్ ఇంటిదగ్గర జరిగే పెద్ద మనుషుల పంచాయితీ దృశ్యాలు సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తూ ఆకట్టుకుంటాయి. ప్రతి సన్నివేశం వాస్తవానికి దగ్గరగా ఉంటూ ఆకట్టుకుంటుంది. 

ప్రధానమైన పాత్రలను పోషించినవారంతా న్యాయం చేశారు. స్మరణ్ సాయి అందించిన నేపథ్య సంగీతం, హరిచరణ్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హెల్ప్ అయ్యాయి. రియల్ లొకేషన్స్ లో చిత్రీకరించడం వలన, ఈ కథ మరింతగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. కథాకథనాలు కొత్తవి కాకపోయినా, సహజత్వం ..  పాత్రలను మలచిన విధానం .. ట్రీట్మెంట్ ప్రేక్షకులను కూర్చోబెడతాయని చెప్పాలి. 

Movie Name: Pekamedalu

Release Date: 2024-08-15
Cast: Vinoth Kishan , Anoosha Krishna, Rethika Srinivas, Muralidhar Goud, Jagan Yogi Raj
Director:Neelagiri Mamilla
Producer: Rakesh Varre
Music: Smaran
Banner: Crazy Ants Productions

Rating: 2.75 out of 5

Trailer

More Reviews